Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vijnaanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - రవీంద్ర

కలలు + కల్పనలు ≠ జీవితాలు   

వాస్తవం కంటే ఊహలు గొప్పగా ఉంటాయి. అందంగా ఉంటాయి. ఆశగా ఉంటాయి. ఆనందంగా ఉంటాయి. హాయిగా ఉంటాయి. ఇంకా ఇంకా లోపలకెళ్లేలా ఉంటాయి. అందుకే ఊహల్లో బతక్కు అని పెద్ద వాళ్లు చెప్తూ ఉంటారు. దీన్నే నేలవిడిచి సాముచేయకు అంటారు. ఆకాశానికిని నిచ్చెన వేయకు అని కూడా అంటారు. "కలలు కనండి ఆ కలల్ని నిజం చేసుకోండి" అని కలాం చెప్పారు. కానీ నిజ జీవితాల్ని వదిలేసి, ఊహలకు రెక్కలు కట్టుకొని ఎగుతుంటే...!! సీతాకోక చిలుకల్లా విహరిస్తుంటే...!! వారివారి ప్రతిభను మర్చిపోయి, కొండ కొనకు గురి పెడుతుంటే...!! నక్షత్రాలను నేలకు దించాలని ప్రయత్నాలు చేస్తుంటే...!! కలల రాకుమారుడి కోసం, ఊహా ప్రేయసుల కోసం తపిస్తుంటే...!!. జీవితాలు స్వర్గానికి నరకానికి మధ్య, సంతోషానికి, దుఃఖానికి మధ్య ఊగిసలాడుతాయి.

ఊహల ఉయ్యాలలో...!!

మనోజ్ఞ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ఛామన ఛాయతో ఫర్వాలేదు అనిపించే అందం. చదువులో కూడా ఫర్లేదు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కానీ, ఎప్పుడూ తన స్నేహితులతో తనను చేసుకోబేయేవాడు సినిమా హీరోలా ఉండాలి, నన్ను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి అని చెప్తుంది. నన్ను, నా ఇష్టాలను గౌరవించడమే కాదు, నేను చెప్పినట్లు నడుచుకునే వాణ్నే చేసుకుంటాను అని చెప్తుంది. ఇక విజ్ఞాన్ ది మరో రకమైన ఆలోచన. పదిమందిలో తనకంటూ ఓ గొప్ప హోదా రావాలి. ఎప్పుడూ తన వెంట పదిమంది ఉండాలి. కోట్లు సంపాదించాలి. నాలుగైదు కార్లు తన ఇంటి ముందు ఉండాలి. పది మంది పనిమనుషులు ఉండాలి. రోజుకో దేశంలో గడిపేలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. పదో తరగతి చదివే నవ్యకు బంగారం అంటే చచ్చేటంత పిచ్చి, కాలు వేలు నుంచి తలమీదున్న జుట్టు వరకు బంగారంతో అలంకరించుకున్నట్లు కలలు కంటుంది. క్లాసులో అందరు తన బంగారాన్ని చూసి ఈర్ష్య పడాలి అని ఊహలు చేస్తుంది. ఇంటర్మీడియట్ చదివే కిరణ్ కు ఒక్కసారైనా క్లాసు ఫస్టు తెచ్చుకోవాలని కోరిక.

నింగికి నేలకు మధ్య

నేటి యువత నింగిని నేలకు దించగలం అంటున్నారు. కొండలు పగులగొట్టే శక్తి తమకు ఉంది అని చెప్తున్నారు. ఊహలే నిజాలని నమ్ముతున్నారు. కలల లోగిళ్లలో నివాసం ఉంటున్నారు. తమతమ స్థాయిని మరిచి ఇంద్రధనస్సులపై విహారం చేస్తున్నారు. మాటలు కోటలు దాటేలా చెప్తున్నారు. ముఖ్యంగా పదహారు నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకుల్లో ఇలాంటి భ్రాంతి ఎక్కువగా ఉంటుంది. శారీరక బలం వారిచే ఈ మాటలు చెప్పిస్తుంది. అంతేకాదు, కలల్ని, వాస్తవాల్ని కలగలిపి బతికేలా చేస్తుంది. వీటి వెనుక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగిన వాళ్లలో ఎక్కువమందికి  అహంతో పాటు, ఇలాంటి ఊహలు ఉంటాయి. అలానే కుటుంబంలో వారసత్వంగా వచ్చిన గొప్పలు చెప్పుకునే గుణం నుంచి ఊహల్లో బతకడం అలవాటవుతుంది. సామాజికంగా ఉన్నత వర్గంలో పుట్టి పెరిగే వాళ్లకూ ఇలాంటి కలల ప్రపంచంలో బతికే అలవాటు ఉంటుంది. మరి ఇంకో కోణం నుంచి ఆలోచిస్తే- చిన్నప్పటి నుంచి జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న వారిలో ఏర్పడే ఆత్మన్యూనతా భావంలోంచి పుట్టే ఊహలు ఆకాశంలో చుక్కల్ని కోరుకునే చేస్తాయి.

కలలు కల్పనలేనా...!

 కలలు కనడం మంచిదే... కానీ అవి కల్పనల్లా ఊహా జగత్తులో ఊగిస లాడేలా ఉండకూడదు. నిజానికి మనస్సు చేసే అల్లరి పనుల్లో కలలు కనడం ఒకటి. సిగ్మెంట్ ఫ్రాయిడ్ తన డ్రీమ్స్ థియరీలో మనిషికి వచ్చే కలల వెనుక, వారి వారి జీవితానుభవాలు, తీరని కోర్కెలు. మనసు మూలన దాగిన సత్యాలు ఉంటాయి అంటారు. అలానే యువత కనే కలల్లో వారి వారి ఊహా ప్రపంచాలు ఉంటాయి. వారి మనసుల్లో చిక్కుకున్న భవిష్యత్ వాంఛలు ఉంటాయి. వాటిని యువతీ యువకులు ఊహల్లో ఇలా ఉండాలి నేను, అలా ఉండాలి నేను అని ఆలోచలనలు చేస్తుంటారు. అవి ఎక్కువగా నిజ జీవితంలో తీరనివి, తీర్చుకోడానికి వీలు లేనివే ఉంటాయి. నిజమైన కోర్కెలు, కలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. దానికోసం శాయశక్తుల కృషి చేసి, అడ్డంకులను అధిగమించి, లక్ష్యాన్ని సాధించవచ్చు. కానీ పగటి కలల్లో విహరిస్తుంటే...అవి కల్పనలుగా మాత్రమే మిగిలి పోతాయి. ఎప్పటికీ తీరవు. ఆ ఊహల్లో సంతోషాన్ని పొందడం మాత్రం కుదరదు. అప్పుడు మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే, కలల ప్రపంచంలో విహరించండం కంటే వాటి వెనుక ఉన్న మూలాలను అర్థం చేసుకొని, ఆ రహస్య మందిరాలను ఛేదించడం మంచిది.

వాస్తవాలతోనే జీవించాలి

ఊహలు యువతను ఆకాశ మార్గం పట్టిస్తే, వాస్తవాలు భూమార్గం పట్టిస్తాయి. మిమ్మల్ని మీరు అంచనా వేసుకోకుండా, మీ వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక జీవితాన్ని మరిచి కలలు కనడం మంచిది కాదు. ఒంటరిగా గదుల్లో, స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య... గొప్పలకు పోతూ ఊహలోకాల్లో సంచరించడం సరైనది కాదు. ముఖ్యంగా యువత ఉద్యోగాల గురించి, కాబోయే జీవిత భాగస్వాముల గురించి, సంపాదన గురించి ఇలాంటి కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమాలు, టీవీల ప్రభావంతో ఇలాంటి ఊహలు చేస్తూ ఉంటారు. ఊహ వేరు, వాస్తవం వేరు. ఊహ వాస్తవం కావాలంటే, ఆ ఊహ అర్థవంతంగా, సమాజ నియమాలకు లోబడి, సాధించగలిగినదై ఉండాలి. అప్పుడే ఊహ నిజం అవుతోంది. అలా కాకపోతే ఆకాశం నుంచి పడే చినుకు వేడికి మధ్యలోనే మాయమైనట్లు అవుతుంది జీవితం. అందుకే, ఊహలు వాస్తవానికి దగ్గర మార్గాలై ఉండాలి. యువత కలల్లో బతక్కుండా వాస్తవాలతో జీవించాలి.

 కలలు కల్పనలు కలిసి జీవితం అయితే కష్టం.
 కృషి పట్టుదల కలిసి జీవిత లక్ష్యం అయితే భవిష్యత్ బాగుంటుంది.
 ఊహలు అతిశయోక్తులు కలిసి జీవితం అయితే కష్టం
 నిజమైన ప్రేమాభిమానాలు, వాస్తవాలు కలిస్తే భవిష్యత్ బాగుంటుంది.      

మరిన్ని శీర్షికలు
jayajayadevam