Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

గోదాదేవి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. సంప్రదాయం ప్రకారం ప్రబంధ నాయికల  సౌందర్య వర్ణన కొత్తదేమీ కాదు, కానీ రాయలు వర్ణించిన తీరు, ఆయన తీసుకొచ్చిన పోలికలు వేరెక్కడా లేనివి, ఆలోచింపజేస్తూ ఆనందింపజేసేవి.

తళుకొత్తున్ భుజ కీర్తి వజ్ర ఘ్రుణిసూత్ర స్యూత హార స్పుర
త్కళికా చిత్ర కుచద్వయోపరి గలాధస్స్వల్పవిస్తార దై
ర్ఘ్య లసత్తిర్యగురస్తటం బను వివాహాంచన్మనో జాత పా
టల దంతఛ్చదబోడబాసికము దండల్వోలె గేళ్ళింతికిన్

గోదాదేవి కంఠము క్రిందుగా వక్షస్థలం వరకూ ఉన్న శరీర ప్రదేశం విశాలమైనది, సుందరమైనది. అది  చూడడానికి, మన్మథుడు రతీదేవిని వివాహము చేసుకున్నపుడు రతీదేవికి కట్టిన బాసికంలాగా ఉన్నది.  అటుప్రక్క ఇటు ప్రక్క పొడవైన, వజ్రములు, హారములు పొదిగిన కేయూరములతో తళతళలాడే సుందరమైన,  కోమలమైన బాహువులు, వ్రేళ్ళాడుతున్న పూలహారాలలాగా ఉన్నాయి. 

ఒదవెడు జవ్వనంబు వెలికొత్తగ బయ్యెద సిగ్గు గూడి బి
ట్టదుమగ లేత లౌట దిగ నాకకుమీరను లేక వక్షపుం 
జదుపున బ్రక్కలన్మెరసి చప్పటలై మరి లావుగూడ బై 
బొదలె ననంగ బిక్కటిలె బొల్తుక చన్నులు నాడునాటికిన్ 

ఆమెకు యవ్వనము వచ్చి కూడింది. దానితోపాటు పుట్టుకొచ్చిన చన్నులను ఆ యవ్వనం పైకి, బయటకు  నెట్టేసింది. కానీ యవ్వనంతో పాటే వచ్చిన సిగ్గు పైటను తెచ్చిపెట్టింది. ఆ పైట చన్నులను అదిమిపెట్టింది,  బిగించి పట్టింది. దానితో పాపం ఆ వక్షోజములకు లోపలికి పోవడానికీ బయటకు రావడానికీ వీలుకాక,  ప్రక్కలకు వ్యాపించినట్లు ముద్దలుగా ప్రక్కలకు వ్యాపించి, నానాటికీ విశాలములు అయినాయి.

వృతరఘూత్తమ శాపమొక్కింత విడిచి 
విడిచి కడకేగ నప్పుడప్పుడకవిసెడు 
చక్రయుగ మన రొమ్మొయ్యనాక్రమించి 
కొమిరెచన్నులు పృథుచూచుకముల నమరె 

శ్రీరాముడు సీతాదేవి వియోగాన్ని అనుభవిస్తున్నప్పుడు చక్రవాక పక్షులకు శాపం ఇచ్చాట్ట. నేను నా  ప్రియురాలి వియోగాన్ని అనుభవిస్తుంటే మీరు హాయిగా సంయోగానందాన్ని నా కన్నుల ఎదురాగానే  అనుభవిస్తూ, నన్ను ఉడికిస్తూ వెక్కిరిస్తూ బాధిస్తున్నారు, భడవల్లారా, మీకు రాత్రిపూట ఎడబాటు  కలుగుగాక, పగటిపూటే మీకు ఒకరినొకరు చూసుకోడం, కలుసుకోడం జరుగుగాక అని శాపం  ఇచ్చాట్ట. ఆ  శాప ప్రభావం వలన పగటిపూట కలుసుకున్న చక్రవాక పక్షులు ఆనందంగా కౌగలించుకుని ముక్కులు 
రాసుకున్నట్లు గోదాదేవి వక్షోజములు ప్రక్కలకు పెరిగి పెరిగి ఒకదానినొకటి ఒరుసుకుంటున్నాయి. ఆ  చక్రవాక పక్షుల ముక్కుల లాగా ఆమె చూచుకములు రాసుకుంటున్నాయి! 

తా రె ట్లట్లుగ దమ్ముం 
జేరిన ముత్తెంపుసరుల జేడియచన్నుల్ 
లోరెంట లుడిపె ఘనమగు 
వారు నిజార్జవము జేరు వారికి నీరే

ఉత్తములైనవారు వారిని ఆశ్రయించిన వారికి తమ ధైర్యాన్ని, సత్త్వాన్ని, లక్షణాలను అందించినట్లు,  యజమానుల లక్షణాలు సేవకులకు వచ్చినట్లు గోదాదేవి వక్షోజాలను ఆశ్రయించిన ఆభరణాలకు ఆ వక్షోజాల  లక్షణాలు వచ్చాయి. విపరీతమైన వైశాల్యం వలన ఆ వక్షోజాలు ఒకదానికొకటి అంటుకుపోయాయి. ఆమె  ధరించిన ఆభరణాలకు ఆమె వక్షోజాల మధ్యలో ఇరుక్కుపోవడం వలన, పేటలన్నీ ఒక్కటిగా ముడిపడి,  ఇరుక్కుపోయాయి. యిదీ రాయల రాసిక్యం!    

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు    

మరిన్ని శీర్షికలు
weekly horoscope 26th june 02 july