Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 26th june 02 july

ఈ సంచికలో >> శీర్షికలు >>

పద్యం భావం - సుప్రీత

వేమనపద్యం


ఆపదైనవేళనరసిబంధులజూడు

భయమువేళజూడుబంటుతనము

పేదవేళజూడుపెండ్లాముగుణమును

విశ్వదాభిరామవినురవేమ.


తాత్పర్యం :

ఆపదలయందు సహాయ పడు వారే బంధువులు. భయముతో ఉన్నప్పుడు ధైర్యం వహించు వాడే వీరుడు. బీదతనములో కూడ గౌరవించునదే భార్య.


విశ్లేషణ :

కొంత మంది స్నేహితులు బంధువులు మాములుగా స్నేహంగా ఉంటారు కాని ఎదైన అవసరం వచ్చినప్పుడు సహాయం చేయల్సివస్తుందని తప్పించుకు తిరుగుతారు. ఎవరైతే మనకి కష్టంలోను సుఖంలోను తోడు ఉంటారో వాళ్ళే నిజమైన బంధువులు. అలాగే కొందరు చిన్న చిన్న విషయాలకే అధైర్య పడి పోతుంటారు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోఉన్నా సరే ధైర్యంగా ఉండే వాడే వీరుడు. అదే విధంగా భార్య అసలు గుణం పేదరికంలో తెలుస్తుంది , ఏ భార్య అయితే పేదరికంలోను భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుందో ఆమే ఉత్తమ ఇల్లాలు అని చెప్పటమే ఈ పద్యంలో నీతి.

దాశరధీ పద్యం :


వనకరిచిక్కెమైనసకు, వాచవికంజెడిపోయెమీను ,తా

వినికికిజిక్కెజిల్వగమవేదుఱుజెందెనులేళ్ళుతావిలో

మనకినశించెదేటితరమాయిరుమూటినిగెల్వనైదుసా

ధనములనీవెకావదగుదాశరధీకరుణాపయోనిధీ.


తాత్పర్యం :
ఏనుగు దేహచాపల్యమునకు చిక్కి చర్మేంద్రియము కిలో నయ్యను. చేప వలను చూసి అక్కడ ఏదో ఉంది అని ఆశ పడి దానిలో చిక్కుకుంటుంది. పాము నాద స్వరము విని ఆశ పడి పాములు పట్టే వాడి చేతిలో చిక్కుకుంటుంది. జింక పిల్లలు అందంగా కనిపించిన వాటి వెంట పరుగు పెట్టి నష్ట పోతాయి. తుమ్మెద పరిమళమునకి ఆశ పడి నశిస్తుంది. ఇలా అన్ని జంతువులు పంచేద్రియాలని గెలవలేక నష్ట పోతాయి. అలాంటి వాటిని గెలవటానికి నీవే మాకు తోడు పడాలి రామ !


విశ్లేషణ :
ప్రకృతి నుంచి మనము నేర్చుకోవల్సిందెంతో ఉంది. మనిషి పంచేద్రియాలకి బానిస అయితే, ఎంత నష్టపోతామో తెలుస్తుంది. ఒక్కో జంతువు వాటి అలవాట్లు వళ్ళ వాటి ఇంద్రియాలను జయింప లేక పోవటం వల్ల ఎంతో నష్టపోతాయి. జంతువులకి జ్ఞానం లేదు కాబట్టి అవి తప్పు చేస్తాయి. కాని మనిషికి భగవంతుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ కూడా ఇంద్రియాలని తనకు తానే జయించలేడు, ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోరికలతో సుఖాలకి అలవాటు పడి తన స్వార్ధం కోసం తప్పులు చేస్తుంటాడు, అలాంటి ఇంద్రియాలని జయించాలంటే మాకు కష్టం, ఓ రామ నీవె సహాయం చేయాలి అని ఈ పద్యంలో నీతి.

సుమతీశతకం :

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింప దగున్‌
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ!

తాత్పర్యం :

ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందర పడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.

విశ్లేషణ :

కొంతమంది మనుషులు తమకి తాము ఏది సరైనది ఏది తప్పు అని తెలుసుకోలేరు. అన్నిటికీ ఎదుటి వారి సలహా తీసుకుంటారు. కొందరు ఎదుటి వారికి సలహాలు ఇచ్చేటప్పుడు తమ సొంత ప్రయోజనం కోసం స్వార్దంగా సలహాలు ఇస్తారు .అందుకే మనకి అవసరం అయినప్పుడు ఎదుటి వారి సలహాలు తీసుకోవాలి కాని తొందరపడి దాన్నిఆచరించక ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే మనిషి మహత్ముడౌతాడు అని ఈ పద్యంలో నీతి.

మరిన్ని శీర్షికలు
sri varaha kshetram