Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ : చంద్రకళ నృత్యం, రాణి గాత్రంతో కలిసి ఆనందంగా సాగుతుంటుంది జీవనయానం. ఫోనులో జగదీష్ పలకరింపు చంద్రకళకి ఉత్సాహాన్నిస్తుంది. వాళ్ళు వస్తున్న విషయంలో తల్లితండ్రి మధ్య ఏదో చర్చ సాగుతుండడం గమనించినా ఏమీ అడగదు చంద్రకళ.   ఆ తర్వాత...

“ పెద్ద విషయమేమీ లేదు. ఈ యేడు కూడా తిరుపతి ట్రిప్ కలుపుకొని, రెండు వారాల కోసం చెన్నై రావాలనే అనుకున్నారట వాళ్ళు. ఇకపోతే, హాలిడేస్ కి రమ్మని, రాణి ప్రతి రోజు ఫోన్ చేస్తుందట. వస్తామనే ఆ అమ్మాయికి చెప్పుంటారు మరి. వదిన మాత్రం, మన చంద్ర డాన్స్ ప్రోగ్రాములు, వినోద్ స్కూల్ హాలిడేస్, అన్నీ మనతో మాట్లాడి డేట్స్ తెలుసుకొని ప్రయాణమౌతామని అంటుంది... ప్రాక్టీసులకి అడ్డం లేకుండా చెప్పమంది,” క్షణమాగింది అమ్మ. “అంతా విని, సరే అన్నాను,

అన్నీ చూసి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పాను. అదీ సంగతి,” అమ్మ సంతోషంగానే ఉంది. ‘అమ్మయ్య! గొడవలు లేవేమోలే’ అనుకున్నాను.

మరి నీ ప్లాన్ ఏంటి. ఎప్పుడు రమ్మని చెబుతావు?” అడిగారు నాన్న.

అమ్మ ఏమీ అనలేదు...ఆలోచిస్తున్నట్టుగా ఉంది... ఆమె ప్లాన్ ఏమిటోనని నేనూ వింటున్నా...... “ఏముంది, సరిగ్గా వర్ధంతి ప్రోగ్రాం టైంకి వస్తే, ఆ వారంలో, మనతో మదురై కి కూడా వస్తారు. అదయ్యాక తిరుపతి ట్రిప్. ఆ తరువాత ఇక్కడే ఉండి, కాస్త అటు ఇటూ తిరిగేప్పటికి అందరికీ స్కూల్స్ రి-వోపెన్ అవుతాయి. కరెక్ట్ గా డేట్స్ కుదురుతాయి,” అంది.

**

ఈ సారి అత్తయ్య వాళ్ళకి మరింత కంఫర్టబిల్ గా ఉండేలా, ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తుంది అమ్మ. డాన్స్ ప్రాక్టీసులు, మ్యూజిక్ క్లాసుల మధ్య, వాళ్ళ డైలీ రొటీన్ గురించి పదే పదే అలోచించి, అత్తయ్యతో మాట్లాడి మరీ ప్లాన్ చేయసాగింది.

‘అన్నీ పర్ ఫెక్ట్ గా ఉండాలి... చక్కగా జరగాలి’ అని అన్నిటా శ్రద్ధ పెడుతుంది అమ్మ. నా ప్రాక్టీసులప్పుడు కూడా చాలా కష్టపడుతుంది. కొత్త సింగర్, ఆర్కెస్ట్రా వాళ్ళకి దగ్గరుండి సూచనలిస్తూ, ‘ఇదివరకటి కంటే ప్రోగ్రాం బాగుండాలి’ అని వారితోనూ అంటుంది...,.

నా కొత్త కాస్టూమ్స్ కి చిన్ని ముత్యాలు, చిట్టి మువ్వలు కుట్టించింది. మొత్తం మూడు కాస్టూమ్స్. అన్నీ నా ఫేవరెట్ కలర్స్. పాత సినిమాలు, మాగజైన్స్ చూసి, కొత్త కొత్త డిజైన్లు - అమ్మే క్రియేట్ చేసింది కూడా. ** ‘మా అమ్మ ఎమేజింగ్!’ అన్నాను కాస్టూమ్స్ చూసాక.

“ఊ, మరి నా బిడ్డ ‘చిన్న దేవతలా’ ఉండాలి వేదికల మీద,” అంది.....

“నువ్వింత ఇష్టంతో, కష్టపడి ప్రాక్టీసులు చేస్తుంటే, దానికి తగ్గట్టు నీ వేషం ఉండాలిగా. అదీ గాక, మంజరి, కాంచన వాళ్ళ కాస్టూమ్స్ లాగా కావాలన్నావుగా!” నవ్వింది అమ్మ.

**

వర్ధంతి ఫంక్షన్ కి ముందు రోజు, సాయంత్రం ఏడింటికి వచ్చారు రాం మామయ్యా వాళ్ళు. జగదీష్ బాగా పొడవయ్యాడు. గొంతు కూడా మారింది. భోంచేసి, మేము హాల్లో టి.వి ముందు చేరితే, పెద్దవాళ్ళంతా వరండాలో కూర్చున్నారు. తన బ్యాక్-పాక్ నుండి క్యాండి బాక్స్ తీసాడు జగదీష్.

“నీకిష్టమైన క్యాండీ అంటగా. డాడీ తెచ్చారు. మరీ ఎక్కువ తింటే, రేపు డాన్స్ చెయ్యలేవు,” నవ్వుతూ క్యాండీ బాక్స్ నాకిచ్చి,

“నీకు ఈ పజిల్ గేమ్.... చూద్దాం నీవెలా సాల్వ్ చేస్తావో,” అంటూ వినోద్ కి గేమ్ బాక్స్ అందించాడు
...

 **

టి.వి చూస్తూ, మాకు వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్పసాగాడు జగదీష్. రెండేళ్ళ క్రితం వరకు, సమ్మర్ వెకేషన్ కి, తప్పనిసరిగా రాజమండ్రిలో ఉన్న తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేవాడట. “అమ్మమ్మ ఒక్కత్తే ఉండేది కదా! తన ఇల్లు, పొలం వదిలి ఎక్కడికీ వచ్చేది కాదు.... అందుకే ఎప్పుడో తప్ప, ప్రతిసారి సెలవలకి నన్ను అటు అమ్మమ్మ వద్దకు పంపేవారు... అమ్మమ్మంటే నాకు చాలా ప్రేమ, ఇష్టం. ఆమెతో తెలుగులోనే మాట్లాడేవాణ్ని. ఇంతగా తెలుగులో మాట్లాడ్డం నేర్పిందే మా అమ్మమ్మ. రెండేళ్ళ క్రితం ‘హార్ట్ ప్రాబ్లం’తో చనిపోయింది...,” చెబుతూ దిగులుగా అయిపోయాడు జగదీష్. నేనేమనలేక పోయాను.


“అమ్మమ్మ వల్లే నేను డాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను,” అన్నాడు జగదీష్....

ఇంతలో వరండాలో నుండి హాల్లోకి వచ్చారు అమ్మావాళ్ళు...

“కిడ్స్, రేపు ప్రోగ్రాం హడావిడి ఉందిగా, అందరూ త్వరగానే పడుకోండి. గుడ్ నైట్,” అన్నారు రాంమామయ్య...

**

మరునాడు లంచయ్యాక హడావిడిగా స్టూడియో చేరి మేకప్ మొదలు పెట్టుకున్నాము. పక్కనే సెట్స్ మీద జరుగుతున్న షూటింగ్ చూడ్డానికి వెళ్ళారు మామయ్యా వాళ్ళు. ప్రోగ్రాం అనౌన్స్ మెంట్ కి, డాన్స్ ఐటమ్స్ వివరాలు రాసాక, మేకప్-మాన్ సాయంతో నా జుట్టు కట్టి, కొప్పు పెట్టి, జడ వేసి దాని అలంకారమంతా చేసింది, అమ్మ...


సరిగ్గా, నా మేకప్ అయ్యే సమయానికి, మూవీ షూటింగ్ చూసుకొని, గ్రీన్-రూమ్ లో అడుగు పెట్టారు అత్తయ్య వాళ్ళు...

“ఈ సారి కూడా విశేషంగా అలంకరించారు చంద్రకళా మీ ‘ వేదికని ’. నీవు రెడీయేగా, పద చూద్దువు గాని,” అని మణత్తయ్య అంటుండగానే, భూషణ్ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు.

చాలా హ్యాపీగా అత్తయ్యని హగ్ చేసి, జగదీష్ హ్యాండ్ షేక్ చేసి, మామయ్యకి నమస్కరించింది రాణి. అందంగా తయారయింది. తన డ్రెస్సులు స్పెషల్ గా డిజైన్ చేయిస్తుందట నీరూ ఆంటీ.

అందరం వేదిక వద్దకు వెళ్ళాము. భూషణ్ అంకుల్ నా వెనకే వచ్చారు, “ఈ సారి ఎలా ఉంది మీ ‘వేదిక’, కళా?” అడిగారు. వేదిక మీద కళ్ళు చెదిరే లైట్లల్లో, బ్యాక్-డ్రాప్ గా సరస్వతీ దేవి బొమ్మ, అటు ఇటూ చిన్నవిగా రాణి, నాది పోస్టర్స్ పెట్టించారు.

“చాలా బాగుంది. థాంక్యూ అంకుల్,” అన్నాను.

“సరస్వతీ దేవికి అటు ఇటు, లక్ష్మీ, పార్వతులని పెట్టినట్టుగా ఉంది ‘వేదిక’,”, “మీ ఏర్పాట్లు, మీ ఆసక్తి కి జోహార్లు అన్న గారు,” అంది ణత్తయ్య భూషణ్ అంకుల్ తో. అందరూ మెచ్చుకున్నారు. అతిధులని రిసీవ్ చేసుకోడానికి నాన్న, అంకుల్ అక్కడి నుంచి కదిలారు. మేము గ్రీన్ రూంకి వెళ్ళిపోయాము.

**

“మీ ఇద్దరి పాట, డాన్స్ ఓ పోటీ లా, ఓ జుగల్బందీలా బాగుంది పాప. ఇంత చిన్న వయస్సులో, మంచి ప్రావీణ్యత సంపాదించారు. బేష్! చాలా బావుందమ్మా,” అన్నాడు ప్రోగ్రాం జరుతుండగా, మా మృదంగం సార్, అమరేంద్ర. ఆయన చేతే, అమ్మ నాకు నెలకి రెండు మార్లు ట్యూషన్ చెప్పిస్తుంది. సంగీతంలో రాగాలు, తెలుగు భాషా ప్రయోగం గురించి అర్ధమయ్యేలా చెబుతారాయన.

**

బ్రేక్ తరువాత, రాణి పాట మొదలవ్వబోతుంటే, వేదిక పక్కనే కూర్చున్న నా వద్దకు వచ్చారు జగదీష్, అత్తయ్య.

“నీ డ్రెస్సులు, నీ వేషం మెరిసి పోతున్నాయని, చాలా అందంగా డాన్స్ చేస్తున్నావని అంటున్నారు ఆడియన్స్,” అంది తగ్గు స్వరంలో అత్తయ్య.

“నీ కొత్త ఐటమ్ – జావళి - ఎమేజింగ్. నీ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ మాజికల్ గా ఉన్నాయి,” అన్నాడు జగదీష్.

అంతలా డాన్సుల్లో, అన్నీ నోటీస్ చేస్తున్నాడు జగదీష్ అని ఆశ్చర్యంతో పాటు సంతోషంగా ఉంది...నృత్యం పట్ల నిజమైన ఆసక్తి అన్నమాట అనిపించింది.

“ష్, సాఫ్ట్ గా మాట్లాడండర్రా. కాసేపు ఇక్కడే కూర్చుని పాట విని వెళదాం. ఇప్పుడు అందరి మధ్యనుంచి వెళ్లడం బాగోదు,” అని మణత్తయ్య అనడంతో, వెళ్ళకుండా నా పక్కనే కుర్చీల్లో కూర్చుండిపోయారు..

**

నాకు ఎంతో ఇష్టమైన, సరస్వతీ అష్టకం పాడుతుంది రాణి.


..భవాం భోజ నేత్రాజ – సంపూజ్యమానాం లసన్మందహాస ప్రాభా – వక్త్ర చిహ్నామ్ | చలచ్చంచలా చారు – తాటంక కర్ణాం భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||......

‘పూర్తిగా అర్ధాలు తెలియకపోయినా, క్లాసులో వినీ వినీ చక్కగా పాటలు మాత్రం వచ్చేస్తాయి మాకు’ అనిపించి నవ్వొచ్చింది. పాటయ్యాక ‘వేదిక’ నుండి దిగుతూ, జగదీష్ వాళ్ళని చూసి ఆశ్చర్య పోయింది రాణి. “అదేమిటి? ఇక్కడ ఉన్నారు. నేను పాడుతుంటే మీరు ఆడియన్స్ లో కదా ఉండాలి!” అంది కాస్త కోపంగానే.

నాన్న నా తరువాతి డాన్స్ ఐటం అనౌన్స్ చేయడంతో, నేను అక్కడి నుండి కదిలాను......

నాకు ఎంతో ఇష్టమైన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి - ‘కొలువైతివా రంగసాయి’. తేజశ్విని మేడమ్ కొరియాగ్రాఫ్ చేసిన ఐటం. అందులోని నడకలు, అడుగులు, స్వరాలు, జతులు అందంగా, కాస్త భిన్నంగా, ఎదురు తాళాన కూర్చారామె. రెట్టింపు ఉత్సాహంతో మృదంగంతో అడుగు కలిపాను....నా డ్రెస్సులకి అమ్మ కుట్టించిన ముత్యాలు, మువ్వలు అందంగా నాతో పాటుగా కదులుతూ, సవ్వడులు చేస్తూ, ఏదో కొత్తదనం తోచింది. ‘నేను-నా నాట్యం’ తప్ప, మరింకేమీ లేనట్టు, నీలాకాశంలో ఆనందంగా ఆడుతున్న భావన కలిగింది........

ఔరా.. ఔరౌరా ! ఔరా... ఔరౌరా!! రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి వురమందు తులసి సరులందు కలసి మణి అందముగ వహించి సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి

జిలిబిలి పడగల శేషాయి తెలిమల్లె శయ్య శయనించి ముజ్జగములు మోహంబున తిలకింపగ పులకింపగ శ్రీ రంగ మందిర నవసుందరా పరా ! // శ్రీ రంగ //

ఆఖరి జతి అయ్యి, డాన్స్ ముగిసేప్పటికి, హాల్లో ఆడియన్స్ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేసారు. పాట చివరిలో ఐదు నిముషాల సేపు సాగే జతికి కూర్చిన అడుగులు, నడక ఆ డాన్స్ కి ‘హైలైట్’ అని అమ్మ అంటూనే ఉంటుంది. ... దానికే ఆ ప్రేక్షకుల స్పందన ....

ఆ పాటకి నర్తిస్తూ నేనెంత ఆనందించానో, ఆ నాట్యం చూస్తున్నవారికీ, అంతే ఆనందం కలిగిందని అనిపించి, నాకు మరింత సంతోషమనిపించింది..

ఆడియన్స్ అప్లాజ్ ఆగేంతవరకు ‘వేదిక’ మీదే ఉండాలని అమ్మనడం గుర్తొచ్చి, నమస్కరించి అక్కడే నిలబడిపోయాను. తరువాతి అనౌన్స్ మెంట్ కి నాన్న వేదిక మీదకి రావడంతో, నేను పక్కకి వెళ్ళ గలిగాను. అమ్మ, రాణి పాడిన ‘అయిగిరినందిని శ్లోకం’ తో ప్రోగ్రాం ముగిసింది.


“తదుపరి ప్రోగ్రాం - వర్ధంతి పూజ, భోజనాలు,” అంటూ అనౌన్స్ చేయడంతో గెస్ట్స్ మెల్లగా ఆడిటోరియం నుండి కదిలారు.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti