Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ : కొన్నిరోజులు అదృశ్యమై, తిరిగొచ్చిన అపర్ణను మీడియా చుట్టుముడుతుంది. ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తుంది..ఫణిభూషణరావు గారు విషాదంలో ఉంటారు....  ఆ తర్వాత...

‘‘హూ!’’ నిట్టూర్చారాయన.

‘‘బయట జనం చాలామంది ఎదురుచూస్తున్నారు’’

‘‘ఎందుకు?’’

‘‘ఎందుకో మీకు తెలీదా? అమ్మగారు పోయిన తర్వాత ఈ ఇంట్లో అమ్మాయిగారి పుట్టినరోజే పెద్ద వేడుక. దసరా, దీపావళి, రంజాన్‌, క్రిస్మస్‌...అన్ని పండగలూ మూకుమ్మడిగా మనింటికి వచ్చే రోజిది. ఈ విషయాలన్నీ మీకు ప్రత్యేకించి చెప్పే అర్హత నాకు లేదు’’

మాట్లాడలేదు ఫణిభూషణరావు.

‘‘అమ్మాయిగారు ఇండియాలో ఉన్నా...ఎబ్రాడ్‌లో ఉన్నా ఇక్కడి ఈ ఆనవాయితీని మీరెప్పుడూ మరిచిపోలేదు. ఇవాళ కూడా మరిచిపోరని తలుస్తున్నాను’’

‘‘ఈ లోకంలోనే లేని అమ్మాయి లేదు. ఇంకా...తనకెందుకు పుట్టినరోజులు’’

‘‘అమ్మాయిగారు నిజంగా చనిపోయారా?’’ ఆనందరావు ప్రశ్నతో ఫణిభూషణరావులో ఒక్కసారిగా ఉలికిపాటు.  కూతురు గుర్తొచ్చి సన్నగా గుండెల్లో నొప్పి.

‘‘ఆమె చనిపోయిందని అనుకుంటున్నా...బతికే ఉంది. ఔను నిజం. ఆమె మీ జ్ఞాపకాల్లో బతికే ఉంది’’ ఆనందరావు అంటున్నాడు. అతడలా అంటుంటే...ఫణిభూషణరావు కళ్లవాకిళ్లలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌, కోటీ హరిద్వార్‌, ఇండికా కారులో తను. ఇంతకీ తనెవరు?

తన కూతురు చనిపోవడం నిరaంగా నిజం. మరి, బతికున్న తనెవరు? ఆమె కనిపించడంతో కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ప్రశ్న ఓపక్క మెదడుని తొలిచేస్తుంటే, మరోపక్క కూతురి అర్థాంతరపు చావు గుండెల్ని తొలిచేస్తోంది. ఈ నేపధ్యంలో విచ్చేసిన కూతురు పుట్టినరోజు కూడా కూతురు లేదన్న సంగతిని గుర్తుచేస్తోంది.

‘‘రండి..మీ చేతుల మీదుగా పేదలకు దుస్తులు పంపిణీ చేద్దురుగానీ’’ ఓ పదినిముషాలు బతిమిలాడుతూనే ఉన్నాడు ఆనందరావు.   ‘‘ప్లీజ్‌! ఆ తంతు ఏదో మీ చేతులతోనే కానివ్వండి. నన్ను విసిగించకండి’’ హుకుం జారీ చేసాడు ఫణిభూషణరావు.

ఇక, చేసేది లేక ఆనందరావు బయటకి వెళ్తుంటే...ఆ గదిలో ప్రతిచోటే కూతురు ప్రతిబింబమే కనిపిస్తోంది.

అయిదునిముషాల తర్వాత`

ఒక్కసారి లేచి కిటికీ కర్టెన్‌ తొలగించి బయటకు తొంగి చూసారాయన.

దుస్తుల పంపిణీ మొదలైంది కాబోలు..వాకిలంతా సందడి  సందడిగా ఉంది. వస్త్రాలు అందుకుంటూ ప్రతిఒక్కరూ నిండునూరేళ్లూ చల్లగా ఉండమంటూ తన కూతుర్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. ఏ లోకంలో ఉన్నా దీవెనలు ఆమెకు చేరాలి...కన్నీటి తెర చూపుల్ని కప్పేస్తుంటే కర్చీఫ్‌తో తుడుచుకుంటూ లోనికొచ్చాడు ఫణిభూషణరావు.

మళ్లీ లోనికొచ్చి...కుర్చీలో వాలిపోతుండగా టేబుల్‌పై ఉన్న కొన్ని పేపర్లు గాలికి రెపరెపలాడుతూ పలకరించాయి. ఆ పేపర్లు..అందులోని ముద్రితమై ఉన్న ఆంగ్లాక్షరాలు చూస్తుంటే మనసులో మళ్లీ అగ్గి రగిలింది.

‘‘ఐయామ్‌ ది హార్ట్‌...యూ ఆర్‌ హార్ట్‌ బీట్‌

ఐయామ్‌ ది బ్రీత్‌...యూఆర్‌ ది ఆక్సిజన్‌

ఐయామ్‌ ది బాడీ...యూఆర్‌ ది సోల్‌

వియ్‌ ఆర్‌ టూ బాడీస్‌...వన్‌ సోల్‌’’

ప్రతిమ సెల్‌ నుంచి పుంఖానుపుంఖాలుగా వెళ్లిన ఎస్‌ఎంఎస్‌ల్లో అదొకటి. పిడికెడు గుండెను కవిత్వంలో ముంచి మరీ ఆవిష్కరిస్తున్న అక్షరాలవి.

‘‘ఆమె హృదయమైతే...అతడు ఆమె హృదయస్పందన

ఆమె ఊపిరైతే...ఆ ఊపిరిలోని ప్రాణవాయువే అతడు

ఆమె శరీరం...అందులో కొలువైన ఆత్మ అతడు

ఆ ఇద్దరివీ రెండు శరీరాలు...ఒకే ఒక్క ఆత్మ’’

ఆ ఊహే భరించలేకపోతున్నాడు ఫణిభూషణరావు. చిన్నతనంలో తన ఒళ్లో కూర్చుని అక్షరాభ్యాసం చేసిన కూతురు...తన చిటికెనవేలు పట్టుకుని ఈ విశాల ప్రపంచాన్ని పరిచయం చేస్తే...అతడినే తన ప్రపంచం చేసుకుంది. తల్లిలేని తనకు తల్లీ తండ్రీ అన్నీ తానే అయి ముద్దుమురిపాలతో పెంచితే...తన సర్వస్వంగా అతడినే ఎంచుకుంది. రెండక్షరాల ప్రేమ ఎంతపనిచేసింది?

ఆలోచిస్తుంటే కళ్లలో అశ్రుధారలు. గుండెల్లో అగ్నిజ్వాలలు.

తట్టుకోలేకపోతున్నాడు ఫణిభూషణరావు. తన కూతురు ప్రతిమను ఈ లోకంలో ఏ తండ్రీ ప్రేమించనంతగా ప్రేమించాడు. ఆమె ఐస్‌ క్రీం కావాలంటే ఐస్‌ క్రీం పార్లర్‌ కొనిపెట్టాడు. సైకిల్‌ కావాలంటే స్కూటీ కొనిచ్చాడు. అడక్కుండానే సొంతకారు అమర్చాడు. అంతేనా! అమెరికా చదువులు చెప్పించాడు. అయితే...తనేం చేసింది? మళ్లీ టేబుల్‌పై ఎగురుతున్న కాయితాలపై దృష్టిసారించాడతడు.

‘‘ఎల్‌` లిజన్‌ మీ

ఓ` అబ్జర్వ్‌ మీ

వి`వెరిఫై మీ

ఇ`ఎక్స్‌పీరియన్స్‌ మీ’’  అంటూ ‘ఎల్‌వోవిఈ...’లో పడిపోయింది.

ఔను...తను పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. ఎంతగా అంటే...ఈ తండ్రిని మరిచిపోయేంతగా. ఒక్కరోజు తనకైనా కాల్‌ చేయడం మరిచిపోయేదేమో కానీ...అతడికి...‘88690 88690’ నంబర్‌కి కాల్స్‌ చేసేది. అలాగే, ఆ నంబర్‌ నుంచి ప్రతి పదినిముషాలకొచ్చే ప్రతి కాల్‌నీ, ప్రతి మెసేజ్‌ని చేతుల్లో హృదయం ఉంచి మరీ అందుకుంది. అదే తనకు నచ్చలేదు. ఒక్క తనకే కాదు...ఈ లోకంలోని ఏ తండ్రికీ అది నచ్చదేమో? మనసు కుతకుత ఉడికిపోతుంటే...దగ్గర్లోనే టీపాయ్‌ మీదున్న సెల్‌ అందుకున్నాడు.

8...8...6...9...0...

కసిగా ఒక్కో నంబర్‌ నొక్కుతున్నాడు.

రింగవుతోంది.

రింగవుతునే ఉంది.

అట్నుంచి ఎవ్వరూ లిఫ్ట్‌ చేయడం లేదు.

‘‘గుండెల్లో పెట్టుకుని అపురూపంగా పెంచి పెద్ద చేసిన నీ కూతురే ఇప్పుడు లేదు...ఆ అభాగ్యుడిపై ఇంకా నీకెందుకంత కక్ష?’’  ఫణిభూషణరావులోని మరో ఫణిభూషణరావు ప్రశ్నిస్తుంటే...వాడి పీకనొక్కేందుకు ప్రయత్నిస్తూనే...మళ్లీ మళ్లీ అదే నంబర్‌కి కాల్‌ చేస్తున్నాడు ఫణిభూషణరావు.

నో రెస్పాన్స్‌.

రింగవుతోంది.

రింగవుతునే ఉంది.

భయం భయంగా చూస్తున్నాడు అభిరామ్‌. ఒకప్పుడు ఫోన్‌ రింగవుతుంటే సుశ్రావ్యంగా సంగీతం వినిపిస్తున్నట్లనిపించేది. ఇప్పుడు సెల్‌ ధ్వని వినిపిస్తుంటే యముని మహిషపు లోహపు గంటల సవ్వడి వినిపిస్తున్నట్లు ఉలిక్కిపడుతుంటాడు. స్క్రీన్‌పై ఏ  నంబర్‌ కనిపించినా... ఆందోళనే. అవతలివాళ్లెవరో...ఎంత అత్యవసరంతో కాల్‌ చేస్తున్నారో  కూడా తెలుసుకోవాలనిపించదు. కారణం...ఓసారి ఇలాగే కాల్‌ రిసీవ్‌ చేసుకుని ఇబ్బందులపాలయ్యాడు.

‘‘హలో...’’

‘‘నేను అభీ! కృష్ణని’’ అది కృష్ణ గొంతే. కాలేజ్‌ దోస్త్‌. ఇప్పుడు ఎంఎన్‌సీలో జాబ్‌ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ వీకెండ్స్‌లో కలుస్తుంటారు.  కబుర్లు చెప్పుకుంటారు.

‘‘ఏంటీ విశేషం?’’ అడిగాడు అభిరామ్‌.

‘‘అర్జంట్‌గా నిన్ను కలవాలి. నీతో డిస్కస్‌ చేయాల్సిన ఇంపార్టెంట్‌ ఇష్యూ ఒకటుంది’’

‘‘ఇప్పుడా? ఇంత రాత్రివేళ...?’’ అప్పుడు రాత్రి  పదకొండుగంటల సమయం.

‘‘ప్లీజ్‌...! అర్జంట్‌గా నువ్వు రాలేదనుకో. ఇక, జన్మలో నన్ను చూడలేవు. సూసైడ్‌ చేసుకుంటాను’’

‘‘ఏయ్‌..ఏంటామాటలు?’’ ఫోన్‌లోనే కసురుకున్నాడు అభిరామ్‌.

‘‘ఇప్పుడు నేనున్న పరిస్థితి నీకు తెలీదు. పీకల్లోతు క్రైసిస్‌లో కూరుకుపోయాను. చావు తప్ప మరో దారి కనిపించనిస్థితిలో పడిపోయాను. చివరిసారిగా నీతో కొన్ని విషయాలు పంచుకుందామని...హాఫెనవర్లో టాంక్‌బండ్‌కి రా! సరిగ్గా, థర్టీ మినిట్స్‌ టైమిస్తున్నాను. నేనిచ్చిన ఈ ముప్పయ్‌ నిముషాల గడువులోగా నువ్వు రాలేదంటే నువ్వూనేనూ ఇక ఎప్పటికీ కలుసుకోలేం’’ ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడతడు. ఆలోచించి, అర్ధం చేసుకుంటే ప్రతి సమస్యకూ పరిష్కారం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెతికే సహనం లేక చావే పరిష్కారమనుకుంటే ఎలా? కృష్ణ ప్రవర్తన చికాకు కలిగిస్తున్నా...మృత్యుముఖంలో ఉన్నానంటూ బెదిరిస్తుండడంతో మిత్రుడిని కలవడానికే నిర్ణయించుకున్నాడు అభిరామ్‌.

‘‘సరే...హాఫెనవర్లో నేనక్కడ ఉంటాను. కానీ, ముందు నువ్వు నాకో మాట ఇవ్వాలి’’

‘‘ఏంటీ...?’’

‘‘తొందరపడి ఏ అఘాయిత్యం చేసుకోనని మాటివ్వు’’

‘‘అలాగే...ఇదే సమయంలో నువ్వు కూడా ఓమాటివ్వాలి’’ అన్నాడు కృష్ణ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్