Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - రవీంద్ర



ఆప్యాయతల హరివిల్లు


మనిషి జీవితం ఆప్యాయతల హరివిల్లు. అనుబంధాలతో పెనవేసుకున్న పొదరిల్లు. మనిషి ఒంటరివాడు కాదు, నిత్యం అనేక సంబంధాలతో పెనవేసుకున్న సంఘ జీవితం. మరి అలాంటి మనిషి జీవితంలోని యవ్వనం అంటే... జీవితాన్ని మలుపు, గెలుపు వైపు తిప్పే దశ. బాల్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే విద్వత్. అలాంటి యవ్వనంలోని యూత్, నిత్యం ప్రవహించే జలపాతాల్లా, ఎగిసే కెరటాల్లా, కణకణ మండే నిప్పు కణికల్లా లక్ష్యాల వైపు పరుగులు తీయాలి. అదే సమయంలో, అదే సందర్భంలో, అదే వయసులో మనుషులతో మమేకం కావాలి, కొత్త విషయాలవైపు ప్రయాణించాలి. సరికొత్త ప్రయోగాలకు తెర తీయాలి. అన్నిటిని మంచి మానవ సంబంధాల్లోని అప్యాయతల చిరునవ్వుల జల్లుల్లో తడవాలి.
 
 
స్నేహితులే చిరుజల్లులు
 

యూత్ ఎక్కువగా తోటి వయసు వారితోనే స్నేహాలు చేస్తారు. ఎందుకంటే... అభిప్రాయాలు, ఆలోచనలు, మానసిక పరిపక్వత ఒకేలా ఉంటుంది కాబట్టి. అందుకే ఇంట్లో తల్లిదండ్రుల కన్నా, బంధువుల కన్నా తోటి స్నేహితులకే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులతోనే మనసు విప్పి మాట్లాడతారు. తనలోని బాధను, సంతోషాన్ని, తీపిని, చేదును మిత్రులతోనే పంచుకుంటారు. నీ మిత్రుడేవరో చెప్పు, నీ గురించి చెప్తాను అన్న మాట వాస్తవం. మీ మీ జీవితాన్ని యవ్వనంతో స్నేహితులే నిర్ణయిస్తారు. తప్పుదోవ పట్టినా, ఎవరెస్టు ఎక్కించినా మీ స్నేహితుల ప్రభావం తప్పక ఉంటుంది. స్నేహితుణ్ని నమ్మినట్లుగా యూత్ మరొకరిని నమ్మరు. నిజమే... మీ స్నేహాన్ని, స్నేహితుల ఆప్యాయతలను ఆహ్వానించాల్సిందే... ఒక్క నిజమైన ఆప్తుడు ఉంటే చాలు. గ్రూపులుగా, గ్యాంగులుగా , గుంపులుగా ఉన్న స్నేహితులు సాహసాలు చేస్తారు. వెకిలి చేష్టలు చేస్తారు. మంచి పనులు చేస్తారు. మనసులు పెనవేసుకొంటే ఒకరికోసం ఒకరు జీవితాలను త్యాగం చేస్తారు. అన్ని మానవ సంబంధాలను డబ్బు, స్టేటస్, హోదా నిర్ణయిస్తున్న నేటి రోజుల్లో స్నేహితులందరూ హితులేనా అని మాత్రం కచ్చితంగా చెప్పలేం. అలానే మంచి హితులు లేని జీవితం వ్యర్థం అని కూడా చెప్పొచ్చు. మంచి స్నేహితుల స్నేహం జీవితాంతం చిరుజల్లులా కురుస్తూనే ఉంటుంది.
 
 
అమ్మనాన్నల అనుబంధాలు
 
 
నేటి యువతకు తల్లిదండ్రులతో అనుబంధాలు తగ్గుతున్నాయి. నగరాల్లో, పట్టణాల్లో అయితే ఈ తేడా మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బాల్యం నుంచి కౌమారంలోకి అడుగుపెట్టగానే యువతకు అన్నీ తెలుసన్న అభిప్రాయం ఏర్పడుతుంది. తల్లికంటే, తండ్రికంటే నేనే ఎక్కువ అనే భావనలో ఉంటారు. కాలేజ్, కొత్త పరిచయాలు, స్నేహాలతో ఆ ప్రపంచం లోకి అడుగుపెట్టగానే వారికి వారే హీరోలుగా, హీరోయిన్స్ గా భావించుకుంటారు. ఏదైనా చేయగలం అన్న ధీమా ఏర్పడుతుంది. దాంతో తమ తమ అభిప్రాయాలను, ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకోరు. కొన్ని విషయాలు వయసురీత్యా, సమాజలోని కట్టుబాట్ల రీత్యా పంచుకోడానికి, మాట్లాడుకోడానికి వీలుకాదు. కానీ అమ్మానాన్నలు మీ వయసును దాటి వచ్చిన వాళ్లు. మీ వయసులో మీ కంటే ముందు కొన్ని అనుభవాలను ఏర్పరచుకున్న వాళ్లు. ఆ అనుభవాలు మీకు ఉపయోగపడతాయి. పాఠాలు నేర్పుతాయి. వారి సూచనలు సలహాలు చాలా అవసరమవుతాయి. మీలోని లోటుపాట్లను, తప్పొప్పులను నిక్కచ్చిగా వివరిస్తాయి. ఓ అద్దంలా మీకు మీరే కనపడేలా చేస్తాయి. అందుకే వీలైనంతవరకు యువతకు అమ్మానాన్నలతో అనుబంధం అవసరం. అందుకే స్నేహితుల్లా మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా కనీసం వారానికి ఒకసారైనా మీరు మీ తల్లిదండ్రులతో కలిసి మీ అభిప్రాయాలు పంచుకోవాలి. కాలేజ్ ఫీజే కాదు, కాలేజ్ లో మీరు చేసిన అల్లరి గురించి కూడా చెప్పాలి.
 
 
లెక్చరర్లతో సరదాలు
 
 
అధ్యాపకులు అంటే కేవలం తరగతి గదిలో పాఠం చెప్పే వారు మాత్రమే కాదు. యువత జీవితానికి దిశ, దశ నిర్ణయించేవాళ్లు. చాలామంది చెప్తుంటారు- నా జీవితంలో నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నాకు పాఠాలు చెప్పిన మా సారే కారణం అని. అలా యువత జీవితాలపై లెక్చరర్ల ప్రభావం పడుతుంది. వారి ఆలోచనలు, దృక్పథాలు, లక్ష్యాలు యువతకు మార్గనిర్దేశాలు అవుతాయి. క్లాసు వదలగానే లెక్చరర్ అంటే ఎవరో అన్నట్లు, అతని ఎదుటే పిచ్చివేషాలు వేసే యువతా ఉన్నారు. అలానే, గురువుల్లో కూడా శిష్యులు అంటే పట్టించుకోని వాళ్లూ ఉన్నారు. గురువులు కూడా స్నేహితుడి వంటి వారే. వేదాల నుంచి నేటి విశ్వవిద్యాలయ విద్యా విధానం వరకు గురు శిష్యుల సంబంధానికి ఓ ప్రత్యేకత ఉంది. కానీ నేడు అది కనుమరుగవుతోంది. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు లాంటి గురుశిష్యుల పరంపర ఉంది. కాలంతో పాటు బోధనలో మార్పు వచ్చింది, అలానే గురుశిష్యుల సంబంధం కూడా ఆర్థిక సంబంధం అయింది నేడు. కానీ శిష్యులు, గురువులు ఆంతరంగిక ముత్రుల్లానే ఉండాలి. శిష్యులు లెక్చరర్ తో స్నేహం చేయొచ్చు, అతనిలోని విద్యను తెలుసుకొనేందుకు, అతనితో కలసి తిరగొచ్చు, అతనిలోని మంచి స్వభావాన్ని అలవర్చుకొనేందుకు, అతనితో కలిసి చిలిపి సరదాలు చేయొచ్చు, మీరు పెద్దవాళ్లు అయిన తర్వాత తీపి జ్ఞాపకాలుగా మిగుల్చుకోడానికి.
 
 
పరిచయాలే పండువెన్నెలలు
 
 
ప్రతి వారిని చిరునవ్వుతో పలకరించాలి. ప్రతి పరిచయాన్ని స్నేహంగా మార్చుకోడానికి ప్రయత్నించాలి. అలాంటి స్నేహాన్ని శాశ్వత తోడుగా తీసుకొచ్చుకోవాలి. అది మీ వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పడు, ఎవ్వరితో, ఎలా మెలగాలి అనేది ఓ విద్య. ఎక్కడా బోధించని విద్య. ఒక్కొక్కరు ఒక్కో రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాలక్రమంలో అబిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు. పరిస్థితులకు అనుకూలంగా మారుతుంటారు. కానీ మార్పు అనేది మీ పరిచయస్థులకు ఇబ్బంది కలిగేలా, మీరు వారికి దూరమయ్యేలా ఉండకూడదు. చదువు పూర్తైనా, ఉద్యోగంలో చేరినా, మరో చోటకు వెళ్లినా కొత్తకొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఆ పరిచయాల్లో కొన్ని అక్కడే ఆగిపోయాయి, కొన్ని కొంత కాలం మాత్రమే కొన సాగుతాయి. మరికొన్ని జీవితాంతం నీడలా తోడు ఉంటాయి. మీ ఆనందం, బాధల్లో పాలు పంచుకుంటాయి. ఒకర్ని పరిచయం చేసుకోవాలంటే... ప్రత్యేకంగా ప్రయత్నం చేసేకంటే, మామాలుగా ఆ పరిచయం జరిగితేనే మంచిది. ఒక్కసారిగా, ఉదృతంగా మీ అభిప్రాయాలను వారికి చెప్పేకంటే, పరిచయంలో గాఢత పెరిగే కొద్దీ మీరు క్రమక్రమంగా వారికి అర్థమయితేనే మంచిది. ఓ సామెత ఉంది. ఎంత ఎక్కువ పూసుకొని తిరిగితే అంత తొందరగా విడిపోతారని. అందుకే పరిచయాన్ని స్నేహంగా మర్చేక్రమం సహజసిద్దంగా ఉండాలి అంటారు నిపుణులు.

జీవితంలో ప్రాధాన్యత సంతరించుకున్న యవ్వనం నిర్వీర్యంగా, నిస్సత్తువగా సాగకూడదు. అనుబంధాల జల్లులా, జీవితాంతం మూటగట్టుకొనే జ్ఞాపకాల మురిపెంలా ఉండాలి. నేటి యువత డబ్బు, ఉద్యోగం, స్టేటస్ కు ఇస్తున్న ప్రాధాన్యం మానవ సంబందాలుకు ఇవ్వడం లేదన్నది వాస్తవం. అందుకే యువత, వారితో ముడిపడిన తల్లిదండ్రులు, స్నేహితులు, లెక్చరర్ల బంధాలను ఆనందాల పూలజల్లుల్లా మార్చుకోవాలి. భవిష్యత్తుకు బంగారుబాటగా చేసుకోవాలి.                                               
మరిన్ని శీర్షికలు
avee - ivee