Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yuva

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

నోరు మంచిదయితే ఊరంతా మంచిగా ఉంటుందంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే, అయినా సరే, ఆ పనిమాత్ర్ం చేయరు. పైగా ఇదేమీ అంత అసాధ్యమయినదీ కాదు, పెడ్డలు చెప్పినదేమిటీ, నోరు శుభ్రంగా ఉంచుకోమని. అంటే దానర్ధం, ప్రతీరోజూ ఖరీదైన టూత్ పేస్టులు వాడమని కాదు. అలాగని కారాకిళ్ళీలూ, ఘుట్కాలూ వాడొద్దనీ కాదు. వాడుకోండి, కానీ, నోటినుండి వచ్చె “ మాట”  శుభ్రంగా ఉంచుకోండీ, అని. ఈ రెండూ ఎలా సాధ్యమూ అంటారా, ఆ తినేదేదో తినేసి, ఓ లవంగం నోట్లో వేసేసికోవడమే.

జోక్కులు వదిలేసి అసలు విషయంలోకి వద్దాము. మాటమంచిదీ అంటే, రోజంతా శుభాషితాలు చెప్తూ, నీతులు బోధించమని కాదు. అవతలివారితో, వయసుతో నిమిత్తం లేకుండా, మాట్టాడేటప్పుడు, “లోపల” ఎలా ఉన్నా, కనీసం మొహంమీద ఓ నవ్వు తెచ్చేసికుని మాట్టాడినా చాలు, మన మనోభావాలు ఎవడు చూసొచ్చినట్టు? ఈ రోజుల్లో ప్రతీదీ,  showcasing  చేస్తేనే కానీ, అందం రాదు. బజారు లో దొరికే పళ్ళూ, కూరలూ చూడండి, చకచకా మెరుస్తూ ఉంటాయి, లోపల ఎలా ఉన్నా సరే. బయటి చమక్కులు చూసే కదా, సరుకు కొనేదీ?

ఎప్పుడూ మొహం చిటపటలాడుతూంటే, మనల్ని ఎవరు పలకరిస్తారండి బాబూ?  అలాగే, ప్రతీదానికీ ఎడ్డెం అంటే తెడ్డెం అనేవారినీ, ఎవరూ దగ్గరకు రానీయరు. కొంతమంది వైద్యులు చూడండి, వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఓ పావుగంట కూర్చుంటే చాలు, అప్పటిదాకా ఉన్న రోగం కాస్తా , పూర్తిగా కాకపోయినా , సగానికి సగమైనా తగ్గుతుంది. మిగిలినది ఆయనిచ్చే మందులతో నయమవుతుంది. పైగా ఆ డాక్టరుగారికి ఓ పెద్ద పేరు కూడా వస్తుంది..” ఫలానా డాక్టరుగారి దగ్గరకు వెళ్తే చాలు, రోగాన్ని ‍ క్షణాల్లో మటుమాయం చేసేస్తారండి బాబూ… “ అంటారు. దానికి ముఖ్యకారణం ఏమిటంటారూ—మాట పధ్ధతి. రోగం ఎలాగూ నయమవుతుంది, ముందుగా వచ్చినవాడికి విశ్వాసం కల్పించడం, ఆ కబురూ, ఈకబురూ చెప్పి, అసలు రోగం అనేదే లేనట్టు మాట్టాడడం. ఓ పదినిముషాలు మాట్టాడేసరికి, ఓ నమ్మకం ఏర్పడుతుంది. రోగాలకి ముఖ్యకారణం చాలా మట్టుకు మనసుకి సంబంధించినవే. ఆ విషయం, డాక్టరుగారు మొదటే కనిపెట్టేశారు.

అలాగే  ఓ dentist  దగ్గరకు వెళ్ళండి,పన్ను నొప్పెడుతోండని, పీకించుకోడానికి వెళ్తాం, అయినా సరే, ఆయన  ఓ వయసొచ్చినవారితో ముందుగా చెప్పేది--- “ అరే ఈ వయసులోకూడా మీ పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయో… పన్నుకేముందండీ క్షణంలో పీకేయొచ్చు, కానీ ఉన్నదానికి ఓ అయిదారేళ్ళు లక్షణంగా ఉపయోగించేటట్టు,  రూట్ కెనాల్  చేద్దాము.. “ అని , మనల్ని ఉబ్బేస్తాడు. నిజమే కాబోలనుకుని, మనమూ ఒప్పుకుని, మన నోటిని ఆయనకు అప్పగించేస్తాము. ఇంక చూసుకోండి, నానారక విన్యాసాలూ చేసి, పక్కనుండే దంతాలని కూడా ఓ కుదుపు కుదిపి ( మళ్ళీ వైద్యానికి రావాలని), అదేదో రూట్ కెనాలింగులో మొదటి అంకం పూర్తిచేస్తాడు. ఓ నాలుగైదు సార్లు, వెళ్ళగా వెళ్ళగా మొత్తానికి , అదేదో సిమెంటు కూడా వేసి పనిపూర్తిచేస్తాడు. 200 రూపాయలతో, పన్ను పీకించుకుంటే అయిపోయేదానికి, వేలకి వేలు పోసి అదేదో చేయించుకోవడం. పోనీ వెళ్ళినవాడేమైనా, యవ్వనంలో ఉన్నవాడా అంటే అదీకాదూ, షష్టిపూర్తి చేసికున్నవాడు. తిండిమీద యావకొద్దీ తప్ప, ఆ దంతం ఉంటేనేమిటీ, పోతేనేమిటీ? అదీ “ మాటే మంత్రం “ అంటే. ఇలా తన మాటచాతుర్యంతో “నాలుగుపళ్ళూ, నాలుగు దంతాలూ “ గా హాయిగా ఉంటాడు.

 అలాగే ఈరోజుల్లో బిల్డర్లూనూ. ఓ ఎపార్టుమెంటు అమ్మడానికి ఎన్నేసి కబుర్లు చెప్తాడో, అరచేతిలో స్వర్గం చూపించేస్తాడు. అదేదో రిజిస్ట్రేషను అయిన తరువాత తెలుస్తాయి లోటుపాట్లు—వర్షాకాలంలో సీలింగు లీకవడమో, మంచినీళ్ళు కిందకెళ్ళి తెచ్చికోవడమో, లిఫ్ట్ అప్పుడప్పుడు తప్ప పనిచేయకపోవడమో లాటివి. అపాటికి జరగాల్సినదేదో జరిగిపోయింది, ఆ బిల్డరు చెప్పిన  మాటలతో, లక్షలు పోసి ఆ ఎపార్టుమెంటు కొనుక్కోవడం.

అలాగే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమందుంటారు, వాళ్ళ దగ్గరకి వెళ్ళాలంటేనే భయం- ఏ విషయం అడగండి ఒకే సమాధానం.. “ మాకింకేమీ పని లేదనుకున్నారా, మీ ఫైలు చూడ్డం తప్పా… మీలాటివారు వేలమందున్నారు, ఎంతమందినని చూడమంటారూ, “ అని, వీళ్ళకి వచ్చినవాళ్ళని .కసురుకోడం  ఓ హాబీ, ఇంకెవరూ రారు కదా అని. అలాగని అందరూ అలాగే ఉంటారనీకాదూ, కొంతమందుంటారు. వెళ్ళీవెళ్ళగానే, కుర్చీలో కూర్చోపెట్టి, యోగక్షేమాలడుగుతాడు. మన సమస్యేదో తెలిసికుని, ఓ రిజిస్టరు తీసికుని, sincere  గా, మన గోత్రనామాలూ వివరాలూ అడిగి రాసుకుంటాడు. కాంటాక్టునెంబరుకూడా రాసుకుంటాడు. ఫలానా టేబిలు వాడి పనీ ఇది అని, మనేదురుగానే ఓ నెంబరు తిప్పుతాడు. ఇక్కడ చిత్రం ఏమిటంటే, ఆ తిప్పిన నెంబరు తనదే. ఎలాగూ  engage tone  వస్తుంది. మనల్ని  impress  చేయడానికి కావాల్సొస్తే ఇంకో రెండు సార్లు కూడా తిప్పుతాడు. ఆన్సర్ వచ్చేదా, చచ్చేదా…చివరకి, “ నేను చూస్తానులెండి.. మీ పనైపోగానే, ఫోను చేస్తాను, నెంబరిచ్చేరుగా..” అని. ఆయన చిలకపలుకులు వినేసి, మనమూ, ఇంకెంత మన పనైపోయినట్టే అని సంతోషిస్తూ వెళ్తాము. కానీ, మనకి తెలియని విషయమేమిటయ్యా అంటే, ఆయన రిజిస్టరులో మనలాటి గిరాయికీలు ఇంకా చాలామందున్నట్టు. ఇలా తన మాటచాతుర్యంతో పని కానిచ్చేస్తూంటాడు. అయితేనేమిటి, అందరి దగ్గరా పేరు తెచ్చుకున్నాడా లేదా?

నోటిమాట తీయగా ఉంచుకోడానికి పైసా ఖర్చుపెట్టఖ్ఖర్లేదు. ఓ సంకల్పమనేది ఉండాలి. ఎంతచెప్పినా మనం పోయిన తరువాత, మిగిలేది అదే కదా. నలుగురూ, “ అయ్యో చాలా మంచివాడండీ..” అనుకోవాలి కానీ, “ అమ్మయ్యా ఓ గొడవొదిలిందిరా బాబూ…” అని కాదు.

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
White Patches | Vitiligo | తెల్ల బొల్లి మచ్చలు | Ayurvedic Remedies and Treatment | Dr. Murali