Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ : జగదీష్ ప్రశంసతో పులకించిపోతుంది చంద్రకళ మనసు. నృత్య-గాన కార్యక్రమంలో వేదికపైన సరస్వతీదేవికిరువైపులా రాణి-చంద్రకళ ఫోటోలు చూసి ఎంతో ఆనందిస్తారు.   ఆ తర్వాత......

నేను మేకప్ తీస్తుంటే, కబుర్లు చెపుతూ జగదీష్  మాతో పాటే ఉన్నాడు.
“వన్ ఇయర్ లో, నీ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్  అయ్యింది చంద్రా,” అంటూ అమ్మతో పాటు నా మేకప్ సామాను సర్దడం మొదలు పెట్టాడు.

ఇంతలో రాణి గ్రీన్-రూంలోకి వచ్చింది.  జగదీష్ చేతి నుండి మేకప్ బ్రష్ తీసేసి,
“నాతో పద జగదీష్,  అక్కడ వర్ధంతి పూజ జరుగుతుంది,” అంది.

“నేను మా వాళ్ళతో వస్తానులే రాణి,” అన్నాడు జగదీష్.
“అయితే, నేనూ ఆగుతాను.  కలిసే వెళదాము,” అంటూ జగదీష్ పక్కనే స్టూల్ మీద కూర్చుంది.
“అయ్యో, తాత వర్ధంతికి నువ్వు లేకపోతే ఎలామ్మా రాణీ, జగదీష్ కూడా వస్తాడు. ఇద్దరూ వెళ్ళండి,” అమ్మ అంటుండగానే,
”రాణీ, అమ్మా రాణీ,”  నీరుఆంటీ గొంతు రూం బయట వినబడింది.
“జగదీష్, వెళ్ళు  నువ్వు. చంద్ర బట్టలు మార్చుకున్నాక, అంతా సర్దుకుని మేము వస్తాము. నువెళ్ళు,”  అంది అమ్మ జగదీష్ తో.
**
మేము వెళ్ళేప్పటికి వర్దంతి పూజ ముగిసింది...  
మరో పక్కనున్న టేబిల్ మీద వినోద్ బర్తడే కేక్ కట్ చేయించాము. వాడు చాలా హ్యాపీ.
అతిధులు చాలామంది నాకు, అమ్మకి అభినందనలు చెప్పి వెళుతున్నారు....
భోజనాల హడావిడి మొదలయ్యాక కూడా, మమ్మల్ని కలవడానికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నాము.  

మాతో ఉన్న అత్తయ్యవాళ్ళని  డిన్నర్ కి వెళ్ళమంది అమ్మ....

‘తేజ’ టి.వి. ప్రొడ్యుసర్ గోవిందన్ గారు కలిసారు. నేను కొత్తగా చేసిన  డాన్సులు,  త్వరలో వాళ్ళ చానల్ కి రికార్డింగ్ చెయ్యాలని అమ్మతో మాట్లాడారు.
ఆయన వెంటున్న మరొకర్ని ‘అమెరికా ఆంధ్ర మహా సభ’ ప్రెసిడెంట్ – రావు గారని ఇంట్రడ్యూస్  చేసారు.  
“చూడండి శారద గారు, అమెరికాలో నివసించే ‘నృత్య శిఖర’ డైరెక్టర్ - తేజశ్విని మేడమ్,  డాన్స్ సబ్జెక్ట్ తో టెలి-ఫిలిం తీస్తున్నారు.  ఆవిడ మా వదినగారు. ఆ ఫిలింకి చంద్రకళ లాంటి  ఆర్టిస్ట్ ల కోసం వెతుకుతున్నాము. మీ అమ్మాయికి ఆ ఫిలింలో యాక్ట్ చేసే అవకాశం వుండవచ్చు. మీ సమాచారం, పాప వివరాలు తీసుకుంటాను, వచ్చి మాట్లాడుతాను,” అన్నారాయన అమ్మతో.  
**
అమ్మ, నేనూ బఫే టేబిల్ వైపు నడిచాము. జగదీష్ కోసం చూసాను.
కాస్త దూరంలో ఓ టేబిల్ వద్ద, రాణితో కూర్చుని, భోంచేస్తున్నాడు.  వాళ్ళకి దగ్గరలో మామయ్యా, మణత్తయ్య, నీరూ ఆంటీ  కూడా. డిన్నర్ సర్వ్ చేసుకుని, వెళ్లి, అక్కడే కూర్చున్నాము.

ముఖ్య అతిధులని సాగనంపి భూషణ్ అంకుల్, నాన్న కూడా మా వద్దకు వచ్చారు.
“వండర్ ఫుల్  పెర్ఫామెన్స్’  బై  దీజ్  బ్యూటిఫుల్  లేడీస్ - చంద్రకళ  ఎండ్ రాణీ ‘...అని వచ్చిన అతిధులంతా అంటున్నారు,”  అంటూ అప్లాడ్  చేస్తున్న భూషణ్  అంకుల్ తో,  చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా చేతులు కలిపారు.
“బ్రహ్మాండంగా జరిగింది మీ పర్ఫార్మెన్స్.  మూడు టి.వి చానల్స్  వారి  ప్రోగ్రాములు, ఫెమీనా, ఈవ్స్ వీక్లీ వారి ఇంటర్వ్యూలు  సెటప్ అయ్యాయి. కంగ్రాచ్యులేషన్స్ టు బోత్ ఆఫ్ యు,”  అన్నారాయన మళ్ళీ.

“హావ్ సమ్మోర్ ఐస్ క్రీం అండ్ కేక్,”  అందరికీ మరో రౌండ డెజర్ట్  తెప్పించారు నాన్న.   
ఐస్ క్రీం  ఎంజాయ్ చేస్తూ, నాలుగు రోజుల్లో మదురై ప్రయాణం అని గుర్తుచేసుకున్నాము.   
**
ప్రోగ్రాం  ప్రాక్టీసులతో, అమ్మవాళ్ళ వంటలతో, కబుర్లతో ఇంట్లో సందడిగా పండుగలా ఉంది.
రాణి పొద్దున్నే వచ్చి,  తన మ్యూజిక్ ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఉండి వెళుతుంది.
మదురై  ప్రయాణానికి ముందు రోజు, రాణి వాళ్ళ హోం-థియేటర్ లో మూవీ  చూడ్డానికి వెళ్ళాము.
**
మదురైకి  ట్రైన్ జర్నీ ఉత్సాహంగా, సరదాగా ఉంది.  
ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా మాతో పాటే ట్రావెల్ చేస్తున్నారు.. మీనాక్షి, కన్నన్ సహా.
..వాళ్ళంతా, మాకు పక్కన కంపార్ట్ మెంట్ లోనే...

ఆరింటికి డిన్నర్ అయ్యాక, బోర్డ్-గేమ్స్ ఆడుతూ, పెద్దవాళ్ళ కబుర్లు వింటున్నాము.
**
“ఓ సారి  మీరంతా మా పాలెంకి రావాలి..   అక్కడి నుంచి శ్రీశైలం, త్రిపురాంతకం చూసుకొని నాలుగు రోజుల్లో వచ్చేయచ్చు,” అన్నారు నాన్న-మామయ్య, అంకుల్ వాళ్ళతో..
“మీ పాలెం పేరు వినగానే, నీ చిన్నతనం గురించి నీవు చెప్పింది గుర్తొస్తుందోయ్, సత్యం.  పన్నెండేళ్ళ వరకు  స్కూల్ కి వెళ్ళకుండా గోలీలతోనే కాదు, పాములతో కూడా ఆడుతూ  తిరిగేవాడివని, చెరువుల్లో బావుల్లో ఈత కొట్టేవాడివని,” అన్నారు భూషణ్ అంకుల్ నవ్వుతూ.
“మీ పిల్లలకి తెలుసా?  నీ  డేరింగ్  చైల్డ్-హుడ్ గురించి, సత్యం?”  మళ్ళీ నవ్వుతూ అడిగారు.

‘నిజమా? నాన్న స్కూల్ కి వెళ్ళలేదా చిన్నప్పుడు’  అనుకుని నాన్న వంక చూసాను.

“అదిగో మా చిన్నామె.  నాన్న చదువుకోలేదా అని  నా వంక అనుమానంగా చూస్తుంది.  ఇప్పుడెందుకులే భూషణ్.  మరో సారి చెబుతానులే,” నవ్వేసారు నాన్న.

“చదువు ఎందుకు లేదు? లేటుగా మొదలు పెట్టినా స్కాలర్ షిప్ లతో బేషుగ్గా చదివి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడుగా.. ఇక  కాలేజీలో,  మీ నాన్న పెద్ద హీరో,  స్టూడెంట్ లీడర్ కూడానమ్మా చంద్రా.  ఇక్కడే మీ నాన్నకి, నేను, భూషణ్  ఫ్రెండ్స్ అయింది మరి,”  అన్నారు  రాం మామయ్య  నా వంక చూసి నవ్వుతూ.

“సత్యా,  నీ  ఫేమస్ – సాలీడ- పద్యం పాడవోయ్.  చాలా ఏళ్ళయింది నీ పాట విని,” ఆయనే మళ్ళీ నాన్నతో.
అత్తయ్య, నీరు ఆంటీ కూడా మరీ మరీ అడగడంతో, కాసిన్ని నీళ్ళు తాగి నాన్న గొంతు  క్లియర్ చేసుకున్నారు.  
తాను పాడబోయే పద్యం, ఫేమస్ కవి జాషువా రచన అని చెప్పి, గొంతు  సవరించి  పద్యం అందుకున్నారు  నాన్న.

...సాలీడా ......నీలో నూలు తయారు చేయు మర గానీ, ప్రత్తి రాట్నంబు గానీ
లేదీశ్వర శక్తి నీ కడుపు లోనే లీనమై యుండునో
యే లీలన్ రచియింతు వీ జిలుగు నూలీ పట్టు పుట్టంబుల
సాలీడా; నిను మోసగాడవని విశ్వంబేల ఘోషించెడిన్?.......

ఎంత బాగా పాడారో?  నాతో సహా అందరం చప్పట్లు కొట్టాము. ‘ఆ పాటకి, మాటలకి అర్ధం  అడగాలి నాన్నని’ అనుకున్నాను.

“మంచి సింగర్, యాక్టర్ కూడా మీ నాన్న,” అన్నారు భూషణ్  అంకుల్.
“వాళ్ళమ్మ, అంటే మీ నానమ్మ, అతన్ని సినిమాల్లోకి  వెళ్ళ వద్దని గొడవ చేయబట్టి మిలిటరీలో చేరాడు గాని... లేకపోతే హీరోగా బుక్ అయ్యాడు కూడా.  అప్పట్లో నీలవేణి, కళ్యాణి వంటి టాప్ హీరోయిన్లతో యాక్ట్ చేయ వలసిన వాడు.  సహకార దర్శకుడుగా  కూడా  పని చేసాడు సత్యం,”  మళ్ళీ అంకుల్.
“నిజమా? ఎందుకు వద్దంది వాళ్ళమ్మ,” అడిగింది మణత్తయ్య.  
“ఒక్కడే  కొడుకు, కుటుంబాన్ని  పోషించకుండా  చేయి దాటి పోతాడని ఆమె అనుకుందట,” అంకుల్ చెప్పేది మేమందరం ఓ కథలా వింటున్నాము...

“అదుగో, సరీగ్గా  ఆ టైం లోనే  నేను కాపాడాను మీ నాన్నని. ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేక బాధ పడుతుంటే, ఆర్మీలో చేరమని సలహా ఇచ్చాను.  మొత్తానికి,  డైరెక్ట్ కాప్టెన్ గా ఆర్మీలో  సెలెక్ట్ అయ్యి,  మా చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నాడు.  ఆ తరువాత,  ఇటువంటి కూతురుని  కన్నాడు... ఈ చంద్రకళ  లోని  నాట్యకళ  వాళ్లకి  ప్రస్తుతం  ఉత్సాహాన్ని,  సంతోషాన్ని ఇస్తుంది,”  అన్నారు మామయ్య  నా భుజం మీద తడుతూ.

నాన్న గురించి వింటుంటే బాగుంది.  ‘నాకు తెలుసును. నాన్న అందరిలా కాదని, చాలా గ్రేట్ మాన్ అని’ అనుకున్నాను.
“ఓకే, బాగుంది రాం. ఈ స్టోరీ సెషన్ చాలా ఇంటరెస్టింగ్.  కాకపోతే  టైం తొమ్మిది... రేపు తెల్లరు జామునే  మదురై  చేరుతాము.  కాబట్టి ఎక్కడి వాళ్ళు   అక్కడే  హాయిగా నిద్ర పొండి.  నేను వెళ్ళి పక్కన కంపార్ట్ మెంట్ లో మన వాళ్ళందరినీ  ఓ రౌండ్ చూసి వస్తా,”  అంటూ పైకి లేచారు నాన్న.
**
నాన్న యాక్టింగ్  గురించి, అమ్మ సంగీతం గురించి ఆలోచిస్తూ పడుకున్నాను.  ‘అవును నాన్న సినిమా హీరోలా,  అమ్మ హీరోయిన్ లా అనిపిస్తారు నాకు’ అనుకుంటూ నిద్రపోయాను.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti