Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : సాక్షాత్తు ముఖ్యమంత్రి విరాట్ కి ఫోన్ చేసి పరామర్శిస్తుంది. అపస్మారకస్థితి నుంచి మెలకువ వచ్చిన సహస్రకి తన కాళ్ళు ఎవరో మృదువుగా పట్టుతున్నట్టనిపించి మెల్లిగా లేచి చూస్తుంది...  విశాల తల్లి కాంచనమాల ఉంటుంది. ఆమె జరిగినదంతా సహస్రకి గుర్తు చేస్తుంది. ఫోటోలో మహదేవ నాయకర్ ని పోల్చుకుంటుంది దీక్ష. ఆ తర్వాత......

‘‘అమ్మ అంతా చెప్పింది. ఇంతసేపు నా పక్కన కూచుని పాదాలు వత్తి సేవలు చేసింది. అందుకే స్పృహ తెలిసింది. అమ్మ మనసు లాగే నీ మనసూ ఇంత మంచిదని తెలుసుకోలేక విరాట్ తో గొడవ పడ్డాను. అందుకే భగవంతుడు నన్నిలా శిక్షించి వుంటాడు.’’ అంటుంటే విశాల అడ్డు పడిన్ది.
‘‘అక్కా అలా ఎందుకనుకుంటున్నావ్. గండం గడిచి క్షేమంగా బయట పడ్డందుకు సంతోషించాలి. ఇలా గతం గురించి బాధ పడ కూడదు. చాలా బలహీనంగా వున్నావ్. ముందు ఏమన్నా తిని మందులు వేసుకోవాలి. డాక్టర్ వచ్చే టైమైంది. తర్వాత మాట్లాడుకుందాం. లేవగలవా?’’ అంటూ లేపింది విశాల.
‘‘నడవ లేనేమో కళ్ళు తిరుగుతున్నాయి. తల చాలా భారంగా వుంది. దీక్ష నన్నుకాస్త బాత్రూం తీసుకెళ్ళవే’’ అంది బెడ్ దిగటానికి ప్రయత్నిస్తూ.
దీక్ష విశాల చెరోపక్క సాయం పట్టి బాత్రూంకి తీసుకెళ్ళారు. విశాల బయట ఆగిపోతూ ‘‘అక్కా లోన కొత్త బ్రష్షు పేస్టు అన్నీ ఉన్నాయి. బ్రష్ చేసుకురా’’ అంది.
వాళ్ళిద్దరూ లోనకెళ్ళగానే...
వెంటనే పక్కనున్న విరాట్ గదిలోకి పరుగెత్తి.
నిద్రపోతున్న విరాట్ ను లేపింది విశాల.
సహస్ర స్పృహలో కొచ్చిందని తెలిసి విరాట్ చాలా సంతోషించాడు. సింక్ వద్ద ముఖం కడుక్కుని పోబోతూ ఎందుకో అనుమానం వచ్చి విశాల వంక చూసాడు.
‘‘సహస్ర నిన్ను చూసిందా?’’ అడిగాడు.
‘‘వూ ’’
‘‘నిన్నేమన్నా అందా? కోప్పడిన్దా?’’
‘‘లేదు లేదు’’
‘‘మరి ఆ కన్నీళ్ళేమిటి?’’
‘‘అక్కని చూస్తే నాకు, దుఖ్ఖం ఆగలేదు. దీక్ష కౌగిలించుకొని ఏడ్చేసింది’’
‘‘నిజం చెప్పు నీతో మాటాడిన్దా?’’
‘‘మాటాడిన్ది’’ అంటూ జరిగిందంతా చెప్పింది విశాల.
‘‘అమ్మ మనసు లాగే నీ మనసూ  ఇంత మంచిదని తెలీక విరాట్ తో గొడవ పడ్డాను అందుకే భగవంతుడు నన్నిలా శిక్షించి ఉంటాడు అంది. ఆ మాటతో నాకు దుఖ్ఖం ఆగలేదు.’’ అంటూ వివరించింది. ఆ మాటలు విన్నాక విరాట్ మనసు తేలిక పడిన్ది. లేదంటే నన్నిక్కడికెందుకు తెచ్చారని గొడవ చేస్తుందని భయపడ్డాడు.
ఇద్దరూ సహస్ర గదిలో కొచ్చారు....
అప్పటికింకా లోన కెళ్ళిన వాళ్ళు బయటికి రాలేదు. అక్కడే ఎదురు చూస్తు సోఫాలో కూచున్నారు. ఇంతలో తనకు ఓపిక లేకపోయినా ఒక గ్లాసు నిండుగా బత్తాయి రసం, ఒక ఫ్లాస్కులో టీ, కొన్ని టీ కప్పులు ట్రేలో ఉంచుకొని స్వయంగా తిరిగి మేడ మీది కొచ్చింది కాంచనమాల.
‘‘ఆన్టీ.... మీరు మెట్లెక్కి రావటం శ్రమ గదా. పని వాళ్ళకిచ్చి పంపించ వచ్చుగా’’ అన్నాడు విరాట్.
‘‘మీ ఆరోగ్యం కన్నా నా ఆరోగ్యం ఎక్కువా ఏమిటయ్యా, నా తృప్తి నాది. అయినా రోజూ తిరుగుతానా ఏమిటి? ఈ బత్తాయి రసం సహస్ర కియ్యవే విశాలా కాస్త ఓపిక వస్తుంది. పాపం చాలా బలహీనంగా వుంది. జూస్ తాగాక  మందులివ్వు. మీరు టీ పోసుకు తాగండి. నేను కిందకెళ్ళి మీరు తినటాని కేమన్నా పంపిస్తాను.’’ అంటూ ట్రేని టీపాయి మీద వుంచి తిరిగి కిందకి వెళ్ళి పోయింది కాంచన మాల.
ఇంతలో భుజాన్ని ఆసరా చేసుకొని బయటికొచ్చింది సహస్ర ఆమెను గుండెలకు హత్తుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు విరాట్.
ఆ స్థితిలో యిద్దర్నీ చూస్తున్న విశాల దీక్షలకూ దుఖ్ఖం ఆగ లేదు, సహస్ర జుత్తు నిమిరి ప్రేమగా కన్నీరు తుడిచాడు విరాట్.
‘‘వద్దు ఏడవ కూడదు, గొప్ప ప్రమాదం నుండి బయట పడ్డాము. సంతోషించాలి. రాత్రి విశాల మన కోసం చాలా రిస్క్ తీసుకొని సేవ్ చేసింది’’ అన్నాడు.
‘‘విన్నాను. విశాలకి చాలా రుణపడ్డాం’’ అంది సహస్ర.
విరాట్ సహస్రను జాగ్రత్తగా తీసుకొచ్చి బెడ్ మీద కూచుండ జేసాడు. విశాల ఆమె వెనుక తల దిళ్ళను సర్ది వెనక్కి వాలి కూచునెలా చేసింది. దీక్ష బత్తాయి రసం గ్లాసు సహస్రకు అందించింది.
‘‘నువ్వు త్వరగా కోలుకోవాలి. ఈ రసం తీసుకో విశాల. సహస్రకి మందులు తెచ్చివ్వు’’ అంది.
సహస్ర కాదనకుండా బత్తాయి రసం తాగింది. విశాల విరాట్ లు సహస్ర పక్క నుండి గమనిస్తుండగా దీక్ష బయటికి వచ్చి వరండా చివర బాల్కనీ వద్ద కొస్తూ తన సెల్ అందుకొని చందూకి ఫోన్ చేసింది. వెంటనే లైన్ లో కొచ్చాడు చందూ.
‘‘ఎక్కడున్నావ్.’’ అడిగింది.
‘‘ఇక్కడే ఇంటి దగ్గరున్నాను. బయల్దేరుతున్నాను’’
‘‘నీకో ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి’’
‘‘ఏమిటది? సహస్ర స్పృహ లోకి వచ్చిందా లేదా?’’
‘‘ఇంత క్రితమే స్పృహ వచ్చింది. ముఖం కడుక్కొని జ్యూస్ తాగింది. విరాట్ విశాల తన దగ్గరున్నారు.’’
‘‘ఇందులో ఆశ్చర్యం ఏముంది’’
‘‘వుంది చందూ ఇప్పుడే ఈ విషయం ఎవరికీ చెప్పకు. విషయం ఏమిటంటే విశాల ఎవరోకాదు విరాట్ కి సొంత మరదలు’’
‘‘వ్వాట్?’’ నిజంగానే చందూ షాకయినట్టు అరిచాడు.
‘‘అవును కాంచన మాల ఎవరో కాదు వెంకటరత్నం నాయుడుగారి చెల్లెలు. ఆవిడ గదిలో ఫోటో చూసాకే నాకీ విషయం తెలిసింది. విచిత్రం ఏమిటంటే విరాట్ వివరాలు ఇప్పటికీ విశాలకి పూర్తిగా తెలీదు’’
‘‘ఈ విషయం వాళ్ళతో చెప్పావా?’’
‘‘లేదు లేదు నీకే చెప్పాను’’
‘‘ఒకె మును సామి విరాట్ సహస్రలను చూడాలని గొడవ చేస్తున్నాడు. ఆయన్ని తీసుకొస్తున్నాను. కాస్సేపట్లో అక్కడుంటాను. ఈ విషయం ప్రస్తుతం ఎవరికీ చెప్పకు. వచ్చేస్తున్నా’’ అంటూ లైన్ కట్ చేసాడు చందూ.
***********************

చందూ వెంటనే వస్తున్నా అన్నాడు గాని వేరే పని చూసుకొని రావటంలో ఆలస్యమైంది. ఈ లోపల....
సహస్ర స్పృహలో కొచ్చిన గంట తర్వాత డాక్టర్ గుణ దీపిక డ్యూటీ దిగి ఇంటి కెళ్తూ సహస్ర విరాట్ లను చూడ్డాని కొచ్చింది. విరాట్ కూడ ఇప్పుడే ఆమెను చూడ్డం. ఉదయం డాక్టర్ వచ్చినప్పుడు అప్పటికింకా విరాట్ కు  స్పృహ రాలేదు.
విశాల తన స్నేహితురాలు డాక్టర్ గుణ దీపికను అందరికీ పరిచయం చేసింది. విరాట్ సహస్రల పట్ల చాలా శ్రద్ధ చూపించింది గుణ దీపిక. తమను సకాలంలో ఆపరేషన్ చేసి కాపాడినందుకు విరాట్ సహస్ర ఇద్దరూ డాక్టర్ కు తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆమెతో మాట్లాడుతుంటే టైమ్ తెలీదు. చాలా సరదా మనిషి. విరాట్ కి మందులు కంటిన్యూగా వాడితే సరి పోతుందని చెప్పింది. సహస్ర విషయంలో ఇక భయపడాల్సిందేమీ లేదు. ఏమన్నా తేడా అన్పిస్తే అప్పుడు స్పెషలిస్టుకు చూపిద్దాం. ప్రస్తుతం ఇవే మందులు వాడమని చెప్పి ఇద్దరికీ చెరో ఇంజెక్షను  ఇచ్చి వెళ్ళి పోయింది. సహస్రకీ డాక్టర్ గుణదీపిక నచ్చింది. ఉన్న ఆ కాస్సేపట్లోనే క్లోజయిపోయారంతా.
డాక్టర్ని సాగనంపి...
తిరిగి మేడ మీదికొచ్చింది విశాల.
సహస్రకి స్పృహ వచ్చినా బలహీనంగా ఉందని ఎవరూ మధురై విశేషాలు ఆమెతో చెప్పలేదు. ముందుగా జ్యూస్ తాగి మందులు వేసుకున్నాక వేడి ఇడ్లీ తిని టీ తాగ్గానే కాస్త తేరుకుంది. అందుకే డాక్టర్ గుణ దీపిక వచ్చే సరికి మామూలుగా మాట్లాడ గలుగుతోంది. డాక్టర్ వెళ్ళగానే అప్పుడు విరాట్ మధురైలో గొడవల గురించి చెప్పి ఫోన్ చేసి సహస్రతో తల్లి దండ్రులయిన మహ దేవ నాయకర్ మూగాంబికలతో మాట్లాడిన్చాడు. విశాల అక్కడి కొచ్చే సరికి సహస్ర ఇంకా వారితో మాట్లాడుతోంది.
ఆ తర్వాత అంతా విశాల గదిలోకి షిప్టయి టివి ఆన్ చేసి న్యూస్ ఛానల్ చూస్తూ కూచున్నారు.
ఈ లోపల...
సరిగ్గా సాయంత్రం అయిదు గంటల వుతుండగా చందూ మునిసామిని తన బైక్ మీద అక్కడికి తీసుకొచ్చాడు.
బైక్ ని విశాల కారు పక్కనే పోర్టికోలో లాక్ చేసి మును సామి తో లోన ప్రవేశించాడు.
హాల్లో ఎవరూ లేకపోడంతో నేరుగా హాలు చివర మెట్ల వైపు దారి తీసాడు చందూ. అతన్ని అనుసరించాడు మునుసామి. ఇంతలో...
తన పడగ్గది తలుపు తెరుచుకొని బయటికొస్తూన్న కాంచనమాలను ఇద్దరూ గమనించలేదు. కాని చందూ వెంట వెళ్తున్న మును సామిని చూసి తన గది డోర్ లోనే ఆగిపోయింది కాంచనమాల. వయసు మళ్ళినా మునిసామిని గుర్తించటంలో తను పొరబడలేదనిపించింది. ఒక్క సారిగా గతం కళ్ళ ముందు మెదిలి గుండె వేగంగా కొట్టుకుంది. కాళ్ళు తడబడుతున్నాయనిపించింది. మెట్లెక్కుతూ మునుసామి హాల్లోకి చూడ్డం గమనించి చట్టున తలుపు వెనక్కి తప్పుకుంది. అంతే... ఇక దుఖ్ఖం ఆగలేదు ఆవిడకు. తలుపు దగ్గరగా మూసి వెళ్ళి తన బెడ్ మీద వాలిపోయింది.
మును సామి అన్నయ్యేమిటి ఇక్కడికి రావటం ఏమిటి? ఎలా వచ్చాడు? ఎందుకొచ్చాడు ? తనిక్కడునట్టు తెలిసి అన్న వెంకట రత్నం నాయుడు మునుసామిని పంపించాడా..... తనలో తను దుఖ్ఖిస్తూనే పరి పరి విధాలా ఆలోచిస్తున్న కాంచన మాలకు ఒక్క సందేహానికీ సమాధానం లభించలేదు.
మును సామిని వెంట బెట్టుకొని చందూ కూడ మీదకు వెళ్ళే సరికి అప్పటికింకా టివిలో వార్తలు చూస్తు విశాల గదిలోనే వున్నారు. మును సామిని చూడగానే లేచి టివి వాల్యూమ్ తగ్గించి ‘‘రండి గురువు గారు’’ అంటూ మునుసామిని ఆహ్వానించాడు విరాట్.
లోన కొస్తూనే మనసులో బాధను ఆపుకోలేక విరాట్ ను కౌగిలించుకొని కంట నీరు నించాడు మునుసామి.
‘‘నేను మీ వెంట వుంటే ఇలా జరిగుండేది కాదు చిన బాబు. మన వెధవలు ఎక్కడ తప్పి పోతారోనని నేను వెళ్ళటం పొరబాటయింది. పెద్ద గండం నుంచి మీరిద్దరూ బయట పడ్డారు. చందూ అంతా చెప్పాడు. మీకేమన్నా జరిగుంటే పెద్దయ్య గారికి ముఖం చూపించ లేక పోయే వాడ్ని.
అమ్మా సహస్ర మీ యిద్దరూ అదృష్టవంతులే తల్లీ. రాత్రి విశాల చూపిన సమయస్ఫూర్తి ధైర్యాన్ని మెచ్చుకోవాలి’’ అన్నాడు బాధ పడుతూ.
‘‘గురువు గారు దేవుడు మనందుండి మన సైడు పెద్ద నష్టం ఏమీ జరగ లేదు, అందుకు సంతోష పడదాం, బాధ పడకండి. మన మనుషులు కూడ బయటి కొచ్చేస్తారు కంగారు పడక్కర్లేదు కూచోండి’’ అన్నాడు విరాట్.
ఇంతలో సహస్ర ఓపిక చేసుకొని లేచి మును సామి ముందుకొచ్చింది. విరాట్ చెప్పే వరకు మీ గురించి నాకు తెలీదు బాబాయ్. మమ్మల్ని ఆశీర్వదించండి. విశాలా ఇలారా’’ అంటూ విశాలను కూడ పిలిచి ఇద్దరూ మును సామి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు మునుసామి వారి వినయానికి పులకించి పోతూ అభీష్ట సిద్ధిరస్తు అంటూ ఇద్దర్నీ ఆశీర్వదించాడు ఆయన కూచోగానే నలుగురూ కబుర్లలో పడ్డారు.
చందూ దీక్షకు సైగచేసి
బయటకు తీసుకెళ్ళాడు
ఇద్దరూ వరండా చివరి కెళ్ళి
బాల్కనీ వద్ద ఆగారు
‘‘ఫోన్లో నువ్వేదో సందేహం చెప్పావ్ ఏమిటది? నాకు సరిగా అర్ధం కాలేదు’’ అనడిగాడు.
‘‘అంత చెప్పినా అర్ధంకాలేదా? ట్యూబ్ లైటు...’’
‘‘ఏయ్ ట్యూబ్ లైటు నేనా నువ్వా? ... ఎలా చెప్తున్నావ్ ? నువ్వు చూసిన ఫోటోలో అదీ బ్లాక్ అండ్ వైట్. ఫోటో లోని మనిషిలో వెంకటరత్నం నాయుడు గారి పోలికలు ఉంటే ఉండొచ్చు. ఆయన కాంచన మాల ఆన్టీకి అన్నయ్య కావచ్చు కాని ఆయనే వెంకట రత్నం నాయుడని, కాంచన మాల ఆయన చెల్లెలని ఎలా నమ్మకంగా చెప్పగలవ్?. తీరా ఆయనకి చెల్లెళ్ళు లేరనుకో. ఈ విషయం బయట పెట్టి మనం నవ్వుల పాలవ్వాలి తెలుసా? అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పొదన్నాను. నీతో ఇక ఈ విషయం మర్చిపో’’ అంటూ హెచ్చరించాడు.
‘‘ఎలా మర్చిపోతాను?’’ అంది పట్టుదలగా దీక్ష.
‘‘నాకు డౌటు రానే కూడదు. వస్తే వదలను. ఇప్పుడే తేలి పోవాలి. విరాట్ కి తెలీకుండా వుంటుందా తనకు మేనత్త ఉందని?.... ’’
‘‘ఏయ్ వద్దు విరాట్ ని కదపటం మంచిది కాదు.’’
‘‘సరి మునుసామికి తెలీకుండా ఉండదు గదా. విషయం చెప్పకుండా వెంకట రత్నం నాయుడు గారికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంత మందో అడిగి తెలుసుకుందాం.’’
‘‘అలా అన్నావ్ బాగుంది ఏదోటి చెప్పి ఆయన్ని బయటికి తీసుకొస్తాను. నువ్విక్కడే ఉండు,’’ అంటూ దీక్షను అక్కడే వుంచి వెనక్కి వెళ్ళాడు చందూ.
అయిదు నిముషాల తర్వాత...
మును సామిని వెంట బెట్టుకొచ్చాడు
‘‘ఏంటమ్మాయ్ దీక్షా ఏదో మాట్లాడాలన్నావట. ఏంటది?’’ అనడిగాడు వస్తూనే మునుసామి.
‘‘ఏంలేదు బాబాయ్ చందూకి నాకు చిన్నగొడవ మీరే తీర్చాలి’’ అంది నవ్వుతూ దీక్ష.
‘‘గొడవ? .......... ఎందుకు ? పెళ్ళి గాకుండానే మీరిలా రోజూగొడవ పడేట్టయితే నా అభిప్రాయం ప్రకారం మీరు పెళ్ళి చేసుకోవటం అనవసరం’’ అన్నాడు సీరియస్ గా మునుసామి.
‘‘అదేంటి?..... జీవితకాలం ఇలా మమ్మల్ని ప్రేమికులుగానే ఉండిపొమ్మంటారా?’’ అన్నాడు చందూ.
‘‘ఉండిపో. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడే యిలా వుంటే రేపు పెళ్ళయ్యాక సంసారం స్వర్గంలా ఉండదు, నరకంలా ఉంటుంది.’’
‘‘అయ్యో బాబాయ్ ఇదేమంత పెద్దగొడవకాదు,’’ అంది దీక్ష.
‘‘కాదా...  అయితే మంచిదే. చిన్న చిన్న గొడవలు నేను తీర్చను. నేవెళ్తాను.’’
‘‘ఆగు బాబాయ్. పోనీ పెద్దగొడవే అనుకో. విషయం వినుకోనంటావేంటి?’’
‘‘సరి వింటాను. చెప్పు చెప్పు’’
‘ఏం లేదు బాబాయ్ వెంకట రత్నం నాయుడు గారికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరంటాడు చందూ, లేకపోవటం ఏమిటి ఉండే ఉంటారంటాను నేను. విరాట్ ని అడుగుదామంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం, బాగుండదు అడగ వద్దంటాడు, పొద్దుటి నుంచి మాకిదే గొడవ.’ అంది దీక్ష.
‘అవును . ఆ ఫ్యామిలీ గురించి నీకన్నా తెలిసిన వాళ్ళు ఎవరుంటారు?’
‘అవును ఆ మాట కరక్టే గదా!’
‘ఈ తగువు ఎవరు తీరిస్తే వాళ్ళకి మా ఇద్దర్లో ఓడిపోయిన వాళ్ళు ఓ ఫుల్ బాటిల్ మందు కొనివ్వాలని పందెం కూడా వేసుకున్నాం’
‘అరె చెప్పు... ఇందులో పందెం కూడా వుందా? నిజమేనా?
‘నిజం బాబాయ్’
‘ఏదీ?... తూతూ మంత్రంలా ఏదో చీఫ్ లిక్కరా?’
‘ఛ ఛ... జానీవాకర్’
‘ష్యూర్?’
‘తర్వాత మాట తప్పకూడదు’
‘తప్పటం జరగదు’
‘అయితే నువ్వు ఓడిపోయావ్ రా అల్లుడూ. అమ్మాయ్ దీక్ష గెలిచింది. ఆనక నాకోసం జానీవాకర్ రెడీగా వుంచు’
‘ఇదన్యాయం, అక్రమం విషయం చెప్పకుండా ఓడిపోయానంటే ఒప్పుకోను.’
‘ఒప్పుకు తీరాలి, దీక్ష చెప్పిందై రైటు. వెంకట రత్నం నాయుడికి ఓ చెల్లెలుంది.’
మునిసామి మాటలకు`
చందూ దీక్షలు ముఖ ముఖాలు చూసుకున్నారు.
‘ఒకే చెల్లెలా!’ అన్నాడు చందూ.
‘అవును, ఒకే చెల్లెలు’ అంటూ బదులిచ్చాడు మునుసామి.
‘సరి వివరాలు చెప్పు ఓడిపోయానని ఒప్పుకుంటాను, ఆవిడ పేరేమిటి?’
‘కాంచన మాల’
‘కాంచన మాలా!’ ఉద్వేగంతో ఒకేసారి పలికారు దీక్ష చందూలు.
‘అవును కాంచన మాలే. ఎందుకలా ఆశ్చర్యపోతారు? అప్పట్లో మేమంతా ముద్దుగా కాంచనా అని పిలుచుకునే వాళ్ళం. ఎంత అందంగా ఉండేదో మా బంగారు తల్లి’
‘నిజంగానా!’
‘అవును. మీకు తెలీదు. ఏదో మును సామి వెంకట రత్నం నాయుడు గారి నూలు మిల్లులో మేస్త్రీగా పని చేసే వాడే గదా అనుకుంటారు. కాని ఆ కుటుంబంతో నాకున్న అనుబంధం ఎవరికీ తెలీదు’
‘‘కాంచన మాల ఇప్పుడెక్కడుంది? విరాట్ తన మేనత్త ఇంటికెళ్ళొస్తుంటాడా? విరాట్ ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదే...’’
‘‘తెలిస్తేగా చెప్పడానికి. మీరింతగా అడుగుతున్నారు గాబట్టి చెప్తా వినండి’’
‘‘చెప్పు బాబాయ్ ఏం జరిగింది?’’ కుతూహలంగా అడిగింది దీక్ష.
‘‘వెంకట రత్నం నాయుడు నేనూ బాల్య స్నేహితులం. అరే ఒరే అనుకునేంత చనువు. ఎప్పుడూ కలిసి తిరిగే వాళ్ళం. వాడి ఒక్కగా నొక్క చెల్లెలు కాంచన మాల. వారి తండ్రి విశ్వేశ్వర నాయుడు నాకు తెలుసు.
కాంచన మాల మాతోనే ఆడుకునేది. తన అన్నతో బాటు నన్ను నోరారా అన్నయ్యాని పిలిచేది. నాకూ అన్నదమ్ములే గాని చెల్లెళ్ళు లేనందున సొంత చెల్లెల్లా చూసేవాడ్ని. తనకి ఏం కావాలన్నా ముందు నాతోనే చెప్పేది. ఈ చేతులతో ఎత్తుకొని తిప్పిన బంగారు తల్లి.
నాయుడు బాగా చదువుకున్నాడు. నేను కాస్త మొద్దు, ఆపైన నాకు చదువు మీద కన్నా సాము గరిడీలు, కత్తిసాము  వంటి వీర విద్యలంటే ఇష్టం. అవి నేర్చుకునే వాడ్ని, ఇక జల్లి కట్టులో నేను బరి లోకి దిగితే ఎలాంటి కోడె గిత్తయినా మెడలు వంచి లొంగి పోవలసిందే. అలా మా తండ్రిగారి పనుల్లో సాయం చేస్తూ అల్లరి చిల్లరిగా తిరిగే వాడ్ని. అలాగే అందరం పెద్ద వాళ్ళమయ్యాం. మాలో ముందుగా వెంకట రత్నం నాయుడికి పెళ్ళయింది. నాకూ సంబంధం కుదిరింది కానీ ఇంకా పెళ్ళి కాలేదు. కాంచన మాలకు సంబంధాలు చూస్తున్నారు. ఈ లోపలేమయ్యిందంటే రంగనాథ చౌదరి అని ఒక చాకు లాంటి యువకుడు. టైలరింగ్ లో మాస్టారు. సొంత షాపు ఉండేది. పెళ్ళి కాలేదు. ఎలా జరిగిందో మొత్తానికి కాంచన మాల రంగనాథ చౌదరిలు ప్రేమలో పడ్డారు. ఈ విషయం పెద్దల దృష్టి కొచ్చింది’’ అంటూ కాస్సేపు చెప్పటం ఆపాడు మునుసామి.
‘‘చెప్పు బాబాయ్. తర్వాత ఏమైంది?’’ అనడిగింది కుతూహలంగా దీక్ష.
‘‘ఏముందమ్మా షరా మామూలే. వాళ్ళ ప్రేమ కూడా కష్టాల్లో పడిన్ది. వారి పెళ్ళికి ఇరు వర్గాలు అంగీకరించ లేదు’’ అన్నాడు మునుసామి.
‘‘ఎందుకని అబ్బాయి నచ్చలేదా, అమ్మాయి తరుపు నుండి కట్నం రాదనా, ఎందుకు అంగీకరిన్చలేదు?’’ అడిగాడు చందూ.
‘‘అవేం కాదు గాని ఆస్థి, అంతస్థు, చదువు యిలా ఎందులో చూసినా రంగనాథ చౌదరి తక్కువే. కాని తెలివైన వాడు. తన కూతుర్ని ఒక దర్జీ కిచ్చి పెళ్ళి చేయటానికి పెద్దాయన విశ్వేశ్వర నాయుడు గారు అంగీకరించ లేదు.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery