Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

జరిగిన కథ : ప్రతిమ పుట్టిన్రోజు నాడు కూతురిని తల్చుకుని కుమిలిపోతుంటాడు ఫణిభూషణరావు. ఆ తర్వాత......

‘‘చెప్పు...’’
‘‘మనిద్దరి మధ్య జరిగిన కాన్వర్వేషన్ ని పోలీసుల దృష్టికి తీసుకు రానని. అంతేకాదు, ఏ ఖాకీ ని వెంట బెట్టుకుని రానని మాటివ్వాలి’’
‘‘అలాగే...’’ అన్నాడు అభిరామ్.
‘‘చావు తప్ప మరో దారి కనిపించని స్థితిలో పడి పోయాను...’’ కృష్ణ మాటలు చెవుల్లో గింగుర్లు తిరుగుతుంటే తొందర తొందరగా డ్రెస్ ఛేంజ్ చేసుకున్నాడు అభిరామ్. బయట కొచ్చి బైక్ మీద కూచుండబోతే...సెల్ ఫోన్ లో మెసేజ్.
‘‘ఐ సెర్చ్ ఫర్ యూ...ఎవ్విరీ చాన్స్ ఐ గెట్!
ఐ ఆల్వేస్ విష్ టూ సీ యువర్ ఫేస్...’’
ప్రతిమ మెసేజ్.
టూ అవర్స్ కిందటే ఓ రెస్టారెంట్ లో కలుసుకుని తనివి తీరా ‘స్వీట్ నథింగ్స్’ చెప్పుకున్నా...మెసెజ్ ల్తో మళ్లీ మళ్లీ పలకరిస్తూనే ఉంటుంది తను. తన కోసం  ప్రతి క్షణం పలవరిస్తూనే ఉంటుంది.
‘ప్రేమంటే ఇదేనేమో?’ నవ్వుకున్నాడు అభిరామ్. ఒకే ఊళ్లో...ఒకే నేలపై ఒకే గాలి పీలుస్తున్నా ఒక్క క్షణం కూడా  ఒకర్నొకరు విడిచి ఉండ లేని స్థితిని తలచుకుంటున్న కొద్దీ మత్తుగా, గమ్మత్తుగా ఉంటోందతనికి.
‘‘హాయ్! అర్జంట్ పని మీద బయటకి వెళ్తున్నా...వచ్చాక నిద్ర పోకుండా ఉంటే నీతో మాట్లాడ్తా’’ చక చకా మెసేజ్ పెట్టేసి...ట్యాంక్ బండ్ వైపు రివ్వుమని దూసుకు పోయాడు అభిరామ్. ఫోన్లో కృష్ణ చెప్పిన సంకేత స్థలానికి చేరుకున్నాడు.
హుస్సేన్ సాగర్ అలలపై తేలియాడుతున్న నక్షత్ర కాంతుల్ని తదేకంగా చూస్తూ నిల్చున్న కృష్ణ బైక్ ఆగిన శబ్దానికి వెనక్కి తిరిగి చూసాడు. బైక్ కి స్టాండ్ వేసి అభిరామ్ వస్తున్నాడు తనవైపే.
‘‘ఏం బాధ వచ్చిందని...ఈ రాత్రివేళ ఇక్కడికి వచ్చావ్’’ అడిగాడు అభిరామ్.
‘‘నిజంగా బాధే...నీ ఫ్రెండ్ నైనందుకు’’
‘‘అంటే...’’అర్ధం కానట్టు చూసాడు.
‘‘ఔను...ఇదే నిజం. ఆటల్లో పాటల్లో, చదువుల్లో అన్నింటిలోనూ ఎప్పుడూ ముందుండే నువ్వు నా ఫ్రెండ్ వై నందుకు ఒకప్పుడు  గొప్పగా ఫీలయ్యాను. మరి ఇప్పుడో...’’
‘‘ఎలా ఫీలవుతున్నావో అదీ చెప్పు. ఇంతకీ నేను నీకేం అన్యాయం చేసాను?’’
‘‘ప్రతిమని ప్రేమించడమే నువ్వు చేసిన అన్యాయం’’
‘‘ప్రతిమనా....?’’
‘‘ఔను...నీ ఫియాన్సీ ప్రతిమ గురించే మాట్లాడుతున్నా. పొద్దస్తమానం ఫోన్ సంభాషణలు, ఆ పై మెసేజ్ లు...అవీ చాలవంటూ వెబ్ చాటింగ్..’’
‘‘అసూయగా ఉందా?’’
‘‘ఉండదా?’’
ఓ క్షణం అవాక్కయ్యాడు అభిరామ్.
‘‘ప్రతిమ నీకు తెలుసా?’’
‘‘ప్రత్యేకించి తెలియాలేంటీ? ప్రతిమ లాంటి అందాల భరిణె నిన్ను ప్రేమించిందన్న విషయం ఒక్కటీ చాలదు...నీ ఫ్రెండ్ అయినందుకు కుళ్లి కుళ్లి చావడానికి. నువ్వు ప్రతిమని వదిలేయి. బతుకుతావు. బాగుపడతావు’’ అన్నాడు కృష్ణ.
‘‘లేకుంటే...’’
‘‘ఛస్తావ్...’’ అన్నాడో లేదో...అభిరామ్ తలపై వెనునుంచి ఎవరో ఇనుపరాడ్తో బలంగా బాదారు. గట్టిగా తగిలిన ఆ దెబ్బకి కళ్ల ముందు మెరుపులు మెరిసాయి. చుక్కలు కనిపించాయి.
‘‘ఎవడ్రా నన్ను కొట్టింది...’’అంటూ వెనక్కి తిరిగే లోపలే మళ్లీ అదే బాదుడు. బలిష్టమైన దేహాల్తో ఉన్న ముగ్గురు వ్యక్తులు దాడి చేసారు. స్పృహ తప్పి పోతున్న దశలో తననెవరో వెహికిల్ మీద పడేసినట్లు లీలగా తెలుస్తోంది.
ఆ వెహికిల్ కదిలిన సవ్వడి కూడా వినిపించింది.
*****
మెలకువొచ్చి చూస్తే...తనెక్కడున్నాడో తెలీలేదు అభిరామ్ కి. చుట్టూ చీకటి. తల వెనుక భాగంలో నొప్పి తీవ్రత తెలుస్తోంది. చేత్తో తడిమి చూస్తే నెత్తుటి తడి.
‘‘కనీసం సిగరెట్ వ్యసనం కూడా లేదా?’’ ఓ సాయంత్రం వేళ ఆట పట్టిస్తూ ప్రతిమ అడిగిన ప్రశ్న ఆ క్షణంలో అతడికి గుర్తొచ్చి అంత బాధలోనూ నవ్వొచ్చింది.
‘‘నా కోసం సిగరెట్ తాగడం నేర్చుకో. మనిద్దరం ఓ ఇంటి వారమైన తర్వాత మొగుడి గారికున్న ఆ ఒక్క వ్యసనం వదిలించేందుకు పెళ్లాంగా నాకో వ్యాపకం ఉంటుంది..’’ మళ్లీ నవ్వింది ప్రతిమ.
‘‘అంటే...నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకుండాల్సిన అర్హత సిగరెట్ వ్యసనమన్నమాట’’ అడిగాడు అభిరామ్.
‘‘ఎస్...శ్రీవారి సిగరెట్ వ్యసనం మాన్పించడం శ్రీమతికి దక్కే అరుదైన వరం. ఎందుకో తెలుసా?’’
‘‘ఊహూ!’’
‘‘పట్టరాని ప్రేమని వ్యక్తం చేయాలంటే...నాలుగు పెదాలు కలవాల్సిందే. సిగరెట్ తాగే పెదాల్ని తన పెదాల్తో బంధించేందుకు ఏ పెళ్లాం ముందుకొస్తుంది? ముందు ముద్దు కావాలంటే...పొగ తాగడం మానేయాలంటూ సెగ పెడ్తుంటుంది. అంతే! విధి లేని పరిస్థితిలో భర్త గారు సిగరెట్ వ్యసనాన్ని మానేసి...’’
‘‘అమృతం తాగే వ్యసనాన్ని అలవర్చుకోమంటావ్? బాగుంది ఆఫర్. పెళ్లాల కన్నా ఫియాన్సీలే మేలు. మొగాళ్ల వ్యసనాల్ని ఎంకరైజ్ చేస్తారు. ఇవాళ్టి నుంచే పొగ తాగడం, పొగరుగా ఉండడం నేర్చుకుంటా’’ ఆ సమయంలో హామీ ఇచ్చాడు అభిరామ్. కానీ, ఒక్కసారైనా సిగరెట్ కాల్చడం ఆరంభించ లేక పోయాడు. ప్రతిమ చెప్పినట్లు అప్పుడే సిగరెట్ అలవాటు చేసుకుని ఉంటే...దాన్ని వెలిగించేందుకు జేబులో ఎప్పుడూ అగ్గిపెట్టె ఉండేది. ఇలాంటి చీకటి సమయాల్లో అక్కరకొచ్చేది. ఒక్క అగ్గిపుల్ల గీస్తే చాలు...గదంతా వెలుగులు పరుచుకునేవి. ఆలోచిస్తున్నాడు అభిరామ్. ప్రతిమకి ఫోన్ చేయాలి...అనుకుంటూ జేబులో చెయ్యి పెట్టి చూసి షాక్ తిన్నాడతడు. సెల్ లేదు.
‘‘ఒరేయ్! వాడు లేచినట్లున్నాడు’’ బయట నుంచి ఎవరి గొంతో వినిపించింది.
‘‘మళ్లీ నాలుగు బాది పడుకో బెట్టేయడమే’’ మరో గొంతు కిలకిలా నవ్వింది.
వెంటనే దగ్గరవుతూ అడుగుల చప్పుడు వినిపించింది. ఆ తర్వాత తలుపులు తెరుచుకున్న సవ్వడి. స్విచ్ ఆన్ చేసినట్లు చిన్ని  
శబ్ధం. ఆ వెలుతురులో అప్పుడు రౌడీల్లా ఉన్న ఆ ముగ్గుర్నీ చూసాడు అభిరామ్.
‘‘అన్ని దెబ్బలు తిన్నవాడెవడూ వరుసగా రెండ్రోజులు లేవడు. అప్పుడే నువ్వు లేచావా?’’
‘‘మళ్లీ కొట్టాల్సిందే’’ మరొకడు అంటున్నాడు.
‘‘అసలు మీరెవరు... నన్నెందుకు కొడ్తున్నారు? నా ఫ్రెండ్ కృష్ణ ఏడీ?’’ వరుస ప్రశ్నలు సంధిస్తుంటే వాళ్లు విసుక్కున్నారు.
‘‘ఒరేయ్! వీడికి సమాధానాలు చెప్పాలట్రా?’’
‘‘ఓకే...చెప్దాం. ఒక్కో ప్రశ్నకు గుర్తుండే ఆన్సర్లిద్దాం’’ అంటూ మళ్లీ కొట్టడం మొదలెట్టారు.
‘‘ఒరేయ్...కొడ్తే కొట్టారు కానీ...ఎందుకు కొడ్తున్నారో చెప్పండ్రా?’’ అడుగుతున్నాడు అభిరామ్ వాళ్ల చేతుల్లో దెబ్బలు తింటూనే.
‘‘ఎందుకా?’’ అందులో ఒకడు ఆగి....తన జేబులోంచి సెల్ ఫోన్ తీసాడు. అది అభిరామ్ సెల్ ఫోనే. బటన్ నొక్కగానే స్క్రీన్ పై  
నవ్వుతూ ప్రతిమ బొమ్మ కనిపించింది.
‘‘ఈ అమ్మాయితో నీకేంట్రా సంబంధం?’’ అడిగాడు వాడు.
‘‘ఆ అమ్మాయి నీకేమవుతుంది?’’ మరొకడి ప్రశ్న.
‘‘ఆ అమ్మాయిని ట్రాప్ లో పెట్టింది వీడేరా? ఇలాంటి వాళ్లు డబ్బున్న వాళ్ల అమ్మాయిల్తో ప్రేమ నాటకాలాడతారు. ఎన్ని సినిమాల్లో చూడలేదూ’’ మరొకడంటున్నాడు.
తనని వాళ్లెందుకు టార్గెట్ చేసారో...అప్పటికి అర్ధమైంది అభిరామ్ కి. కలిసిన వెంటనే కృష్ణ మాట్లాడిన్ది ఇదే. కానీ, ఆ మాటలు కృష్ణవి కావని అర్ధమవుతోంది. కృష్ణ దగ్గర ఎన్నోసార్లు ప్రతిమ ప్రస్తావన వచ్చింది. ప్రతిసారీ ఆనందంగానే వినేవాడు. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని అనేవాడు. అలాంటిది ట్యాంక్ బండ్ దగ్గర కలవగానే...ప్రతిమతో తన ప్రేమనే తప్పు పట్టాడు. ‘‘ఇంతకీ మీరెవరు?’’ మళ్లీ అడిగాడు అభిరామ్.
‘‘మేమెవరమైనా నీకొక్కటే చెప్తున్నాం...బతికి బాగుండాలంటే మళ్లీ ఆ అమ్మాయి జోలికి రావొద్దు. ఇదే మా హెచ్చరిక. ఆమెతో తిరిగినట్లు మాకు తెలిస్తే...ఇప్పుడంటే కొట్టి వదిలేస్తున్నాం. అప్పుడు ప్రాణాల్తో మిగలవు బిడ్డా’’ గాండ్రిన్చాడు మరొకడు. ఆ తర్వాత...ట్యాంక్ బండ్ దగ్గరకి తీసుకొచ్చి తన బైక్ దగ్గర వదిలి పెట్టారు. అంతే కాదు... నంబర్లన్నీ డిలెట్ చేసిన తర్వాత సెల్ ఫోన్ తిరిగిచ్చేసారు.
ఆ అర్ధరాత్రి`
గాయాలు, ఒళ్లు నొప్పులతో ట్యాంక్ బండ్ మీద ఒంటరిగా మిగిలాడు అభిరామ్.


 ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా.......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్