Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

పద్యం - భావం - సుప్రీత

వేమన పద్యం

ఆత్మ శుద్ధి లేని యాచార మది యేల
భాండ శుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినుర వేమ.

తాత్పర్యం
మనస్సు నిర్మలంగా లేకుండా ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ?స్థిరచిత్తము లేని శివ పూజలు కూడా వ్యర్ధమే.

విశ్లేషణ
కొంతమంది మడి ఆచారం అని అందరితో చెప్తూ ఇతరులకి ఇబ్బంది కలగచేస్తు ఉంటారు నిజానికి వారికి మడి మీద ఉన్న శ్రద్ధ మనస్సుని నిర్మలంగా ఉంచుకోవటంలో ఉండదు. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ మనస్సులో కల్మషం తో ఎంత మడి కట్టుకున్నా ఉపయోగం లేదు. అలాగే మనము శుభ్రంగా కడగని వంట పాత్ర లో వంట చేసిన అది ఆరోగ్యానికి ,రుచికి మంచిది కాదు. అదే విధంగా మనస్సు చిత్తంగా లేని పూజల వల్ల కూడా ఏ ఉపయోగం లేదు అని చెప్పటమే ఈ పద్యంలో నీతి.

దాశరధీ పద్యం

కంచన వస్తు సంకలిత కల్మష మగ్నిపుటంబు బెట్టి వా
రించిన రీతి నాత్మని గిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భక్తియోగ దహనార్చి దగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరధీ కరుణాపయోనిధీ.

తాత్పర్యం
ప్రకాశించు కర్ణాభరణములు దాల్చిన రామా ! బంగారమునకు అంటుకొన్న మాలిన్యము తొలగించవలె నన్న ఆ బంగారమును పుటము వేయవలెను . మనో మాలిన్యములను తొలగింపవలెనన్న ఆ మనస్సును నీ యందు లీనము చేయవలెను. భక్తియోగమనెడి అగ్ని జ్వాలలో పుటము వేయకున్నచో అందలి మాలిన్యములు నశించవు కదా ?

విశ్లేషణ
బంగారానికి మట్టి అంటుకుంటే దాన్ని తొలగించాలంటే బాగా నిప్పులో కాల్చాలి అప్పుడే అది సుద్ది అయ్యి మెరిసిపోతుంది. అలాగే మనిషి మనస్సులో ఉన్న మలినం అంటే చెడు ఆలోచనలు , కామ క్రోదాలు తొలగించుకోవాలంటే మనస్సుని భక్తి మార్గము నందు తీసుకువెళ్ళాలి. నిత్యము భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలి. భక్తి అనే అగ్ని జ్వాలల్లో మనస్సుని కాల్చకుంటే అందులోని మాలిన్యము నశించిపోదు కదా అని చెప్పటమే ఈ పద్యం లోని నీతి .

సుమతీ శతకం
ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్
మడుపునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!

తాత్పర్యం
ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటి జీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.

విశ్లేషణ
భగవంతుడు జంతువులకి జ్ఞానం ఇవ్వలేదు, ఒక్క మనిషికి మాత్రమే జ్ఞానం వరంగా ఇచ్చాడు.మనిషి ఆ జ్ఞానం అనే సంపద తో మంచి ఆలోచనలతో ఎన్నో విజయాలని సాధించవచ్చు. ఉడుము వందేళ్ళు జీవిస్తుంది , పాము వెయ్యేళ్ళు  జీవిస్తుంది , కొంగ ధీర్గాయువు తో జీవిస్తుంది కాని అవి ఎవ్వరికి ఉపయోగపడవు. మనిషి మత్రం జీవించినన్నాళ్ళూ అందరికీ ఉపయోగ పడుతూ తన జీవితాన్ని ని ధర్మం తో నడిపిస్తూ మోక్షం కోసం ప్రయత్నించాలి అని చెప్పటమే ఈ పద్యం లో నీతి.

మరిన్ని శీర్షికలు
weekly horoscope 10th july  to17th july