Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dastooreetilakam

ఈ సంచికలో >> కథలు >> మలిసంధ్య

malisandhya

రిటైరై రెండు నెలలైన రాఘవకి  ఏమీ తోచడంలేదు. హాయిగా మనవడు, మనవరాలితో కాలక్షేపం చేస్తూ కథలు చెప్పే వయస్సు. ఇద్దరమ్మాయిలూ అమెరికాలో వుండడం వల్ల ఆ అదృష్టం లేకుండా పోయింది.

శ్రీమతి సహాయంతో పిల్లల బాధ్యత బాగానే పూర్తి చేశాడు. తల్లిదండ్రులను చివరివరకు కనిపెట్టుకుని ఆ కార్యం కూడా సక్రమంగానే నిర్వర్తించాడు. ఇక  మిగిలింది, బ్రతికుండగా సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడటం, ఏం చేస్తే కాలక్షేపంగా వుంటుంది? అలా అని నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనలో వున్నాడు.

ఉదయం తొమ్మిది అవుతోంది. పేపర్ చదవడం, టిఫిన్ తినడం పూర్తిచేసి, పోర్టికోలో కూర్చుని, వీధిలో వచ్చేపోయేవాళ్ళని చూస్తున్నాడు. సైకిల్ మీద స్కూల్ కి వెళ్తున్న పిల్లలు, బళ్ళ మీద పిల్లల్ని ఎక్కించుకు వెళ్తున్న తల్లిదండ్రుల్ని చూశాక, ఆ సందు చివర వున్న స్కూల్ గుర్తుకు వచ్చింది.

స్కూల్ జ్ఞాపకం రాగానే, మనసు బాల్యం లోకి జారుకుంది. తను, పక్కింట్లో గోపాల్ కలిసి 2 కిలోమీటర్ల దూరం వున్న బడికి వెళ్ళేవాళ్ళు. పొద్దున అసెంబ్లీ - వందేమాతరం, సాయంత్రం అసెంబ్లీ - ఎక్సర్ సైజులు, జనగణమన వుండేవి. వారం లో ఒక పి.టి. క్లాసు వుండేది. అందరూ ఆ పీరియడ్ కోసం ఎదురుచూసేవాళ్ళు. బడి చుట్టూ బోలెడు ఖాళీ వుండేది. పెద్ద చెట్లతో వుండేది. కబాడి, ఖొ ఖొ లాంటి ఆటలు ఆడేవాళ్ళు.

ఇవన్నీ గుర్తు వచ్చి, ఇంటి దగ్గర స్కూల్ ఎలా వుందో? ఒకసారి చూద్దాం అనే కుతూహలం కలిగించింది. లేచి మెల్లగా స్కూల్ వైపు నడక సాగించాడు.

"భారతి స్కూల్" ఒక రెండు అంతస్థుల భవనం లో నడుస్తోంది. సెల్లార్ లో మొక్కల కుండీలు అందం గా అమర్చి వున్నాయి. సైకిళ్ళు, బళ్ళు పక్కకు వున్నాయి. ప్రిన్సిపాల్ గది మొదటి  అంతస్థులో వుంది. గది బయట  డా గిరిజ అని అందమైన నేం ప్లేట్ గోడకు పెట్టి వుంది.

"ఎవరు కావాలి సార్" అని అడిగింది అటుగా వెళ్తున్న ఆయా.

"ప్రిన్సిపాల్ గారిని కలవాలి" అన్నాడు రాఘవ.

లోనకు  వెళ్ళి మాట్లాడి , అప్పుడు గదిలోకి పంపింది ఆయా.

కుర్చీలో వున్నావిడకి 40 సంవత్సరాలు వుండొచ్చు. సరిపడా ఎత్తు, చామనచాయ, మొహం గుడ్రం గా వుంది.

"చెప్పండి సార్" అంది ఆమె.

"నా పేరు రాఘవ. ఈ వీధిలోనే మా ఇల్లు" అని తన గురించి, ప్రస్తుతం రిటైరయ్యాక, తన ఆలోచన గురించి చెప్పాడు.

గిరిజ తను లెక్కలలో పి.హెచ్.డి చేసి ప్రైవేటు కాలేజీలో 10 ఏళ్ళు పనిచేసినట్లు చెప్పింది. క్లాసులో సగం మంది పిల్లలకి సబ్జెక్టు పూర్తిగా అవగాహన లేకపోవడం గమనించి, వీళ్ళకి ముందునుండే బలమైన పునాది వెయ్యడం అవసరం అని తలచి, కాలేజ్ ఉద్యోగానికి రాజీనామా చేసి, 4 ఏళ్ళ క్రితం ఈ స్కూల్ ప్రారంబించినట్లు తెలిపింది. "రండి సార్, పైన క్లాసులు చూద్దురు గాని" అని పైకి తీసుకెళ్ళింది. కె.జి నుండి ఏడవ తరగతి వరకు మొత్తం 9 క్లాసులున్నాయి. కారిడార్లో అక్కడక్కడ చక్కటి నీతివాక్యాలు వ్రాసి వున్నాయి. క్లాసులో పాఠాలు జరుగుతున్నాయి. తిరిగి కిందకు వెళ్ళారు.

"మీ స్కూల్ కి నేనేమన్నా ఉపయోగపడగలనేమో ఆలోచిస్తానమ్మా" అని చెప్పి సెలవు తీసుకున్నాడు.

ఏమండీ! భోజనానికి రండి" అన్న భార్య సునంద కేక విని పోర్టికోలోని పడక కుర్చీ నుండి లేచి లోపలకి వెళ్ళాడు.

బోజనం అయ్యాక సునంద దగ్గర తన నిర్ణయాన్ని వెలిబుచ్చాడు. ఈ తరం వాళ్ళకి పిల్లలకి కథలు చేప్పే తీరిక లేదు. అలా అని తాతో, బామ్మో చెప్పడానికి వాళ్ళతో కలిసి వుండడం లేదు. ఆఖరుకి కథలు వినడానికి కూడా పిల్లలు "గ్రాండ్ మా స్టోరీస్" అని ఇంటర్నెట్ మీద ఆధారపడవలసి వస్తోంది.  అందుకని రోజూ స్కూల్లో చిన్న పిల్లలకి కాసేపు నీతి కథలు, ఇంకొంచెం పెద్ద భారతం, రామాయణం వంటివి చెబుదామని వుంది అన్నాడు.

పోనీలెండీ.. మనవళ్ళకి చెప్పలేకపోతున్నామనే బాధ అనవసరం. ఇది ఇంకా ఎక్కువమందికి ఉపయోగపడుతుంది. పిల్లలకు పుస్తక పఠనం మీద ఆసక్తి కూడా పెరుగుతుంది. అంది సునంద.

పక్కరోజు ఉదయం 10 గంటలకి స్కూల్ వెళ్ళాడు. గిరిజను కలిసి తన ఆలోచనను వివరించాడు.

"బాగుంది మాస్టారు! చిన్న  పిల్లలకు వారానికి ఒక క్లాసు నీతి కథలు, పెద్ద పిల్లలకు రామాయణం, భారతం ప్లాన్ వేద్దాం" అంది.

ఎలాగు జూన్ నెల సంవత్సరం ప్రారంభం లో వున్నాం అని రాఘవ పేరును కూడా చేర్చి, టైం టేబుల్ ను అడ్జెస్ట్ చేసింది గిరిజ. రోజూ స్కూల్ కి వెళ్ళి వస్తున్నాడు అతను.

లోకం తెలియని చిన్న పిల్లలు జంతువుల మీద, పక్షుల మీద కథలు చెబుతుంటే వినోదంగా, ఆశ్చర్యం గా కళ్ళు ఇంత చేసుకుని వింటుంటే రాఘవకి ఎంతో సంతోషం గా వుంది. భారతం వినడానికి పెద్ద పిల్లల ఆసక్తి, మళ్ళా క్లాసు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం, కథ ఎంతవరకు అయ్యిందర్రా అనగానే చెప్పడం, అతని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అతని ధ్యాస అంతా ఈ పిల్లలకి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే. మెల్లగా స్కూల్ అసెంబ్లీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసాడు. "అంత స్థలం మనకు లేదు కదా మాస్టారూ" అంది గిరిజ.

"ఎవరి క్లాసులో వాళ్ళు నుంచుని వుండగా మైక్ సిస్టం తో వందేమాతరం, జనగణమన చెప్పిద్దాం" అన్నాడు.

ఒక వారం లో దాన్ని కార్య రూపం లోకి తెచ్చాడు.

ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా దారిలో ఖాళీ సైటు చూసి బుర్రలో తళుక్కున ఒక ఆలోచన తట్టింది. మర్నాడు ఉదయం గిరిజతో ఈ సందులో ఒక్క సైటే ఖాళీగా వుంది. రెడ్డిగారు తప్ప అందరూ ఇల్లు కట్టేశారు. ఆయన ఇక్కడ వుండరు. ఆయనను సంప్రదించి సైటు లీజుకు తీసుకుందాం. పిల్లలకి ప్లే గ్రౌండ్ గా పనికొస్తుంది. అన్నాడు.

తప్పకుండా ఆ సాయంచెయ్యండి. మాస్టారూ! ఆయనెవరో నాకు తెలియదు అంది.

పది రోజులలో ఎలాగైతే ఆ పని సాధించాడు రాఘవ. ఇప్పుడు పొద్దున ఒక్క పూటే కాదు, సాయంత్రం కూడా స్కూల్ కి వెళ్ళడం, పీటి క్లాసుల్లో పిల్లోలు ఆ ఖాళీ స్థలం లో కేరింతలతో ఆటలాడుతుంటే చూస్తూ కూర్చోవటం అలవాటైపోయింది. మధ్య మధ్య వాళ్ళని ఉత్సాహపరచేవాడు. స్కూల్ నుండి ఆటల్లో పాల్గొనడానికి ఒక గట్టి టీం ను తయారుచేయుటకు ఒక  పీటి మాస్టర్ ని నియమించడం కూడా జరిగింది. వర్షాకాలం లో స్కూల్ పిల్లల్తో ఆ వీధంతా పూలమొక్కలు నాటించాడు. పెద్ద పిల్లలు ఒక బృందం గా ఏర్పడి ఆ వీధిలో ఇళ్ళ్ళళ్ళో వారిందరినీ కలిసి స్వచ్చభారత్ కార్యక్రమం లో భాగంగా ఆ రోడ్డు మీద ఎక్కడా చెత్తపడెయ్యవద్దని, ఎవరి ఇంటి ముందున్న మొక్కల్ని వారే పరిరక్షించాలని వాళ్ళని కూడా భాగస్వాముల్ని చేశారు.

చూస్తూ సంవత్సరం గడిచింది. ఆ సంవత్సరం ఏడవ తరగతి పిల్లలు వేరే స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. చాలామంది తల్లిదండ్రులు కూడా గిరిజను కలిసి పిల్లలను ఐదవ తరగతి దాకా ఇక్కడే చదివేలా ఏర్పాటు చెయ్యమని, అవసరమైతే వాళ్ళ సహకారం కూడా వుంటుందని చెప్పారు. గిరిజ, రాఘవ సలహా మీద లోన్ తీసుకుని, పైన ఇంకో ఫ్లోర్ వెయ్యాలని నిర్ణయించుకుంది. నిర్మాణం పని మొదలయ్యింది. మధ్యలో ఆడపిల్లల ఇద్దరి డెలివరికి సునంద అమెరికా వెళ్ళింది. తనని రమ్మన్నా, నిర్మాణం పని అది చూసుకోవాలని వెళ్ళలేదు.

రోజులు గడుస్తున్నాయి. స్కూల్తో అనుబంధం రాఘవకి కాలక్షేపం తో పాటు ఎంతో సంతృప్తినిస్తొంది. వీధిలో అందరూ రాఘవని పలకరించేవారే. పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ అతను మాస్టారే!

తల్లి ద్వారా విషయాలన్నీ తెలుసుకుంటున్న శారద, లలిత ఎప్పుడు తండ్రితోపాటు, స్కూల్ ను అక్కడ పిల్లలను చూద్దామా అని
ఆరాటపడుతున్నారు. అమెరికా వెళ్ళలేదన్న మాటేగానీ రాఘవకి కూడా ఎప్పుడెప్పుడు మనవడిని, మనవరాలిని చూద్దామా! అని వుంది. కొత్త సంవత్సరం వచ్చింది. కూతుళ్ళు, అల్లుళ్ళు మనవరాళ్ళ సంతానం రానే వచ్చారు. రోడ్డుకు ఇరుపక్కల విరగబూసి వున్న గన్నేరు, గరుడ వర్ధనం చెట్లు వాళ్ళకు స్వాగతం చెబుతున్నాయన్నట్లుంది. మనవడిని, మనవరాలిని చూసి మురిసిపోయాడు రాఘవ.

మరుసటి రోజు అందరినీ స్కూల్ కి తీసుకెళ్ళాడు. వాళ్ళను  గిరిజకు పరిచయం చేశాడు. పిల్లలందరికీ చాక్లెట్లు పంచారు.

శారద, లలిత రోజూ స్కూల్ వదిలే సమయానికి పోర్టికోలో కూర్చుంటే, స్కూల్ ఉనికిని తెల్లుపుతూ గాలిలో మంద్రం గా "జనగణమన అధినాయక జయహే..." అని జాతీయ గీతం వినిపించేది. ఇళ్ళకి వెళ్తూ స్కూల్ పిల్లలు వీళ్ళకు "బై" చెబుతూ వెళ్ళేవాళ్ళు. పుట్టినరోజు వేడుకలు అయిపోయాయి. నాలుగు వారాల ట్రిప్ చివరకు వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు కూతుళ్ళిద్దరు తల్లిదండ్రుల్ని ఇక్కడ ఒక్కరే వుండి ఏం చేస్తారు? అమెరికా వచ్చెయ్యమని అన్నారు. ఈ సంవత్సరం 10వ క్లాసు వరకు పెంచుతున్నాం. వాళ్ళకి వ్యక్తిత్వ వికాసానికి క్లాసులు ఏర్పాటు చేయాలి. క్విజ్ పోటీలకు తయారుచేయాలి. ఇలా చాలా ఆలోచనలు వున్నాయి. ఆచరణలో పెట్టాలి" అన్నాడు రాఘవ.

ఎప్పుడన్నా చూడాలనిపించి వస్తారేమో కానీ అమెరికాలో వుండిపోయేటట్లురారు అని అర్ధమయ్యింది. మరుసటి రోజు శారద, లలిత స్కూల్ కి వెళ్ళి గిరిజకు వాళ్ళిద్దరి తరుపున స్కూల్ అభివృద్ధికి ఖర్చు చెయ్యమని లక్ష రూపాయలు విరాళం గా ఇచ్చి ఆమెను ఒక చిన్న సహాయమ ఆర్ధించారు. వాళ్ళ నాన్న కథలు చెప్పే కార్యక్రమాన్ని రికార్డు చేసి తమకి పంపమన్నారు. ఇంతమంది పిల్లలు ఆ కథలు వింటుండగా, సొంత మనవడు, మనవరాలికి కూడా ఆ భాగ్యం దక్కాలని, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళకి బెడ్ టైం స్టోరీస్ గా వినిపిస్తామన్నారు.

రాఘవ, సునంద అమెరికా రాకపోయినా, వాళ్ళకి కాలక్షేపానికి లోటు లేదని, ఈ వయస్సులో కూడా జాతి నిర్మాణానికి కృషి చేస్తున్న వాళ్ళ నాన్నకు తాము దగ్గరలేకపోయినా, కొండంత అండ వుందనే భరోసాతో తిరుగు ప్రయాణమయ్యారు శారద, లలిత.

మరిన్ని కథలు