Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - డా.ఎ.రవీంద్ర

పొరపాటు ఒక గుణపాఠం 

తప్పు చేయడం మానవ సహజం అంటారు. మరి మానవ సహజం అయినప్పుడు తప్పులు చేస్తే తప్పులేదన్న మాట అని కాదు అర్థం. ఆ తప్పును ఎలా అర్థం చేసుకున్నాం?. ఆ తప్పునుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాం?. అసలు తప్పును తప్పుగా గుర్తించామా! గుర్తిస్తే దానిని సమర్థించుకున్నామా!?, తప్పని ఒప్పుకున్నామా!?... ఆ తప్పు ద్వారా జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం?. అది జీవితంలో ఎలాంటి ప్రాధాన్యాత సంతరించుకుంది....? ఇలా ఎన్నో విధాలుగా ఒక తప్పు గురించి ఆలోచించాలి. ఆలోచించినప్పుడే తప్పుకూడా జీవిత మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.

తప్పులు ఒప్పుల త్రాసు

తప్పులు, ఒప్పులు అనేవి సమాజ నడవడికను బట్టి ఏర్పడతాయి. ఒక్కో సమాజంలో, ఒక్కో దేశంలో, ఒక్కో ప్రదేశంలో, ఒక్కో సంస్కృతిలో ఒక్కోపని తప్పు అవుతుంది. ఒక్కో పని ఒప్పు అవుతుంది. అదే విధంగా స్థలం, కాలం, సందర్భాన్ని బట్టి కూడా తప్పొప్పులు మారుతుంటాయి. ఇక రాజ్యాంగం, చట్టాలు వంటి పరిథులు వేరే విధంగా తప్పులను, ఒప్పులను నేరాలను నిర్దేశిస్తాయి. వీటన్నిటిని పక్కన పెట్టి ఆలోచిస్తే, ప్రతి మనిషిలో ఒక కొలబద్ద ఉంటుంది. తప్పొప్పులను నిర్ణయించే త్రాసు ఉంటుంది. దానినే మనసు అంటారు. అంతరాత్మ అని చెప్తారు. తప్పు చేసేటప్పుడు తప్పకుండా మీ మనసు మీకు చెప్తుంది. మీరు జీవిస్తున్న సమాజం ఆ తప్పను ఎలా రిసీవ్ చేసుకుంటుంది. దాని వల్లమీకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో కూడా చెప్తుంది. వాటిని బట్టి మీరు తప్పు చేయకుండా ఉండటమే మంచిది. మరి తప్పు చేస్తే...

తప్పుకు ముందు వెనుక

సోనీ బీటెక్ రెండో సంవత్సరం చదువుతుంది. వివేక్ తో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా లవ్ గా మారింది. దాంతో ఇంట్లో చెప్పకుండా సినిమాలు, పార్కులకు వెళ్లడం మొదలైంది. కానీ ఇవన్నీ తల్లికి ఎలా చెప్పాలి.? చెప్పకపోతే ఏరోజైనా తెలిస్తే పరిస్థితి ఏంటి.? తను చేస్తుంది తప్పా....? ఒప్పా...? ఒకవేళ అమ్మకు చెప్తే తనను ఎలా రిసీవ్ చేసుకుంటుంది.? ఈ మనో వేదనతో అటు వివేక్ తో, ఇటు తల్లితో సరీగా ఉండలేకపోతుంది. ఒక్కోసారి వివేక్ చనువు చూస్తే తను తప్పు చేస్తానేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది. చరణ్ ది ఆకతాయి మనస్తత్వం. అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకొని రాంగ్ మెసేజ్ లు పంపుతూ, వాళ్ల వీక్ నెస్ లు తెలుసుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఇద్దరు ముగ్గుర అమ్మాయిలు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ జెస్ట్ ఫర్ ఫన్ అని తన తప్పను తాను సమర్థించుకుంటున్నాడు.

ప్రసాద్ దో విచిత్రమైన పరిస్థితి. చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణతో పెరిగాడు. ఈ మధ్యనే ఓ మంచి ఉద్యోగంలో చేరాడు. కొలీగ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు. మొదట పార్టీలు.. ఆ తర్వాత మందు, ఆ తర్వాత అమ్మాయిలతో సంబంధాలు... ఇలా ఒక్కొక్కటీ... కానీ తప్పు అని తెలుస్తూనే చేస్తున్నాడు. మానుకోలేక పోతున్నాడు. అదేమంటే ఫ్రెండ్స్ బలవంతం అంటున్నాడు. ఇక్కడ సోనీ తప్పు చేయడానికి ముందు ఆలోచిస్తుంది. చరణ్ తన తప్పను ఒప్పు అని సమర్థించుకుంటున్నాడు. ఇక ప్రసాద్ తప్పుచేసి ఆ తప్పును తప్పని తెలుసుకున్నా బయటపడడానికి సిద్ధంగా లేడు.

తప్పను ఒప్పుకోవాల్సిందే...!

తప్పు చేయడం సహజమే అంటున్నాం. కానీ తప్పను ఒప్పుకోవడం చాలా కష్టం. మీ పనుల వల్ల, మీకు గానీ, మీకు సంబంధించిన వాళ్లకు గాని, ఇతరులకు గాని ఏ మాత్రం ఇబ్బంది కలిగితే ఆ పని తప్పు. అసలు మీరు చేస్తుంది తప్పు అని తెలుసుకొంటే చాలు.  కొంతమంది మా లైఫ్ మా ఇష్టం అంటుంటారు. ఇది మితిమీరిన అహంకారానికి చిహ్నం. తప్పుని తప్పు అని తెలుసుకొని, దాని వల్ల నష్టం కలుగుతుందని అర్థం కాగానే వెంటనే మానేయాలి. తప్పును తప్పని అంగీకరిస్తే సగం తప్పు పరిష్కారం అయినట్లే. కొంతమంది త్పపుచేసి మిన్నకుంటారు. ఒప్పుకోడానికి అహం అడ్డువస్తుంది. ఎంత పెద్దవాళ్లైన తప్పును ఒప్పుకొంటే ఇంకా పెద్దవాళ్లు అవుతారు. లేకపోతే చిన్న వాళ్లుగా మారిపోతారు.  లేదంటే వారి వ్యక్తిత్వం మైనస్ లోకి వెళ్లిపోతుంది. సోనీ తను తప్పు చేయడానికి సిద్ధపడుతున్నాను అని తెలుసుకుంది. కానీ తల్లితో చెప్పలేక పోతుంది. అలా చెప్పడం మంచిది. తీరా తప్పు చేశాక, వచ్చే పరిణామాలను బరించేకంటే, ముందే పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఇక ప్రసాద్ చేస్తుంది తప్పు. కానీ ఒప్పు అనుకోవడం అతని నైజం. తప్పును తప్పు అని ఒప్పుకోవాలి. లేదా పరిస్థితులు విషమిస్తే అతని జీవితం చాలా సంక్లిష్టంలో పడొచ్చు. ఇక మరో వ్యక్తి వివేక్ తన తప్పను వేరే వారి మీద రుద్దుతున్నాడు. అంటే తన మనసు మీద తను అధికారాన్ని కోల్పోయాడు. ఇలాంటి వాళ్లకు ఓ స్థాయిని మించిపోయాక కౌన్సిలింగ్ లాంటివి అవసరం.   

పొరపాటొక గుణపాఠం

తప్పులు చాలా ముఖ్యమైనవి అంటారు మనోవిజ్ఞానశాస్త్రంలో. అసలు తప్పులు చేస్తేనే మనిషిలోని మనిషి గురించి తెలుస్తుందట. కానీ తప్పు చేసినప్పుడల్లా బాధపడుతూ, కన్నీళ్లు పెడుతూ కూర్చోకూడదు. ఆ తప్పు వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చాలి. అలాంటి తప్పు మళ్లీ చేయకుండా పూర్వాపరాలు ఆలోచించి జీవితాన్ని ముందుకు నడపాలి. తప్పు చేయడానికి పూనుకున్నప్పుడే.. అలా చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పుడే మనవ నైజం బయట పడుతుంది. ఓ వ్యక్తి ఉద్యోగం కోసం చేసిన ఇంటర్ వ్యూలో తప్పుచేసి ఫెయిల్ అయ్యాడు అంటే, ఆ తప్పు గ్రహించి మరో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఒకసారి తప్పు చేసి ప్రాణ స్నేహితురాలిని దూరం చేసుకుంటే, తప్పుని ఒప్పుకొని ఆమె స్నేహాన్ని తిరిగి పొందుతాడు. లేదా మళ్లీ అలాంటి తప్పు చేయకుండా మరో స్నేహితురాలినైనా పొందుతాడు. అందుకే తప్పు విజయం వైపు నడిపే ఓ గుణపాఠం. అలా పొందలేని వ్యక్తిత్వాలు జీవితాన్ని అభాసపాలే కాదు. నరక ప్రాయం కూడా చేసుకుంటాయి. తప్పును దాటేయకూడదు. మౌనం వహించకూడదు. నిక్కర్షగా ఒప్పుకొని సరిద్దిద్దుకొని ముందుకు పోవాలి.

సూత్రాలు - తీర్మానాలు

ముఖ్యంగా యువత తప్పులు చేయడానికి వయసు, స్వేచ్ఛ, ఊహలు, పరిచయాలు, పరిసరాలు సహకరించవచ్చు. అందుకే కొన్ని నియమాలు పెట్టుకొవాలి. అలా అని స్వేచ్ఛ లేకుండా ఉండమని కాదు. పరిధుల్లో జీవించమని అర్థం. చేస్తున్న తప్పులను వారానికోసారి సమీక్షించుకోవాలి. తప్పు అని తెలిస్తే కారణాలు, పురికొల్పిన పరిస్థితులను తెలుసుకొని దూరంగా ఉండాలి. దాని నుంచి జీవితానికి సంబంధించిన పాఠం నేర్చుకోవాలి. తప్పును గుణపాఠంగా భావిస్తాను అని మనసులో గట్టి నిర్ణయం తీసుకోవాలి. ముందుగా జరిగిన తప్పులకు నేనే బాధ్యత అని ఒప్పుకోవాలి. క్షమించమని బాధితులను అడగాలి. నాకు తెలిసే తప్పు చేశాను... ఇక చేయను అని నిర్దారణకు రావాలి. ఓ పని చేసే ముందు మనసుతో, ముందు వెనుకలు ఆలోచించి మొదలు పెట్టాలి.

సోని, ప్రసాద్, వివేక్ లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వారి జీవితాలు గాడిన పడుతాయి. వాళ్లే కాదు నేటి యువత అందరికీ ఇది చాలా అవసరం. తప్పు నుంచి ఒప్పుకు, ఒప్పునుంచి సరైనా జీవితానికి మార్గాన్ని వేస్తాయి.                                          

మరిన్ని శీర్షికలు
weekly horoscope 17th july  to 23rd july