Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

బాహుబ‌లి లో అదొక్క‌టే లోటు - త‌మ‌న్నా

త‌మ‌న్నా అంటే.. మిల్కీబ్యూటీ!
ఆ రంగు చూసి.. పాల‌రాతి మెరుపులు కూడా చిన్న‌బోతాయి. అంద‌మొక్క‌టే త‌మ‌న్నా ఆభ‌ర‌ణం కాదు. దాంతో పాటు అభిన‌యం అనే కిరీటం ఆమె నెత్తిమీద సింగారించుకొంది. దాంతో త‌మన్నా టాప్ స్టార్ అయిపోయింది. త‌న ఖాతాలో హిట్లున్నా.. బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మాత్రం లేదు. ప‌దేళ్ల కెరీర్‌లో త‌మ‌న్నా ఇండ్ర‌స్ట్రీ రికార్డు ఎలా ఉంటుందో తెలీదు. ఆ లోటు బాహుబ‌లి తీర్చేసింది. ఆల్ ఇండియా రికార్డులు బ‌ద్ద‌లు కొడుతూ ముందుకు సాగుతున్న బాహుబ‌లిలో అవంతిక‌గా మెప్పించింది త‌మన్నా. అటు క‌త్తి తిప్పింది.. ఇటు త‌న‌లోని సోయాగాల్ని వెండితెర సాక్షిగా ఆవిష్క‌రించింది. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నాతో గో తెలుగు చేసిన స్పెష‌ల్ చిట్ చాట్ ఇది. 


* 250 కోట్ల సినిమాలో మీరు క‌థానాయిక... ఈ మాట వింటుంటే ఎలా అనిపిస్తోంది..?
- గొప్ప‌గా... గ‌ర్వంగా ఉంది. ఆ సౌండింగ్ బాగుంది. అదంతా రాజ‌మౌళి అండ్ టీమ్ వ‌ల్ల నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నా.

* బాహుబ‌లితో అనుకొన్న‌ది సాధించిన‌ట్టేనా?
- (న‌వ్వుతూ) నూటికి రెండొంద‌ల శాతం. బాహుబ‌లి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇలాంటి గొప్ప సినిమాలో నాకూ ఓ పాత్ర ద‌క్క‌డం నేను చేసుకొన్న అదృష్టం. నేను ప‌రిశ్ర‌మ‌కొచ్చి దాదాపు ప‌దేళ్ల‌య్యింది. ఈ స‌మ‌యంలో ఇలాంటి గొప్ప సినిమా చేస్తాన‌ని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ ప‌దేళ్ల ప్ర‌యాణంలో నేను గుర్తుపెట్టుకొనే గొప్ప చిత్రంగా బాహుబ‌లి నిలిచిపోతుంది. ప‌దేళ్ల‌కేంటి.. ఇదో జీవిత కాల జ్ఞాప‌కం.

* పార్ట్ 2లో అవంతిక ఎలా ఉండ‌బోతోంది?
- పార్ట్ 2లో అంత‌గా క‌నిపించ‌ను.. అదొక్క‌టే కాస్త అంతృప్తి.


* బాహుబ‌లి - ది బినిగింగ్‌లో మాత్రం అద‌రొట్టేశారు క‌దా..?
- అవంతిక పాత్ర గురించి రాజ‌మౌళి సార్ చెబుతున్న‌ప్పుడే చాలా ఉద్వేగానికి గుర‌య్యా. చాలా ఫోర్స్ ఉన్న పాత్ర అది. చూడ్డానికి మ్యాన్లీగా క‌నిపిస్తుంది గానీ - లోప‌ల ఓ అద్భుత‌మైన సౌంద‌ర్య‌రాశి దాగుంది. ఆ పాయింట్ నాకు బాగా న‌చ్చింది.

* క‌త్తియుద్దాలు చేయ‌డం క‌ష్ట‌మ‌నిపించ‌లేదా?
- ఈ పాత్ర చేయ‌డానికి ప్ర‌ధాన‌మైన కార‌ణం.. అదే. ఓ క‌థానాయిక‌లో వీర‌త్వం బ‌య‌ట‌ప‌డే ఛాన్స్ ఎప్పటికోగానీ ద‌క్క‌దు. అలాంట‌ప్పుడు క‌ష్ట‌మ‌నుకొని భ‌య‌ప‌డితే ఎలా? 

* బాహుబ‌లి బాలీవుడ్‌లోనూ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ సినిమాతో మ‌ళ్లీ మీకు బాలీవుడ్ త‌లుపులు తెర‌చుకొన్న‌ట్టేనా?
- బాహుబ‌లి బాలీవుడ్‌లోనూ భారీ వ‌సూళ్లు సాధించ‌డం గ‌ర్వంగా ఉంది. అయితే ఈ సినిమా పేరు చెప్పుకొని నేనేం అవ‌కాశాలు సంపాదించ‌ను.ఎందుకంటే బాహుబ‌లి నా ఒక్క‌దాని సినిమా కాదు. ఇది టీమ్ ఎఫెక్ట్‌.  కొన్ని ఫ్లాపులు వ‌చ్చినంత మాత్రాన‌ ఎవ్వ‌రికీ ఎక్క‌డా సంపూర్ణంగా అవ‌కాశాలు రాకుండా పోవు. ఎవ‌రికైనా, ఎప్పుడైనా ఏ రూపంలో అయినా మంచి ఛాన్సులు రావ‌చ్చు.

* రెండు ఫ్లాపుల‌తో పూర్తిగా ద‌క్షిణాదివైపు దృష్టి పెట్టిన‌ట్టున్నారు?
- నాకు ముందు నుంచీ ద‌క్షిణాది సినిమాలంటేనే ఇష్టం. నేను పేరు తెచ్చుకొంది ఇక్క‌డే. బాలీవుడ్ ఆఫ‌ర్ ఓ ప్ర‌మోష‌న్‌లా వ‌చ్చింది. అలాంట‌ప్పుప‌డు కాద‌న‌లేక‌పోయా. రెండు ఫ్లాపులు వ‌చ్చినంత మాత్రాన‌.. బాలీవుడ్ ప్ర‌యాణం ఆగిపోయిన‌ట్టు కాదు.

* నేటి క‌మర్షియ‌ల్ సినిమాల్లో క‌థానాయిక‌ల‌కు త‌గిన ప్రాధాన్యం ఉందంటారా?
- ఎందుకు లేదూ...??  హీరోయిన్‌ని ఇప్పుడు కేవ‌లం బొమ్మ‌లా చూపిస్తానంటే ఎవ్వ‌రూ ఒప్పుకోరు. క‌థానాయిక పాత్ర కేవ‌లం పాట‌ల‌కు ప‌రిమిత‌మైతే.. అలాంటి క‌థ‌లు, సినిమాలూ నిల‌బ‌డ‌వు. బాహుబ‌లిలో క‌థానాయిక పాత్ర‌ల‌కూ ప్రాధాన్యం ఉంది క‌దా.

* ఈ ప‌దేళ్ల కెరీర్‌లో ఏం సాధించామ‌ని లెక్క‌లేసుకొంటే.
- మీముందే బాహుబ‌లి రూపంలో స‌మాధానం ఉంది క‌దా..


* ఎప్పుడైనా అభ‌ద్ర‌తా భావానికి గుర‌య్యారా?
- ప్ర‌తి క్ష‌ణం ఉంటుంది. మ‌న స్థానానికి ఇక్క‌డ గ్యారెంటీ లేదు. ప్ర‌తి రోజూ, ప్ర‌తి సినిమా కీల‌క‌మే. మా స్థానం కోసం మేం ఎప్పుడూ పోరాడుతుంటాం. క‌థానాయిక‌ల మ‌ధ్య పోటీ ఉంది. కానీ... అది ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ. మాలో ఎవ‌రైనా విజ‌యం సాధిస్తే.. మ‌రొక‌రు మ‌న‌స్ఫూర్తిగా అభినందించుకొంటాం.

* మ‌రి కొత్త క‌థానాయిక‌ల‌తో పోటీ ఉందా?
- వాళ్ల‌ని త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. నేనూ ఒక‌ప్పుడు కొత్త క‌థానాయిక‌నే క‌దా..??

* ఐటెమ్ గీతాల‌కు సై అంటారా?
- నో వే... ఇప్ప‌టి వ‌ర‌కూ న‌న్నెవ‌రూ ప్ర‌త్యేక గీతం చేయ‌మ‌ని అడ‌గ‌లేదు.


* బెంగాల్ టైగ‌ర్ ఎలా ఉండ‌బోతోంది?
- ర‌వితేజ మార్క్ ఫ‌న్ ఉంటుంది.  మిమ్మ‌ల్ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అందులో నా పాత్ర కూడా చాలా త‌మాషాగా సాగుతుంది. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఇలాంటి క‌థానాయిక పాత్ర‌లు ఉండ‌డం చాలా అరుదు.

* కొత్త సినిమాలేమైనా ఒప్పుకొన్నారా?
- క‌థ‌లు వింటున్నా. ఇప్ప‌టి వ‌ర‌కూ సంత‌కాలు చేయ‌లేదు.

* ఆల్ ది బెస్ట్ త‌మ‌న్నా..
- థ్యాంక్యూ.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka