Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

 జరిగినకథ:  కాంచనమాల ఇంటినుంచి ఎలా వెళ్ళిపోయిందన్న విషయం  చందూ, దీక్షలకు  వివరిస్తాడు మునుస్వామీ.   వెంకటరత్నంనాయుడికి చెల్లెలిపై ఎంత ప్రేమ వుందన్నదీ, ఇప్పటికీ ఆయన గుండెల్లో చెల్లెలు బావ వాళ్ళ జాడ తెలీలేదన్న బాధ ముల్లులా గుచ్చుతూనే వుందని చెప్తాడు. ఆతరువాత..

 

కాబట్టి మధురైలో మీరెండు వర్గాలు అల్లర్లకు తెగబట్టానికి కారణం ఇదేనా లేక వేరే కారణం ఏదైనా వుందంటారా ? దీనిక్కూడ త్యాగరాజన్ తొణక లేదు తడబడ లేదు మీకు నేనో విషయం ముందుగా చెప్పాలనుకుంటున్నాను.

చెప్పండి నేను కాదు మా ప్రేక్షకులు కూడ మీ సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అన్నాడు.

మీకు తెలిసో తెలీకో మీ రెండు వర్గాలు అన్నారు. మహదేవనాయకర్ కి రౌడి వర్గం ఉందేమో నాకు తెలీదు గాని నాకు మాత్రం ఏ వర్గం లేదు. ఆ అల్లర్లను తిప్పికొట్టాలని ప్రయత్నించిన వాళ్ళు పోరాడిన వాళ్ళు అంతా నా పనివాళ్ళు. తామంతా నామీద నా వ్యాపారాల మీద ఆధార పడి బతుకుతున్నారు. కాబట్టి నా ఆస్థుల్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో స్వచ్ఛందంగా ప్రాణాలకు తెగించి ప్రత్యర్ధుల దాడుల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. అంతే గాని నాకంటూ ఏ వర్గం లేదు.

జరిగిన అల్లర్లలో ఎక్కువ భాగం నష్ట పోయిందీ నేనే. అయినా నేను బాధ పడ్డం లేదు. మహ దేవ నాయకర్ పెద్దవారు. ఆయనంటే నాకెప్పుడూ గౌరవం వుంది. అలాగే జర్నలిస్టు లహరి మీద నాకెలాంటి కోపం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఇందులో మనం ఆవేశాలు కావేషాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. అంటూ వివరణ ఇచ్చాడు త్యాగరాజన్.

వాడి మాటలు వింటున్న సహస్ర కోపం పట్టలేక చేతికి దొరికిన పేపర్ వెయిట్ని టివి మీదకు విసిరి కొట్టబోయింది. సమయానికి విరాట్ పట్టుకొని ఆపాడు గాని లేదంటే టివి ముక్కలు చెక్కలయ్యేదే. సహస్ర ఆవేశం చూసి చట్టున లేచి టివి ఆఫ్ చేసింది విశాల.

‘‘సహస్ర ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమిటీ ఆవేశం? నువ్విలా ఆవేశ పడితే తల మీద పడ్డ కుట్లు తెగే ప్రమాదం వుంది. కూల్ డౌన్’’ అంటూ హెచ్చరించాడు విరాట్.

‘‘ఆవేశ పడకుండా ఎలా ఉండ గలను? వాడి నక్క వినయం చూడు. మానవ మృగం. వాడు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు. ప్రజల్ని మోసం చేసి వారి సానుభూతి పొందటం కోసమే ఈ ఇంటర్వూకి వచ్చినట్టున్నాడు. నా చేతికి దొరికితే ఖచ్చితంగా వాడ్ని చంపేస్తాను.’’ అంది కోపంగా సహస్ర.

‘‘నువ్వంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదు. వీడి సంగతి చట్టం చూసుకుంటుంది. ముందు నీ ఆరోగ్యం బాగు పడాలి. నువ్వు మధురై కోర్టుకెళ్ళటం నాకిష్టం లేదు. ధర్మ కూడ ఇదే సలహ యిచ్చాడు. ఈ కేసును చెన్నై కోర్టుకు బదిలీ చేయమని సుప్రీం కోర్టుకు అప్పీలు పంపించు. రేపే ఆ పని చేయాలి. ఇక్కడయితే త్యాగరాజన్ మనుషుల్ని అడ్డుకోడానికి మేమంతా ఉన్నాం’’ అంటూ గుర్తుచేసాడు విరాట్.

ఎందుకో అవునని గాని కాదని గాని సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళి బెడ్ మీద పడుకుంది సహస్ర. కారణం తెలీక విశాల విరాట్ లు ముఖ ముఖాలు చూసుకున్నారు.

ఆ రోజు మధురైలో చెలరేగిన అల్లర్ల గురించి టివిలో వార్తలు చూసిన తక్షణం, కదిరేషన్ తన మనుషులతో బయలుదేరి వెళ్ళి పోయాడు. కాని అలా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే తిరుగు టపాలా మరునాడు ఉదయానికంతా చెన్నైకి వచ్చేసారు.

ఎందుకంటే మధురై పొలిమేరల్లోనే అన్ని రూట్లలోనూ పోలీసులు అన్ని చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీ చేసి గాని ఏ వాహనాన్ని సిటీలోకి అనుమతించటం లేదు. సాయంత్రానికి మధురై పొలిమేరల్లోకి చేరుకున్న కదిరేషన్ మహదేవనాయకర్ కి ఫోన్ చేసాడు. అప్పటికే ఆయన్ని హౌస్ అరెస్ట్ లో వుంచారు పోలీసులు. మహ దేవ నాయకర్ కదిరేషన్ ని ముఖం వాచేలా చీవాట్లు పెట్టాడు.

‘‘అక్కడ అమ్మాయి సహస్రను ఒంటరిగా వదిలేసి మధురై రమ్మని ఎవర్రా మీకు చెప్పింది. వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోయి అమ్మాయికి రక్షణగా మీరంతా అక్కడే ఉండండి’’ అంటూ ఆర్డర్ వేసాడు.

ఆ క్షణంలో మహ దేవ నాయకర్ అసలు కదిరేషన్ బృందాన్ని తను పంపిపంచిందే సహస్రను పట్టి ఇంటికి తీసుకు రాటానికనే విషయాన్నే మర్చిపోయాడు. ఆ విధంగా కదిరేషన్ తన మనుషులతో తిరిగి విరాట్ ఇంటికి చేరుకున్నాడు.

ఈ లోపల అటు సిటీ అవుట్ స్కర్ట్స్ లో హోటల్లో దిగిన ధర్మ బృందం విరాట్ ను చూడాలని తొందర పడుతోంది.

తన మీద ఎంతో అభిమానంతో ఇంత దూరం వచ్చిన వాళ్ళని ఎక్కువ రోజులు కలవకుండా ఉండటం న్యాయం కాదు. తన చేతి గాయం ఇప్పుడిప్పుడే ఆరుతోంది. ఇంకా పచ్చి మీద వున్నందున చేయి కదిపితే పెయిన్ స్టార్టవుతుంది. అయినా తప్పదు.

జగన్మోహన్ ఇంటర్వూను టివిలో చూసిన సాయంకాలమే విశాలను వెంట తీసుకొని మిత్రబృందాన్ని  కలవటానికి బయలుదేరాడు విరాట్. బలహీనంగా వుంది. తల మీద బాండేజ్ అలాగే వుంది.

విశాల స్టీరింగ్ తీసుకుంది.

పక్కన కూచున్నడు విరాట్.

తననెవరూ గుర్తుపట్టకుండా తలకు తుండు చుట్టుకున్నాడు. సీటు మీదకు వాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు.

‘‘బావా........ నాకో విషయం అర్ధం గావటం లేదు’’ అంది దారిలో విశాల.

‘‘నువ్వు కాస్త జనరల్ నాలెడ్జ్ లో వీక్. అందుకే చప్పున ఏదీ అర్ధం కాదు. ఏ విషయం అర్ధం కాలేదో అడుగు’’ అన్నాడు కళ్ళు తెరవకుండానే.ఆ మాటకి విశాలకి రోషం ముంచుకొచ్చింది.

‘‘ఏంటి? నేను జనరల్ నాలెడ్జ్ లో వీకా?’’ అంది.

కళ్ళు తెరిచి చిన్నగా నవ్వాడు విరాట్

‘‘కాదా? అందుకేగా విషయం అర్ధం కాలేదంటున్నావ్.’’ అన్నాడు నిటారుగా కూచుంటూ.

‘‘నీకర్ధమైందా?’’

‘‘యా!’’

‘‘అయితే  ఏంటో చెప్పుచూద్దాం’’

వెరీ సింపుల్. వరసయిన బావ పక్క గదిలోనే వున్నాడు. నీకు వయసు అలజడి. రాతృళ్ళు నిద్ర పట్టక పక్కమీద దొర్లుతున్నావ్. దాంతో తెల్లవారే సరికి కళ్ళు ఎరుపులెక్కి నీ అందమైన ముఖం వాడి పోతోంది. అలాగని ఏ అర్ధరాత్రో వెళ్ళి బావమీద పడదామంటే మధ్య గదిలోని అక్క సహస్ర ఏమనుకుంటుందోనని భయం....... ఇక మీ యిద్దరి మధ్యన ఎవరు ఏరాత్రి వచ్చి మీద పడతారోనని బావకి భయం. తలుపు లాక్ చేసుకొని నిద్రపోవలసి వస్తోంది.’’

విరాట్ విశ్లేషణకి పగలబడి నవ్వింది విశాల.

‘‘చాలు బావా. ఇక చాలు. జనరల్ నాలెడ్జ్ లో నువ్వు నాకన్నా వీకని అర్దమైపోయింది’’ అంది నవ్వాపుకుంటూ.

‘‘అలాగా సరి ఒప్పుకుంటాను. ఇంతకీ నీకర్ధం గాని విషయం ఏంటి చెప్పు’’ అడిగాడు.

‘‘ఆ త్యాగరాజన్ అల్లర్లు ఆరంభం కాగానే మధురై నుంచి చెన్నై పారిపోయి వచ్చాడు. ఆ సంగతి మనకు తెలుసు. కాని నాలుగు రోజులుగా ఇక్కడే ఉన్నానంటూ ఇంటర్వూలో బొంకాడు. ఇంతకీ వాడు ఇక్కడే ఉంటాడా మధురై వెళ్ళిపోతాడా? వాడేం చేస్తాడనేది అర్ధం గావడం లేదు.’’ అంటూ తనకు అర్ధం గాని సందేహాన్ని బయట పెట్టింది విశాల.

‘‘ఇందులో అర్ధం గానిదేముంది? మధురైలో ఉండి సాధించ లేనిది చెన్నైలో ఉండి సాధించాలని ఇక్కడే ఉంటాడు. సహస్ర ఇక్కడే ఉందని వాడికి తెలుసుగా’’ అన్నాడు విరాట్.

‘‘అంటే అక్కను చంపించాలనేనా?’’

‘‘డౌటా? కేసు విచారణ వస్తే తనకి ఉచ్చు బిగుస్తుందని వాడికి తెలుసు. ముందు కేసు బలహీన పడితే తర్వాత ఎలాగో తప్పించుకోవచ్చు. అలా జరగాలంటే సహస్ర బతక్కూడదు. అడ్రస్ వెతికి మరీ చంపించాలని చూస్తాడు.’’

‘‘ఈ లోపల మనమే వాడ్ని చంపేస్తే అక్క క్షేమంగా ఉంటుంది గదా?’’

‘‘ఏయ్.... సమస్యకు అది సొల్యూషన్ కాదు. మనం క్రిమినల్స్ కాదు. ఆ కోణంలో ఎప్పుడూ ఆలోచించకు’’ హెచ్చరించాడు విరాట్.

‘‘అయితే పరిష్కారం ఏమిటి? అక్కను మనం కాపాడుకోవాలి గదా’’ అంది విశాల.

‘‘మనమంతా ఉండగా తనకేమీ కాదు. డోన్ట్ వర్రీ అయినా ప్రశాంతమైన నీ బుర్రలోకి ఈ క్రిమినల్ థాట్స్ ఎలా వస్తున్నాయి. ఆ విషయాలు మేం చూసుకుంటాం గాని అనవసరంగా బుర్ర పాడు చేసుకోకు. కారును రైట్ రోడ్లోకి పోనీ’’ అన్నాడు విరాట్.

అప్పటికే చెన్నై అవుటర్లోకి వచ్చేసింది కారు. విరాట్ చెప్పిన వైపు కారును మళ్ళించింది విశాల.

‘‘ఒకె బావా రాత్రికి నీ గదికొచ్చేస్తాను’’ అంది వున్నట్టుండి

తృళ్ళిపడ్డాడు విరాట్.

‘‘ఇదెక్కడి గోల......... ఎందుకు?’’ అనడిగాడు అమాయకంగా.

‘‘పో బావా నీకన్నీ వివరంగా చెప్పాలి... అందుకే’’ అంది సిగ్గును ఎరువు తెచ్చుకుంటూ.

‘‘అందుకే అంటే...........అమ్మో ఒప్పుకోను. పెళ్ళికిముందే తొందరపడ్డం ఆచార విరుద్ధుం.........చట్ట విరుద్దం........లోక విరుద్ధం’’ కంగారుగా అరిచాడు.

‘‘ఓహో! అందుకే అనగానే నువ్వక్కడికి వెళ్ళిపోయావా? పోబావా అంత విరుద్ధమైన పని నేనెందుకు చేస్తాను?’’ అంది.

‘‘మరి గదిలోకొచ్చేస్తానంటున్నావ్.’’

‘‘అవును నిజంగా నువ్వు డోర్ లాక్ చేసుకుంటున్నావో లేదో వచ్చి చెక్ చేస్తాను.’’

‘‘హమ్మయ్యా బతికించావ్. అయినా.... లాక్ చేయకపోతే........ లోనకొచ్చేస్తావా?’’

‘‘వచ్చి’’

‘‘నిన్ను కొరుక్కు తినేస్తాను’’

‘‘అంత పని చేయమాక. నాకింకా చాలాకాలం బతకాలనుంది’’

‘‘నాకు మాత్రం లేదా?’’ అంటూ చటుక్కున పెదవుల మీద ముద్దు పెట్టేసింది.

‘‘ఓర్నాయనో నువ్విలా కవ్వించకు పుణ్యం వుంటుంది. అసలే భుజం గాయం నొప్పితో ఛస్తున్నాను. నువ్వు వేరే పాడు ఆలోచన పుట్టించి చంపకు. అదో హోటల్ కొచ్చేసాం. పక్కకు తిప్పి కారును ఆ ఖాళీ స్థలంలో చెట్టు కింద ఆపు’’ అన్నాడు.

కారును అటు మళ్ళించి...

చెట్టు కింద ఆపింది విశాల.

‘‘నేను కూర్చొనే వుంటాను. నువ్వు వెళ్ళిరా’’ అంది.

తన సెల్ అందుకొని కారు దిగాడు విరాట్. ఎసి కార్లోంచి బయటకు రావటంతో బయటి వాతావరణం వేడిగా తోచింది. ఓసారి చుట్టు చూసాడు. హోటల్ ముందు భాగం లోనే ఆగుంది ఒక లగ్జరీ మినీ బస్సు. ధర్మ బృందం బస్సు అదేనని వూహించాడు. ధర్మ సెల్ కి ఫోన్ చేసి తను చెట్టు కింద వున్నట్టు చెప్పాడు.

ఫోన్ చేసిన మూడో నిముషం లోనే ఏ హడావుడి లేకుండా ఇద్దరు ముగ్గురు జట్టుగా ధర్మతో సహా పాతిక మంది మిత్రబృందం హోటల్లోంచి బయటికొచ్చేసారు. వాళ్ళని చూసి చిరునవ్వుతో చేయి వూపాడు విరాట్.

వస్తూనే విరాట్ ను కౌగిలించుకున్నాడు ధర్మ. యోగ క్షేమాలనంతరం వచ్చిన స్నేహితులందర్ని పేరు పేరున పలకరించి క్షేమ సమాచారాలడిగి తెలుసుకున్నాడు విరాట్. తర్వాత ప్రస్తుత పరిస్థితి గురించి ధర్మతో కాస్సేపు చర్చించాడు.

‘‘సారీరా విరాట్ మధురైలో వూహించన సంఘటనలే జరిగాయి. ఇప్పటికైనా మహ దేవ నాయకర్ కి  నిజం తెలియాలని చెప్పాను. తెలీగానే ఆయన విలయ తాండవం చేస్తాడని వూహించలేదు. చాలామంది చనిపోవటం బాధగా వుంది’’ అన్నాడు ధర్మ.

‘‘అయిపోయిందాని గురించి ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఈ రోజు త్యాగరాజన్ ఇంటర్వూ చూసావా?’’

‘‘చూసాం లేరా వాడు చెప్పిన సమాధానాలన్ని అబద్దాలే. వాడిక్కడే వున్నాడు గాబట్టి సహస్ర విషయంలో నువ్వు మరింత కేర్ తీసుకోవాలి. మా గురించి నువ్వు టెన్షన్ పడాల్సింది లేదు. మీకు సాయంగా కొద్ది రోజులిక్కడ ఉండాలనే వచ్చాం. తెల్లవారు జామున సిటీలో ప్రవేశించి ఏదో హోటల్లో దిగి తర్వాత గోస్వామి కాలనీకొస్తాం’’ తన అభిప్రాయం చెప్పాడు ధర్మ.

‘‘తెల్లవారు జామున అంతగా పోలీస్ చెకింగ్ ఉండదు కాని మీరంతా గుంపుగా ఒకే హోటల్లో దిగటం మంచిది కాదు. ఓ పని చేయండి మీరు సైదాపేట ఆ పరిసరాల్లో మూడు నాలుగు హోటళ్ళలో విడి విడిగా గదులు తీసుకొని బస్సును గోస్వామి కాలనీ మనింటికి పంపించేయండి. డ్రయివరు అక్కడే ఉంటాడు. రోజు బస్ లో వచ్చి పికప్ చేసుకుంటాడు మిమ్మల్ని. త్యాగరాజన్ కేసు ప్రాథమిక విచారణకు సైదాపేట కోర్టుకే వస్తుంది. మీరూ ఆ ప్రాంతంలోనే ఉంటే సహస్ర రక్షణకి అందుబాటులో వుంటారు. ఏమంటారు?’’ అన్నాడు విరాట్. ఈ సలహా అందరికీ నచ్చింది.

‘‘ఏరా సహస్రని కార్ లోనే ఉంచేసినట్టున్నావ్. మాకు పరిచయం చేయవా?’’ అనడిగాడు నవ్వుతూ ధర్మ.

‘‘ఓ సారీరా. ఆ సంగతి చెప్పటం మర్చేపోయాను. సహస్ర ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తను ఇంటి దగ్గరే వుంది. ఇప్పుడు నాతో వచ్చింది విశాల’’ అన్నాడు విరాట్.

‘‘విశాలా..........’’ ఒకే సారి అరిచారంతా. విశాల గురించి ధర్మకి కూడ తెలీదు.

‘‘అవున్రా విశాల’’ అన్నాడు విరాట్.

‘‘తనెవరు?’’

‘‘చెప్తా’’ అంటూ వెళ్ళి కారు డోర్ తట్టాడు విరాట్.

డోర్ తెరిచింది విశాల.

‘‘వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. ఓసారి బయటికొస్తావా?’’ అడిగాడు.

కారు దిగింది విశాల.

అందరికీ నమస్కరించింది.

పుత్తడి బొమ్మలా వున్న విశాలను చూసి రెప్ప వాల్చటం మర్చిపోయారంతా.

‘‘ఈ అమ్మాయి పేరు విశాల. నా మేనత్త కూతురు. నాకు మరదలు.’’ పరిచయం చేసాడు. అలాగే తన మిత్రబృందాన్ని విశాలకి పరిచయం చేసాడు. ధర్మ మనుసులో ఏదీ దాచుకోడు డౌటు వస్తే వెంటనే అడిగేస్తాడు. కాస్త హాస్య ప్రియుడు కూడ.

‘‘ఏరా విరాట్ మహాలక్ష్మిలా మరదలుండగా నువ్వు సహస్రని లవ్ చేయటం ఏమిట్రా?’’ అని వెంటనే అడిగేశాడు.

‘‘ఏం చేయమంటావ్ రా. సహస్ర కూడ నాకు మహాలక్ష్మి లాగే కన్పించింది. ఇపుడూ పార్వతి సగం దేహమై ఉండగా శివుడు గంగను నెత్తికి ఎందుకెత్తుకున్నాడంటావ్? శ్రీవళ్ళి అమ్మవార్ని లవ్ చేసిన కూమార స్వామి దేవ సేనను ఎందుకు పెళ్ళి చేసుకున్నాడు? అలివేలుమంగను ప్రేమించిన ఆ వెంకన్న పద్మావతీ అమ్మవార్ని కాదనలేక పోయాడే......... కొన్నిటికి కారణాలుండవు ధర్మ. అలా జరిగిపోవాల్సిందే. చీకటి పడుతోంది మేం బయలుదేరతాం. ఫోన్ లో టచ్ లో ఉంటాలే’’ అంటూ కారెక్కేసాడు విరాట్. విశాల కారు స్టార్ట్ చేసింది. వెళ్ళిపోతున్న కారును ఆయోమయంగా చూస్తూ నిలబడి పోయారంతా.

కాస్సేపు అక్కడే వుంటే వాళ్ళేవో జోకులు పేల్చకుండా వదలరు. విశాలకి అలాంటివి నచ్చదు. అందుకే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు విరాట్. కాని అతడి సమాధానం మిత్రబృందాన్ని ఆయోమయంలో నెట్టేసింది.

‘‘నువ్వేమడిగావు వాడేం చెప్పాడు. శివుడంటాడు వెంకన్నంటన్నాడు ఏమన్నా సంబంధం వుందంటావా?’’ అన్నాడు ధర్మ పక్కనున్న చిన్నా.

‘‘ఉందిలేరా......... సూటిగా చెప్పటం ఇష్టంలేక మనోడు ఉపమానాలనతో సరిపెట్టి వెళ్ళిపోయాడు నాకర్ధమైంది ఏంటో తెలుసా?

’’‘‘ఏంటి.......... ఏంటీ?’’ ముక్త కంఠంతో అరిచారంతా.

‘‘వీడు మామూలోడు కాదురా బాబు. సహస్రని, విశాలని ఇద్దర్ని లవ్ చేస్తున్నాడు.’’ అన్నాడు ధర్మ పెద్దగా నవ్వుతూ.

అంతే...

ఆ.......... అంటూ తెరిచిన నోళ్ళు మూయటం మర్చిపోయారంతా. అప్పటికే విరాట్ విశాల ప్రయాణిస్తున్న కారు వీధి మలుపు తిరిగి అదృశ్యమైంది.

*************************

కీల్పాక్కం!

కీల్పాక్కం మెంటలాస్పత్రికి కూత వేటు దూరంలోనే చుట్టూ ఎత్తైయిన కాంపౌండ్ మధ్య మూడంతస్థుల పాత భవనం ఒకటుంది. కాస్త విసిరేసినట్టున్న మారుమూల ప్రాంతం అది. త్యాగరాజన్ కి గల అనేక భవంతుల్లో ఇది ఒకటి. పాత భవనంలా కన్పించినా లోపల అన్ని వసతులతో చాలా అధునాతనంగా కన్పిస్తుంది. ఎవరి దృష్టి ఇటు ఆకర్షించకుండా ఉండేందుకు అలా ఉంచబడిన్ది.

ఇక్కడ ప్రత్యేక కార్య కలాపాలంటూ ఏమీ జరగవు. మధురై నుండి పని మీద, తన స్టాఫ్ లో ముఖ్యులు గాని, తన కింద పనిచేసే వాళ్ళలో ముఖ్యులు గాని చెన్నై వస్తే బస చేయటానికి హోటళ్ళకి పోకుండా ఈ భవనం వసతి గృహంలా ఉపయోగపడుతోంది. దిగువ రెండస్థులు అందుకోసం వదిలేయగా పైన టెర్రస్ మీది విశాలమైన డబుల్ కాట్ బెడ్ ఎసితో అన్ని వసతులు కలిగిన ప్లాట్ వుంది. అది సగం వరకే ఉండగా మిగిలిన ఓపెన్ టెర్రస్ మీద చిన్నగార్డెన్ తో బాటు ఓపెన్ గా వుండి రిలాక్స్ గా కూచోడానికి అనువుగా తీర్చి దిద్దబడిరది. ఈ ప్లాట్ మాత్రం త్యాగరాజన్ పర్సనల్. ఇక్కడికి ఎవరికీ ప్రవేశం లేదు. అనుమతి లేకుండా ఎవరినీ పైకి రానీయరు.

ప్రస్తుతం త్యాగరాజన్ కీల్పాక్కం లోని ఆ ప్లాట్ లో వున్నాడు. ఈ సంగతి బయటి ఎవరికీ తెలీదు. ఇంటి వద్ద వుంటే మీడియా వాళ్ళు లేదా పోలీసులు ప్రశ్నలతో విసిగించేసే ప్రమాదాన్ని వూహించి తన మకాంని ఇక్కడికి మార్చుకున్నాడు.

అప్పటికి రాత్రి ఎనిమిది గంటలవుతోంది.

డిమ్ లైట్ల కాంతిలో ప్రశాంతంగా ఓపెన్ టెర్రస్ లో కూచుని మందు కొడుతున్నాడు త్యాగరాజన్. అతనికి ఎడంగా నలుగురు అనుచరులతో నిలబడున్నాడు ఎట్టయప్ప. మధురైలో అయితే త్యాగరాజన్ ఎదురుగా కూచొనేవాడు ఎట్టయప్ప. కాని ఇప్పుడున్న పరిస్థితిలో కూచోడానికి ధైర్యం చాలటం లేదు. సాయంకాలమే చెన్నైకి చేరుకున్నాడు. మధురై అల్లర్లలో భారీ నష్టమే జరిగింది. ఆపటం తన వల్ల కాలేదు.త్యాగరాజన్ నోరువిప్పి మాట్లాడలేదు. ఆ మౌనం అందరికీ ఇబ్బందిగా వుంది. గుండెల్లో దడపుట్టిస్తోంది. ముఖ్యంగా ఎట్టయప్ప తనకు అప్పగించిన ఏ పనిలో కూడ ఇంత వరకు అపజయమంటూ ఎరుగడు. అలాంటిది ధనగిరిని నమ్ముకొని లహరిని అంతం చేయటంలో ఫెయిలయ్యాడు. ఇక మధురై అల్లర్లలో విఫలమై పారిపోవటం రెండో విషయం. ఈ రెండు కారణాల వల్ల తనిప్పుడు యజమాని ముందు తల దించుకోవలసి వచ్చిందనే బాధ ఎట్టయప్ప గుండెల్లో ముల్లులా గుచ్చుతోంది. ఏమంటాడోనని గాభరా చెందుతున్నాడు.

కాని త్యాగరాజన్ ఎవరినీ ఏమీ అనలేదు.

చాలా సేపటి తర్వాత ‘‘దిష్టిబొమ్మల్లా అలా నిలబడకపోతే తలో పెగ్గు వేసుకుని పోయి భోంచేసి రావచ్చుగా వెళ్ళండి’’ అన్నాడు.ఎట్టయప్ప బాధగా చూసాడు.

‘‘క్షమించండి సార్......... ఓడిపోయాను. ఎస్టేట్ ను కాపాడలేక పోయాను. లహరిని చంపించలేక పోయాను. అసమర్ధుడిగా మిగిలిపోయాను.’’ అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

‘‘రేయ్ ఎట్టయప్పా ఎందుకురా బాధ పడతావ్. ప్రవాహమైతే ఏదో పది బస్తాల ఇసక మూటలు వేసి ఆపుతాం. అదే సునామి వస్తే ఎవరు ఆపగలరు? మధురై సంఘటన సునామి లాంటిది. నీ స్థానంలో ఎవరున్నా ఆపలేరు. ఇక లహరి విషయంలో నువ్వు నేను కూడ తప్పు చేసాం. ఎంతో అనుభవం వున్న ధనగిరి కూడ చావు దెబ్బ తినటం ఇది నిజంగా వాడి అసమర్ధతే. అంచేత ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిందాని గురించి కాదు. జరగ వలసిన దాని గురించి. అల్లర్లలో జరిగిన నష్టం మనకి పెద్ద నష్టం కాదు. కాని అసలు నష్టం లహరి బ్రతికుండటం. అందుకేం చేయాలో ఆలోచించి ప్లాన్ చేద్దాం. నాకు మీ మీద కోపం లేదు. అనవసంగా ఫీలవకండి’’ అన్నాడు.

‘‘థాంక్యూ సార్’’ అన్నాడు ఎట్టయప్ప. ‘‘ధనగిరి టచ్ లో ఉన్నాడా?’’ మరో పెగ్గు విస్కీ కలుపుకొంటూ అడిగాడు త్యాగరాజన్.‘‘ఉన్నాడు సర్, ప్రస్తుతం పాండీ బజార్ లోని హోటల్ నుంచి పరశువాక్కంలోని చంద్రా లాడ్జికి షిఫ్టయ్యాడు. ఎలాగైనా లహరి అడ్రసు తెలుసుకొని ఆమెను చంపించాకే తిరిగి మన ముందుకొస్తానంటున్నాడు.’’ చెప్పాడు ఎట్టయప్పన్.

‘‘వద్దు ఇక వాడ్ని నమ్ముకొని ప్రయోజనం లేదు. అయ్యవారొచ్చే దాకా అమావాస్య ఆగదు. ఎప్పటి పనులు అప్పుడు జరిగి పోవాలి. అవతల ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమీషన్ని ఎలాగో మేనేజ్ చేసాను. కానీ కమీషన్ కోరిన మరో మూడు మాసాల గడువును సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆరు మాసాలు పూర్తి కావస్తోంది. సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశిస్తే పరిస్థితి దారుణంగా వుంటుంది. ఇన్ని సమస్యల మధ్య ధనగిరి ఎప్పుడో ఏదో చేస్తానంటే ఇంకా నమ్మి కూచోలేం.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika