Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 జరిగినకథ: అందరూ మధురై లోని పామ్-గ్రోవ్  రిసార్ట్స్ కు చేరుకుంటారు.  కాటేజీలోనే  మేకప్ కానిచ్చి, ఆడిటోరియంకి వెళ్తారు చంద్రకళ, వాళ్ళ అమ్మగారు.  అప్పటికే,  ‘కళామంజరి’  వారి  గ్రీన్ రూమ్స్ లో,  ఫెస్టివల్ పార్టిసిపెంట్స్ – మరికొందరు వచ్చేస్తారు. . అందరి  కరతాళధ్వనుల నడుమ తన ప్రదర్శన ప్రారంభించి ఆఖరి ఐటంతో పాటు మంగళం చేసి,  ‘వేదిక’ మధ్యకి వెళ్లి,  సభకి నమస్కరిస్తుంది చంద్రకళ. ఆ తరువాత...

 

మరునాడు,  త్వరగా బ్రేక్ ఫాస్ట్  ముగించుకొని  తిరిగి  చెన్నై  ప్రయాణమయ్యాము.

ట్రైన్ వేగం పుంజుకున్నాక, అందరూ కబుర్లకి దిగారు.  మదురై  ప్రోగ్రాం  గురించి  పెద్దవాళ్ళు  చెప్పుకుంటున్న విషయాలు  వింటూ కూర్చున్నాను.

“మునపటి కన్నా  చంద్ర బాగా డాన్స్ చేసింది.  రాణి బాగా పాడింది కూడా.

వాళ్ళకీ  టాలెంట్ ఉండడంతో పాటు, మీలాంటి పేరెంట్స్ ఉండడం ఆ పిల్లల అదృష్టమే.

ముఖ్యంగా మా చంద్రకి శారద, సత్యదేవ్ గారు ఇచ్చే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు,” అంది మణత్తయ్య.

“నిజమే, కళలంటే ఎంతో ఆసక్తి ఉన్నవారే  చంద్రకళ  తల్లితండ్రులు.  అయితే, ఆసక్తి  ఉండీ,  అప్పట్లో   సినీరంగం  వదులుకున్నారంటే,  పాపం  సత్యగారు చాలా బాధపడుంటారు,”  అంది నీరూఆంటీ నాన్న గురించి..

నాన్న వంక  చూస్తే, నవ్వుతూనే మౌనంగా వింటున్నారు.

“మొన్ననే  అడుగుదామనుకున్నాను.  మీ అమ్మగారు, సినిమాల్లో యాక్ట్ చేయవద్దన్నారు  సరే.  మరి  మీరు  ఏమీ అనకుండా ఇలా మిలిటరీకి వెళ్లిపోయారా? ఎలా సత్యగారు?” అంది నీరూఆంటీ  నా పక్కన కూర్చున్న నాన్నతో

“ఏముందమ్మా? అప్పట్లో నాకు నా చెల్లెలు పెళ్ళి, తల్లితండ్రుల బాధ్యత ఉండేవి.  త్వరగా  ఉద్యోగస్తుడనై,  తమని ఆదుకుంటానని  ఎదురుచూస్తున్న కుటుంబం మాది.  నేను యాక్ట్ చేయవలసిన  సినిమాలేమో, సెట్స్ మీదకి వెళ్ళడానికి యేడాది పడుతుందని తెలిసింది.  అదంతా తట్టుకుని నిలబడగల ఆర్ధిక స్తోమత లేక, మా అమ్మ మాట  సరయినదనిపించి,

మిలిటిరీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నాకు స్థిరత్వాన్ని ఇచ్చింది ఆ నిర్ణయమే మరి...మీ ఆయనలా లక్ష్మీ పుత్రుడని కానయ్యే,”  నవ్వుతూ ముగించారు నాన్న.

ఇదంతా వింటున్న అంకుల్ అందుకున్నారు...

“ఏమైనా, తను చెన్నై నుండి వెళ్ళే ముందు మాత్రం, నన్ను తీసుకెళ్ళి ఆ  సినిమాల  డైరెక్టర్స్ కి  పరిచయం  చేసాడు  సత్యం.  మంచి  యాక్టరునని  సిఫారసు  చేసి,  మేకప్ టెస్ట్ కూడా చేయించి,  తనకున్న అవకాశాల్ని  నా  చేతికందించాడు  నా  ఈ మిత్రుడు,”  క్షణమాగారాయన.  “సత్యం చొరవ చేసుండకపోతే,  ఎటూ కాకుండా అయ్యేవాడిని.  ఎందుకంటే, అప్పట్లో  నాకటు  పైచదువుల  మీద  ఆసక్తి  గాని,  ఇటు వ్యవసాయంపై  మక్కువ  గాని  ఉండేవికావు.  సత్యం  చేసిన  మేలు  ఎప్పటికీ  మరువలేను,”  ఆసక్తిగా వింటున్న మా అందరి  వంక  చూసారు, భూషణ్  అంకుల్........

“సినిమారంగం  కాకపోతేనేమి?  మా సత్యం - మేజర్. సత్యదేవ్ గా సెటిల్ అయ్యాడు.  తనూ మంచి  పొజిషన్ లో ఉన్నాడు.  మీకు తెలుసో లేదో?.  ఆంధ్ర రాష్ట్రంలో మేజర్ ఒక్కడే ఇటూ మిలిటరీలోనూ,  అటు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూశాఖలో ఆఫీసరుగానూ చక్రం తిప్పుతున్నాడుగా,”  అన్నారు  మళ్ళీ  ఆయన......

“అదెలా సాధ్యం?” అడిగింది నీరూఆంటీ.

“ఆయన్నే అడుగు,” అన్నారు అంకుల్...

అందరం నాన్న వంక చూసాము.

“ఇండియన్  ఆర్మీ నన్ను సెలెక్ట్  చేసి  రిజర్వ్డ్  సర్విస్ లో ఉంచింది.  వాళ్ళ  అవసరాన్ని  బట్టి  ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.  మిగతా సమయంలో ఆంధ్రరాష్ట్రంలో  డైరెక్ట్ రిక్రూట్ - గెజటెడ్ ఆఫీసరుగా సర్వీస్ చేస్తాను.  ఆంధ్రరాష్ట్ర  ప్రభుత్వంకి, ఆర్మీకి మధ్యన, నా విషయంలో  ఉన్న అవగహన  అది.  ఏమైనా, పెద్దగా  లక్ష్మీకటాక్షం  లేకపోయినా, పొజిషన్ బాగుంటుంది,” అంటూ నవ్వారు నాన్న. 

‘మా నాన్న అలా ఉద్యోగంలో కూడా  స్పెషల్ అన్నమాట,’ గర్వంగా అనిపించింది.  రెండు ఉన్నత  స్థాయి  ఉద్యోగాలు ఎలా  సాధ్యమో,  అర్ధమయ్యేలా  చెప్పమని  నాన్నని  అడగాలి.

ఇంతలో  రాంమామయ్య,  “సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా...మా చెల్లెలు శారద కూడా  ఏమీ  తక్కువది కాదు.  అందమైనది.  పద్ధతి,  సంప్రదాయాల  నడుమ  పెరిగి,  గ్రాడ్యుయేట్  అయింది.  నాట్యం, సంగీతం నేర్చుకొని  కర్ణాటక  సంగీతంలో  పట్టా  పుచ్చుకొంది.  సంగీతం గురువుగా పేరు ప్రతిష్ట సంపాదించింది మరి,”  అన్నారు.

“అబ్బో ఇంక  పోటీ  కొచ్చేసారు  ఆడపిల్లవారు,” అంటూ నవ్వేశారు అందరూ.

“నిజమే కదా !  శారదకి  విద్య, తెలివి, ఓర్పు, నేర్పు ఉండబట్టే, ఓ తల్లిగా  చంద్రకళని ఇలా సపోర్ట్  చేయగలుగుతుంది.  ఇంత చిన్నవయస్సులోనే ఆ అమ్మాయి ఇంత సాధించగలగడం కేవలం ఆ తల్లి వల్లే..  తన బిడ్డని సాన పెట్టిన వజ్రంగా మలచగలదు,”  మళ్ళీ రాంమామయ్య.

అమ్మ సంగతి అలా వింటుంటే, నాకు దుఃఖమొచ్చింది.  అటువంటి అమ్మ నాకు అమ్మవడం నా అదృష్టమే....‘ఐ యాం బ్లెస్డ్’  అనుకున్నాను...

ఈలోగా, అమ్మ ఒకసారి, వద్దంటున్నా జగదీష్ ఒకసారి, నా పాదానికి  డాక్టర్ ఇచ్చిన  ‘బెంగే క్రీం’  రాసి కట్టు కట్టారు.

కథలు, కబుర్లతో సాగిన మా జర్నీ...ముగిసి, ఇల్లు  చేరేప్పటికి  అర్ధరాత్రి దాటింది.

**

మరునాడు నేను నిద్ర లేవకముందే,  నాన్న డ్యూటీకి వెళ్ళి పోయారు.

ఇంట్లో సందడిగా ఉన్నా, నాన్నని  పొద్దున్న  చూడకపోవడం  నన్ను బాధపెట్టింది.  నాకు తెలిసి నాన్నతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చెయ్యకపోవడం ఇదే మొదటిసారి.....

**

రోజూకంటే ఆలస్యంగా, చీకటి పడ్డాక వచ్చారు నాన్న.  వెళ్లి పక్కన కూర్చున్నాను.  “నాన్నా, ఇవాళ  పొద్దుట డ్యూటికి వెళ్లేముందు నన్ను నిద్ర లేపవచ్చుగా.  చెప్పకుండా అలా వెళ్ళావెందుకు?” అడిగాను.

“అలిసిపోయి నిద్రపోతున్నవుగా! అందుకని,” అన్నారు నవ్వుతూ.

సిటింగ్ లో ఉన్న మా అందరికీ అమ్మ స్నాక్స్, కాఫీ అందిస్తుండగా, డోర్ బెల్ మోగింది.

కామాక్షి డోర్ తెరిచింది.

ఇ యామ్ హియర్,” అంటూ సప్రైజ్  చేసింది రాణి.  వెంట వాళ్ళ సర్వెంట్ బాయ్ కూడా ఉన్నాడు.

“నమస్తే ఆంటీ, అంకుల్,” అంటూ అందర్నీ విష్ చేసింది.   

మాకు ‘హలో’ చెప్పింది.

“మణిఆంటీ, నేను  మీకోసం  వంట  చేయించాను.  జగదీష్ కి  ఫిష్,  రాంఅంకుల్ కి మటన్.

శారదా ఆంటీకి, మీకు కొబ్బరి పచ్చడి.  అమ్మేమో సత్యఅంకుల్ కి చికెన్ రైస్ చేసింది,” అంటూ,  అమ్మ వంక తిరిగి, “ఇవన్నీ డైనింగ్ మీద పెట్టించనా?”  అడిగింది రాణి.

“అయ్యో, ఏమిటమ్మా ఇంత శ్రమ పడ్డారు?” అంటూ ఆ డిషెస్ ని తీసుకొని టేబిల్ మీదకి సర్దసాగింది  అమ్మ.

“నిజానికి, భోజనం టైం కదా భోంచేయండి.  స్నాక్స్ పక్కకి ఉంచండి.  అన్నీ వేడిగా ఉన్నాయని అమ్మ చెప్పమంది.  నేను తినే వచ్చాను కాబట్టి సర్వ్ చేస్తాను...” అంది రాణి.

అందరు భోజనానికి కూర్చోక తప్పలేదు.

**

“అన్నీ చాలా బాగున్నాయమ్మా.  మాకేమేమి ఇష్టమో, కనుక్కుని మరీ చేయించావు.  నేనూ, శారద కూడా అన్నమంతా కొబ్బరి పచ్చడితోనే తినేస్తున్నాము, చూస్తున్నావుగా!” రాణి తో అంటూ భోజనం ముగించింది అత్తయ్య.

“మణిఆంటీ, మరి  రేపటి నుంచి  మీరు మా అతిధులుగా మా ఇంట్లో ఉంటారుగా! నేను, అమ్మా మీ కోసం అన్నీ రెడీ చేయించాము,” అంది రాణి మణత్తతో.

అత్తయ్య ఏమీ మాట్లాడలేదు.  ఆమె మామయ్యా వంక చూసింది.  జగదీష్ మా వంక చూసాడు.

“తప్పకుండానమ్మా,  ఇప్పటి వరకు ప్రయాణాలు,  ప్రోగ్రాములే కదా.  ఇదిగో ఇప్పుడే  ఇలా కూర్చున్నాము.  రేపు, ఎల్లుండి తిరుపతి వెళ్లి వచ్చిన తరువాత, చెపుతామమ్మా రాణి,” ,

“సరేనా?”  అన్నారు మామయ్య భోజనం ముగించి, నాన్నతో పాటు డైనింగ్ నుండి లేస్తూ...

అందరి భోజనాలయి మళ్ళీ లివింగ్ రూంలో చేరాము.

“నాకు ప్రామిస్ చేసాడు జగదీష్.  మణిఆంటీ  కూడా చెప్పింది మా ఇంట్లో ఉంటామని.   మీరు వస్తారని మేమెంతో ప్రిపేర్  అయ్యి ఉన్నాము.  డిజపాయింట్  చేయకండి  అంకుల్,” అంది రాణి.

“తప్పకుండా వస్తాము రాణి,  రేపు చెపుతానుగా,” అంది మణత్తయ్య.

...రాణి ఇంకాసేపు కూర్చుని  వెళ్ళింది.

**

“ఓ గ్లాసుడు మంచి నీళ్ళు తెచ్చిపెట్టమ్మా కళా,” అన్నారు నాన్న. లేచి వెళ్ళి తెచ్చిచ్చాను.

“ఇలా కూర్చో,  అమ్మతో పాటు.  నీక్కూడా ఈ విషయం చెప్పాలి,” అన్నారు నాన్న.

ఏమి సంగతో అనుకుంటూ, ఎదురుగా మోడా మీద కూర్చున్నాను.  పక్కనే ఉన్న అమ్మ కూడా వింటుంది.

“నన్ను ఓ ఆరునెలల పాటు ‘భూటాన్’ కి పంపుతామని, పొద్దున్నే మా హెడ్క్వార్టర్స్ నుంచి  ఇంటిమేషన్  వచ్చింది.  నేను, ఆర్టిలరీ, రైఫల్  షూటింగుల్లో ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తానుగా!  ఇప్పుడు భూటాన్ లో కూడా క్యాంప్,  ట్రైనింగ్ సెటప్  చెయ్యాలి.,.  వచ్చే వారం వెళ్ళి మార్చి మొదట్లో వచ్చేస్తాను,”  అన్నారు నాన్న.

అమ్మ ఉలిక్కిపడింది.   నాకు ఒక్క సారిగా ఏడుపొచ్చేసింది.  ‘నాన్నని వదిలి ఎలా ఉంటాము?’ అంటూ తోచకుండా  అయిపోయాను.

“డాడీ,  నేనూ వస్తా,”  అంటూ వెళ్లి నాన్న పక్కనే కూర్చున్నాడు వినోద్.

“ఈ అసైన్మెంట్  ఉంటదని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నదే.  మరి తప్పదుగా,” అన్నారు నాన్న మళ్ళీ. అందరం ఏమనకుండా వింటున్నాము,,,

“ఏమ్మా, దిగులేమీ వద్దు. ఏం పర్వాలేదు,  ఆరు నెలలేగా! నీ డాన్స్ ప్రాక్టీసుల్లో నీవు బిజీగానే ఉంటావు.  నేను ఇంట్లో లేనని గుర్తుండదులే,” అన్నారు  నావంక చూస్తూ.

లేచి వెళ్ళి నాన్న చైర్ ఆర్మ్ మీద కూర్చున్నాను.

అంతా వింటున్న రాంమామయ్యా,  “అయితే, నాట్ మచ్ టైం, పనులుంటాయిగా.  కానివ్వండి శారదా,” అన్నారు.

“మీరు ఏం బెంగపెట్టుకోకండి అన్నగారు.  శారదా,  పిల్లలు డిసెంబర్ సెలవల్లో మా వద్దకు వస్తారులెండి,”  అంది అత్తయ్య.

“లేదంటే, మేమే ఇక్కడికి వస్తాము,”  అన్నాడు జగదీష్.

“డిసెంబర్ సంగతి అలాగే ప్లాన్ చేద్దాము.  ఇకపోతే,  రేపు పొద్దున్నే మేము ముగ్గరం తిరుపతికి వెళ్లి,  ఎల్లుండి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాము.  ఆ తరువాత రెండురోజులు భూషణ్ వాళ్ళ ఇంటికి వెళతాము,” తమ ప్లాన్ వివరించారు మామయ్య.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery