Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 జరిగినకథ:   ప్రతిమ నుండి వచ్చిన ఫోన్ కాల్స్ కి, మెసేజ్ల కు అభిరాం రెస్పాన్స్  ఇవ్వడు. తన ఫ్రెండ్ కృష్ణ , ప్రతిమను ప్రేమించడం వల్లే నీకిలా జరిగిందని, తనని మర్చిపొమ్మని సలహా ఇస్తాడు. తను లేకుండా వుండలేనని అభిరాం తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. మరుసటిరోజు ప్రతిమను కలుసుకుని జరిగిన విషయమేమీ తనతో చెప్పకుండా, బైక్ పై వస్తుండగా ఆక్సిడెంట్ అయిందని చెప్తాడు. ఆ తరువాత..    

 

‘‘వనజ నంబరనుకుని మీరు నా నంబర్‌కే కదా చేసారు. మీ ఫ్రెండ్‌ నంబర్‌ కోసం నేనూ ట్రయ్‌ చేస్తాను. దొరికితే మంచిదే కదా!’’

‘‘థాంక్సండీ...’’ ఫోన్‌ పెట్టేసింది తను.

ఆ రోజంతా నంబర్‌ గేమ్‌లో పడి కొట్టుకుంటున్నాడు అభిరామ్‌. తన సెల్‌ నంబర్‌ చివరి అయిదంకెల్ని మార్చి మార్చి కొడుతూ ...అవతలివారి పేర్లు తెలుసుకుంటున్నాడు. ఒక్క నంబర్‌ టాలీ కావడం లేదు. వనజ అనే శాల్తీ జాడ తెలీడం లేదు. ఏదో తనకు ఓదార్పుగా ఆ సజెషన్‌ ఇచ్చాడే కానీ...అది వర్కవుట్‌ అవుతుందనే నమ్మకం తనకు లేదు. అంకెల సముద్రంలో పీకల్లోతు మునిగిపోయినా...ఆ అమ్మాయి ఫ్రెండ్‌ ఆచూకీ అందుకోవడం కష్టమే.

‘‘ఔనూ...అసలు వనజ కోసం తనెందుకు వెతుకుతున్నాడు... అర్ధం లేని ఈ వెర్రిపని తనెందుకు చేస్తున్నాడు?’’ ఆలోచిస్తే వచ్చిన అంతా వయసు మహిమ అన్న ఆన్సర్‌ వచ్చింది. అదీ నిజమే! వయసు పిచ్చెక్కిస్తుంది. మనసుని వెర్రెక్కిస్తుంది. మాటిమాటికీ అద్దంలో ముఖాన్ని చూసుకోమంటూ పురమాయిస్తుంది.

‘‘ఇంతకీ ఆ అమ్మాయికి వనజ ఫోన్‌ నంబర్‌ దొరికిందా?’’ ఆరా తీయాలనిపించింది. ఆ విషయం తెలుసుకోవాలంటే ఫోన్‌ చేయాలి. ఫోన్‌ చేస్తే తనేమనుకుంటుంది? ఆమె ఫోన్‌ చేస్తే తనేమైనా అనుకున్నాడా...లేదే?  ఫ్రెండ్‌ నంబరనుకుని ఫోన్‌ చేసింది. కానీ, తనో? ఆమెతో మాట్లాడేందుకే ఫోన్‌ చేయాలి...ఆ సంగతి ఫోన్‌ చేసే తనకూ...రిసీవ్‌ చేసుకునే ఆ అమ్మాయికీ తెలిసిన విషయమే. అందుకే...తప్పు పడుతుందేమోనని చిన్నపాటి సంకోచంలో పడ్డాడు అభిరామ్‌. ఆ ఊగిసలాటలోనే సాయంత్రం దాకా గడిపాడు. ఆఖరికి...ఆమె నంబర్‌కి కాల్‌ చేసాడు.

‘వన్‌ఫోర్‌త్రీ...’ చివరి నంబర్లు నొక్కుతుంటే హృదయంలో చిన్నపాటి కలవరం. ఆ మూడు వరుస నంబర్ల ఆకర్షణే అంత. ప్రపంచంలోని ప్రేమనంతా ఒడిసిపట్టుకున్నట్లు తెగ ఫోజు కొడ్తుంటాయి.

‘‘హలో...ఎవరూ?’’ అట్నుంచి ఆమె.

‘‘నేనండీ...’’

‘‘నేనంటే...’’ కొంటెగా నవ్వుతూ మరో ప్రశ్న ఆమెనుంచే.

‘‘నేనంటే...ఉదయం మీరు నాకు ఫోన్‌ చేసారుగా...’’

‘‘చేస్తే...’’

ఆ స్పందనకు ఎలా ప్రతిస్పందించాలో అర్ధం కాలేదు అభిరామ్‌కి.

‘‘ఊ...చేస్తే! చెప్పండి’’ రెట్టించి మరీ అడుగుతోంది తను.

‘‘అదే...మీ ఫ్రెండ్‌ వనజ నంబర్‌ దొరికిందో లేదోననే...’’

‘‘మీకెందుకు ఆత్రుత?’’

‘‘మీ ఫ్రెండ్‌కోసం నానా హైరానా పడ్డారు కదండీ’’

‘‘ఔను...అర్జంట్‌ మేటరొకటి కమ్యూనికేట్‌ చేయాలని ఎంతగానో తపన పడ్డాను. తను ఫ్రెండ్‌ కాబట్టి...’’

‘‘సర్లెండి. ఏదో మార్నింగ్‌ కాల్‌ చేసారు కదాని...మళ్లీ కాల్‌ చేసి అప్‌డేట్‌ తెలుసుకుందామనుకున్నాను...’’

‘‘అప్‌డేట్‌ కోసం కాదు...ఆడపిల్ల మాట్లాడింది కదా! మరోసారి మాట్లాడాలనీ’’

దొంగతనం దొరికిపోయింది. ఇక, చెప్పేందుకు సమాధానమే లేదు. అందుకే, అభిరామ్‌ కాల్‌ కట్‌ చేసాడు. ఆ వెంటనే అట్నుంచీ మళ్లీ కాల్‌ వచ్చింది. ‘వద్దువద్ద’నుకుంటూనే ఫోన్‌ లిఫ్ట్‌ చేసాడు.

‘‘ఏం...కాల్‌ కట్‌ చేసారు?’’

‘‘నా ఫోన్‌...నా కాల్‌ ...నా ఇష్టం’’ అన్నాడు అభిరామ్‌

‘‘అదిగో...మీరు ఉడుక్కుంటున్నారు...’’ రెచ్చగొట్టింది తను.

‘‘లేదు...లేదు. ఒక్క విషయం చెప్పండి. నా వైల్డ్‌ గెస్‌ వర్కవుటైందా?’’

‘‘వర్కవుట్‌ కాలేదు. ఫోన్‌ నంబర్లు అలా ఎవరైనా వెతుక్కుంటారా? అయినా, మా వనజ నంబర్‌ దొరికింది’’

‘‘అదెలా?’’

‘‘మరో ఫ్రెండ్‌కి కాల్‌ చేస్తే తనిచ్చింది...’’

‘‘ఎలాగైతేనేం...మీ ఫ్రెండ్‌ మీకు దొరికింది’’ అన్నాడు అభిరామ్‌. ఆ తర్వాతి మాటల కోసం ఇద్దరూ తడబడ్డారు.  ‘చిన్నప్పట్నుంచి నేర్చుకున్న అమ్మ భాష ఈ అమ్మాయి దగ్గర అక్కరకు రాకుండా పోయింది...’’ బాధగా అనుకున్నాడు అభిరామ్‌.

‘‘ఊ...ఇంకా!’ అంది తను.

అదేమాటని రిపీట్‌ చేసాడతడు.

‘‘చెప్పండి...’’

‘‘ఏం చెప్పను?’’

అటు తను, ఇటు అతను సెల్‌ఫోన్లకి చెవులప్పగించి సైలెంట్‌గా ఉండిపోయారు. కొన్నిసార్లు పెదవులనుంచి వచ్చే మాటల కన్నా మౌనమే మాట్లాడుతుంది.

ఆ తర్వాత కూడా చాలాసార్లు ‘మిస్‌డ్‌ కాల్స్‌’తో ఒకర్నొకరు పలకరించుకునేవాళ్లు. పొరపాటున ఒక్కోసారి ఎవరైనా ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే...మాట్లాడకుండా మౌనాన్నాశ్రయించేవాళ్లు. నిశబ్ధంగా అలా ఉండిపోతే...వెచ్చని ఊపిరులే గుసగుసలాడేవి. ప్రాణవాయువు పంపే ప్రణయ సందేశమనుకునేవాళ్లు.

ఓరోజు`

‘‘నేనొకటి అడగనా?’’ అన్నాడు అభిరామ్‌.

‘‘ఆ ఒక్కటీ తప్ప...’’

‘‘ఏ ఒక్కటీ...’’ అడగాలనిపించినా అడగలేకపోయాడు. ఆడవాళ్ల మాటల్లో వెతికిన కొద్దీ వేనవేల అర్ధాలుంటాయి. అందులో ఏ అర్ధంతో ఏది అడగవద్దని ఆంక్షలు విధించిందో అర్ధం చేసుకోలేకపోయాడు.

‘‘అడగండి..ఏదో అడగాలనుకున్నారు కదా!’’

‘‘ఇన్నాళ్లూ మూగగా మాట్లాడుకుంటున్నాం కదా!’’

‘‘అయితే...’’

‘‘మిమ్మల్ని ఏమని పిలవాలా? అని ఆలోచిస్తున్నాను’’

‘‘అంటే...నా పేరు తెలుసుకోవాలనుందా?’’

‘‘ఔను...మీ పేరేంటీ?’’

‘‘అడగ్గానే అంత తొందరగా చెప్పేస్తే ఎలా?’’ అంది ఉడికిస్తూ.

‘‘ప్లీజ్‌..చెప్పండి. నా స్వర నేస్తం పేరేంటో తెలుసుకోవాలని మనసు ఒక్కటే ఉవ్విళ్ళూరుతోంది’’

‘‘స్వరరాణి...అనే పిలవండి’’ అంది సమాధానంగా ఆమె.

‘‘అంతేనా?’’

‘‘అంతే!’’ ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా ఆమె నుంచి అదే జవాబు వచ్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ పరిచయం పెరుగుతూ వచ్చింది.‘‘నా పేరు తెలుసుకోవాలనుందా?’’ అడిగిందోసారి.

‘‘చెప్తే...’’

‘‘సరే...అందమైన ఆకృతిని. శిలతోనో..ఏ లోహంతోనో చేసిన రూపాన్ని. ముద్దుగా మూడక్షరాల పేరున్నదాన్ని. కనుక్కోండి’’ పజిల్‌ ఇచ్చింది తను. ఆ క్లూ ఆధారంగా అభిరామ్‌ ఆమె పేరు తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు.  శిలను మలిస్తే శిల్పం. లోహంతో చేస్తే...లోహమూర్తి. శిల్ప...రెండక్షరాల పేరు. లోహమూర్తి...అసలు ఆడపేరుకాదు. మార్కెట్లో పేర్ల పుస్తకాలు, ఇంటర్నెట్‌ గూగుల్‌లో సెర్చ్‌లు ఎడతెరపిలేకుండా చేసాడు.

ఆఖరికి...ఓ అర్ధరాత్రివేళలో ‘ప్రతిమ..’ అనే మూడక్షరాలు అతడి మదిలో మెదిలాయి.

‘‘ప్ర...తి...మ! నైస్‌ నేమ్‌’’ అనుకున్నాడు. ఆ అర్ధరాత్రే ఫోన్‌ చేసి ఆమె నిద్రలేపి మరీ తను కనుక్కున్నది నిజమో...కాదో తేల్చుకోవాలనుకున్నాడు  అభిరామ్‌. అయితే, ఆ సమయంలో ఫోన్‌ చేసేందుకు అతడి సంస్కారం అడ్డొచ్చింది. ఆ రాత్రి...ఎంతకీ నిద్రపట్టక బాల్కనీలోకొచ్చి నీలాకాశాన్ని వెలిగిస్తున్న నక్షత్రాల్ని చూస్తూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? అని నిరీక్షించాడు.

తూరుపు అరుణరాగరంజితమైన కాసేపటికి ఓ సూర్య కిరణం ఇంటితట్టడం ఆలస్యం...సెల్‌ఫోన్‌ చేతుల్లోకి తీసుకున్నాడతడు.కాల్‌ చేసాడు. చేస్తూనే ఉన్నాడు. క్షణాలు, నిముషాలై గంటలుగా మారుతున్నా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఆ ఒక్క రోజే కాదు...వరుసగా పదిరోజులు ఫోన్‌ లిఫ్ట్‌ చేయనే లేదు.

నంబర్‌ మార్చిందా? లేక, ఫోన్‌ పోగొట్టుకుందా? ఏం జరిగి ఉంటుంది? అభిరామ్‌ మనసు మనసులో లేదు. అనుకోని అతిథిలా వచ్చింది. ‘హలో...!’ అంటూ పలకరించింది. కొన్నాళ్లు మౌనంతో, మరికొన్నాళ్లు మాటల్తో గుండెగూటికి సంబరాల్నే తెచ్చింది.  అప్పుడప్పుడూ ఫోన్‌లో వినిపించిన  ఊపిరి సవ్వళ్లు ఇప్పటికీ ఆమెని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఒక్కోసారి మువ్వలా గలగలా నవ్వులు రువ్వేది. ఒక్కోసారి ఆట పట్టించేది. పొద్దున్నే ఓ ‘గుడ్‌ మార్నింగ్‌’, సాయంత్రం ఓ ‘గుడ్‌ ఈవినింగ్‌’, రాత్రుళ్లు ‘ గుడ్‌నైట్‌’ ఆమె చెప్తుండేది. మధ్య మధ్య ఎన్నో విశేషాలు చెప్పేది. అవన్నీ ఒక్కసారి శూన్యమయ్యేసరికి...పొద్దు గడవడం లేదు అభిరామ్‌కి.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్