Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

ఇక అలాంటి సీన్స్‌ చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యా!  - అల్ల‌రి న‌రేష్‌

రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర‌వాత కామెడీ క‌థానాయ‌కుడి కుర్చీలో కూర్చున్న కుర్రాడు... అల్ల‌రి న‌రేష్‌.  కిత‌కిత‌లు పెట్టించే క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయ్యాడు. న‌రేష్ అంటే మినిమం గ్యారెంటీ హీరో!  అత‌ని సినిమా థియేట‌ర్‌లో ఓసారి చూడాల‌నిపిస్తుంది. ఇంట్లో టీవీలో అయితే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తాయి. అందుకే న‌రేష్ సినిమాకి శాటిలైట్ కూడా భ‌లేగా గిట్టుబాట‌వుతుంది. ఈ న‌మ్మ‌కంతోనే న‌రేష్‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డుతుంటారు. అయితే గ‌త కొంత‌కాలంగా న‌రేష్ ఖాతాలో హిట్టే లేదు. ఓ విజ‌యం కోసం న‌రేష్ చేయ‌ని ప్ర‌య‌త్నాలూ లేవు. మ‌ధ్య మ‌ధ్య‌లో చేసిన ప్రయోగాలు బెడ‌సికొట్ట‌డంతో .. ఈసారి త‌న‌దైన మార్క్ వినోదంతో న‌వ్వులు పంచ‌డానికి సిద్ధ‌మైపోయాడు. నరేష్ న‌టించిన తాజా చిత్రం జేమ్స్‌బాండ్‌. ఈ శుక్ర‌వారం థియేట‌ర్లో సంద‌డి చేయ‌బోతోంది. ఈసంద‌ర్భంగా న‌రేష్ పంచుకొన్న క‌బుర్లు ఇవీ.
 

* హాయండీ.. ఎలా ఉన్నారు..

- కాస్త టెన్ష‌న్ టెన్ష‌న్‌గా ఉన్నా...

* ఎందుక‌ట‌...

- జేమ్స్ బాండ్ రిలీజ్ ఉంది క‌దా.  ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారా అన్న టెన్ష‌న్ ఉంటుంది క‌దా.. అందుకు!

* మొత్తానికి బాహుబ‌లికి పోటీ ఇస్తున్నారు క‌దా.. 

- అయ్యో అంత మాట అన‌కండి. రెండింటికీ పోలికేంటి?  అది బాహుబ‌లి అయితే, ఇది భ‌ర్త బ‌లి.. అదొక్క‌టే పోలిక‌

* భ‌ర్త బ‌లా.. అదెలా?

- సాధార‌ణంగా అమ్మాయిల్ని పువ్వుల్తో పోలుస్తుంటారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ని మాత్రం బుల్లెట్ తో పోల్చాలి. అంత ర‌ఫ్ఫ‌న్న‌మాట‌. అలాంటి అమ్మాయిని నాలాంటి ఓ సాఫ్ట్ గా ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకొంటే భ‌ర్త బ‌లి అనే క‌దా అనాల్సింది..

* కిత‌కిత‌లు టైపు క‌థ‌న్న‌మాట‌..

- అలా నాతో క‌మిట్ చేయించ‌కండి. దాంతో ఈ సినిమాకి పోలిక లేదు.  బ‌క్క మొగుడు బండ పెళ్లాం క‌థ అది. జేమ్స్ బాండ్ రూటే సెప‌రేటుగా ఉంటుంది.
 

* జేమ్స్ బాండ్ ఈ టైటిల్ ఈ క‌థ‌కు ఎలా మ్యాచ్ అయ్యింది?

- జేమ్స్ బాండ్ అనేది సినిమా పేరు కాదు, క్యారెక్ట‌ర్ పేరు. అలాంటి క్యారెక్ట‌రే ఈ సినిమాలో హీరోయిన్‌ది. పిల్ల‌ల‌కూ పెద్ద‌వాళ్ల‌కూ తేలిగ్గా అర్థ‌మైపోతుంది క‌దా అని ఆ పేరు పెట్టాం. అంత‌కు ముందు అబ్బాయి అక్కినేని - అమ్మాయి నంద‌మూరి అనే పేరు కూడా చ‌ర్చ‌ల‌కు వ‌చ్చింది. పెద్ద హీరోల‌తో పెట్టుకోవ‌డం ఎందుకులే రిస్కు.. అని జేమ్స్ బాండ్‌తో స‌ర్దుకొన్నాం.

* గ‌త సినిమాల్లో కామెడీ పంచ్ కాస్త త‌గ్గింది. ఈ సినిమాలో లెక్క స‌రిచేస్తారా?

- ఫుల్లుగా. మీర‌న్న‌ట్టు నా నుంచి వ‌చ్చిన కొన్ని సినిమాలు ఈమ‌ధ్య నిరాశ ప‌రిచాయి. న‌రేష్ సినిమా అంటేనే కామెడీ అని జ‌నం అనుకొంటున్నారు. ఈ ద‌శ‌లో వాళ్ల‌కు కావ‌ల్సింది ఇవ్వ‌డ‌మే నా ధ‌ర్మం. పంచ్‌లు కోరుకొంటున్నార‌ని ప్ర‌తీదానికీ పంచ్ వేయ‌లేదు.. అవీ ఉంటాయి.. స‌న్నివేశానికి త‌గిన‌ట్టు వినోదం ఉంటుంది. మొత్తానికి థియేట‌ర్లో ఆడియ‌న్స్ అంతా న‌వ్వుకొంటూ ఇళ్ల‌కు వెళ్ల‌డం ఖాయం.

* జ‌బ‌ర్‌ద‌స్త్‌లాంటి షోల వ‌ల్ల కామెడీ ఇంటింటికీ చేరిపోతోంది. ఈ ద‌శ‌లో ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డం ఇంకాస్త క‌ష్ట‌మైన‌ట్టు అనిపించ‌డం లేదా?

- న‌వ్వించ‌డం ఎప్పుడూ క‌ష్ట‌మేనండీ. అందుకోసం కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తుండాలి. ఎప్పుడూ ఒకే దారిన వెళ్తే బోర్ కొట్టేస్తుంటుంది. అంతెందుకూ.. మీరు చెప్పిన జ‌బ‌ర్‌ద‌స్త్ పోగ్రాం మొద‌ట్లో చాలా బాగుండేది. రాను రాను కాస్త మొనాటినీ వ‌చ్చేసింది. సినిమాల కాన్వాస్ వేరు. టీవీలో ఎన్ని పోగ్రాంలు చూసినా, థియేట‌ర్‌కి వ‌చ్చి న‌వ్వుకోవ‌డంలో ఆ కిక్కే వేరు.

* న‌రేష్  కేవ‌లం స్నూఫ్‌ల‌తో బండి లాగించేస్తున్నాడంటున్నారు.. 

- సుడిగాడులో స్నూఫ్‌లు ఆ రేంజులో చూపించాం మ‌రి. ఆ త‌ర‌వాత అలాంటి స‌న్నివేశాలు చేయకూడ‌ద‌ని గ‌ట్టిగా అనుకొన్నా. కానీ.. కొన్ని సినిమాల్లో చేయక త‌ప్ప‌లేదు.  అస్త‌మానూ నేను స్నూఫ్‌లు చేస్తూ కూర్చుంటే జ‌నం చూడ‌రు. ఇలా ఎన్ని చూడ‌మంటావ్‌?  అని ఆడియ‌న్సే అడుగుతారు. అందుకే ప్ర‌స్తుతానికి నేను స్నూఫ్‌ల జోలికి వెళ్ల‌డం లేదు.

* స్నూఫ్‌లేనా.. ప్ర‌యోగాలూ మానేస్తారా?

- ల‌డ్డూబాబు నా దృష్టిలో ప్ర‌యోగమే అది బెడ‌సికొట్టింది. సో.. కొంత‌కాలం ప్ర‌యోగాలు కూడా వ‌ద్దు. నా త‌ర‌హా కామెడీ క‌థ‌లే ఎంచుకొంటా.

* ల‌డ్డూబాబు ఫ్లాప్ బాధించిందా?

- ఏ ఫ్లాప్ అయినా.. బాధ‌పెడుతుంది. కానీ ల‌డ్డూబాబు కి ఇంకా బాధ‌ప‌డ్డా. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. మేక‌ప్ కోస‌మే నాలుగు గంట‌లు ప‌ట్టేది. అంత చేసినా ఫ‌లితం రాలేదు. మేక‌ప్ ముసుగులో ఉంది న‌రేషా కాదా అన్న అనుమానం వ‌చ్చేసింది ఆడియ‌న్స్‌కు. అది సినిమాని బాగా దెబ్బ‌కొట్టింది.

* మ‌రి బందిపోటు ప‌రిస్థితేంటి?

- నా నుంచి ఆడియ‌న్స్ ఊర కామెడీ కోరుకొంటారు. మేమేమో క్లాస్ కామెడీ అంటూ మ‌రో క‌థ చూపించాం. అక్క‌డ బాగా నిరాశ ప‌డ్డారు.

* నాన్న‌గారి బ్యానర్‌లో తీసిన సినిమా క‌దా..

- అవును. అందుకే ఆ విష‌యంలో బాగా నిరుత్సాహ‌ప‌డ్డా. అయినా వ‌ద‌ల‌ను. నాన్న‌గారి పేరుతో ఈసారి మ‌రో సినిమా చేస్తా. ఆయ‌న సినిమాలో ఎంత కామెడీ ఉంటుందో.. అంతా అందిస్తాను. త‌ప్ప‌కుండా ఈసారి హిట్ కొడ‌తాం.

* రాబోయే సినిమాల వ‌ర‌కూ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకొంటారు?

- ముందే చెప్పిన‌ట్టు ప్ర‌యోగాలు మాత్రం చేయ‌ను. నా త‌ర‌హా కామెడీ క‌థ‌ల్ని ఎంచుకొంటా. ఈసారి స్ర్కిప్టు విష‌యంలో ప‌క్కాగా ఉండాల‌ని నిర్ణ‌యించుకొన్నా. ఎందుకంటే కొన్ని క‌థ‌లు లైన్లుగా విన్న‌ప్పుడు బాగుంటున్నాయి గానీ, తెర‌పై చూసుకొంటే ఆ ఫీల్ రావ‌డం లేదు. కొన్ని సెట్స్‌పై ఉండ‌గానే తేడా కొట్టేస్తుంటాయి. ఆ ద‌శ‌లో సినిమాని ఆప‌లేం.. కాబ‌ట్టి పూర్తి చేసి విడుద‌ల చేయాల్సివుంటుంది. బౌండెడ్ స్ర్కిప్టు ఉన్న‌ప్పుడు ఈ ఇబ్బందులు ఉండ‌వు. 
 

* మామ మంచు అల్లుడు కంచు సినిమా విశేషాలేంటి?

- మోహ‌న్ బాబుగారితో నేను చేస్తున్న సినిమా ఇది. ఆయ‌న కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌న సినిమాల్లో అంద‌రినీ ఆయ‌న ఆట‌ప‌ట్టిస్తుంటారు. ఈసారి నేను ఆయ‌న్ని ఆట ప‌ట్టిస్తుంటా. చాలా తమాషా క‌థ ఇది.

* ఈ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చింది?

- విష్ణు ఫోన్ చేసి అడిగాడు. ఓ క‌థ ఉంది.. నాన్న‌గారితో చేయాలి అన్నాడు. నేను షాక్ అయ్యా. అదేంటి నువ్వే చేయొచ్చు క‌దా.. అని అడిగా. కానీ నువ్వైతేనే బాగుంటావ్ అనేస‌రికి కాద‌న‌లేక‌పోయా.

* 50వ సినిమా సంగ‌తులేంటి?

- జేమ్స్ బాండ్ నా 49వ సినిమా. 50 వ సినిమా కోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లేం లేవు. అంకె ఏదైనా సినిమాకి ప‌డే క‌ష్టం ఒకేలా ఉంటుంది. ప్ర‌తి సినిమా హిట్ కొట్టాల్సిందే. ప్ర‌స్తుతం నా ముందున్న ల‌క్ష్యం అదే.

* ఓకే.. ఆల్ ది బెస్ట్

- థ్యాంక్యూ.. 

 

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review : James Bond