Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగినకథ: అందరూ తిరిగి చెన్నై ప్రయాణమవుతారు.  ట్రైన్ వేగం పుంజుకున్నాక, అందరూ కబుర్లలోకి దిగుతార్. ముందుకన్న చంద్ర  బాగా డాన్స్ చేసిందని, రాణి బాగా పాట పాడిందని మణత్తయ్య పొగుడుతుంది. వాళ్ళకి  టాలేంట్ వుండడంతోపాటు  తల్లిదండ్రులు మీరిచ్చే ప్రోత్సాహం అంతాఇంతాకాదని అంటుంది.   ఆ తరువాత..   


నాన్న వెళ్ళడానికి ఇంకా వారం కూడా లేదు.  నేను, వినోద్ నాన్నని అంటిపెట్టుకుని ఉంటున్నాము.  మాకు ఎన్నో జాగ్రత్తులు చెబుతున్నారు నాన్న.

ప్రతిరోజు నాన్నకిష్టమైన  గుడికో,  రెస్టారెంటుకో  వెళ్ళి వస్తున్నాము.

తను భూటాన్ లో ఉండగా, ‘మైలాపూర్  ఫైనార్ట్స్’ దసరా  ప్రోగ్రాం ఉంటుందని, ఊళ్ళోనే కనుక భూషణ్ అంకుల్ సాయం చేస్తారని గుర్తుచేశారు నాన్న.

**

జగదీష్ వాళ్ళ తిరుగు ప్రయాణానికి ముందురోజు,  మమ్మల్ని  పార్టీకి  ఇన్వైట్ చేసింది నీరూ ఆంటీ.  సర్ ప్రైజ్   పార్టీ అని అందట అమ్మతో. ఎవరికి సర్ ప్రైజ్  అని మేము అడిగినా అమ్మ నోరు విప్పలేదు.  వివరాలు  తనకి తెలియదంది.

ఆమెకి తెలుసని నా అనుమానం....

**

సాయంత్రం ఏడింటికి, భూషణ్ అంకుల్ వాళ్ళ డిన్నర్ కి వెళ్ళాము.  ఇల్లంతా చాలా బాగా డెకొరేట్ చేసారు.  వాళ్ళ గార్డెన్ హాల్లో పార్టీ ఏర్పాటు చేసారు.  గార్డెన్ లోని రకరకాల పువ్వులని చూస్తూ పార్టీ హాల్లోకి నడిచాము.  ఓ పక్కగా మ్యూజిక్ బాండ్ కూడా సెటప్ చేస్తున్నారు...

అప్పటికే  రాణి ఫ్రెండ్స్ వచ్చున్నారు.   గణపతి దేవుడు గురించి నాతో పోట్లాడిన నా క్లాస్ మెట్  లీనా జోసెఫ్ తో సహా. 

వాళ్ళు కూర్చున్న టేబిల్స్ దాటి వెళ్లి, కాస్త దూరంగా కూర్చున్నాము.  నాన్న తన  కుర్చీని టెన్నిస్ కోర్ట్స్ వైపు వేసుకొన్నారు.  ఎవరాడుతున్నారో  చూస్తానంటూ  వినోద్  కోర్ట్స్ లోకి వెళ్ళాడు.

లీనా వచ్చి, మా వద్ద చేరింది.  తన అక్క  రీనాతో వచ్చానని,  రీనా  రాణికి   క్లాస్ మెట్ అని వివరించింది.  ఐదు నిముషాల సేపు కబుర్లు చెప్పి వెళ్ళింది.

**

కాసేపటికి ఇంటిలోపలి నుండి ముందుగా జగదీష్, వెనుకే అత్తయ్య, మామయ్య పార్టీ హాల్లోకి వచ్చారు.

జగదీష్ బ్లాక్ సూట్ వేసుకున్నాడు.  మామయ్య పైజమా కుర్తా వేసుకున్నారు.  అత్తయ్య మెరిసిపోయే మూవీ యాక్టర్ల చీరల్లాంటిది కట్టుకుంది. మమ్మల్ని చూసి, మా వద్దకు వచ్చారు.

“అబ్బో, ఏమిట్రా జగదీష్ బాబు, ఏదో షూటింగ్ నుండి వచ్చిన డాషింగ్ హీరోలా ఉన్నావే?” అంది అమ్మ నవ్వుతూ.

జగదీష్  కోపంగా  ఉన్నాడు. “ఇదిగో మా మమ్మీని అడుగు. రెండు రోజుల నుంచి నన్ను పార్టీ ప్రిపరేషన్స్ తో చంపేస్తున్నారు.  ఇంత ఫార్మల్  వేషం ఇప్పుడెందుకు?” అని వెళ్ళి నాన్న వాళ్ళ  పక్కగా  కూర్చున్నాడు.

నాకు నవ్వొచ్చింది.

“అయినా తన ఫార్మల్  సూట్  బాగుందిగా!  ఎందుకు కోపం?” అడిగాను పక్కనే  కూర్చున్న అత్తయ్యని.

“మామయ్య, నువ్వూ కూడా చక్కగా ఉన్నారుగా,”  అని కూడా అన్నాను ఆమెతో నవ్వుతూ.

ఓ నిముషం సేపు మణత్తయ్య  ఏమీ అనలేదు.

“ఈ ఫంక్షన్ కి మీ అమ్మిచ్చిన సిల్క్ షర్టు వేసుకోవాలనుకున్నాడు.  కాని,  రాణి  ఇష్టప్రకారమే  మేమంతా తయారయ్యాము. అదీ కోపం,” అంటూ నవ్వేసింది అత్తయ్య.

“అసలేమిటి ఈ ఫంక్షన్ వదినా? అడిగింది అమ్మ.

“ఏమో! ఏదో సర్ ప్రైజ్  అంట.  మరి  ఎవరికో  ఏమిటో.  వచ్చేవారమే వాళ్ళమ్మాయి రాణి పుట్టినరోజనైతే  అన్నారు.  ఆ  అమ్మాయికి అతిగారాబం అనుకుంటా.  మమ్మల్ని కూడా తన మాట వినే వరకు ఊరుకోడం లేదు.  మాతో  ప్రేమగా అయితే ఉంటుంది,”  అంది అత్తయ్య.

**

పార్టీ హాలంతా అతిధులతో నిండిపోయింది.  భూషణ్ అంకుల్, నీరూ ఆంటీ వచ్చి  మమ్మల్ని పలకరించారు.  ఎవరెవరో సినిమా యాక్టర్లు వచ్చారు.  వాళ్ళ చుట్టూ మనుషులు  పరిగెడుతున్నారు.  

**

“పదండి స్నాక్స్ తెచ్చుకుందాము,” అంటూ నన్ను, వినోద్ ని పిలిచాడు జగదీష్.  వెళ్లి, స్నాక్స్  తెచ్చుకుని  టేబిల్ వద్ద కూర్చున్నాము.

రెండు రోజులుగా, రాణితో, చెన్నై మ్యూజియం - పార్క్ – రివాల్వింగ్ రెస్టారెంట్ కి వెళ్ళాడట.

తమతో ఆమె ఫ్రెండ్స్ కూడా కొందరు వచ్చారని చెబుతూ,

“నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది, చంద్రా.  పిలిచాను కూడా.  కాలు నొప్పన్నావు...నిజంగా చాలా నొప్పా?  ఇప్పుడు ఎలా ఉంది,” అడిగాడు జగదీష్.

ఇంతలో మ్యూజిక్  మొదలైంది.   సెంటర్  టేబిల్  మీద  రెండు టాల్  కేక్స్ ఏర్పాటు చేసారు.

“ఐ వాంట్ మోర్, జగదీష్ బావ,”  అన్న వినోద్ తో,  ఇద్దరు మళ్ళీ స్నాక్స్ టేబిల్ వద్దకు వెళ్లారు.

**

లేటెస్ట్ మూవీ హిట్స్ ప్లే చేస్తున్నారు... అందరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుండగా...రాణి వచ్చి మమ్మల్ని పలకరించింది..  కళ్ళు జిగేల్ మనే లాంటి మెరిసిపోయే  వైట్  పరికిణీ వోణి వేసుకొంది.  అలాగే జ్యువలరీ కూడా.  చాలా చక్కగా ఉంది.  ఆమెనలా  చూస్తూండిపోయాను....

రాణి మాతో మాట్లాడుతుండగా, భూషణ్  అంకుల్, నీరు ఆంటీ మైక్  ముందుకి వచ్చారు. 

‘హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్’ అంటూ అందర్నీ గ్రీట్ చేసారు....

“ఫ్రెండ్స్, లేడీస్ ఎండ్ జెంటిల్మెన్,  ఈ సందర్భాన్ని మాతో కలిసి సెలెబ్రేట్  చేయడానికి  మీరంతా వచ్చినందుకు, మా ధన్యవాదాలు.  ఈ టేబిల్ పైన రెండు కేక్స్  ఉన్నాయిగా!....ఈ రోజున, మా స్నేహితులు - ఢిల్లీ వాస్తవ్యులు ఐన మేజర్. రాంబాబు - మణిగార్ల  అబ్బాయి,  జగదీష్  బాబు  పుట్టినరోజు  సెలెబ్రేషన్.  అతనికిది  సప్రైజ్.  రెండో బర్తడే మా రాణిదే.  నిజానికి, వాళ్ళిద్దరి  అసలు  పుట్టినరోజులు వచ్చేవారం.

జగదీష్ కి  పందొమ్మిదేళ్ళు నిండితే, రాణికి  పదిహేడేళ్ళు నిండుతాయి.

ఈ యంగ్స్ టరస్   ఇద్దరూ, మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలుపుతూ, వి విల్ కట్ ది కేక్స్.  ఎండ్ ఎంజాయ్ డిన్నర్ అండ్ మ్యూజిక్ ఆఫ్టర్.....” హ్యాపీ బర్త్డే టు యు’ అని పాడుతూ లీడ్ చేసారు అంకుల్.

ముందుగా రాణి, తరువాత జగదీష్ కేక్ కట్ చేసారు....

భూషణ్ అంకుల్ మళ్ళీ మైక్ తీసుకొని,  “మరో సప్రైజ్ కూడా ఉంది ఫ్రెండ్స్...మేజర్ సత్యదేవ్, శారద గార్ల అమ్మాయి, చంద్రకళ.  గత  ఏడేళ్ళగా  కూచిపూడి నృత్యంలో నిర్విరామ  కృషి  చేస్తున్న ఓ యువ కళాకారిణి.  ఆరేళ్ళ వయస్సు నుండే  ఎన్నో సార్లు టాలెంట్ షోల్లో గెలుపొంది ‘చెన్నై యంగ్ టాలెంట్’ అవార్డ్స్ తీసుకుంది.

ఆ అమ్మాయిని అప్పట్లోనే “చైల్డ్ ప్రాడజీ” గా ఎన్నో పత్రికలు ప్రశంసించాయి..  అంతేకాదు. గత వారం మదురైలో తన నృత్యానికి  -

“కళామంజరి’ వారి - ప్రతిష్టాత్మక “నృత్యమంజరి” అవార్డు అందుకుంది.  చంద్రకళని  ఆశీర్వదిస్తూ, అభినందిస్తున్నాము.  చంద్రకళని వచ్చి ఈ ‘అభినందన’ కేక్ కట్ చేయమని కోరుతున్నాను.  వెంట తమ్ముడు, మాస్టర్ వినోద్ కూడా ఉండాలి”  నవ్వుతూ

అనౌన్స్  చేసారు....

లోపలినుండి, అంబుజ మరో కేక్  తెచ్చి ఆంటీకి అందించింది.... ఆంటీ టేబిల్ మీద దాన్నుంచి, దానిపై ఓ కాండిల్ కూడా వెలిగించింది...

అంకుల్ నాగురించి చేసిన అనౌన్స్మెంట్ కి,  జరుగుతున్న  విషయానికి,  నేను సప్రైజ్  అయ్యాను.   మమ్మల్ని  టేబిల్ వద్దకి తీసుకెళ్ళి, నాచేత కేక్ కట్ చేయించారు నాన్న.

మా నలుగిరికి  అంకుల్ – గిఫ్టులందించారు..

మరి కాసేపటికి, డిన్నర్ కూడా అయ్యాక,  అంకుల్ వాళ్లకి థాంక్స్ చెప్పి ఇల్లు చేరాము.

**

గబగబా బట్టలు  మార్చుకుని  సిటింగ్ లోకి వచ్చాను.  అంకుల్ మాకిచ్చిన  గిఫ్ట్స్ వోపెన్ చేసాము.  నాకు ఒక గోల్డ్ చైన్-లాకెట్,  వినోద్ కి ‘కిడ్స్ వరల్డ్’  గిఫ్ట్ సర్టిఫికేట్.

చైన్ అమ్మకందించి, మెళ్ళో పెట్టమన్నాను.

“ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చారాయన?  అవార్డ్  గెలిచినందుకు  చంద్ర చేత  కేక్ కట్ చేయిద్దాము అన్నారు.  అక్కడ వరకు బాగానే ఉంది, కాని ఇంతింత కానుకలు ఎందుకు,” అంది అమ్మ.

“దానిదేముందిలే గాని, శారదా,  మీ అన్నయ్యవాళ్ళు ఇంకాసేపట్లో మనింటికి వస్తారు.   రేపు సాయంత్రమే వాళ్ళ  ఢిల్లీ  ప్రయాణం.  వాళ్ళ పడకలు, ఏర్పాట్లవీ చూసావుగా!” క్షణమాగారు.

“పోతే, మరో విషయం.  భూషణ్ వాళ్ళకి, వీళ్ళు అంతగా దగ్గరవడం విడ్డురంగా  ఉంది.  ఓ కంట కనిపెట్టు.  ఇదంతా ఎందుకో? ఎటు దారి తీస్తుందో అని నాకు అర్ధంకాడం లేదు.  ఆ అబ్బాయిని ఎలాగోలా పట్టేయాలని చూస్తున్నారా  ఏమిటి?”  అన్నారు  నాన్న.

“అంత  అవసరం  ఏముందిలెండి.  ఆ అమ్మాయే కాస్త అతిగారాబం.  అందుకే అలా చేస్తుంది, తన మాట నెగ్గించుకోవాలని పంతం,” అంది అమ్మ.

“అసలు ఇది వినండి.  ఈ ఫంక్షన్ విషయంగా, వీళ్ళంతా మొన్న షాపింగ్ వెళ్ళారంట.

జగదీష్ కి సూటు, వదిన చీర, అన్నయ్య బట్టలు అన్నీ తనే కొంటానని గొడవ చేసిందట రాణి.  అన్నయ్య ససేమిరా కుదరదన్నారట.  ‘మా బట్టలు మేమే కొంటామని గట్టిగా చెప్పారట’  మొత్తానికి ఇలాటివే  సూట్స్  వాళ్ళకి  ఇంట్లో ఉన్నా,  అవసరం లేని బట్టలు కొనడం అయిందని మొత్తుకుంది వదిన,”  నవ్వింది అమ్మ.

డోర్ బెల్ మోగడంతో వెళ్ళి తలుపు తీసాను.  రాంమామయ్యా  వాళ్ళు  లోనికొచ్చారు.

**

పెద్దవాళ్ళు  వరండాలో కూర్చుని, కబుర్లు  చెప్పుకుంటున్నారు.

మేము సిటింగు రూములో చేరాము....


జగదీష్ కూడా, కబుర్లు చెబుతూ, మధ్యమధ్యలో వినోద్ ప్రశ్నలకి జవాబులు చెప్పి నవ్విస్తున్నాడు.

“జగదీష్,  నీ గిఫ్ట్ చూపించు అత్తయ్యకి,”  అంది మణత్తయ్య.

బాక్ ప్యాక్ నుండి ‘రోలెక్స్’  వాచ్ తీసి చూపించాడు జగదీష్.

“బాగుంది,” అన్నాము.

మరి  కాసేపు కూర్చుని  టి.వి  చూస్తూ  అక్కడే  సోఫాల్లో నిద్రకి  పడ్డాము.

**

నాన్న భూటాన్ లో  ఉన్నప్పుడు,  తాము మళ్ళీ ఓ సారి  చెన్నై వచ్చే ప్రయత్నం  చేస్తామని చెప్పి, సాయంత్రం ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్ళిపోయారు  జగదీష్, మణత్తయ్య, మామయ్య.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery