Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగినకథ: ఆ రోజంతా 1..4..3..నంబర్ గేం లో పడి కొట్టుకుంటాడు అభిరాం. ఎలాగోలా మొత్తనికి ఆ అమ్మాయి పేరు కనుక్కుంటాడు. ప్ర...తి....మ... అని.. ఆ తరువాత... 

ఆమె నంబర్ ను బట్టీ ఆమెకు సెల్ సర్వీసులందించే మొబైల్ కంపెనీ తెలుసు. నంబర్ ను బట్టీ ఆమె పర్సనల్ డిటైల్స్ తెలుసుకోవడం సులభమే. అయితే...కంపెనీ సిబ్బంది సహకరిస్తేనే!

ఆమె చిరునామా తెలుసుకుని...ఒక్కసారి ఆమెని చూడాలి. ఇన్నాళ్లూ ఎందుకు పలకరించలేదంటూ నిలదీయాలి...అనుకున్నాడు అభిరామ్.
ఆ వెంటనే...కార్యక్షేత్రంలోకి దిగాడతడు.

గ్రీన్ ల్యాండ్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ లోని పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లో ‘సెల్కామ్...’ కార్పొరేట్ కార్యాలయంలోకి అడుగుపెట్టాడు అభిరామ్. ఫ్రంట్ ఆఫీసులో ల్యాప్ ట్యాప్ లోకి తొంగిచూస్తున్న లిప్స్ టిక్ చిన్నది ఎవరో వచ్చిన అలికిడికి అలర్టయింది.

‘‘వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ!’’ అడిగింది అభిరామ్ ని చూస్తూ.

‘‘స్మాల్ ఫేవర్...’’

‘‘చెప్పండి...’’

అంతకుముందే నంబర్ రాసి ఉంచిన తన చేతుల్లోని పేపర్ అందించాడు.

‘‘ఈ నంబర్ ఈ కంపెనీదే..’’

‘‘ఔను...అందుకే, వచ్చానిక్కడికి’’

‘‘ఏం చేయాలి?’’

‘‘ఏమనుకోకపోతే...యూజర్ డిటైల్స్ కావాలి’’

‘‘యూజర్ డిటైల్సా! అంటే, ఈ నంబర్ మీది కాదా?’’

‘‘ఊహూ!’’

‘‘మరెవరిది?’’

‘‘అది తెలుసుకుందామనే....’’

‘‘ఎందుకు తెలుసుకుందామనుకుంటున్నారు?’’ ఆమె అడుగుతుండగానే ఆమె సెల్ రింగైంది.

‘‘జస్టేమినిట్!’’ అంటూ సెల్ ఫోనందుకుని కొన్ని చిరునవ్వులని  చిందించింది. అసలే అందం కోసం ఎర్రదనం పులుముకున్న ఆమె చెక్కిళ్లు ఆ ఫోన్ కాల్ తో  సహజసిద్ధమైన అరుణవర్ణాన్ని పులుముకున్నాయి.

‘‘థాంక్స్...ష్యూర్! కంపల్సరీ...డ్యూటీ అయిపోగానే కలుద్దాం. షార్ప్ ఫైవో క్లాక్. సికింద్రాబాద్ ప్యారడేజ్ దగ్గర...’’ చెప్తోంది కచ్చితంగా అది కస్టమర్ నుంచి వచ్చిన కాల్ కాదని సెల్ ఫోన్ చెవికానించుకుంటూ పక్కకి వెళ్లిపోయినప్పుడే అర్ధమైంది అభిరామ్ కి. మాట్లాడుతున్నంత సేపూ శరీరం అణువణువూ ఆనందతరంగితమవుతున్న విషయం తేటతెల్లమవుతోంది. కళ్లలో మెరుపులు, పెదవుల్లో నవ్వులు, కాంతివంతమవుతున్న చెక్కిళ్లు...సంతోషంతో ఎగిసిపడుతున్న ఎదలయలు...హోయలు పోతూ ఆమె మాట్లాడుతోంది...ప్రియాతిప్రియమైన బాయ్ ఫ్రెండ్ తోనే అని తెలిసిపోయిందతడికి.

చివర్లో...సెల్ ల్లోనే ఓ కిస్ ఇచ్చి ‘బాయ్...’ చెప్తూ సీటు దగ్గరికొచ్చిందామె. వెంటనే, పనిలో లీనం కాలేకపోయింది. గుండెల్లోంచి ఎగిసిపడ్తున్న సంబరాలు చిర్నవ్వులై పెదాలు దాటి వస్తున్నాయి.

కొన్ని క్షణాల తర్వాత`‘‘ఊ...చెప్పండి...’’ అంది మళ్లీ.

‘‘అదే...యూజర్ డిటైల్స్..’’ అన్నాడు అభిరామ్ మళ్లీ సంకోచంగా. అప్పుడు మధ్యలోనే తను వదిలేసి వచ్చిన పని గుర్తొచ్చిందామెకి. నంబర్ని చూసిందోసారి. చివర్లో...‘1...4...3’ ఉంది.

‘‘ఆ డిటైల్స్ మీకెందుకు?’’

‘‘చివరి అంకెల్ని చూసైనా సరే...అర్ధం చేసుకోలేరా?’’ దీనంగా అభ్యర్ధించాడు.

‘‘ఔను...ఆమె నా ఫోన్ సుందరి. చాలా కబుర్లు చెప్పుకున్నాం. అంతలోనే...అంతర్ధానమైంది. కాల్ చేయడం లేదు. మాట్లాడడం లేదు. కనీసం...నే కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..’’ గొంతు డగ్గుత్తికగా మారింది. కన్నీరు బయటకు రాకుండా కన్రెప్పలు బలవంతంగా ఆపుతున్నాయి.

అతడి వాలకం చూసిందామె.

‘‘ఇన్నాళ్ల ఫోన్ స్నేహంలో ఆమె గురించి అస్సలు తెలీదా?’’

‘‘ఊహూ...’

‘‘కనీసం...పేరూ..ఊరూ...’’

‘‘తెలీదు...’’

‘‘ఇప్పుడెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు...’’

‘‘ఎందుకా...? ఆమె అంటే పిచ్చి ప్రేమ. ఆమె మాటా పలుకు దూరమైందన్న ఆలోచనే భరించలేకపోతున్నాను. తనెందుకు దూరమైందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి...ఒక్కసారి ఆమెని కలవాలని ఉంది’’

‘‘మనిషిని చూడకుండా ప్రేమలో పడడం...ఆమె కోసం ఆరాతీయడం...అంతా కొత్తగానే ఉంది’’

‘‘పిచ్చాడిలా కనిపిస్తున్నానా?’’ అడిగాడు అభిరామ్.

‘‘ప్రేమా...పిచ్చి ఒక్కటేనేమో?’’

‘‘ఇంతకీ మీరేం చేస్తారు?’’

‘‘డిగ్రీ సెకండియర్...’’ చెప్పాడు అభిరామ్.

‘‘చక్కగా చదువుకోక...’’

‘‘అన్నీ ఫస్ట్ క్లాస్లే...’’ అన్నాడు.

‘‘సారీ...ఒకరి పర్సనల్ డిటైల్స్ మేం బయటపెట్టకూడదు. కంపెనీ రూల్స్ కి వ్యతిరేకం’’ చెప్పింది ఖరాఖండిగా.

‘‘ప్లీజ్! ఆ డిటైల్స్ నాకిచ్చినందువల్ల మీకేం ఇబ్బంది కలగదు...’’ బతిమిలాడుతున్నాడు.

‘‘నో...ఆ డిటైల్స్ మీరడగకూడదు. మేమివ్వకూడదు. దయచేసి మీరెళ్లొచ్చు’’

ఇంకేం చేయలేక వెళ్లబోతూ మళ్లీ వెనక్కి తిరిగి...‘‘మేడమ్! మీరూ ప్రేమలో పడ్డారు. ఆ సంగతి ఇందాక మీకొచ్చిన కాల్ ద్వారానే తెలిసింది. అలాంటి మీరు కూడా నా ప్రేమను అర్ధం చేసుకోకపోవడం అన్యాయం’’ అన్నాడు.

‘‘ఏ ఒక్కరోజైనా మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడకపోతే వచ్చే వేదన ఏంటో మీకూ ఈపాటికి అనుభవమై ఉ ంటుంది. కనీసం...ఆ బాధని గుర్తుంచుకోనైనా నా విషయం కాస్త పట్టించుకోండి’’

ఆ మాటలకి ఆమె కరిగింది.

‘‘వన్మినిట్...కంప్యూటర్లో సెర్చ్ చేసి డిటైల్స్ ఇస్తా...’’ అంటూ ఆమె లేవబోతుండగానే..అభిరామ్ ఫోన్ మోగింది. స్క్రీన్పై కనిపించిన   నంబర్లో చివరి మూడు అంకెలు...‘1...4...3’

‘‘యురేకా...’’ అని గట్టిగా అరిచాడు అభిరామ్. ఆ సమయంలో తన చుట్టూ ఓ ప్రపంచం ఉందనే సంగతిని అతడు విస్మరించాడు.‘‘పిచ్చి...’’ అంది ఆమె.

‘‘ప్రేమ...’’ అన్నాడు అభిరామ్ ఆమెకి టాటా చెప్తూ.

‘‘ఏంటీ...ఇన్నాళ్లూ ఫోన్ లేదేం?’’

‘‘నా ఫోన్ కోసం ఎదురుచూసావా?’’

‘‘ప్రత్యేకించి చెప్పాలా? నువ్వు కాల్ చేయలేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏమైంది నీకు?’’ ఆమెపై తనకేదో అధికారం ఉన్నట్లు గట్టిగా గదమాయిస్తున్నాడు అభిరామ్.

‘‘నా హెల్త్ బాగోలేదు. టైఫాయిడ్ వచ్చింది. దాంతో...ఎవరి కాల్స్ అటెండ్ చేయలేదు’’ చెప్పింది తను. ఆ తర్వాత తన గురించి తన కుటుంబం గురించి అనేక విషయాలు చెప్పింది.  చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది. బిజినెస్ పనుల మీద డాడీ ఎక్కువగా టూర్లు. చేస్తుంటారు. పిన్నివాళ్లింట్లో ఉండి చదువుకుంటున్నాను...’’ అని చెప్పింది తను.

ఆ తర్వాత అడిగింది...‘‘ఇంతకీ నాపేరు కనుక్కున్నావా లేదా?’’

‘‘గెస్ చేసాను...’’

‘‘వైల్డ్ గెస్సా?’’

‘‘అది నువ్వే చెప్పాలి’’

‘‘అయితే, పేరు చెప్పు...’’

‘‘ప్ర...తి...మ’’ అన్నాడు అభిరామ్.

అట్నుంచి తను ‘యురేకా...’’ అని అరిచింది.

‘‘యూ ఆర్ జీనియస్. చక్కగా కనుక్కున్నావు..’’ మెచ్చుకుంది.

‘‘ఇప్పుడెక్కడున్నావ్?’’ అడిగింది తను.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti