Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vijnaanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - - డా.ఎ. రవీంద్ర

ఇంలాంటి స్నేహితులు వద్దు 

జీవితం అంటే కొన్ని మనసులు, మనుషుల కలయిక. ఏ పని చేసినా, చేయకున్నా పదిమందితోనే కలిసి జీవిస్తాం. అనేక అనుబంధాలు ఏర్పడతాయి. స్నేహం, బంధుత్వం, పరిచయం, రక్త సంబంధం... ఇలా అనేక బంధాల మధ్య వాటిని కుదించేస్తాం. వీటిలో ఏ రిలేషన్ విలువ దానిదే. దేని ప్రత్యేకత దానిదే. ప్రతి మనిషి అనేక సమయాల్లో అనేక రిలేషన్లలో అనేక పాత్రలు పోషిస్తాడు. ఒక స్త్రీ- భార్యగా, తల్లిగా, స్నేహితురాలిగా, ఉద్యోగిగా, పరిచయస్తురాలిగా ఇలా.. అనేక బంధాలతో ఉంటుంది. అదే పురుషుడు అనుకో భర్త, తండ్రి, ఫ్రెండ్, ఉద్యోగస్తుడు, ఫ్రెండ్... ఇలా అనేకం. ఇక యూత్ విషయానికి వస్తే వాళ్లు అన్నిటికంటే స్నేహానికే ప్రాముఖ్యత వహిస్తారు. స్నేహం కన్నా ఏదీ ముఖ్యం కాదు అంటారు. స్నేహం కన్నా మించింది ఏదీ లేదు అంటారు. అయితే ఎలాంటి స్నేహితుల్ని ఎంచుకోవాలి, ఎలాంటి స్నేహితులను దూరం చేసుకోవాలి అనే విషయం గురించి చాలా మందిలో సందిగ్ధత ఉంటుంది. అసలు స్నేహాలు కావాలంటే ఏర్పడవు అనేది నిజమే కావచ్చు. కానీ మనల్ని ఇబ్బంది పట్టే స్నేహాలను మాత్రం వదులుకోవాల్సిందే.

తగవుల తమాషా

తరచుగా స్నేహితుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. చిన్నచిన్న కోపాలు, అలకలు, మాట పట్టింపులు అన్నీ ఉంటాయి. కానీ కొంతమంది వాటిని సీరియస్ గా తీసుకొని స్నేహాలు వదులుకుంటారు. చిన్న చిన్న విషయాలను రాద్దాంతం చేసి, పెంచి పెద్దవి చేసుకుంటారు. సినిమాలు, షికార్లు, ఆటపట్టించడం, జోకులు వేయడం, వ్యక్తిగత విషయాలను పెద్ద చేయడం, అమ్మయిలు అయితే అబ్బాయిల వల్ల, అబ్బాయిలు అయితే అమ్మాయిల వల్ల గొడవలు వస్తుంటాయి. ఇవి ఒక్కసారి వస్తే మంచి రిలేషన్స్ కూడా చెడిపోతాయి. అందుకే క్షమించడం అనేది గొప్ప గుణం. అయినా మీ స్నేహితుడ్ని మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు. తగవుల తర్వాత వచ్చే కిక్కే అద్భుతంగా ఉంటుంది. రిలేషన్ గట్టి పడతుంది. కానీ అదే పనిగా గొడవలు పెట్టుకునే, వాటిని పెంచే స్నేహితులతో ఎక్కువకాలం స్నేహం చేయలేం. 

కబుర్ల కమామిషు

చాలామంది యూత్ కు కబుర్లు చెప్పే వాళ్లు అంటే చాలా ఇష్టం. వాళ్లతో ఉంటే సమయమే తెలియదు అంటారు. ఇక అమ్మాయిలు, అబ్బాయిల కలిసిన గ్రూప్ అయితే వాళ్ల కబుర్లతో టయమే తెలీదు. టయమ్ పాస్ కు కబుర్లు అవసరమే, బాగుంటాయి, ఎంజాయ్ కూడా చేయొచ్చు. కానీ పరీక్షలప్పుడు, సీరియస్ విషయాలప్పుడు కబుర్లతో కాలం గడిపే స్నేహితులూ ఉంటారు. వారి సమయాన్ని వాళ్లు వృధా చేసుకోవడమే కాకుండా, మిగతా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేస్తారు. కాబట్టి కబుర్లు అయినా, ఎంజాయ్ అయినా సమయం, సందర్భం ఉండాలి.  ఏ పని చేసే టప్పుడు ఆ పని చేయాలి. అలా అని చదువుకునే టప్పుడు కబుర్లు చెప్పే వాళ్లు వద్దు, ఎంజాయ్ చేసే టప్పుడు మాత్రమే వాళ్లు కావాలి అంటే కుదరదు కదా. అందుకే కబుర్లు చెప్పే స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా మెలగాలి మరి. మీరు కబుర్లు చెప్పే వాళ్లు అయితే లోపాలను గుర్తించి మెలగాలి.

విమర్శ మంచిది కాదు

యువతలో కొంత మందికి తరచు విమర్శించే స్వభావం ఉంటుంది. తమ తమ స్నేహితులు తప్పు చేసినా, ఒప్పు చేసినా తిట్టరు, మెచ్చుకోరు. కానీ విమర్శిస్తారు. ఇవి కొత్తల్లో బాగానే ఉంటాయి. కానీ ఒకరి మనస్తత్వాన్ని దెబ్బతీసే విధంగా విమర్శ ఉన్నప్పుడు ఎవరికైనా బరించడం కష్టం. అందుకే విమర్శించడం మానుకోవాలి. కావాలంటే సలహాలు ఇచ్చి ప్రోత్సహించాలి. ఎందుగుదలలో తమనుతాము చూసుకోవాలి. పది విమర్శలకన్నా ఒక్క పొగడ్త చాలా విలువైనది. అందుకే మీ స్నేహితులను అప్పుడప్పుడూ పొగడ్తలతో ముచ్చెత్తండి. అంతే కాని విర్శించవద్దు. తప్పు చేస్తే అర్థమయ్యేలా చెప్పండి. మీకన్నా అందంగా ఉంటే ఆ అమ్మాయికి నిర్మొహమాటంగా అదే విషయం చెప్పండి. డ్రెస్ బాగుంటే బాగుందని చెప్పండి. అనవసరంగా ఇతరులతో గొడవ పెట్టుకుంటే వద్దని సర్ది చెప్పండి. మంచి మార్కులు తెచ్చుకుంటే మీ గ్రూపు అంతా కలిసి ట్రీట్ ఇవ్వండి.

గోతులు తవ్వేవారితో జాగ్రత్త

కొంతమందికి కన్నింగ్ మనస్తత్వం ఉంటుంది. మీతో మంచిగా ఉంటారు. మీతో కంబైన్డ్ స్టడీ చేస్తారు. మీతో నిత్యం కలిసి ఉంటారు. లంచ్ బాక్సు షేర్ చేసుకుంటారు. మీ డబ్బులతో బేకరీల్లో బిల్ కట్టించుకుంటారు. కానీ తీరా చూస్తే మీకు తెలియకుండానే మీ వెనక మిమ్మల్ని విమర్శిస్తారు. మీ మంచిని చెడ్డగా ఇతరుల ముందు ప్రచారం చేస్తారు. మీకు అనుమానం రాకుండానే మీ వ్యక్తిత్వాన్ని పదిమంది ముందు దెబ్బతీస్తారు.  మీ ఆంతరంగిక విషయాలు షేర్ చేసుకుంటే వెంటనే మీ వ్యతిరేకులతో చెప్పి మీ పరువు తీస్తారు. అంటే నక్కలాంటి వాళ్లు అన్నమాట. ఇలాంటి వాళ్లను కొంచెం కనిపెట్టి ఉండాలి. లేదంటే మీరు ఫూల్ అవడం మాత్రమే కాదు. నవ్వులపాలు అవుతారు. బాధ పడతారు. అందుకే ఇలాంటి వాళ్లు మీ స్నేహితులగా ఉంటే వెంటనే వదిలించుకోండి. ఒక వేళ  మీకే అలాంటి మనస్తత్వం ఉంటే మారండి. లేదంటే మీకు స్నేహితులే ఉండరు.

ఇంకా కొంతమంది స్నేహితులు గందరగోళంగా ఉంటారు. ఎప్పుడు ఏ విషయం మాట్లాడాలో తెలియదు. అనవసరంగా మీ మనసుల్ని చిరాకు పెడ్తారు. లేనిపోని విషయాలను చర్చకు తెచ్చి అసందర్భంగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. అలానే కొంతమంది మీ అవసరాలకు దగ్గర ఉండరు. ఫోన్ చేస్తే తప్పించుకుంటారు. మీకు తన అవసరం ఉందని తెలిసి ముందే ఎస్కేప్ అవుతారు. అందుకే స్నేహితులను ఎంపిక చేసుకోవడమే కాదు. వారితో మెలగడం కూడా కత్తిమీద సామే. స్నేహం అనేది ఎదుటి వాళ్ల మనస్తత్వం మీదే కాదు, మీ మనస్తత్వం మీద కూడా ఆధారపడి ఉంటుందని మర్చిపోకూడదు. కానీ మనవాళ్లంటూ, మనకు నచ్చిన ఒక్క స్నేహితుడు ఉన్నా, స్నేహితురాలు ఉన్నా మన జీవితం ధన్యం.                                              
                                           
మరిన్ని శీర్షికలు
padyam - bhavam