Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 7th august  to13th august

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - ..

తిక్క : కొండా రవిప్రసాద్ గారూ మీపై నమస్కారాలు విసిరితే ఏమవుతుంది?
తొక్క: " కొండా " మీదకి ఏం విసిరినా ఏమవుతుంది మహా అంటే ప్రతి నమస్కారాలు దొర్లిపడతాయి...

తిక్క : ఇసుకతో కార్టూన్లు వేసి ఆ ఇసుకనంతా మూటకట్టి పత్రికలకు పంపుతే ఆ ఇసుకలో వేసిన
కార్టూన్లు పబ్లిష్ అవుతాయా?

తొక్క: అవుతాయి కానీ, ఇసుకతో చేసిన పత్రికలకే పంపాలి, మళ్ళీ వాళు పంపే ఇసుక పారితొషికమెక్కడ పెట్టుకుంటాం.

తిక్క : నదుల అనుసంధానం వల్ల మీ కార్టూన్లకు ఒనగూడే ప్రయోజనం ఏమైనా ఉందని భయపడుతున్నారా?
తొక్క: ఒక్క నదిలో నా కార్టూన్లు నింపితే చాలు అన్ని నదుల్లో తేలతాయి, అప్పుడు అందరూ పుణ్య స్నానాల కోసం నదుల్లో దిగితే నీళ్ళకు బదులు నా కార్టూన్లలో తడుస్తారేమోనని జనం భయపడుతున్నారు.

తిక్క : తరచు అంతర్జాతీయ బహుమతులు ఎందుకందుకుంటున్నారు?
తొక్క: కార్టూన్లు పంపమని వాళ్ళే పిలుస్తున్నారు, బహుమతులు అందుకొమ్మనీ వాళ్ళే పిలుస్తున్నారు....అందుతుంటే అందుకోక, ఎందుకూరుకుంటారండీ.

తిక్క : మీ కార్టూన్లలో కొండా రవిప్రసాద్ అని సంతకం ఎందుకుంటుంది?
తొక్క: వేరే కార్టూనిస్టులెవరూ వాళ్ళ కార్టూన్లలో నా సంతకం చేయడం లేదు కనక.

తిక్క : కత్తి గాట్లకన్నా మీ కార్టూన్లే ఎక్కువగా బాధిస్తాయట కదా?
తొక్క: అవును అందుకే నా కార్టూన్ల బాధ మరిచిపోవడానికి కొంతమంది కత్తులతో పొడుచుకుంటున్నారట...

తిక్క : పర్యావరణం మీద తెగ కార్టూన్లేస్తూంటారు కదా, ఇంతకీ మీరు రోజుకెన్ని చెట్లు నరుకుతుంటారు?
తొక్క: చెట్లు నరకడానికి చాలామంది ఉన్నారు కదండీ...అందుకే నేను ఎదుటి వాళ్ళ కోతలను నరుకుతుంటాను.

తిక్క : ప్రజల్లో మీకున్న ఇమేజి డామేజి అయిపోవడానికి మీ మొదటి కార్టూనే కారణమా?
తొక్క: కాదు, రెండో కార్టూను.

తిక్క : మంచి కార్టూన్ ఎంత పెద్ద సైజులో ఉండాలి?
తొక్క: నా తలకాయంత అంటే అ4 సైజు అంతా అన్నమాట కొంచెం అటూ ఇటూగా అగ్గిపెట్టి సైజున్నా పర్లేదు.

తిక్క : మీ కార్టూన్లు గాలికి ఊగకుండా ఉండాలంటే ఏ చెట్టు కదలకుండా ఉండాలి?
తొక్క: ఫ్యాన్ చెట్టు కదలకుండా చేస్తే సరి

తిక్క : కలి యుగం అంతరించిపోయక మీ కార్టూన్ల యుగం వస్తుందా?
తొక్క: కలియుగమంతా నా కార్టూన్లదే..మళ్ళీ నా కార్టూన్లకో యుగమెందుకు, బోర్..

తిక్క : పంటపొలాలు ఎండిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, మీరింకా కార్టూన్లు మాత్రం మొదలెట్టడం లేదెందుకు?
తొక్క: ఇవన్నీ నా కార్టూన్ల వల్లనే జరుగుతున్నాయని ఎవరైనా అంటారేమోనని భయపడి దాక్కున్నా.

తిక్క : మెలకువతో ఉన్నప్పుడు కార్టూన్ ఐడియాలొస్తే, నిద్రలో కార్టూన్లు వేస్తారా?
తొక్క:  అలా చాలా సార్లు వేసి పత్రికలకు పంపించాను కూడా..పారితోషికమడిగితే, మళ్ళీ నేను నిద్రపోతున్నప్పుడు పంపుతామన్నారు....ఇక నిద్ర పోయి ఎదురుచూస్తా...

తిక్క : ఏమేం వస్తువులు విసిరేస్తే ఒక మంచి కార్టూన్ ఏర్పడుతుంది?
తొక్క: కార్టూనిస్టు చూపు సామాజిక సమస్యల మీద విసురుతూనే ఉండాలి, సమాజం ఊరుకొంటుందా, కార్టూనిస్టు బుర్ర పైకి అయిడియాలు విస్రుతుంది...అప్పుడు పాఠకులపై మంచి కార్టూన్లొచ్చి పడతాయి.

తిక్క : మీ కార్టూన్లన్నీ శ్రీకృష్ణుడు అప్పుడే వేసేసాడు కదా, మళ్ళీ కొండా రవిప్రసాద్ తో వేయిస్తున్నారెందుకు?
తొక్క: శ్రీకృష్ణుడి కార్టూన్లలో చాలా కరెక్షన్స్ ఉన్నాయని ఒబామా మా ఊరికొచ్చినప్పుడు గాంధీగారితో చెప్పారట. అందుకని సింగపూర్ ప్రభుత్వం కొండా రవిప్రసాద్ తో వేయిస్తున్నారట...

తిక్క : జానపద కథల్లో ఏ రాజకుమారుడూ గుర్రపుస్వారీ చేస్తూ కార్టూన్లు వేయలేదు, వాటిపై మీ సంతకం చేయలేదుగా?
తొక్క: అందుకే నేను ఐడియాల గుర్రాల మీద స్వారీ చేస్తూ కార్టూన్లేస్తున్నాను మరి.

తిక్క : మీ కార్టూన్ల వల్ల లిబియాలో అంతర్యుద్ధం తప్పేట్టు లేదట కదా?
తొక్క: అంతర్యుద్ధం అయితే పర్లేదు...అందరూ కలిసి మనమీదకి యుద్దానికి రాకుంటే చాలు...

తిక్క : మాయాబజార్ సినిమాలో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి కానీ, మీ కార్టూన్లు కనిపించలేదెందుకని?
తొక్క: ఈ ఫుటో చూడండి...వీళ్ళందరి వెనక్కి వెళ్ళి అందులో ఏం చూస్తున్నారో మీరూ చూడండి. అందులో నాకార్టూన్లుంటాయి...లేకుంటే చెప్పండి. మళ్ళీ మాయాబజార్ ఎవరైనా తీసేప్పుడు వాళ్ళకి చెప్తా....

తిక్క : వందలకోట్లు నల్లధనం మూలుగుతున్న వార్కి మీ కార్టూన్లెందుకు నచ్చవు?
తొక్క: వందల కోట్లను కాపాడుకోవడంతోనే సరిపోతోందికదా, ఇక వాళ్ళకి నా కార్టూన్లు చూసే టైమెక్కడిదని నచ్చలేదంటున్నారేమో....

తిక్క : తుంటర్వ్యూ గురించి మీరు ఎవరితో ఏం అన్నారో ఎవరికైనా తెలుసా?
తొక్క: ఎవ్వరితో ఏం అనలేదని అందరికీ తెలుసు...అందులో కొందరైనా మరికొందరితో ఏం అనలేదని అంటే చాలు...

తిక్క : మీ ఊళ్ళో ఎన్ని సముద్రాలున్నాయో కూడా తెలీకుండా కార్టూన్లెందుకు మానేసారు మీరు?
తొక్క: ఒకటో రెండో సముద్రాలుంటే పర్లేదు. మా ఊళ్ళో లెక్కలేనన్ని సంద్రాలున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు దగ్గర్లో కేసముద్రం రైల్వే స్తేషన్ ఒకటుంది. అందుకే నేను కార్టూన్లు మానేసి చాలా....కాలమైంది....అంటే దాదాపు గంట పైనే అయ్యుండొచ్చు.

తిక్క : మీ కార్టూన్లతో మీరు చాలా ఎక్కువ చేస్తున్నారని నవాజ్ షరీఫ్ మీ ఊరి సర్పంచ్ తో అన్నాడట కదా?
తొక్క: నా దగ్గరున్న తక్కెడకూ, నవాజ్ షరీఫ్ దగ్గరున్న తక్కెడకూ చాలా తేడా ఉండొచ్చు. అందుకే అలా అని ఉంటాడు. ఇక మా ఊరి సర్పంచ్ దగ్గరసలు తక్కెడే లేకుండొచ్చు..ఆయన ఎటని మాట్లాడతానని ఊరుకొనుండొచ్చు.

తిక్క : మీ తుంటర్వ్యూ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మొదలైంది, ?
తొక్క: మొదలైంది మొదలైంది అటు చూడండి. గోతెలుగు చూడండి......

మరిన్ని శీర్షికలు
sahiteevanam