Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
deathmistery

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగినకథ:  జరిగినకథ:  కోయంబత్తూరు నుంచి అంతా బయలు దేరిన వార్త తెలీగానే విశాల   చాలా హడావుడి చేసేస్తుంది . విందు భోజనాలకి చక చకా ఏర్పాట్లు చేస్తుంది విశాల. తను ముందుగానే వాళ్ళ కంట పడకూడదన్న ఉద్దేశంతో విరాట్‌ సహస్ర వద్దే ఉండిపోతాడు.  వెంకట రత్నం నాయుడు గారికి దీక్ష తెలుసుకాబట్టి  తనను గుర్తు పడతారని తనూ సహస్రతోనే  ఉండి పోతుంది దీక్ష.  ఆ తరువాత...    ఆ తరువాత...

 

‘‘లేదు లేదు. సహస్ర మేడమీద ఉంది’’

‘‘మరి ఈ అమ్మాయెవరు?’’

‘‘ఎవరేమిట్రా వరసయిన అమ్మాయి గాబట్టి వరసలు కలిపి ఆహ్వానిస్తోంది. తినబోతూ రుచి అడగటం ఏంటి కాళ్ళు కడుక్కొని  లోనకు పద’’ అన్నాడు మునుసామి.

ఇంతలో వేన్‌ కూడా లోనకు రావటంతో చందూ వెంట విక్రాంత్‌ కూడా వేన్‌ దిగాడు. వాళ్ళనీ వరస కలిపి ఆహ్వానించింది విశాల. స్వయంగా తనే అందరికీ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళందించింది.

వచ్చిన వాళ్ళలో ఒక్క చందూ తప్ప`

అందరికీ విశాల ఒక సస్పెన్స్‌ అయిపోయింది.

‘‘విరాట్‌ ఎక్కడ్రా?’’ అంటూ మునుసామిని అడిగాడు సోఫాలో కూచుంటూ వెంకటరత్నంనాయుడు.

‘‘వస్తాడ్రా. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ముందు కాస్త రిలాక్సవండి’’ అన్నాడు మునుసామి. అంతా హాల్లో సోఫాలో సెటలయ్యారు. విశాల అందరికీ జ్యూస్‌ గ్లాసులు అందించింది.

‘‘అమ్మా విశాల ఓ సారి రా తల్లీ’’ అంటూ ` అంతా జ్యూస్‌ తాగి స్థిమితపడ్డాక పిలిచాడు మునుసామి.

‘‘చెప్పండి మావయ్య ఏంకావాలి?’’ అంటూ దగ్గర కొచ్చింది విశాల.

‘‘మరేం వద్దుగాని ఒక్కనిముషం ఆగు. ఏరా సరిగా చూడు. ఈ అమ్మాయిని ఎప్పుడన్నా చూసిన గుర్తుందా?’’ వెంకటరత్నం నాయుడ్ని అడిగాడు.

‘‘అదేగా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ చూసిన గుర్తులేదే!’’ అన్నాడాయన.

‘‘ఒకె. ఇక్కడ ఎగ్మోర్‌లో ‘స్మైల్‌ రెడీ మేడ్స్‌’ అని పెద్ద రెడీమేడ్‌ దుస్తుల కర్మాగారం ఒకటుంది. మూడువందల మంది పనిచేస్తారు. వారి దుస్తులు విదేశాలకీ ఎక్స్‌పోర్ట్‌ అవుతాయి. అక్కడ ఫ్యాషన్‌ డిజైనర్‌ కమ్‌ ఓనర్‌ విశాల... తెలుసా’’

‘‘అవును విన్నాను. మన లక్ష్మీమిల్స్‌ నుంచి కూడా వాళ్ళకి క్లాత్‌ మెటీరియల్‌ సప్లై అవుతుంది. మనకున్న పర్మనెంట్‌ కష్టమర్లలో వాళ్ళు ఒకరు.  ఇంతకీ...’’

‘‘అక్కడికే వస్తున్నా. ఆ కంపెనీ ఓనర్‌ విశాల.... ఎవరో కాదు ఈ అమ్మాయే’’

వెంకటరత్నం నాయుడికి ఆశ్చర్యంగా వుంది. అప్పటికీ విషయం అర్థం కాలేదు.

‘‘సంతోషం కాని మమ్మల్ని వరసలు కలిపి పిలుస్తోందంటే మరేదో కారణం ఉంది. ఏమిటది?’’ అనడిగాడు.

‘‘ఏమిటంటే ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రంగనాథ చౌదరి అని మన కోయంబత్తూరు వాడే. ప్రస్తుతం ఆయన లేడు. సమీపకాలంలోనే గుండెపోటుతో మరణించాట్ట.ఈ అమ్మాయి ఆయన కూతురు...’’

ఆయన మాటలు వింటున్న మంగతాయారు భర్త కన్నా ముందే చట్టున లేచి నిలబడుతూ` ‘మరిదీ మునుసామి ఏమిటయ్యా నువ్వంటున్నది గనాథ చౌదరి కాలం చేసారా... ఈ అమ్మాయి ఆయన కూతురా... మరి మా ఆడబిడ్డ... కాంచన మాల.. కాంచనమాల ఎక్కడ?’ అంది ఒక్కసారిగా గుడ్లనీరు నించుతూ. 

అప్పటికి విషయం అర్థమై తనూ లేచి ఆశ్చర్యంగా విశాలను చూసాడు వెంకటరత్నంనాయుడు. చెల్లెలు కాంచనమాల గుర్తొచ్చింది. విశాల ఎవరోకాదు. తన మేనకోడలు. అందుకే వరసలు కలిపింది.

‘‘చెప్పరా మునుసామి మా కాంచనమాల ఎక్కడ? చెప్పమ్మ విశాల నువ్వెవరో ఇప్పుడు కదా అర్థమైంది. అమ్మ ఎక్కడా? తనయినా క్షేమంగా ఉందా?’’ అంటూ బొంగురు పోయిన గొంతుతో ఆయన అడుగుతుంటే విశాలకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

మునుసామి చెమరించిన కళ్ళు తుడుచుకుంటూ లేచి అందర్ని చూసాడు. ‘‘మీరేమి కంగారు పడకండి. తను క్షేమంగా ఇక్కడే వుంది. మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చేవరకూ నాకూ వీళ్ళగురించి తెలీదు. ఇందులో మరో విశేషం ఏమంటే వీళ్ళేవరో తెలీకుండానే విరాట్‌కి ఈ కుటుంబంతో అనుబంధం ఏర్పడటం. నేను చెప్పేవరకు మన చినబాబుకీ తెలీదు తను వున్నది స్వయాన మేనత్త ఇంట్లో అని విశాల తన మరదలని.

ఆ రోజు ఎక్కడో చెత్తకుప్పలో శవాల్లా తెలివి తప్పి పడున్న సహస్ర విరాట్‌లిద్దర్ని చందూ సాయంతో ఎవరికీ తెలీకుండా కార్లో తీసుకొచ్చింది విశాల. పక్కవీధిలోని తన స్నేహితురాలు డాక్టర్‌ గుణదీపిక చేత ఆపరేషన్‌ చేయించి కాపాడి తెచ్చి తన ఇంట్లో ఇద్దర్నీ ఉంచుకుంది విశాల’’ అంటూ మునుసామి వివరిస్తుంటే మంగతాయారు విశాలను దగ్గరకు తీసుకుంది.

ఇంతకాలం బంధువర్గానికి దూరంగా వున్న విశాలకి ఇప్పుడు తమ వాళ్ళందర్ని చూస్తుంటే దు:ఖం ఆగటంలేదు ‘అత్తయ్యా’ అంటూ మంగతాయారు కౌగిలించుకొని ఏడ్చేసింది. ఆమె కళ్ళు తుడిచి ఓదార్చింది మంగతాయారు.

‘‘ఇంతకి చెల్లమ్మ ఎక్కడ్రా?’’ ఇక సస్పెన్స్‌ భరించలేక ఆత్రంగా అడిగాడు వెంకటరత్నంనాయుడు.

‘‘అదో మీకు ముఖం చూపించలేక తనలో తను కుమిలిపోతూ ఆగదిలో వుంది. వెళ్ళి పలకరించండి.’’ అంటూ ఎదురుగా గదివైపు చూపించాడు మునుసామి.

అంతే...

ముందు వెంకటరత్నంనాయుడు ఆ వెనకే కుటుంబమంతా ఆగదిలోకి పరుగు తీసింది. అదే సమయంలో కళ్ళు తుడుచుకొంటూ విరాట్‌ కోసం మేడమీదకు పరుగు తీసింది విశాల.

‘‘మనం కూడా లోనకెళ్దాం.పాపం అంతా దుఖ్ఖంలో వున్నారు’’ అన్నాడు చందూ.

‘‘పిచ్చోడా, ఆ దుఖ్ఖమంతా కాస్సేపేరా. నవ్వుతో అంతా బయటికోస్తారు చూడు’’ అంటు తాపీగా కూచున్న చోటునుంచి కదలకుండా బదులిచ్చాడు మునుసామి.

అతడికి అనుబంధం నేర్పిన పాఠం. చిరకాలం తర్వాత కలుసుకున్న ఆనందలో అన్నా చెల్లెల్లు కాస్సేపు కౌగిలించుకొని ఏడుస్తారు. తర్వాత పరామర్షలు పరిచయాలు. సంతోషంతో కేరింతలు కొడతారు, నిజంగా ఈ రోజు వాళ్ళందరికీ సుదినం. పండగ రోజు. వాళ్ళకేనా. తనకి కూడ. ఈ శుభసందర్భంలో రాత్రికి మందువేయాల్సిందే.

ఆలోచిస్తున్నాడు మునుసామి.

ఈ లోపల విరాట్‌ విశాల యిద్దరూ ముందు మెట్లు దిగివచ్చారు. ఆ వెనకే దీక్ష సాయంతో జాగ్రత్తగా తనూ కిందకొచ్చింది సహస్ర. గత సాయంకాలమే డాక్టర్‌ గుణదీపిక సహస్ర తలకి వేసిన బాండేజీలను తొలగించింది. కుట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేస్తూ తిరిగి గాయానికి డ్రస్సింగ్‌ చేసి తలవరకు చిన్న బాండేజి మాత్రం వేసి వదిలింది.

వాళ్ళంతా మెట్లు దిగిరావటం చూసి సోఫాలోంచి లేచాడు మునుసామి. ‘‘ఏమిటీ తల్లీ నువ్వెందుకు దిగిరావటం. ఇంత నీరసంలో అవసరమా? మేమే వచ్చేవాళ్ళంగదా’’ అన్నాడు సహస్రనుద్దేశించి.

‘‘ఫరవాలేదు. అందర్నీచూడాలనిపించింది’’ అంది నవ్వుతూ సహస్ర.

ఇంతలో ముందుగా వెంకటరత్నంనాయుడు, ఆ వెనకే విక్రాంత్‌ కూతుర్ని చంకనేసుకుని కాంచనమాల తర్వాత మిగిలిన వాళ్ళు అంతా ఆనందంతో బయటకు రావటం చూసి మురిసిపోయారు.

‘‘రా రా మిమ్మల్ని చూడాలని తనే కిందికొచ్చింది సహస్ర’’ అంటూ మునుసామి సహస్రను వెంకటరత్నంనాయుడుకి మిగిలిన వారికి పరిచయం చేసాడు.

నేరుగా చూళ్ళేదుగాని సహస్రతో చాలా సార్లు ఫోన్‌లో మాట్లాడిరది మంగతాయారు. సింపుల్‌గా పసిడి బొమ్మలా మెరిసిపోతున్న సహస్రను చూసి అంతా సంతోషించారు.

‘‘నీకు తెలుసో తెలీదో అమ్మాయ్‌. లహరిగా నీకు నేనూ ఫాన్‌నే. నువ్వు మాకోడలివి గావటం మాకు ఆనందంగా ఉంది.’’ అన్నాడు వెంకటరత్నంనాయుడు.

‘‘థ్యాంక్యూ మావయ్యా. ఏయ్‌ విశాలా ఇలారావే!’’ అంటూ విశాలను దగ్గరకు పిలిచింది. వెంకటరత్నం నాయుడు మంగతాయారు దంపతుల్ని పక్కన నిలబడమని చెప్పి...

‘‘సాక్షాత్తు ఆది దంపతుల్లా వున్నారు. మమ్మల్ని ఆశీర్వదించండీ’’ అంటూ విశాలతో కలిసి ఇద్దరికీ పాదాభివందనం చేసింది.

వాళ్ళిద్దరూ ఇకే సారి దండంపెడుతుంటే అర్థంగాక అయోమయంగా ముఖముఖాలు చూసుకున్నారు నాయుడు దంపతులు.

సరి పెళ్ళికావలసిన యువతులు కాబట్టి యిద్దరూ ఆశీర్వాదం కోరుతున్నారు అనుకుని, వారి వినయానికి మురిసిపోతూ... ‘అభీష్ట సిద్ధిరస్తు’ అంటూ మంగతాయారు, శ్రీఘ్రమేవ కళ్యాణప్రాప్తిరస్తు’ అంటూ వెంకటరత్నంనాయడు యువతులిద్దర్నీ దీవించేసారు.

‘‘ఇదిగో అమ్మాయ్‌ సహస్ర. నువ్వు మాకు తెగనచ్చావమ్మా. మా పాత గొడవలు మరే కారణాలయినా మనసులో పెట్టుకుని మీ డాడీ మహాదేవనాయకర్‌ కాదన్నా నువ్వే మా కోడలివి.’’ అంటూ ఆనందంతో భరోసా ఇచ్చేసాడు వెంకటరత్నంనాయుడు.

‘‘అయ్యో మావయ్యా. మీకింకా తెలీదా? మా డాడీ అభ్యంతరం ఏమీ లేదు. మావ అల్లుడూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. మీ అబ్బాయి నడగండి’’ అంటూ సహస్ర అసలు విషయం చెప్పగానే అంతా నవ్వుకున్నారు.

‘‘ఇంతకీ ఎక్కడ్రా వీడు? చిన్నోడా?’’ అంటూ చుట్టూ చూస్తూ తండ్రి పిలవగానే అప్పుడు ముందుకొచ్చాడు విరాట్‌.

చాలా కాలంతర్వాత చిన్నకొడుకును చూసిన ఆనందలో కాస్సేపు ఉక్కిరిబిక్కిరయ్యాడు వెంకటరత్నంనాయుడు. ఎడం చేతి గాయానికి వేసిన బాండేజ్‌ను తడిమి చూసాడు. ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

‘‘సారీ డాడీ.. మిమ్మల్ని చాలా బాధపెట్టాను’’ అన్నాడు విరాట్‌.

‘‘లేదు పిల్లల మనసు తెలిసీ పట్టుదలకు పోవటం పెద్దల తప్పే. నేనే పొరపాటు చేసాను. కోపం పోయిందిగా? మేనకోడలు సాగరికను కాదన్నా, ఆణిముత్యంలాంటి సహస్రను కోడలిగా తెస్తున్నావ్‌. నీ మీద నా కిప్పుడు కోపం లేదు. అక్కకి ఎలాగో నచ్చచెప్తాలే. ఇవేమి మనసులో పెట్టుకోకు. ఆ త్యాగరాజన్‌ ఓ గుంటనక్క. సహస్రను కాపాడి వాడ్ని కటకటాల వెనక్కి నెట్టే వరకు విశ్రమించకు. మీ వెనక మేం వున్నాం. విజయం మీదే. ఈలోపల సాగరికతో బాటు మన విశాలకీ మంచి సంబంధం చూస్తే మీ మూడు జంటలకీ ఒకేసారి వైభవంగా పెళ్ళి జరిపించేస్తాం’’ అన్నాడు.

ఆమాట, ముఖ్యంగా చివరి మాటలు వినగానే అంతా సైలంట్‌ అయిపోయారు. ఎందుకంటే అసలు విషయం అటుకాంచనమాలకీ తెలుసు ఇటు మునుసామి మిగిలిన వాళ్ళకీ తెలుసు. విశాల విరాట్‌ని ఇష్టపడుతున్న విషయాన్ని ఇప్పుడే చెప్పటం ఇష్టంలేక చందూ దీక్షలతో బాటు అంతా మౌనం వహించారు. కాని మునుసామి సుచాయగానయినా ముందే హింట్‌ యివ్వటం మంచిదనుకుంటూ... ‘‘ఒరే. నువ్వప్పుడే పెళ్ళిళ్ళవరకు వెళ్ళమాకు. సాగరికకు సంబంధం చూస్తునన్నావ్‌ ఒకే. విశాల విషయంలో ఆ అవసరం లేదు. తనూ ఓ అబ్బాయిని లవ్‌ చేసిందట. సమయం వచ్చినప్పుడు చెప్తానంటోంది. కాబట్టి ఆ విషయం వదిలెయ్‌’’ అంటూ సూచించాడు.

‘‘అలాగా అయితే మంచిదేగా ఈ కాలం పిల్లలు తప్పు చేయరని తమ పార్టనర్స్‌ని ఎంచుకోవటంలో పొరపాటు పడరనీ నాకు అర్థమైంది. ఒకే అవునూ ఇలారా అమ్మాయ్‌. నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు  మాఫ్రండు మధురై మాసిలామణి కుతూరు దీక్షవికదూ?’’ అంటూ దగ్గరకు పలిచాడు.

‘‘అవునంకుల్‌ గుర్తుపట్టారు’’ అంటూ వినయంగా వచ్చి దంపతుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది దీక్ష.

‘‘ఒరే. ఈ అమ్మాయికీ సంబంధాలు చూద్దాం అనకు. ఎందుకంటే ఆల్రెడీ మన చందూతో లవ్‌ అయిపోయి పెళ్ళికి ఎదురు చూస్తున్నారు. తన అన్నలెలాగు పట్టించుకోరు. వీళ్ళ పెళ్ళికూడా మనమే దగ్గరుండి జరిపించాలి.’’ అని మునుసామి అంటుంటే అంతా నవ్వుకున్నారు.

అంతా స్థిమితంగా కూచుని కబుర్లు చెప్పుకుంటున్న సమయానికి కదిరేశన్‌ వేన్‌లోనకొచ్చింది. అందులోంచి కదిరేశన్‌ వెంట బండశివా, ధర్మ మరో ముగ్గురు విరాట్‌ ఫ్రండ్సు అంతా దిగారు.

తిరిగి ధర్మతో అందరికీ పరిచయాలు పరామార్శలు. సహస్రను వాళ్ళు ఇప్పుడే చూడ్డం.

ఆ తర్వాత విందు భోజనాలు మొదలయ్యాయి. కాంచనమాలకి బంధువులరాకతో చాలా ఆనందంగా వుంది. సమీపకాలంలో తల్లిని ఇంత సంతోషంగా ఎప్పుడూ చూళ్ళేదు విశాల. ఇక వెంటరత్నంనాయుడు గార్ని ఒక సందేహం బలంగా పీడిరచటం ఆరంభించింది.

‘‘కాంచనమాలను విశాల మమ్మీ అని పిలుస్తోంది. సహస్ర మమ్మి అంటుంది. విరాట్‌ని కూడా విశాల బావా అనటంలో అర్థం వుంది. కాని సహస్ర కూడా బావా అనే పిలుస్తోంది. అంతే కాదు. భోజనాలప్పుడు ముచ్చట్లాడుతున్నప్పుడు కూడా బావా బావా అంటూ రాజుకుపూసుకు తిరుగుతొంది విశాల. కొంపదీసి సహస్రతో బాటు విశాల కూడా విరాఠ్‌ను ప్రేమించటం లేదుకదా! ఆల్రెడీ ఎవరో ` అబ్బాయిని లవ్‌ చేస్తోందని మునుసామి చెప్పనే చెప్పాడు. ఆ అబ్బాయి విరాట్‌ కాదుగదా? వూహ ఈ సస్పెన్స్‌ తెలియాలంటే మునుసామి పిలక పుచ్చుకుంటే గాని తెలీదు. వీడిసంగతి రాత్రికి చెప్తా’’ అనుకున్నాడు వెంకటరత్నంనాయుడు.

రాత్రంతా కారు ప్రయాణంలో అలసిపోయి వున్నారు గాబట్టి కిందగదుల్లోనే ఓ గదిలో వెంకటరత్నంనాయుడు మరో గదిలో భార్య, కోడలు పిల్లలు అంతా నిద్రకుపక్రమించగా దీక్ష విశాల సహస్ర ముగ్గురూ కాంచనమాల గదిలో చేరిపోయారు.

మేడమీద విరాట్‌ గదిలో మిగిలిన వాళ్ళు సమావేశమయ్యారు. విశ్రాంతి సంగతి కూడా మర్చిపోయి తమ్ముడు విరాట్‌ వెంట వచ్చి తనూ ఆ సమావేశంలో కూచున్నాడు విక్రాంత్‌.

ధర్మ, మునుసామి, కదిరేశన్‌, ఇంకా మిగిలిన వాళ్ళు అంతా ఈ రోజువరకు సహస్ర విషయంలో జరిగిన సంఘటనల్ని విరాట్‌తో ఓ సారి కూలంకషంగా సమీక్షించుకున్నారు.

ఇప్పటికే త్యాగరాజన్‌ కేసును మధురై నుండి చెన్త్నై కోర్టుకు బదిలీ చేయమని కారణాలు వివరించి అర్థిస్తూ సహస్ర సుప్రీంకోర్టు ధర్మాసనానికి లెటర్‌ వ్రాయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సహస్ర సైదాపేట సెషన్స్‌ కోర్టుకి హాజరుకావలసి ఉంటుంది. అంత వరకు సహస్రను వేయికళ్ళతో శతృకంటపడకుండా రక్షించుకోవాలి.

త్యాగరాజన్‌ కూడా చెన్త్నైలోనే ఉన్నాడు. ఏదో విధంగా ఈలోపల లేదా కోర్టుబయట సహస్రను తుదముట్టించే పథకరచనలో ఉంటాడు. కాబట్టి ఒకనిర్థిష్టమైన ప్లాన్‌తో సహస్ర రక్షణకు తామంతా చర్యలు తీసుకోవాలి.

తన మనుషుల్ని ఆరుగుర్ని విశాల యింటి వద్ద నిరంతర కాపలాకి ఏర్పాటు చేసాడు కదిరేశన్‌. పగలు రాత్రి ఇద్దరిద్దరుగా ఇరవై నాలుగ్గంటలూ పటిష్టంగా కాపలా ఉంటారు.

తన మనుషుల్ని అటు గోస్వామి కాలనీలోను ఇటు ఓల్డ్‌ మాంబళంలోను మొహరించి అనుమానితుల్ని పసిగట్టి తగిన చర్యతీసుకునేలా ఏర్పాటు చేస్తానన్నాడు మునుసామి. ఇక ధర్మ తన మిత్ర బృంధంతో లాడ్జిమీద నిఘా వుంచి త్యాగరాజన్‌్‌ మనుషుల జాడ తెలుసుకునే ఏర్పాటు చేస్తానన్నాడు.

చాలాసేపు వాళ్ళ చర్చలు వ్యూహాలు వింటూ మౌనంగా కూచున్నాడు విక్రాంత్‌.  ఉన్నట్టుండి అసహనంగా అటూయిటూ కదిలి తమ్ముడు విరాట్‌ వంక విసుగ్గా చూసాడు.

‘‘ఏరా! మీ మాటలు వింటుంటే ఎంతసేపూ ఏటి వాలుకు కొట్టుకుపోయే ధోరణి కన్పిస్తోంది గాని ఏటికెదురీది త్వరగా ఒడ్డుకి చేరాలన్న ఆలోచేనే వున్నట్టులేదే’’ అన్నాడు.

ఆ మాటలతో ఒక్కసారిగా అందరిదృష్టి విక్రాంత్‌ వైపు మళ్ళింది. అతడి ఉద్దేశం తెలీక ముఖముఖాలు చూసుకున్నారు.

‘‘ఏంటన్నయ్యా, ఏమంటున్నావ్‌’’ అనడిగాడు విరాట్‌.

‘‘అవును పెదబాబు నీ అభిప్రాయం ఏమిటో వివరంగా చెస్తే గదా మాకూ అర్థమవుతుంది’’ అన్నాడు మునుసామి.

‘‘మీరంతా సహస్ర రక్షణకి తగిన ఏర్పాట్లు చేయటం మంచిదే’’

‘‘ఇక్కడ రెండు ముఖ్య విషయాల్ని మీరు పట్టించుకోడం లేదు. గట్టు తెగి వరదనీరు ముంచెత్తాక తీసుకునే జాగ్రత్తల కన్నా అసలాగట్టు తెగకుండా ముందే పటిష్టమైన చర్యలు తీసుకోవటం తెలివైన పని. ఇది నా అభిప్రాయం.

మీరు పట్టించుకోని మొదట విషయం త్యాగరాజన్‌ కుడి భుజం ఎట్టయప్ప. వాడు మధురైలో లేడని ఓపక్క ధర్మ చెప్తూనే ఉన్నాడు. అల్లర్ల తర్వాత వాడక్కడ కన్పించటం లేదంటే అర్థం ఏమిటి? వాడు కూడా మరికొందర్ని తీసుకొని చెన్నై వచ్చేసాడని అర్థం. వాడ్ని ట్రేసవుట్‌ చేసి వాళ్ళకదలికల్ని ముందే గమనించటం తెలివైన పని.

ఇక మీరు వదిలేసిన రెండవ విషయం త్యాగరాజన్‌్‌. వాడు ఇక్కడే ఉన్నాడని తెలుసుగదా. ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు సహస్ర విషయంలో వాళ్ళ వ్యూహం ఏమిటి? అది తెలియాలి. కాని వాళ్ళు అటాక్‌ చేస్తే తిప్పి కొట్టడం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. అసలు వాళ్ళ వ్యూహం ఏమిటో ముందే తెలుసుకుంటే వాళ్ళని దెబ్బకొట్టడం సులువనేది నా అభిప్రాయం.

చెన్నైలో కూడా త్యాగరాజన్‌్‌కి చాలా ఇళ్ళున్నాయని విన్నాను. కాని కాపురం ఉండేది మాత్రం ఆర్‌కె నగర్‌లోని కలైంజర్‌ స్ట్రీట్‌లోని ఇంట్లో.కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడాయింట్లో ఉంటాడని అనుకోను. మధురై పరిస్థితులమీద పోలీసులు వచ్చి ప్రశ్నించవచ్చు లేదా మీడియావాళ్ళు వెంట పడొచ్చు. కాబట్టి మరోచోట ఎక్కడో వుంటూ ఏదో టైంలో ఇంటికి వచ్చి పోతుంటాడు. అలాగే ఎట్టయ్యప్ప వాడి మనుషులు కూడా సిటీలోని లాడ్జిల్లో దిగరు. అక్కడ వెదికినందువల్ల ప్రయోజనం ఉండదు. వాళ్ళు కూడా త్యాగరాజన్‌కి చెందిన ఏదో ఇంట్లోప్రస్తుతం షెల్టర్‌ తీసుకునుంటారు. 

కాబట్టి మన ధర్మ మిగిలిన ఫ్రెండ్సు స్థానికులుగాబట్టి ఎట్టయప్పను వాడిమనుషుల్ని సులువుగా గుర్తించగలరు. జగన్మోహన్‌ ఇంటి సమీపాల్లో కూచుంటే జగన్మోహన్‌ గాని వాడి మనుషులుగాని దొరక్కపోరు. వాళ్ళని ఫాలో చేస్తే ఎక్కడ ఉండేది తెలిసిపోతుంది. ఆ తర్వాత వీలుచూసి ఎట్టయ్యప్ప మనుషుల్లో ఏ ఒక్కడ్ని పట్టితెచ్చినా వాళ్ళ ప్లాన్స్‌ ఏమిటో మనకి తెలిసిపోతాయి. ఇలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత మీ యిష్టం’’ అన్నాడు విక్రాంత్‌

అన్నగారి మాటలకి విరాట్‌ ముగ్ధుడైపోయాడు. ఆ ఆలోచనలు అందరికీ ఆమోదయోగ్యంగా వున్నాయి.

‘‘ఓ మైగాడ్‌ అన్నయ్యా డాడీ లాగే నువ్వు పక్కా బిజినెస్‌మేన్‌వి అనుకున్నాను. నీలోకూడా ఇంత లౌక్యం, ఆలోచన ఉన్నాయనుకోలేదు. థ్యాక్సన్నయ్య’’ అన్నాడు అభినందిస్తూ.

విక్రాంత్‌ నవ్వాడు.

‘‘ఏరా! వ్యాపారంలో శతృవులుండరనుకుంటున్నావా? అక్కడే ఎత్తుకు పైఎత్తులు వేసి శతృవుల్ని కిందకి తొక్కకపోతే మనం పైకి రాలేం. లౌకిక విషయాలకీ అదే సూత్రం వర్తిస్తుంది. వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్‌ చేయండి. మీరెక్కడున్నారో ఆ త్యాగరాజన్‌కి తెలిసేలోపు వాడెక్కడున్నాడో తెలిసి ఉంచుకోవటం చాలా అవసరం. నాకునిద్రొస్తోంది’’ అంటూ చెప్పాల్సింది చెప్పి విరాట్‌ బెడ్‌మీదే పడుకున్నాడు విక్రాంత్‌.

త్యాగరాజన్‌ ఎట్టయప్పల జాడతీసే బాధ్యతను తనుతీసుకుని ధర్మ మిగిలిన వాళ్ళతో అక్కడినుండి బయలు దేరాడు. కదిరేశన్‌తోబాటు వాళ్ళంతా వెళ్ళిపోగానే విరాట్‌ అన్న విక్రాంత్‌ పక్కనే పడుకున్నాడు. మునుసామి పక్కన సోఫాలో నడుంవాల్చాడు. కాస్సేపటికి విశాల వచ్చి ఆ గదిలోకి తొంగిచూసే సరికి వాళ్ళంతా గాఢనిద్రలో వున్నారు. అప్పటికి సాయంకాలం మూడు గంటలు సమయం.

I                I               I

రాత్రి ఎడుగంటలు.....

గోస్వామి కాలనీ.....

వెంకటరత్నం నాయుడు మునుసామి యిద్దరూ విరాట్‌ గదిలో ప్రశాంతంగా కూచుని విస్కీ బాటిల్‌ ఓపెన్‌ చేసారు. సాయంత్రం అయిదు గంటలకి నిద్రలేవగానే స్నానాదికాలు ముగించి మునుసామిని తీసుకుని వచ్చేసాదు వెంకటరత్నంనాయుడు.

‘‘ఏదో అడగాలన్నావ్‌! ఏమిట్రా?’’ ఒక పెగ్గులాగించేసాక అడిగాడు మునుసామి.

‘‘ఏం లేదుగాని...’’

‘‘ఇంత క్రితం ఏదో ఉందన్నావ్‌గా...’’

‘‘ఉంది ఇంతకాలానికి చెల్లెమ్మను కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. విశాల... నా మేనకోడలు. అందంగా వుంది. తెలివైనది. తండ్రి స్థాపించి వెళ్ళిపోయిన సంస్థని ఇంత ఉన్నత స్థితికి తెచ్చింది. సాగరికను కాదంటే సరే, కనీసం విశాలనన్నా మనోడు పెళ్ళిచేకుంటే బంధుత్వం కలిసేది. కాని వీడేమిట్రా, సహస్రని ప్రేమించాడు. నాకేమీ అర్థం గావటం లేదు.’’

మునుసామి వెంకటరత్నంనాయుడి డౌటేమిటో గ్రహించాడు. సూటిగా అడక్కుండా విషయాన్ని చుట్టు తిప్పి తీసుకొచ్చి తన చేతే నిజం చెప్పించాలని చూస్తున్నాడు. కాని తను చెప్పడుగా.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్