Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగినకథ: ప్రతిమతో గడిపిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి అభిరామ్‌కి.  ఆమె స్నేహం పెరిగి పెద్దదవడం...ఓ శుభ ముహూర్తాన ఒకర్నొకరు చూసుకోవడం...కలిసి సాయంత్రాలు ఖర్చు చేయడం...అన్నీ అన్నీ అతడి మనో ఫలకం పై ప్రగాఢ ముద్రనే వేస్తాయి.. ఆమె గురించి అన్ని విషయాలూ తనకు సంపూర్ణంగా తెలీలేదనే విషయం తెలుసుకునే సరికే...తన చుట్టూ ఎన్నెన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి. తానొటి తలిస్తే విధి ఒకటి తలుస్తుందన్నట్లు...ప్రతిమ తో జీవితం పంచుకోవాలనుకుంటే...అది జరగ లేదు సరి కదా, ప్రతిమ జీవితమే తనని అడుగడుగునా వెంటాడుతుంటుంది. ఆ తరువాత..   

 

సెవంత్‌ ఫ్లోర్‌కొచ్చి ఆగింది లిఫ్ట్‌. డోర్‌ తెరుచుకుని ఫ్లోర్‌లోకి అడుగుపెట్టారు. ఆ ఫ్లోర్‌ ఫ్లోరంతా వాగ్దేవి ప్రొడక్షన్స్‌ లేటెస్ట్‌ మూవీ...‘ప్రియతమా’  ఆకర్షణీయమైన వాల్‌ పేపర్స్‌ అంటించి ఉన్నాయి. కొత్త హీరో హీరోయిన్లు కాబోలు...మేడ్‌ఫర్‌ ఈచ్‌ అదర్‌లా కనిపించి కవ్విస్తున్నారు. ఈ చివర్నుంచీ ఆ చివరివరకూ విశాలంగా ఉన్న కారిడార్‌. ఆ తర్వాత చిన్ని చిన్ని క్యాబిన్స్‌. ఫిల్మ్‌ ఆఫీసైనా కార్పొరెట్‌ లుక్‌తో ఉంది.

‘‘ఎవరు కావాలి?’’ అడిగాడు సిద్దార్థని ఎదురొచ్చిన ఆఫీస్‌ బాయ్‌.

‘‘ప్రతిమ.’’ అనగానే...‘‘రండి సార్‌’’ అంటూ ఆ ఫ్లోర్‌లో కొంత దూరం నడిపించి ఓ క్యాబిన్‌ చూపించాడతడు.

అద్దాల అవతల్నుంచి అంతా గమనిస్తున్న ఆమె లేచి చిర్నవ్వుల తో వెల్‌కం చెప్పింది.

ముందు సిద్దార్థ...ఆ వెనుక తేజ లోనికి ప్రవేశించారు.

‘టీ..కాఫీ..’’ ఆఫర్‌ చేసిందామె.

‘‘యాజ్‌ యువర్‌ విష్‌...’’అన్నాడు సిద్దార్థ.  ఆమె బెల్‌నొక్కి ఆఫీస్‌బాయ్‌కి కాఫీ ఆర్డర్‌ చేసింది.

కను రెప్పలు వాల్చకుండా ఆమెవైపు తదేకంగా, తన్మయంగా చూస్తున్నాడు తేజ. ఆమె గురించి సిద్దార్థ చెప్పింది తక్కువేననిపించింది ఆ క్షణంలో తేజాకి. అందానికి అందంలా భాసిస్తోందామె. చిక్కటి చీకటితెరల్నే కురులుగా సింగారించుకుంది. కను రెప్పలకి నల్లటి కాటుకను రాసుకుంది. పల్చటి పెదాలకు ఎర్రని లిప్‌స్టిక్‌ పూసుకుంది. నవ్వితే చిన్నగా సొట్టపడుతున్న బుగ్గలపైనా కించిత్‌ అరుణిమ నేనున్నానంటూ దోబూచులాడుతోంది. పంజాబీ డ్రస్‌లో ఇమిడిపోయిన సొగసైన కుందనపు బొమ్మ...అనుకున్నాడు తేజ.  ఈమెని చూసిన మొదటి క్షణంలోనే హీరోయినో...కాస్మోటిక్‌ ప్రొడక్ట్‌ల స్క్రీన్‌ యాడ్స్‌కోసం కెమెరాలకు ఫోజిచ్చే మోడలో అనుకుంటారు.

‘‘ఊ...చెప్పండి. ఎందుకో అర్జంట్‌గా రమ్మన్నారు’’ డైరక్ట్‌గా విషయంలోకి వచ్చాడు సిద్దార్థ.

‘‘అవన్నీ కాఫీ తాగిన తర్వాత .... ఇంతకీ,ఈయన మీ దోస్తా?’’ ఆమె డైరక్ట్‌గా అడిగేసింది.

‘‘నా అసిస్టెంట్‌...’’అంటూ సిద్దార్థ ...‘‘ఎలక్ట్రానిక్‌ మీడియాలో క్రయిం రిపోర్టర్‌ని’’ అంటూ తేజా ఒకేసారి జవాబిచ్చారు.

ఆ ఇద్దర్నీ ఒక్కసారి ప్రశ్నార్ధకంగా చూసిన ఆమె`‘ఓహో...! ‘ఓపక్క క్రయిం రిపోర్టర్‌గా పనిచేస్తూనే...ఈయన దగ్గర అసిస్టెంట్‌గా ఉంటున్నారన్నమాట’’ ఓ ముక్తాయింపు ఇచ్చింది.

‘‘ఎస్‌...ఎస్‌...సిద్దార్థ దగ్గర అసిస్టెంట్‌గా తర్ఫీదవుతున్నా’’ అన్నాడు తేజ.

‘‘అయితే, ఇంకేం! నా కేసులో మీ ఇద్దరి బ్రెయిన్లూ పనిచేస్తాయన్నమాట...’’ అందామె.

ఇంతలో, పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీని మూడు కప్పుల్లో తీసుకొచ్చాడు ఆఫీస్‌బాయ్‌. తనో కప్పు అందుకుని...‘హేవిట్‌..’ అందామె. నెమ్మదిగా కాఫీ తాగి ఖాళీ కప్పులు ట్రేలో పెట్టిన తర్వాత భుజందాకా వేలాడుతున్న వదులైన శిరోజాల్ని సొగసుగా సవరించుకుంది.

‘‘మీ ఆఫీసు సిన్మా ఆఫీసులా లేదు...’’ అన్నాడు సిద్దార్థ.

‘‘నాకూ కొంతమంది ప్రొడ్యుసర్లు, సిన్మా ఆఫీసుల్తో పరిచయముంది. ఆ ఆఫీసుల లుక్కే వేరు. రిలాక్స్‌డ్‌గా స్టోరీ డిస్కషన్స్‌ కోసం ఓ రూంలో నేలంతా పరుపులే పరుస్తారు’’ అన్నాడు తేజ.

‘‘మా చైర్మన్‌గారి అభిరుచే వేరు. రండి...ఆఫీసోసారి చూద్దురుగాని...’’అంటూ తను లేచింది. ఆమెని అనుసరిస్తూ ముందు సిద్దార్థ...ఆవెనుక తేజ. ఒక్కో క్యాబిన్‌ చూపిస్తూ డిటెయిల్స్‌ చెప్తోంది ప్రతిమ.

‘‘వాగ్దేవి ప్రొడక్షన్స్‌లో ప్రతి ఒక్కరూ ఎంప్లాయే. ప్రతిరోజూ టెన్‌టూ సిక్స్‌ డ్యూటీ చేయాల్సిందే. ఎంప్లాయిస్‌కి ఉండే అన్ని ఫెసిలిటీస్‌ ఇక్కడ వర్తిస్తాయి. సీఎల్స్‌, పీఎల్స్‌, సిక్‌లీవులుంటాయి. పిఎఫ్‌ కటింగ్‌ కూడా ఉంది’’

‘‘అంటే...సర్వీస్‌ రూల్సన్నీ వర్తిస్తాయన్నమాట’’

‘‘అన్నమాట కాదు...ఉన్నమాటే. సాధారణంగా ఇండస్ట్రీలో సిన్మా తీస్తున్న టైంలోనే టెక్నిషియన్లకు జీతభత్యాలుంటాయి. కానీ, ఇక్కడలా కాదు..సంస్ధలో చేరి పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ నెలసరి జీతగాడే. వాగ్దేవి ప్రొడక్షన్స్‌లో పనిచేస్తున్నాననే ధీమాతో హాయిగా బతికేయొచ్చు.  అంతేనా!  ప్రతి మూడునెలలకో సిన్మా ప్రొడ్యుస్‌ చేయాలనే టార్గెట్‌తో సంస్థ పనిచేస్తోంది’’ ఆమె చెప్తున్న మాటలు వింటూ ఆఫీసు తీరుతెన్నుల్ని గమనిస్తే...ఆశ్చర్యం కలుగుతోంది సిద్దార్థకి, తేజాకి. కంప్యూటర్లముందు కూచుని క్రమశిక్షణతో పనిచేసుకుంటూపోతున్నారు. ప్రతి ఒక్కరి మెడల్లో వాగ్దేవి ప్రొడక్షన్స్‌ ఐడీ కార్డు వేలాడుతోంది.

‘‘ఇది స్టోరీ డిపార్ట్‌మెంట్‌. ఇక్కడే తీయబోయే సిన్మాకు సంబంధించిన సబ్జెక్ట్‌ పురుడుపోసుకుంటుంది. సబ్జెక్ట్‌ల కోసం రిసెర్చే జరుగుతుంది. డైలీ పేపర్లలోని హ్యూమన్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్సిడెంట్స్‌ క్లిప్పింగ్స్‌ ఎప్పటికప్పుడు భద్రపరుస్తారు. ఒక్కోసారి ఆ రియల్‌ ఇన్సిడెంట్స్‌నే డెవలప్‌ చేసి స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్తారు. వీలైతే...ఆ ఇన్సిడెంట్స్‌లోని వ్యక్తుల్నే హీరోహీరోయిన్లుగా సిన్మాతీస్తారు...’’

‘‘ఔనా?’’ ఆశ్చర్యంగా చూసాడు సిద్దార్థ ఆమెవైపు. నిజానికి, చాలా సిన్మా కంపెనీల్లో ఇంత డెడికేషన్‌, ఇంత డిసిప్లేన్‌ కనిపించవు. అక్కడ రైటర్సనబడేవాళ్లంతా స్టోరీమీద కూచుంటారు. ‘కూచోవడం’లోనూ వేరే అర్ధముంది. కథా చర్చలు మత్తుగా, గమ్మత్తుగా సాగుతుంటాయి. మాంఛి ఫాంలో ఉన్న హీరోయిన్లమీద అడల్ట్స్‌ జోక్స్‌ పచ్చిగా పేలతాయి. స్టోరీ డిస్కషన్‌లో సీరియస్‌నెస్‌ కాగడాపట్టి వెతికినా కనిపించదు. అంతేనా? ప్రొడ్యుసర్‌ బామ్మర్ది మొదలు ఆఫీస్‌బాయ్‌ వరకూ ప్రతిఒక్కడూ స్టోరీలో వేలుపెట్టేవాడే. సిన్మా కథంటే ఏముంది? ఓ హీరో, ఓ హీరోయిన్‌. సిన్మా స్టార్ట్‌ కాగానే హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌... తర్వాత హీరోయిన్‌ను కలుసుకోవడం...చిన్నతగవుతో మొదలైన వారిద్దరి పరిచయం స్నేహమై, ప్రేమగా మారడం...మబ్బుపట్టిన ఓ సాయంత్రం వేళ...ఉరుములు, మెరుపులు...ఆకాశం నుంచి సన్నగా చినుకులు పడుతుంటే...హీరో, హీరోయిన్లు కాంక్షాపూరిత నేత్రాల్తో కసిగా ఒకర్నొకరు చూసుకోవడం...‘కచ్చగా ఉందా...ఒళ్లు వెచ్చగా ఉందా?’ అని హీరో అడగడం...‘పిచ్చగా ఉంది...పిచ్చిపిచ్చిగా ఉందంటూ హీరోయిన్‌ తడిసిన తెల్లచీరచాటు అందాల్ని స్రీనంతా ఆరబోయడం..ఇలా సాగుతుంటుంది స్టోరీ. చూసిన సినిమాల్లోని సీన్లే రిపీటవుతుంటాయి తప్ప కించిత్తయినా కొత్తదనం  ఉండడం లేదు. సిన్మా క్రియేటివిటీకి కార్పొరేట్‌ కల్చర్‌ జోడించి హుందాగా సిన్మాలు తీస్తోంది వాగ్దేవి ప్రొడక్షన్స్‌.

‘‘ఇక, నా సంగతి మీకు తెలుసు కదా! ఆరు రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత క్రియేటివ్‌ హెడ్‌గా చైర్మన్‌గారు నన్ను సెలక్ట్‌ చేసారు. ఇప్పుడు మా కంపెనీకే ఎసరొచ్చింది’’ అంది ప్రతిమ క్యాబిన్‌లోకి ప్రవేశిస్తూ.

‘‘ఇంతకీ...ఏం జరిగింది?’’ సిద్దార్థ ప్రశ్నకు సమాధానంగా ల్యాప్‌ట్యాప్‌ ఓపెన్‌ చేసి ఓ సినిమా ప్లే చేస్తోంది.

‘‘వన్‌..ఫోర్‌...త్రీ...ఐలవ్‌యూ! అనడానికి మూడక్షరాలే. అనబోయే ముందు లక్ష ప్రశ్నలు, కోటి సందేహాలు. ఈ ఒక్కమాట చెప్పడానికి ఈ  చిన్ని గుండెందుకు మొరాయిస్తోంది. ఆ అమ్మాయి ఎదురుపడ్డప్పుడు పెదాల్నుంచి మాట బయటకు రావడం లేదు. చెవుల్నుంచి వేడి సెగలు. కాళ్లూ చేతులూ వణికిపోతున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే...ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కాపురం చేయగలనా?’’ చేతిలో ఎర్రగులాబీ పట్టుకుని అద్దం ముందు నిల్చున్న యువకుడి స్వగతం అది.  అద్దంలో మధ్యమధ్య అతడి బదులు ఆ అమ్మాయి కనిపిస్తోంది. ఆ అమ్మాయే హీరోయిన్‌. ఆ అబ్బాయి హీరో. ఆ తర్వాత ఆ అబ్బాయి డ్రీమ్‌లోకి వెళ్లిపోవడం...యువన్‌శంకర్‌రాజా మ్యూజిక్‌లో చిత్ర, కార్తీక్‌ పాడిన సాంగ్‌ కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

‘‘కేసు ఇన్విస్టిగేషన్‌లో ఇంత ఎంటర్టయిన్‌మెంటుంటుందా?’’ అనుకున్నాడు తేజ.

‘‘అర్జంట్‌గా రమ్మని పిలిచిన ఆ అమ్మాయి లాప్‌ట్యాప్‌లో సినిమా చూపిస్తోంది. ఇంతకీ కేసేంటో?’’ ఆలోచిస్తున్నాడు సిద్దార్థ.

‘‘ఇప్పుడు మీరు చూస్తోంది మా సినిమాయే’’

‘‘ఔనా?’’ అన్నాడు సిద్దార్థ.

‘‘ఈ ఫ్రైడే రిలీజ్‌ ...’’

‘‘అంటే...’’

‘‘మీరు చూస్తున్నది రిలీజ్‌కి ముందే ఇంటర్నెట్‌లో హల్చల్‌ చేస్తున్న సినిమాని. కోట్లు ఖర్చు పెట్టిన సినిమా థియేటర్లలో మార్నింగ్‌ షో పడిన వెంటనే మరమరాలమ్మినట్లు పౖౖెరసీ సీడీల్ని రోడ్డుపక్కన అమ్మేస్తున్నారు. నలభై రూపాయల సీడీలో నాలుగు సినిమాల్ని కారుచవగ్గా అమ్మేస్తున్నారు. మాది మరీ దారుణం...ఇంకా రిలీజే కాలేదు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల్లో జనాలు తెగ చూసేస్తున్నారు. ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ అయి రెండు రోజులు  కాలేదు...అప్పుడే లక్షన్నరమంది వ్యూయర్స్‌. ఫేస్‌బుక్‌ల్లో లైక్‌లు, షేర్లు’’ నిట్టూర్చింది ప్రతిమ.

‘‘ఎలా జరిగింది?’’

‘‘తెలుసుకోవాల్సింది మీరే. అందుకే మిమ్మల్ని పిలిపించాను’’

‘‘ఇలాంటి కేసుల్ని డీల్‌ చేసేందుకు సైబర్‌ క్రైం పోలీసులున్నారు’’

‘‘ఉన్నారు. కానీ, మా చైర్మన్‌గారు సీక్రేట్‌గా ఇన్‌వెస్టిగేషన్‌ జరగాలన్నారు’’

‘‘తీసిన సిన్మాయే బయటకొచ్చేసింది. అక్రమాలకు పాల్పడ్డవారిని కనిపెట్టడంలో సీక్రేట్‌ ఎందుకో?’’ సిద్దార్థ అడుగుతుండగా`‘‘ఎక్స్‌క్యూజ్‌మీ’’ అంటూ క్యాబిన్‌దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు.

‘‘కమిన్‌...ఈయన మా ఆఫీస్‌ మేనేజర్‌. పేరు పరంధామ్‌..’’ అని పరిచయం చేసింది అతడిని సిద్దార్థ, తేజాలకు.

తర్వాత`‘‘ఊ..చెప్పండి’’ అంది అతడివైపు చూస్తూ.

‘‘సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇవాళే టీవీ యాడ్స్‌ రిలీజ్‌ చేయాల్సి ఉంది. ఆ విషయమై...’’ అన్నాడు పరంధామ్‌.

‘‘ఆ కాన్సెప్ట్‌ టోటల్‌గా చేంజ్‌ చేయాలి. మళ్లీ యాడ్స్‌ ప్రిపేర్‌ చేయించండి. ఈసారి యాడ్స్‌లో పైరసీని టార్గెట్‌ చేస్తూ సిన్మా ప్రమోషన్‌ ఉండాలి. మన సినిమా యూట్యూబ్‌లో జతదినోత్సవం జరుకుంటోంది. ఆ సంగతి మీకు తెలుసుగా’’ అడిగింది ప్రతిమ.

‘తెలుస’న్నట్లు తలూపాడతడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti