Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - డా.ఎ.రవీంద్ర

 

అలవాట్లు వ్యసనాలైతే...!!

హద్దులో ఉంటేనే ముద్దు అని పెద్దవాళ్ల సామెత. అలవాటు మంచిదైనా, చెడుదైనా పరిది మించి ఉండకూడదు. పరిది మంచితే వ్యసనంగా మారిపోతుంది. వ్యసనంగా మారాక దానికి మీరు బానిసలవుతారు. మంచి అలవాటైనా మితిమీరి చేస్తుంటే అది చెడుకే దారి తీస్తుంది. రక్షితకు ఎవరు ఏ మాట చెప్పినా, ఎవరు ఏమి మాట్లాడినా దానిని వ్యతిరేకించడం అలవాటు. ఎదుటి వాళ్లు అవునంటే కాదంటుంది. కాదంటే అవునుంటుంది. అదో అలవాటు. అలానే మనోజ్ కు స్నేహం చేయడం ఓ హాబీ. ఎంతమంది ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే అంత క్రేజి అనుకుంటాడు. అందుకే కనపడిన ప్రతి ఒక్కరితో స్నేహం చేయాలని తపిస్తుంటాడు. అందువల్ల అందరికీ సమయాన్ని కేటాయించలేక సతమతమవుతుంటాడు. రక్షితకు ఉన్న అలవాటు చెడ్డది. కానీ మనోజ్ కు ఉన్న అలవాటు మంచిదే. అది హద్దులు దాటటం వల్ల తిప్పలు తప్పడం లేదు.

అలవాటు... అనేక రకాలు

మనిషికో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు అలవాట్లు కూడా చాలా భిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. ఇక యువతీ యువకులకైతే- ఎన్నో రకాల అలవాట్లు. కొన్ని పాతవారిని అనుసరించేవి. మరికొన్ని కొత్తగా అలవాటు చేసుకునేవి. కొందరికి ఉదయాన్నే నిద్రలేవక పోవడం అలవాటు. కొందరికి అమ్మయిలను ఏడిపించడం అలవాటు. కొందరికి ప్రతి నిముషం మ్యూజిక్ ఎంజాయ్ చేయడం అలవాటు. కొందరికి గాసిప్స్ క్రియేట్ చేయడం, వ్యాపింపచేయడం అలవాటు. కొందరికి టీవి చూడ్డం, సెల్ ఫోన్ తో బిజీ అవడం అలవాటు. కొందరికి రాత్రిళ్లు మేలుకొొని చదవడం అలవాటు. కొందరికి ఎవరు ఏది చెప్పినా నమ్మడం అలవాడు. కొందరికి ప్రతిదానికి భయపడడం అలవాటు. కొందరికి ప్రతిపనిని పది సార్లు చేయడం అలవాటు. కొందరికి మౌనంగా ఉండడం అలవాడు. కొందరికి గలగలా మాట్లాడడం, ఎదుటి వాళ్లను విమర్శించడం అలవాటు. ఏ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోక పోవడం అలవాటు. తన మాటే నెగ్గాలనే అలవాటు. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో అలవాట్లు. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన అలవాటు ఉండొచ్చు. లేదా రెండు మూడు రకాలైన అలవాట్లు ఉండొచ్చు.అలవాట్లు... మనసకు నకళ్లుప్రతి అలవాటు మనిషి మనస్తత్వానికి అద్దం పడుతుంది అంటారు మానసిక నిపుణులు. మీకున్న అలవాటే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది. కావాలంటే కిందకు పడదోస్తుంది. రోజువారి మీ దినచర్యే మీ మీద అమితమైన ప్రభావం చూపుతుంది. అసలు అలవాటు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే... పక్కవాళ్ల నుంచి ఎవరికి వాళ్లు గ్రహిస్తారు అని చెప్తారు కొందరు. మరికొందరు మాత్రం అలా గ్రహించినా మీమీ మనసుకు నచ్చితేనే దానిని క్రమం తప్పకుండా ఆచరిస్తారు అని చెప్తున్నారు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని పనులను అలవాటుగా మార్చుకుంటారు. అయితే అవి బలవంతంగా మాత్రం ఎక్కువకాలం చేయలేరు. ఎందుకంటే నచ్చితే చేసే పనికి, నచ్చకపోయినా చేసే పనికి చాలా తేడా ఉంటుంది. శిరీషకు డాన్స్ అంటే ఇష్టం. వాళ్ల అమ్మ నిద్రలేపినా లేపకపోయినా, రోజూ ఉదయాన్నే డాన్స్ క్లాసు మాత్రం మిస్ కాదు. నరేష్ కు ఉదయాన్నే తండ్రితో కలిసి వాకింగ్ కు వెళ్లడం ఇష్టం ఉండదు. రోజూ తండ్రి లేపే సమయానికి అబద్దాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. అందుకే  ఒక పనిని అలవాటుగా చేస్తున్నారు అంటే... ఆ పనిలో ఆనందాన్ని పొందుతున్నారు అని అర్థం. ఆ పని వల్ల మీ మనసు ఉత్తేజం పొందుతుంది. మీ అలవాట్లు మంచివైతే మీరు మానసికంగా మంచి వాళ్లై ఉంటారు. అందుకే మనసకు ప్రతి రూపాలే అలవాట్లు.

అలవాట్లు...పరిమితులు

ఏ పనైనా శృతి మించి చేయకూడదు. ప్రతి పనికి, ప్రతి మాటకు పరిమితి ఉన్నట్లే అలవాట్లకు పరిమితులు, పరిదులు ఉంటాయి. స్మితకు ఎక్కువగా నవ్వడం అలవాటు. ఎవ్వరు ఏది మాట్లాడినా ముందు నవ్వి తర్వాతే తను మాట్లాడుతుంది. ఒకరోజు తన ఫ్రెండ్ ధీరజ్ తో ఎక్కువ సేపు మాట్లాడాల్సి వచ్చింది. స్మిత పదేపదే తనతో నవ్వుతూ మాట్లాడడంతో మరసటి రోజు స్మిత నన్ను ఇష్టపడుతుందని కాలేజ్ లో ప్రచారం చేశాడు ధీరజ్. జోక్ వేసినప్పుడో, సందర్భం వచ్చినప్పుడో నవ్వితే ఈ అనర్థం జరిగేది కాదు. కరుణ్ కు నిజాలు చెప్పే అలవాటు లేదు. అతను ఏది చెప్పినా దానిలో అబద్దమే ఉంటుంది. లేదా పుకారు ఉంటుంది. ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ కు యాక్సిడెంట్ అయితే మిగిలిన వారికి చెప్పాడు. కానీ ఎవరూ నమ్మలేదు. అందుకే ప్రతి అలవాటుకు, ప్రతి పనికి ఒక పరిమితి ఉంది. అలవాటు మంచిదైనా అది పరిమితి దాటితే ఇబ్బందే. కావ్య బాగా చదువుతుంది. ఎప్పుడు ఫస్ట్ మార్కులు వస్తాయి. కానీ ఎగ్జామ్ ముందురాత్రి నిద్రలేకుండా చదవడం తన అలవాటు. కానీ ఒకసారి, రాత్రంతా చదవడం వల్ల బడలికతో ఎగ్జామ్ హాల్లో నిద్రపోయింది. ఎగ్జామినర్ గుర్తించి చివరి అరగంటలో లేపడం వల్ల... కేవలం పాస్ మార్కులవరకే రాయగలిగింది. అందుకే అలవాటు పరిమితిని దాటితే వ్యసనంగా మారుతుంది.

అలవాటుకు వ్యసనానికి మధ్య...

అలవాటు ముదిరితే వ్యసనంగా మారుతుంది. అది మంచి అలవాటైనా వ్యసనంగా మారితే కష్టమే. అప్పుడు ఆ పని చేయకుండా మీరు ఉండలేరు. ఏదో కోల్పోయినట్లు ఫీలవుతారు. ప్రతిరోజు కాలేజ్ నుండి ఇంటికి వచ్చేముందు సుకుమార్ కు అందరికి బాఁయ్ చెప్పడం అలవాడు. అది మంచిదే... కానీ అది అతను తప్పకుండా చేస్తాడు. ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారు. వారికోసం వెతికివెతికి వెళ్లొస్తాను అని చెప్పడం చూసి అందరూ అతనికి బాఁయ్ అని నిక్ నేమ్ పెట్టారు. వినయ్ కో అలవాటు ఉంది. సరదాగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి కొనిస్తూ ఉంటాడు. తన పక్కన ఉన్న వాళ్లను ఎంటర్ టైన్ చేస్తున్నాను అని అనుకుంటాడు. కానీ ఒకరోజు పర్స్ మర్చిపోయి వస్తే... అప్పుచేసి కొనిచ్చాడు. అంటే అతను ఆ అలవాటుకు బానిసయ్యాడన్న మాట. అను అందంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ సెల్ఫీలు తీసుకొని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి ఎన్ని కామెంట్స్ వచ్చాయి. ఎన్ని లైక్ లు వచ్చాయి అని చూసుకుంటూ ఉంటుంది. పైగా ప్రెండ్స్ కు చూపించి తన అందాన్ని మెచ్చుకోవాలని చెప్పుకుంటుంది. చివరకు ఫేస్ బుక్ ఫిగర్ అని కాలేజ్ లో ముద్రపడింది. కేవలం తన అలవాటు వ్యసనంగా మారడం వల్లే అందంగా ఉన్న అను అలా పేరు తెచ్చుకుంది. మీకున్న అలవాటు మంచిదైనా అది హద్దుల్లోనే ఉంటే, మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న మిగిలిన వాళ్లు  అభిమానిస్తారు. మీతో కలిసి రిలేషన్స్ కొనసాగిస్తారు. అలవాటు వ్వ్యసనంగా మారితే ఎవ్వరూ మిమ్మల్ని భరించరు.

ప్రతి మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది అంటారు పెద్దలు. నిజమే. కానీ మీ అలవాటును మీరు అంచనా వేసుకోండి. ఒక పనిని రోజూ చేస్తున్నారా.. ఒకరోజు చేయకపోతే ఉండలేని పరిస్థితికొచ్చారా.. ఒక మనిషితో రోజూ మాట్లాడుతూ ఒక రోజు మాట్లాడక పోతే బాధ అనిపించిందా.. అంటే ఆ రిలేషన్ కు మీరు బానిస అయినట్లే... అలానే రోజు ఒకే సమయానికి క్యాంటిన్ కు వెళ్లి టీ తాగే వాళ్లు. ఒకరోజు వెళ్లక పోతే... తలనొప్పి అని ఫీలవుతున్నారా.. అంటే మీ శరీరాన్ని దానికి బానిసని చేసినట్లే. అలవాటు మంచిదైతే కొన సాగించడం, చెడ్డదైతే వదిలేయడం మంచిది. అలవాటు మంచిది కదా అని తరచూ చేయడం కూడా మంచిది కాదు. అంటే... మీ మనసు మీద మీకు కంట్రోల్ పవర్ ఉండాలన్న మాట. అది లేకపోతే... కష్టమే. రిమోట్ టీవికి ఎంత అవసరమో...మీ మీ అలవాట్లను మీ లైఫ్ ఎదుగుదలకు అనుగుణంగా మార్చుకోడానికి మీ మనసు మీద మీకు అధికారం అంతే అవసరం.

మరిన్ని శీర్షికలు
navvunaluguyugalu