Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ - శ్రుతిహాస‌న్‌

Interview - Shruti Haasan

సినిమాల్లోనే త‌ప్ప‌ బ‌య‌ట న‌టించ‌డం తెలీదు..!  - శ్రుతిహాస‌న్‌

శ్రుతిహాస‌న్ ఓ తెలివైన క‌థానాయిక‌. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకొంటూ ముందుకెళ్తోంది. మ‌ధ్య‌లో ఐటెమ్ గీతాలకూ 'ప‌చ్చ‌జెండా' ఊపింది. తెలుగు, త‌మిళం, హిందీ.... ఇలా భాషాబేధం చూపించ‌కుండా అవ‌కాశం ఎక్క‌డొస్తే అక్క‌డ వాలిపోతోంది. ఓ చోట కాక‌పోయినా, మ‌రో చోటైనా హిట్టొస్తుంద‌న్న న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌క‌మే నిజ‌మైంది. తొలి విజ‌యం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సివ‌చ్చినా, కెరీర్ తొలి రోజుల్లో ఐరెన్‌లెగ్ అనే ముద్ర‌ప‌డినా బెదిరిపోలేదు. త‌న టైమ్ కోసం ఓపిగ్గా ఎదురుచూసింది. గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ల‌క్ క‌ల‌సివ‌చ్చింది. ఇప్పుడు ద‌క్షిణాదిన మోస్ట్ వాంటెడ్ క‌థానాయిక అనిపించుకొంది. లేటెస్ట్‌గా 'శ్రీ‌మంతుడు'తో మ‌రో హిట్ ద‌క్కించుకొంది. ఈ హిట్‌తో శ్రుతి ఫుల్ ఖుషీలో ఉంది. ఈ సంద‌ర్భంగా శ్రుతిహాస‌న్‌తో గో తెలుగు డాట్ కామ్ జ‌రిగిన ఇంట‌ర్వ్యూ ఇది.

* హాయ్ శ్రుతి..
- హాయ్‌...

* శ్రీ‌మంతుడుతో మ‌రో హిట్ కొట్టేశారు...
- అవునండీ. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని క‌థ విన్న‌ప్పుడే అనిపించింది. ఎందుకంటే.. విలువ‌లున్న సినిమా ఇది. క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఎక్క‌డా మిస్ అవ్వ‌లేదు. దాంతో పాటు మేం అనుకొన్న సీన్ల‌న్నీ బాగా పండాయి. సో.. ఈ హిట్ ముందే ఊహించిన‌దే.

* ఈసినిమాలో  మీరు బాగా ఎగ్జ‌యిట్ అయిన సీన్ ఏది?
- దాదాపుగా అన్ని స‌న్నివేశాలూ ఉత్సాహంగా చేసిన‌వే. అయితే కాలేజీ సీన్లు మాత్రం బాగా న‌చ్చాయి.

* మ‌హేష్‌తో మీ కెమిస్ట్రీ బాగా కుదిరిన‌ట్టుంది..?
- ఔనా... ఆడియ‌న్స్‌కి అలా అనిపిస్తే, నిజంగా అది నా అదృష్టం. చారు, హ‌ర్ష క్యారెక్ట‌ర్లలో అంత డెప్త్ ఉంది. ఆ డెప్త్ ఉంటే.. ఖ‌చ్చితంగా పాత్ర‌ల మ‌ధ్యకెమిస్ట్రీ బాగా పండుతుంద‌ని నా న‌మ్మ‌కం. సాధార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌థానాయిక‌ల‌కు అంత స్కోప్ ఉండ‌దు. కానీ ఈ సినిమా అలా కాదు. సినిమా ట‌ర్న్ అవ్వ‌డానికి నా పాత్ర కీల‌కం. అందుకే చారు అంద‌రికీ అంత బాగా న‌చ్చింది.

* ఈ సినిమాని మీ నాన్న‌గారు చూశారా?
- లేదింకా. చూస్తాన‌ని చెప్పారు... ఆయ‌న ఏమంటారా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా.

* మీ సినిమాలు చూసి నాన్న‌గారు స‌ల‌హాలేమైనా ఇస్తుంటారా?
- నేను అడిగితే చెప్తారు. కానీ ఆయ‌న కావాల‌ని ఇలా చేయ్‌... అలా చేయ్ అన‌రు. నా క‌థ‌ల్ని నేనే వింటా. నాకు న‌చ్చితే ఒప్పుకొంటా, లేదంటే లేదు. సినిమా ఒప్పుకొన్న త‌ర‌వాతే `డాడీ.. ఫ‌లానా సినిమా చేస్తున్నా` అంటా. ఆయ‌న కూడా క‌థేంటి, క్యారెక్ట‌ర్ ఏమిటి అని అడ‌గ‌రు. బాగా చేయ్‌.. అంటారంతే.  అంత‌కు మించి మామ‌ధ్య సినిమాల‌కు సంబంధించిన విష‌యాలేం పెద్ద‌గా చ‌ర్చ‌కు రావు. మేం ఒక‌రి అభిప్రాయాల్ని మ‌రొక‌రు గౌర‌వించుకొంటుంటాం. మాలో హిపోక్ర‌సీ అస్స‌లుండ‌దు.

* మీ నాన్న‌గారి దగ్గ‌ర మీకు చ‌నువు ఎంత వ‌ర‌కూ ఉంటుంది?
- నాకు కావ‌ల్సినంత స్వేచ్ఛ ఇచ్చారాయ‌న‌. మేమిద్ద‌రం బాగా క్లోజ్‌గా మాట్లాడుకొంటాం. నాకు సంబంధించిన ఏ విష‌య‌మైనా ఆయ‌న‌తో చెప్పుకొంట‌తా.  కానీ ఎవ‌రి లిమిట్స్‌వాళ్ల‌కుంటాయి. అది ఉండాలి కూడా.

* శ్రుతి ఇంట్లో ఎలా ఉంటుంది?
- నార్మ‌ల్ అమ్మాయిలానే. అంద‌రిలా అల్ల‌రి చేస్తా. అంద‌రి అమ్మాయిల్లానే నాకూ ఆశ‌లు, కోరిక‌లూ ఉంటాయి. అయితే నేనో ఫిల్మీ స్టార్ అనే విష‌యాన్ని నేను గ‌డ‌ప‌లోప‌ల‌కి అడుగుపెట్ట‌గానే మ‌ర్చిపోతుంటా. సినిమాల్లో న‌టిస్తాను గానీ, ఇంట్లో వాళ్ల ద‌గ్గ‌ర కాదు. నా స్నేహితుల ద‌గ్గ‌ర వాళ్ల‌కు తెలిసిన శ్రుతిలానే ఉంటా.

* గ్లామ‌ర్‌ని ఎలా కాపాడుకొంటారు?
- నేను ఏ విష‌యాన్న‌యినా ప‌క్కా ప్రొఫెష‌న‌ల్‌గా తీసుకొంటా. క‌థానాయిక‌గా గ్లామ‌ర్ కాపాడుకోవ‌డం నా బాధ్య‌త‌. సినిమాకి ఏం కావాలో అన్నీ ఇవ్వాలి. గ్లామ‌ర్‌గా క‌నిపించాల‌న్న‌ప్పుడు అలానే త‌యార‌వ్వాలి. ఆ విష‌యంలో రాజీ ప‌డ‌ను.

* మ్యూజిక్‌ని దూరం పెట్టిన‌ట్టు అనిపిస్తోంది..?
- ఎట్టిప‌రిస్థితుల్లోనూ అది జ‌ర‌గ‌ని ప‌ని. ఎందుకంటే సంగీతం నా ప్రాణం. మీర‌న్న‌ట్టు ఇప్పుడు సంగీతానికి అంత సమ‌యం కేటాయించ‌డం లేదు. అయితే.. భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా సంగీత ద‌ర్శ‌కురాలిగా కొన్ని సినిమాల‌కు ప‌నిచేస్తా.

* ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర పేరుతో క‌నిపిస్తుంటారు. ఆ పాత్ర‌లోకి వెళ్ల‌డానికి, ఆ పాత్ర‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డానికి మీరు చేసే క‌స‌ర‌త్తు ఎలా ఉంటుంది?
- మా లాంటి క‌థానాయిక‌ల‌కు  క‌థ‌ని అర్థం చేసుకోవ‌డం చాలా ముఖ్యం.  క‌థేంటి, పాత్రేంటి? అనే విష‌యాల్ని మైండ్‌లోకి ఎక్కించుకొంటా. ఆ పాత్ర‌కు త‌గిన‌ట్టే ప్ర‌వ‌ర్తిస్తా. ఒక్క‌సారి మేకప్ తీసేసి, సెట్లోంచి  బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత నేను నాలానే ఉంటా. సెట్‌కి వెళ్లాక మ‌ళ్లీ ఆ పాత్ర‌లోకి జంప్ చేసేస్తుంటా. నాకైతే ఇది వెరీ సింపుల్‌.

* ప్ర‌త్యేక గీతాలు ఇక‌మీద‌టా చేస్తారా?
- మ‌హేష్ సినిమా కాబ‌ట్టి 'ఆగ‌డు'లో ఒప్పుకొన్నా. మ‌ళ్లీ అలాంటి క్రేజీ ఆఫ‌ర్ వ‌స్తే అప్పుడు ఆలోచిస్తా.

* శ్రుతిని ఒక్క‌మాటలో అభివ‌ర్ణించ‌మంటే..
- నేను నేటిత‌రం అమ్మాయిని. కానీ నిన్న‌టి త‌రం విలువ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటా.

* పారితోషికం విష‌యంలో మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయ్‌?
- డ‌బ్బులు అవ‌స‌ర‌మే. కానీ వాటి కోస‌మే సినిమాలు చేయ‌లేను. నా క‌ష్టానికి త‌గిన పారితోషికం అందుకోవ‌డం నా హ‌క్కు.

* ఏ భాష‌లో న‌టించ‌డం సౌల‌భ్యంగా ఉంటుంది?
- నాకు అన్ని భాష‌లూ ఒకేలా ఉంటాయి. మా ఇంట్లోనూ తెలుగు, త‌మిళం, హిందీ.. ఇలా మూడు భాష‌లూ మాట్లాడుకొంటాం. అందుకే ప్ర‌తి భాష‌పై ప్రేమ పుట్టుకొచ్చింది. నాకు అన్నీ ఒక్క‌టే.

* బాలీవుడ్‌లోనూ ప్ర‌యాణం బాగా సాగుతున్న‌ట్టేనా?
- సూప‌ర్‌గా. అక్క‌డ ఇప్పుడిప్పుడే మంచి పాత్ర‌లు వ‌స్తున్నాయ్‌. త‌ప్ప‌కుండా అక్క‌డా నాదైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తా.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్.  

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka