Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review

చిత్రం: సినిమా చూపిస్త మావ
తారాగణం: రాజ్‌ తరుణ్‌, అవికా గోర్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, సత్య, కృష్ణ భగవాన్‌, ప్రవీణ్‌, జయలక్ష్మి, సత్య, తోటపల్లి మధు, మాధవి, రజిత, షకలక శంకర్‌ తదితరులు.
చాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
సంగీతం: శేఖర్‌ చంద్ర
నిర్మాణం: లక్కీ మీడియా
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
నిర్మాతలు: జోగాది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్‌, రూపేష్‌ సునీత
విడుదల తేదీ: 14 ఆగస్ట్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే

చదువు అస్సలు అబ్బని జులాయి కుర్రాడు కత్తి (రాజ్‌తరుణ్‌), ఇంటర్‌లో వెయ్యికి 996 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చిన పరిణీత (అవికా గోర్‌)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. పరిణీత తండ్రి క్రమశిక్షణతో, తన ఇష్టాల్ని బయటకు చెప్పుకోలేకపోతుంది. కత్తి ప్రేమలో పడ్డాక, అప్పటివరకూ పొందలేని ఆనందాల్ని పొందుతుంది. జీవితంలో ప్రతీదీ 'క్వాలిటీ'తో పోల్చుతుంటాడు పరిణీతి తండ్రి. అలాంటి వ్యక్తికి కత్తి సహజంగానే నచ్చడు. కానీ కూతురు కత్తిని ప్రేమించిందని తెలిసి, కత్తిని వదిలించుకోడానికి ఓ పరీక్ష పెడతాడు కత్తికి, పరిణీత తండ్రి. ఆ పరీక్ష ఏంటి? పరీక్షలో కత్తి నెగ్గాడా? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే

తెరపై ఈజ్‌తో చెలరేగిపోయాడు రాజ్‌ తరుణ్‌. తొలి సినిమాలోని ఎంటర్‌టైనింగ్‌ పార్ట్‌కి కొనసాగింపులా ఉన్న పాత్రలో రాజ్‌తరుణ్‌ తనదైన ఎనర్జీతో ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీ లెవల్స్‌, ఈజ్‌ సినిమాని కంప్లీట్‌ ఎంటర్‌టైనింగ్‌గా మార్చేశాయి. సినిమా చూస్తున్నంతసేపూ ఆడియన్స్‌ స్క్రీన్‌ పైనుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారంటే, అదంతా రాజ్‌ తరుణ్‌ టాలెంటే.

హీరోయిన్‌ అవికాగోర్‌ తొలి సినిమాకన్నా ఇంకా బొద్దుగా తయారైంది. నటన ఓకే. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా రాణించాలంటే ఛబ్బీ లుక్‌ ఒక్కటే సరిపోదు, స్లిమ్‌గా ఉండటం బెటర్‌. లేదంటే తక్కువ వయసులోనే సినిమాల్లోకి వచ్చి మాయమైపోయినవారి ఖాతాలోకి అవిక చేరిపోయే అవకాశముంది.

రావు రమేష్‌ మరోమారు మంచి పాత్రలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఎనర్జిటిక్‌ అల్లుడితో తలపడే సన్నివేశాల్లో రావు రమేష్‌ తన ఎనర్జీని చూపించాడు. ఇలాంటి చిత్రాలకు రావు రమేష్‌ నటన అదనపు ఆకర్షణ అని ఈ చిత్రంతో ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపించారు.

కథ పరంగా కొత్తదనమేమీ లేదు. కథనం పరంగానూ చెప్పుకోదగ్గ ప్రత్యేకతల్లేవు. అయితే ఆద్యంతం సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. రాజ్‌తరుణ్‌లోని ఎనర్జీని దర్శకుడు బాగా వాడుకున్నాడు. సినిమాలోని ఇంకో మెయిన్‌ పాత్రధారి రావు రమేష్‌నీ దర్శకుడు సరిగ్గా వాడుకున్నాడు. కథ, కథనం అటూ ఇటూగా ఉన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌ సరిగ్గా ఉంటే, ఆడియన్స్‌ టైమ్‌పాస్‌ ఫీలవుతారు. ఆ ఒక్కటీ పట్టుకున్న దర్శకుడు, సినిమాని జాగ్రత్తగా లాగించేశాడు. సినిమటోగ్రఫీ బాగుంది. పరిమిత బడ్జెట్‌తో కూడుకున్న సినిమాకి అందమైన సినిమాటోగ్రఫీ అందించాడు సినిమాటోగ్రాఫర్‌. సంగీతం బాగుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ బాగానే ఉంది. నిర్మాణపు విలువలూ బాగున్నాయి.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లోనూ దాదాపు అదే పేస్‌ కనిపిస్తుంది. కొత్తదనం లేకపోవడం కాస్త మైనస్‌. ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉండటం అన్ని మైనస్‌లనీ ఓవర్‌కమ్‌ చేసేస్తుంది. సినిమా చూస్తున్నంతసేపూ కాలక్షేపంగానే అనిపించడం కన్నా సినిమాకి పాజిటివ్‌ థింగ్‌ ఏముంటుంది? పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు గనుక, సినిమా ఖచ్చితంగా ప్రాఫిట్‌ వెంచర్‌ అవుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

టైమ్‌పాస్‌ అల్లుడు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview - Shruti Haasan