Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగినకథ:  వెంకటరత్నం నాయుడు కి విశాల ఎవరనే అనుమానం మనసులో తొలుస్తుంటుంది. మునుస్వామి అది అర్ధం చేసుకుని విశాలని పిలిచి ఎవరో గుర్తుపట్టావా అని అడుగుతాడు వెంకటరత్నం నాయుడిని. తరువాత  విశాల ఎవరోకాదు. తన మేనకోడలు. తన చెల్లెలు కాంచనమాల కూతురు అని చెప్పగానే  ఒక్కసారిగా ఆశ్చర్యానందాలకులొనవుతాడు వెంకటరత్నం నాయుడు. ఆ తరువాత...  

 

 

‘‘ఇంకా ఏమర్థం కావాల్రా నీకు? విరాట్‌ సహస్రలు ప్రేమించు కున్నారు. ఉన్న సమస్యలనుంచి వాళ్ళు బయట పడగానే పెళ్ళి చేసుకుంటారు. మనం నాలుగక్షింతలు వేసి దీవించేస్తే ఓ పనైపోతుంది. అంతేగా’’ అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ.

‘‘అంతేనా?’’

‘‘అంతకు మించి ఏముంది?’’

‘‘ఉంది. నీకంతా తెలుసు. చెప్పరా. విశాల ప్రేమించిన అబ్బాయి ఎవరు?’’

‘‘ఈ మాట నీ మేనకోడల్ని అడగాలి. నన్ను అడిగితే నాకేంతెలుసు?’’

‘‘నీకు తెలుసు... చెప్పాలి.’’

‘‘నాకు తెలీదురా బాబు. చెప్పనంటోంది.’’

‘‘విరాట్‌ ఎవరో తెలీక ముందే ఆ ఇంటింతో అనుబంధం వుందని చెప్పింది నువ్వేకదా?’’

‘‘అయితే?’’

‘‘ఆ అనుబంధం ఎలా ఏర్పడిరదో చెప్పు’’

‘‘ఒరే... ఇన్ని ప్రశ్నలెందుగ్గాని అసలు నీ సందేహాలేమిటో నీ మనసులో ఏముంది అడిగెయ్‌. నాకు తెలిస్తే చెప్పేస్తాను.’’

‘‘వచ్చినప్పట్నుంచి చూస్తున్నాను ‘బావా బావా’ అంటూ మన విరాట్‌తో రాసుకు పూసుకు తిరుగుతోంది విశాల. పరాయివాడెవడ్నో తను ప్రేమించి ఉంటే ఎంత సొంత బావయినా విశాల అంత చనువుగా వుండగలదా? ఇది డౌట్‌ నంబర్‌ వన్‌.

సహస్ర తనే మాకు పాదాభివంతనం చేసి ఆశీర్వదాలు తీసుకోవచ్చు. కాని విశాలను కూడా పిలిచి ఇద్దరూ ఒకేసారి దండం పెట్టి ఆశీస్సులు పొందారు. ఎందుచేత? ఇది డౌడ్‌ నెంబర్‌ టు.

ఇక సొంత తల్లిగాబట్టి విశాల మన చెల్లెమ్మను అమ్మాని పిలిస్తే అర్థం వుంది. కాని విశాలతో బాటు సహస్ర కూడా అమ్మ అంటోంది ఎందుకని? ఇది డౌట్‌ నెంబర్‌ త్రీ...’’

అంతా వింటున్న మునుసామి ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టలేక ఫక్కున నవ్వేసాడు. ‘‘ఒరే నీ డౌట్స్‌ అన్నీ కలిపి చెత్త బుట్టలో పడేయరా. ముందే ఈ విషయాలు చెప్పేస్తే మీరు కంగారుపడతారని చెప్పలేదంతే నీకు డౌట్‌ వద్దు. విశాల ప్రేమించిన కుర్రాడు ఎవరోకాదు. మన విరాటే.’’ అంటూ అసలు విషయం బయటపెట్టేసాడు.

ఆ మాటవింటూనే...

తెరిచిన నోరు మూయటం మర్చిపోయి...

అలా చూస్తుండిపోయాడు వెంకటరత్నంనాయుడు.

‘‘ఏంట్రా? షాకయ్యావా?.. ఇదికూడా లాగించేసి కాస్తరిలాక్సవు’’ అని నవ్వుతూ తిరిగి చెరోపెగ్గు విస్కీకలిపాడు మునుసామి.

‘‘అంటే.. ఈ విషయం విరాట్‌కి తెలుసా?’’ తిరిగి గ్లాసులు ఖాళీ అయ్యాక షాక్‌ నుంచి తేరుకుంటూ అడిగాడు వెంకటరత్నంనాయుడు.

‘‘తెలుసు’’ అన్నాడు మునుసామి.

‘‘సహస్రకి తెలుసా?’’

‘‘సహస్రకి తెలుసు. చెల్లెమ్మ కాంచనమాలకీ తెలుసు. మా అందరికీ తెలుసు. అమ్మాయిలిద్దరూ మన చినబాబుని ప్రేమిస్తున్నారని’’

‘‘ఈ విషయం మహాదేవనాయకర్‌కి తెలుసా?’’

‘‘ఆ విషయం నాకు తెలీదు. నువ్వు మరీ ఆశ్చర్యపోమాకు. అసలు ఏం జరిగిందో చెప్తేగాని ఈ సస్పెన్స్‌ నీకు అర్థంగాదు. అటు సహస్ర యిటు విశాల యిద్దరూ ఒకేరోజు కాస్త అటు యిటుగా మన చినబాబుని చూసి లవ్‌లో పడ్డం జరిగింది. కాని మన చినబాబు ముందుగా ప్రేమించింది మాత్రం సహస్రనే. న్యూస్‌ పేపర్లో ప్రకటనిచ్చింది తెలుసుగా. అది చూసాకేగా నువ్వు మమ్మల్ని చెన్నైపంపించింది’’ అంటూ మునుసామి జరిగిందంతా వివరిస్తుంటే వెంకటరత్నంనాయుడు నమ్మలేక పోయాడు. కాని ఇది నమ్మాల్సిన నిజం.

‘‘మీరంతా ఆశ్చర్యపోతారని నాకు తెలుసు. కాని అలా జరిగిపోయిందంతే. విశాల తన మంచి తనంతో స్వచ్ఛమైన ప్రేమతో విరాట్‌ మనసునే కాదు. సహస్ర మనుసును జయించింది.

ఇపుడు విశాలకి సహస్ర విరాట్‌లు ప్రాణమైతే సహస్రకి విశాల విరాట్‌లు ప్రాణం. ఇక విరాట్‌కయితే వాళ్ళిద్దరూ రెండు కళ్ళు. ఏ కంటినీ ఒదులుకోలేడు. ఆ విషయం గ్రహించే చెల్లెమ్మ కాంచనమాల కూడా వాళ్ళకి అడ్డుచెప్పకపోగా సహస్రనీ తన కూతురులాగే అంతప్రేమగానూ చూసుకుంటోంది. ఇక ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేమంటే ఇది వాళ్ళ ముగ్గురి సమస్యగాబట్టి వాళ్ళే పరిష్కరించుకుంటారు. మనం పట్టించుకోవాల్సిన పనిలేదు’’ అంటూ ముగించాడు.

‘‘కాని మహాదేవనాకర్‌కి పట్టింపు ఉంటుంది. విషయం తెలిసాక ఎలా స్పందిస్తాడో ఏమిటో’’ అన్నాడు వెంకటరత్నంనాయుడు.

‘‘కూతురు ఇష్టపడ్డాక అయనేం చేస్తాడ్రా నీ పిచ్చిగాని, ఇక ఆ విషయాలు వదిలెయ్‌’’ అన్నాడు మునుసామి.

సుమారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో వెంకటరత్నంనాయుడ్ని కార్లో ఓల్డ్‌ మాంబళం పంపించేసి లోనకొచ్చాడు మునుసామి.‘‘అన్నా నాదో డౌటన్నా’’ అన్నాడు బండశివా ఎదురొస్తూ.

‘‘ఏంటో అడుగు’’ అంటూ సోఫాలో కూచున్నాడు మునుసామి.

‘‘ఏం లేదన్నా. రామావతారం కృష్ణావతారం ఈ రెండు అవతాలెత్తిందీ ఆ శ్రీహరేగదా?’’ దగ్గరకొచ్చి నిలబడుతూ అడిగాడు బండశివా.

‘‘ఓర్నీ ఇదా నీ డౌట్‌? ఆయన అవతారమూర్తిరా రెండేమిటి? దశావతారాలూ ఆయనేగదా’’ అన్నాడు మునుసామి.

‘‘కాని.. నా కర్థంగానిదీ రెండవతారాలేనన్నా’’ అన్నాడు బుర్రగోక్కుంటూ బండశివా.

కాస్త విసుగ్గా చూసాడు మునుసామి.

‘‘ఏరా ఈ టైంలో అడగాల్సిన ప్రశ్నరాయిది? బండ వెధవ. రామాయణం భారతం కథలు వినలేదా సినిమాలు చూళ్ళేదా? ఇంకా ఏమర్థంకావాల్రానీకు?’’ అని కసురుకున్నాడు.

‘‘కోప్పడకన్నా. తెలీకేగా అడిగాను? రామావతారం ఎత్తి సీతమ్మను పెళ్ళాడి ఒకే పెళ్ళాం ఒకటే బాణమంటూ ఆదర్శ మూర్తి అయ్యాడు రాముడు. మరి కృష్ణావతారం వచ్చేసరికి అదే శ్రీహరి ఒకటేమిటి ఏకంగా ఎనిమిదిమందిని పెళ్ళాడాడు. చిన్నప్పుడే చిన్న చిన్న దొంగతనాలు చేసాడు. అబద్ధాలాడాడు, అల్లరి చిల్లరగా తిరిగాడు. అయినా కూడ మనం రాముడ్ని కొలుస్తున్నాం. కృష్ణుడ్ని పూజిస్తున్నాం. మరి మనం ఆదర్శంగా రాముల వార్ని తీసుకోవాలా కృష్ణుడ్ని తీసుకోవాల?’’

‘‘ఏ విషయంలో ఆదర్శం? పెళ్ళి విషయంలోనా?’’

‘‘అవును’’

‘‘మన చినబాబు సహస్ర విశాల యిద్దర్నీ లవ్‌ చేయటంతో నీకీ డౌట్‌ వచ్చిందా?’’

‘‘అవునన్నా’’

‘‘ఓరి పిచ్చోడా లోకంలో ఇద్దరు పెళ్ళాల మొగుళ్ళు లేరనుకుంటున్నావా ఏంటి?’’

‘‘అంటే అన్నా. ఇపుడు ఎవరయినా రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చా? చట్టం ఒకర్ని మించి చేసుకో కూడదంటుంది గదా’’‘‘ఎవరూ అభ్యంతరం చెప్పనంతవరకే, చెప్తే వీలుకాదు’’‘‘మరి శ్రీహరి అవతారాల లక్ష్యం ధర్మసంస్థాపనే గదన్నా. అలాంటప్పుడు ఈ అవతారాలకు భిన్న స్వభావాలెందుకు?’’

‘‘ఓరీ నాయనో. నీ ప్రశ్న వింటుంటే నాకు తాగింది దిగిపోయేలా వుందిరా బండవెధవాని. దేశకాల పరిస్థితుల్ని బట్టి న్యాయధర్మాలు ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయని పెద్దల మాట వినలేదా?’’

ఇపుడు రామాయణాన్నే తీసుకుందాం. శ్రీరామచంద్రుడు చేసిన ధర్మ సంస్థాపన ఏమిటి? నిశితంగా పరిశీలిస్తే నీకేం కన్పించదు. ఆయన చేసిందంతా రాక్షస సంహారం. ధర్మసంస్థాపన చేసింది రామావతారానికి కాస్త ముందుగా వచ్చిన పరశురామావతారం. దుష్టులైన క్షత్రీయ రాజుల మీద అనేకసార్లు భూమండలమంతా చుట్టి యుద్ధం చేసి సంహరించి ధర్మసంస్థాపన చేసి రామ చంద్రుడికి ఆ శ్రమలేకుండా చేసాడు. కాబట్టి అక్కడ ధర్మ సంస్థాపన పరశురాముని ద్వారా జరగ్గా లోకకంటకులయిన రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని సంహరించి లోక కళ్యాణం జరిపించాడు రాముడు.

అందుకే పరశురామావతారం లక్ష్యం ముందే నెరవేరింది గాబట్టి ఒకానొకసందర్భంలో శ్రీరాముడు పరశురాముని తాకగానే ఆయనలోని నారాయణాంశ రామునిలో ప్రవేశించింది. ఆ తర్వాత పరశురాముడు తపస్సు కెళ్ళిపోయాడు.

కాబట్టి రామాయణ భారతాల విషయంలో నేను చెప్పొచ్చేదేమంటే రామాయణం కుటుంబగాధ, మహాభారతం రాజకీయ చరిత్ర. నీ బుర్రకి సులువుగా అర్థం కావాలంటే ఓ మాట చెప్తాను విను. భక్తులు రాముడ్ని కృష్ణుడ్ని కూడా కలిపి రామ రామ కృష్ణ కృష్ణ రామ కృష్ణ హరే హరే అని ప్రార్థిస్తారు ఎందుకో తెలుసా?’’

‘‘నువ్వు చెప్పన్నా నాకేం తెలుసు?’’

‘‘ఆ రామచంద్రుడు కుటుంబంలో సుఖశాంతుల్ని యిస్తాడు. శ్రీకృష్ణుడు తన భక్తులకు లౌకిక విజయాన్నిస్తాడు. కాబట్టి ఇంటా బయటా కూడా తమకు విజయం చేకూరాలని ఆ రెండు అవతారాల్ని కలిపి రామ కృష్ణ హరే హరే అని ప్రార్థిస్తారు. అర్థమైందా?’’

‘‘అర్థమైందన్నా’’

‘‘ఇంకేందిరా నీ డౌటు?’’

‘‘ఏం లేదన్నా నేను కూడా....’’

‘‘వూ... నీవుకూడా? ఆ నాన్చుడేందిరా చెప్పి తగలడు!’’

‘‘అదేనన్నా నేనుకూడా ఇంకోపెళ్ళి చేసుకొని ఇద్దరు పెళ్ళాలకి మొగుడవ్వాలనుంది. చేసుకోవచ్చా?’’

‘‘ఓరినీ... ఇంకోపెళ్ళి చేసుకుంటావా. ఆ మాట నా దగ్గరంటే అన్నావ్‌ గాని నీ పెళ్ళాం దగ్గరనమాక. ఒంటి స్తంభానికి కట్టేసి వారంరోజులు కూడు నీళ్ళు లేకుండా మాడ్చి చంపేస్తుంది. తింగరెదవా. నీ జీతమెంత నువ్వెంత నీకు మరోపెళ్ళా! చినబాబు ఇద్దరమ్మాయిల్ని ప్రేమించాడు గాని ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఇద్దర్లో ఒకర్నిచేసుకుంటాడో ఇద్దర్నీ చేసుకుంటాడో తెలీదు. ఇప్పుడే నువ్వు ఇంకో పెళ్ళి కావాలంటున్నావ్‌. చంపేస్తానొరే. పోరా. పోయి పని చూసుకో. సోంబేరి వెధవా’’ అంటూ విసుక్కుని లోనకెళ్ళి పోయాడు.

ఆ సాయంకాలం చందూ ధర్మ వెంట సైదాపేట వాళ్ళుంటున్న లాడ్జికి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదు. ‘‘చందూ వచ్చాక లేపు భోంచేస్తాం’’ అని చెప్పి తన గదిలోకి పోయి పడుకున్నాడు మునుసామి.

*****************************************

మరునాడు ఉదయం...

మధురైనుండి మహాదేనవనాయకర్‌ ఆయన సతీమణి మూగాంబికై చెన్నై రావటం ఎవరూ వూహించని పరిణామం. మూడోరోజునే మధురై పోలీసులు ఆయన్ని హౌస్‌ అరెస్ట్‌ నుండి తప్పించారు. నాలుగోరోజు తెల్లవారుజామున కార్లో బయలుదేరి ఉదయం పదిగంటల ప్రాంతానికి చెన్నై చేరుకున్నారు.

వారు వస్తున్న విషయం సహస్రకు తప్ప ఎవరికీ తెలీదుతొమ్మిది గంటలప్పుడు సహస్ర విశాలని పిలిచి చెప్పింది. ‘‘మమ్మీ డాడీ వస్తున్నారు నేరుగా తిరగటం క్షేమంకాదు గదా నువ్వే వాళ్ళని రిసీవ్‌ చేసుకోవాలి’’ అంది.

విశాల చాలా సంతోషించింది.‘‘అక్కా ఇంత మంచివార్త ఇంతలేటుగానా చెప్పటం! ఇక ఆ విషయం నాకు వదిలేయ్‌ ఇప్పుడే మనవాళ్ళందరికీ ఈ శుభవార్త చెప్పేస్తాను’’ అంది ఉత్సాహంగా.

‘‘ఏయ్‌ మోద్దూ చెప్పమాక. డాడీకి మావయ్య వెంకటరత్నం నాయుడు గారికి పడదు తెలుసుగదా. ముందే చెప్పేస్తే మావయ్య ముఖం చాటేయొచ్చు. వాళ్ళు గోస్వామి కాలనీకి పోకుండా నేచెప్పిన అడ్రసు ప్రకారం నేరుగా ఇక్కడికే వస్తున్నారు. కాస్సేపట్లో వచ్చేస్తారు. వచ్చాక అందరికీ చెప్పు’’ అంది సహస్ర.

‘‘అలాగే అక్క నేచూసుకుంటాలే’’ అంటూ ఎప్పటిలాగే సింపుల్‌గా తయారై కిందికొచ్చింది. అయినా మునుసామి పసిగట్టేసాడు. అంత క్రితమే అక్కడికొచ్చాడాయన.

‘‘ఏమ్మా విశాల ఏమిటి హడావుడీ? ఎవరన్నా వస్తున్నారా?’’ అనడిగాడు.

‘‘అవును మావయ్య’’ అంది విశాల

‘‘ఎవరమ్మా వాళ్ళు?’’

‘‘సస్పెన్స్‌. వచ్చాకమీరే చూస్తారుగా’’ అంటూ విషయం చెప్పకుండా పోర్టికోలోకి వెళ్ళిపోయింది విశాల.సరిగ్గా ఇరవై నిముషాల తర్వాత...ఖరీదైన కారు నిశ్శబ్దంగా గేటులోకి వచ్చింది. విశాల సూచనతో డ్రయివరు కారును నేరుగా పోర్టికోలోకి తెచ్చి ఆపాడు. వెనకడోరు తెరుచుకొని ముందుగా మహదేనాయకర్‌ ఆయన వెనకే భార్య ముగాంబికై కారు దిగారు.

‘‘రండి బాబాయ్‌గారూ........ రండి పిన్నిగారూ’’ అంటూ వరసలు కలిపేసి ఇద్దర్నీ ఆహ్వానించింది విశాల కాళ్ళకు నీళ్ళిచ్చింది.విశాలను ముచ్చట పడుతూ గమనించారు దంపతులిద్దరూ.

‘‘ఇదిగో అమ్మాయ్‌ విశాల నువ్వేకదూ?’’ అడిగింది మూగాంబికై

‘‘ఓసి పిచ్చిమొగమా తను విశాలగాకపోతే, పక్కింటమ్మాయనుకుంటున్నావా? ఆ అందం అణకువ తెలీటంలేదూ? చూడగానే గుర్తుపట్టేసాలే

విశాలని. మన సహస్ర చెప్పిన పోలికలన్నీ అచ్చుగుద్దినట్టు సరిపోయాయి.’’ అన్నాడు మహాదేవనాయకర్‌.‘‘థాంక్స్‌ బాబాయి గారు నన్ను సరిగ్గా గుర్తుపట్టేసారు. అక్క సహస్ర నా గురించి మీకు చెప్పేసిందన్న మాట. రండి’’ అంది వాళ్ళని లోనకు తీసుకొస్తూ విశాల.‘‘ఒక్కనీ గురించేమిటమ్మాయ్‌ మీ ఇంట్లో అందరి గురించి చెప్పింది. పైకి ఎంతకోపంగా వున్నా దానికి డాడీ అంటేనే ఎక్కువయిస్టం అందుకే ఆయన దగ్గర ఏదీదాచదు’’ అంది మూగాంబికై. అంత క్రితం వరకు వెంకటరత్నం నాయుడు మునుసామి యిద్దరూ హాల్లోనే కూచుని మాట్లాడుకుంటున్నారు. మహదేవనాయకర్‌ దంపతులు వచ్చిన విషయం క్షణంలో యిల్లంతా పాకిపోయింది మునుసామి లేచి ఎదురొస్తూ.‘‘నమస్తేసార్‌ మహాదేవనాయకర్‌ గారూ. అమ్మా నమస్కారం అనుకోకుండా తమ దర్శన భాగ్యం కలగటం నా అదృష్టం. నా పేరు మునుసామి........’’ అంటుంటే.

‘‘చాలు చాలు’’ అన్నాడు నవ్వూతూ మహాదేనాయకర్‌.

‘‘జల్లికట్టు మునుసామి నువ్వు. మాకు తెలీక పోడం ఏంటయ్యా. నాయుడికి జిగ్రీ దోస్త్‌వి. కత్తిసాము కర్రసాములో మాస్టర్‌వి. విరాట్‌కి ఆదిగురువువి నువ్వే కదా.........’’ అంటుంటే ఆయన మాటలకి విస్తుపోయాడు మునుసామి.‘‘అయ్యా బాబోయ్‌. నా గురించి ఇన్ని విషయాలు తెలిసాయంటే డౌట్‌ లేదు, అమ్మాయి సహస్ర మీకంతా చెప్పుండాలి.’’ అన్నాడు ఉత్సాహంగా.‘‘చెప్పాలా ఏంటి? టివిలో మనవాళ్ళతో బాటు నీ అద్బుతమైన ఫైటింగ్‌ చూసాంగదా. ఓసారి నీతోకత్తి కలిపి ఫైట్‌చేయాలినుందయ్యా.’’‘‘అమ్మో మీతోనా? నేనా?........ నాయకర్‌ వంశీకులు. మీముందు నేనెంత? మీరు చేయి కలిపాల్సింది నాతో కాదు మా నాయుడితో. మీ యిద్దరూ ఫైట్‌ చేస్తే రెండు కొదమ సింహాలు పోరాడినట్టే.’’

‘‘అది సాధ్యంకాదు లేవయ్యా. ఇప్పుడు వియ్యమందే చేత్తో కయ్యం పొసగదు కదా’’ అంటూ నవ్వేసాడు.

ఈలోపల నాయుడి కుటుంబ సభ్యులంతా హాల్లోకొచ్చేయటతో విశాల అందర్నీ పరిచయం చేసింది. ‘‘వదినా’’ అంటూ మంగతాయారు మూగాంబికైని లోనకు తీసుకుపోయింది. విశాల తల్లి కాంచనమాలను పరిచయం చేసినప్పుడు మహాదేవనాయకర్‌ రుద్దకంఠంతో ‘‘మా బిడ్డను నీ బిడ్డలా చూసుకుంటున్నావ్‌ నీ రుణం తీర్చుకోలేమమ్మా’’ అంటుంటే ‘‘అంత మాటనకన్నయ్య. సహస్ర ఇప్పుడు నా పెద్దకూతురులాంటిది. తన గురించి మీరేందిగులు పడొద్దు’’ అంది.

మహాదేవనాయకర్‌ తనవైపు రావటంచూసి సోఫాలోంచి లేచివచ్చాడు వెంకటరత్నం నాయుడు. మహదేవనాయకర్‌ నాయుడి చేతిని స్నేహపూర్వకంగా అందుకున్నారు.

‘‘ఎంతయినా ఆడపిల్ల వాళ్ళం. ఓమెట్టు దిగాలిగదా. ఒకప్పటి మన కయ్యం వియ్యంగా మారటం చాలా ఆనందంగా వుంది. గతాన్ని మర్చిపోదాం. కావాలంటే కోయంబత్తూరు వద్ద మీ పొలాల పక్కనున్న ఆ ఏభై ఎకరాల్ని కట్నంగా ఇప్పుడే ఇచ్చేస్తాను. మీ కిష్టమైన ఫ్యాక్టరీ ఏదైనా పెట్టుకోవచ్చు’’ అన్నాడు.

వెంకటరత్నం నాయుడు ఆలోన చెతిమీదచేయివేసి నవ్వాడు. ‘‘ఏమిటయ్యా నాయకర్‌ ఆ ఏభై ఎకరాలలో సరిపెట్టేద్దామనుకుంటున్నావా? మీ ఆస్థికి ఏకైక వారసురాలు అమ్మాయేగదా. కట్నం వేరే యివ్వాలా? మాకు పిల్లచాలు. కట్నం అక్కర్లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్ద మనుసుతో పట్టింపుల్ని పక్కనపెట్టి మీరు మా అబ్బాయిని అల్లుడిగా స్వీకరించటం ఆనందంగా వుంది’’ అన్నాడు.

‘‘ప్రేమించుకోడం ప్రేమ వివాహాలు ఈ రోజుకొత్తగదా నాయుడూ. ఏనాడో శకుంతలా దుష్యంతులు ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఆ పరంపర ఈనాడు సర్వ సాధారణమై పోయింది. కాలంతో బాటు మనమూ మారాలిగదా తప్పదు. ఇంతకీ విరాట్‌ సహస్రలు ఎక్కడ?’’‘‘వాళ్ళు మేడమీద వున్నారు. కాస్సేపు రిలాక్స్‌గాకూచోండి. కాఫీ తీసుకున్నాక వెళ్దాం.’’

మహదేవనాయకర్‌ దంపతులకు అతిథి మర్యాదలనంతరం స్వయంగా వెంకటరత్నం నాయుడు వార్ని సహస్ర గదికితీసుకెళ్ళాడు. వెంట మునుసామి పెద్దకొడుకు విక్రాంత్‌ కూడ వచ్చాడు. వాళ్ళు వెళ్ళేసరికి విరాట్‌ సహస్ర వద్దే వున్నాడు.

చాలా రోజుల తర్వాత తల్లిదండ్రుల్ని చూడగానే దుఖ్ఖం ఆగలేదు. చెంగున లేచి ఎదురెళ్ళి ఇద్దర్నీ కౌగలించుకొని ఏడ్చేసింది సహస్ర. ‘‘ఈ పోరాటంలో ప్రాణాలతో వుంటానో లేదో తెలీదు. ఈ లోపలే మిమ్మల్ని ఓసారి చూడాలనిపించింది. సారీ డాడీ మిమ్మల్ని చాలా బాధపెపట్టాను.’’ అంటూ తల్తిదండ్రుల్ని పట్టుకొని ఏడ్చేసింది. మహాదేవనాయకర్‌ కూడ కన్నీరు తుడుచుకున్నాడు. మూగాంబికై కూతుర్ని అక్కున చేర్చుకొని ఓదార్చింది.

‘‘ఈ బేలతనం, పిరికి మాటలు ఎలా వచ్చాయి నీకు? వీరవంశంలో పుట్టి, నరనరాన పౌరుషం నిపుంకున్న నీవు పలకాల్సిన మాటలు కావివి. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ధర్మం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది. ధర్మం నీ పక్షాన వుంది. పోరాడు..... జయించు. ప్రజాక్షేమంకోసం జీవితాలు ధారపోసిన నాయకరాజుల వంశంలో పుట్టిన వీరవనితవు. భయమెందుకుతల్లీ. మేమంతా నీవెకనవున్నాం.’’ అంటూ ధైర్యం చెప్తుంటే తండ్రి మాటలకు నూతనోత్సాహాం పొందుతూ కళ్ళు తుడుచుకుంది సహస్ర.

‘‘కంగారు పడాల్సిందేమీ లేదమ్మా. నేను సియంగారితో మాటాడినీకు తగిన రక్షణ ఏర్పాట్లు కూడ చేయిస్తాను’’ అన్నాడు మహదేవనాయకర్‌.‘‘వద్దు డాడి. ఆ పనిమాత్రం చేయొద్దు.’’ అంది వెంటనే సహస్ర.

‘‘సియం నాకు రక్షణ కల్పించటమంటే ఇదంతా రాజకీయంగా మారిపోతుంది. నాయకులు పార్టీలు రాజకీయ లబ్ధికోసం రచ్చచేస్తాయి. ప్రతి పక్షాలు ఇదంతా సియం చేస్తున్న కుట్ర అంటాయి.

ఇదంతా అవసరమా? అందుకే మేంఎక్కడ ఉందీకూడ ఎవరికీ తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. విరాట్‌ సెల్‌నెంబర్‌ సియం వద్దవుంది. స్వయంగాతనే రక్షణ ఏర్పాట్లు చేస్తానన్నా మేం తిరస్కరించాం. అడ్రసు కూడ చెప్పలేదు.’’ అంటూ వివరణ చెప్పింది.

‘‘అవునంకుల్‌ ఈ ఇష్యూకి మీరుకూడ దూరంగా ఉండండి. మేమంతా సహస్ర వెంట వున్నాం. ఆ త్యాగరాజన్ని జైలుకి పంపించకుండా వదలం’’ అన్నాడు విరాట్‌.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika