Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

 జరిగిన కథ: వెంకటరత్నం  నాయుడు మనసులో విశాల ఎవరిని ప్రేమిస్తుందన్న విషయం పై చాలా అనుమానాలు వస్తుంటాయి.. అంతా వింటున్న మునుసామి ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టలేక ఫక్కున నవ్వేస్తాడు. ‘తన డౌట్స్‌ అన్నీ కలిపి చెత్త బుట్టలో పడేయమని... విశాల ప్రేమించిన కుర్రాడు ఎవరోకాదు. మన విరాటే.’’ అంటూ అసలు విషయం బయటపెట్టేస్తాడు మునుస్వామి.. వెంకటరత్నం  నాయుడు అశ్చర్యానికిలోనవుతాడు.. ఆ తరువాత....

 

 

ఓపిగ్గా విని ‘‘సరి మీయిష్టం’’ అన్నాడు మహదేవనాయకర్‌. సహస్ర తలమీద గాయాన్ని, విరాట్‌ భుజం మీద గాయాన్ని చూసి దంపతులిద్దరు చాలా గాబరపడ్డారు. జాగ్రత్తగా వుండమని హెచ్చరించారు. ఈ లోపల నాయకర్‌ దంపతులకోసం కింద హాలు దగ్గరగా మరోగదికేటాయించి వారిలగేజిలోన పెట్టించి మేడమీదకొచ్చింది విశాల.

ఆ విధంగా రెండు కుటుంబాలు కలిసిపోడంతో కబుర్లతో సమయం తెలీలేదు. తల్లిదండ్రుల రాకతోసహస్రకు నూతనోత్సాహం ఏర్పడిరది. ఎప్పుడూ ఒంటరితనంతో ఉండేయిల్లు ఒక్కసారిగా బంధువులరాకతో కళకళలాడుతోంది. కాంచనమాల ఆనందానికి హద్దేలేదు. ఇక విక్రాంత్‌ పిల్లలిద్దరూ ఆమెకు మంచి కాలక్షేపం.

ఆ సాయంత్రం గోస్వామి కాలనీకి వచ్చేసి విరాట్‌ ఇంట్లో సిటింగ్‌ వేసారు వెంకటరత్నంనాయుడు, మహాదేవనాయకర్‌, మునుసామి. ముగ్గురూ స్కాచ్‌విస్కీ ఓపెన్‌చేసి పుచ్చుకొంటుండగా ముందుగా మునుసామి అసలు విషయాన్ని ప్రస్తావించాడు. ‘‘నాయకర్‌ సార్‌........మా విశాల మీద మీ అభిప్రాయం ఏమిటి?’’ అంటూ.

మునుసామి ప్రశ్నకు విచిత్రంగా నవ్వాడు మహదేవనాయకర్‌. ‘‘అభిప్రాయం? ఏ విషయంలో ?’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు

‘‘అదేనండీ అమ్మాయిని చూసారుగదా మంచి చెడు ఏమన్నా వుంటే చెప్తారనీ’’ అన్నాడు మునుసామి.

‘‘భలేవాడివయ్యా చెడు గురించి చెప్పడానికేముందని? లక్షణమైన అందమైన అమ్మాయి. అంతకు మించి తెలివితేటలు అందం ఐశ్వర్యం వినయ విధేయత ఒకటేమిటి? అన్ని శుభలక్షణాలతో కూడిన అమ్మాయి ఇంకేం చెప్పాలి?’’

‘‘అమ్మాయి సహస్ర ఇంకేం చెప్పలేదా?’’

‘‘లేదే.......చెప్పటానికి వేరే ఏముందయ్యా?’’

‘‘ఉంది సార్‌ అందుకే అడుగుతున్నాను.’’

‘‘అదే ఏమిటంటున్నాను. ఇదిగో నాయుడూ మునుసామి మనసులో ఏముందో నాకర్ధంగావటం లేదు. ఏంచెప్పాలో అడుగు.’’

ఆయన కాస్సేపు మౌనం వహించాడు.

విశాల గురించి సహస్ర తన తల్లిదండ్రులకు చెప్పి వుండొచ్చు. కాని విశాల కూడ విరాట్‌ని లవ్‌ చేస్తోంది. ఆ విషయం చెప్పిందోలేదో తెలీదు. ఇద్దరూ విరాట్‌ని కోరుకుంటున్నారు. ఇది పెళ్ళి వరకు వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అప్పుడు నాయకర్‌ అభ్యంతరం చెప్తే అదోపెద్ద సమస్యవుతుంది. కాబట్టి ముందే ఆయన చెవిన ఓమాట వేసుంచటం మంచిదన్నది వెంకటరత్నం నాయుడి అభిప్రాయం. అందుకు అనుగుణంగా మునుసామి విశాల ప్రస్తావన తెచ్చాడు అయితే. 

ఇంకా దాచటం ఎందుకనే ఉద్దేశంతో వెంకటరత్నం నాయుడు బయట పడిపోయాడు.

‘‘నేను చెప్తాను విశాలకూడ మా విరాట్‌ని లవ్‌చేస్తోంది. చాలా సంవత్సరాలకు కలిసిన కుటుంబం మాది. నా చెల్లెలు కాంచన మాలను ధపెట్టలేను. కాబట్టి నేనుఎటూ చెప్పలేను. ఈ విషయం మా అందరికీ తెలుసు. సహస్ర నీకీ విషయం చెప్పిందో లేదో మాకుతెలీదు దుకే..........’’

వెంకటరత్నం నాయుడి మాటలు పూర్తిగాకముందే ఫక్కున నవ్వాడు మహాదేవనాయకర్‌.

‘‘ఈ మాత్రానికే నువ్వెందుకు టెన్షన్‌ పడతావు నాయుడు. నాకంతా తెలుసు. చేసుకునేది వాళ్ళుగదా. మనకెందుకు టెన్షన్‌ పడ్డం?

కష్టపడి పెళ్ళాం పిల్లల్ని పోషించాలా? ఇద్దరు భార్యలయితే భరించలేడనే బాధవుందా? లేదు గదా. ముగ్గురూ కోట్లాది ఆస్థులకు వారసులు. ముగ్గురూ ఒక్క ప్రాణంగా వున్నప్పుడూ మనమెందుక్కాదనాలి? మీకో విషయం తెలుసా?

మా రాజవంశంలో ఒక్కరికన్నా ఎక్కువ మంది భార్యల్ని కలిగి వుండటం పూర్వాచారం.

ఈ ఆచారాన్ని మానాన్నగారు తప్పించారు. ఆయన ఏక పత్నీ వ్రతుడు. ఆయన కొడుగ్గా నేనూ ఏక పత్నీ వ్రతుడ్నే, కాని మధురైలోని మా వంశీకుల్లో చాలా మందికి ఇద్దరేసి భార్యలున్నారు.

టేకిటీజీ నాయూడూ. ఆ టైం రాగానే ఇద్దర్కీ ఇచ్చిపెళ్ళిచేసేద్దాం. మీ చెల్లెలు కాంచనమాలని బాధపెట్టడం నాకు మాత్రం ఇష్టమా. నాకూతుర్నికూడ తనకూతురిలా భావిస్తున్న మంచి మనసుతనది. అలాంటప్పుడు విశాలకూడ మా బిడ్డకాదా. విశాలతో కలిపి మాకూ యిద్దరు కూతుళ్ళు. కాళ్ళుకడిగి నీ కొడుక్కి నేను యిద్దర్నీ కన్యాదానం చేస్తాను చాలా?’’ అన్నాడు.

ఆ మాటలకు వెంకటరత్నం నాయుడు మునిసామి యిద్దరూ సంతోషించారు. గుండెలనుంచి పెద్ద భారం తొలగిపోయినట్టయింది. ‘‘చాలు నాయకర్‌ ఆ మాటన్నారు చాలు. ఇక మాకేచింతాలేదు.’’ అన్నాడు వెంకటరత్నం నాయుడు.

రాత్రి తొమ్మిది గంటల వరకూ మందుకొట్టి, తర్వాత వెంకటరత్నం నాయుడు మహాదేవనాయకర్‌ లిద్దరూ కారులో ఓల్డ్‌ మాంబళంవెళ్ళిపోయారు. తర్వాత మునుసామితోపాటు చందూ, బండశివా మిగిలిన వాళ్ళు అంతా భోంచేసి పడుకున్నారు.

వెంకటరత్నం నాయుడు కుటుంబంతో బాటు మహాదేవనాయకర్‌ దంపతులు అయిదు రోజులు ఇక్కడే ఉన్నారు. అంతా చాలా సంతోషంగా గడిపారు. రోజూ ఏదో పూటవచ్చి సహస్ర విరాట్‌లను చెకప్‌చేసి వెళ్తాండంటంతో డాక్టర్‌ గుణదీపిక అందరికీ బాగాపరిచయమై వస్తే కాస్సేపు అందర్నీ పరామర్శించిగాని వెళ్ళటంలేదు. మంచి మందులు వాడటంవలన విరాట్‌ సహస్రలు చాలా త్వరత్వరగా కోలుకుంటున్నారు.

ఆరో రోజు ఉదయం ముందుగా మహదేవనాయకర్‌ మూగాంబికలు మధురైకు తమ కార్లో బయలుదేరి వెళ్ళిపోగా, మధ్యాహ్న భోజనాలనంతరం వెంకటరత్నం నాయుడి కుటుంబం కోయంబత్తూరుకు బయలు దేరింది.

చెల్లెలు కాంచనమాలను తమతో తీసుకెళ్ళాలని చూసాడు వెంకటరత్నం నాయుడు. కాని ప్రస్తుతం రానంది కాంచనమాల. పరిస్థితులు చక్కబడ్డాక సహస్ర విశాల యిద్దర్ని తీసుకుని విరాట్‌ వెంటవస్తానంటూ మాటచ్చింది. ఆ విధంగా వెంకటరత్నం నాయుడి కుటుంబంకూడ వెళ్ళిపోడంతో ఒక్కసారిగా యిల్లంతా బోసిపోయినట్టయింది.

అంతవరకు విశాలకిష్టమైన కుక్కపిల్లలు రెండూ తమ డాగ్‌ హౌస్‌కే పరిమితమయ్యాయి. వాటిని వదల్లేదు. ఇపుడు వాటికి స్వేచ్ఛలభించింది. అవి విశాలతో బాటు సహస్రకీ బాగా అలవాటయ్యాయి. ప్రస్తుతం సహస్రకాలక్షేపం అవే. రోజులు గడుస్తున్నాయి...

విరాట్‌ సహస్రలు పూర్తిగా కోలుకుంటున్నారు.

ఈ లోపల...

అటు త్యాగరాజన్‌ కుడి భుజం ఎట్టయప్ప తన మనుషులతో సహస్ర జాడకోసం సిటీలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. హర్యానా నుండి ఆరుగురు షూటర్‌ని పిలిపించాడు త్యాగరాజన్‌్‌. జాలిదయ అనే పదాలకు అర్ధం తెలీని మూర్ఖులు వాళ్ళు. డబ్బిస్తే ఎవర్నయినా కాల్చి చంపేస్తారు. సహస్ర జాడ తెలిస్తే గాని వాళ్లనుపయోగించటం వీలు కాదు. గాబట్టి వాళ్ళంతా ప్రస్తుతానికి క్యాంప్‌కే పరిమితమయ్యారు.

మరోపక్క...

ఇక ధర్మ మిత్రవర్గం వుంది. వాళ్ళంతా చిన్న చిన్న జట్లుగా విడిపోయి ప్రస్తుతం త్యాగరాజన్‌్‌ ఎట్టయప్పటల రహస్య స్థావరంకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇక మునుసామి మనుషులు కదిరేషన్‌ మనుషులు అటు విశాల యింటినీ, ఇక్కడ గోస్వామి కాలనీలోని రెండు యిళ్ళ రక్షణకోసం రేయింబవళ్ళు అప్రమత్తంగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా...

మధురై కోర్టుకు హాజరు కాలేని పరిస్థితి ఉందికాబట్టి కేసును చెన్నై కోర్టుకు బదిలీ చేయవలసిందిగా సవివరంగా సహస్ర పంపించిన వినతి పత్రాన్ని సహృదయంతో పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమె కోరిన విధంగానే కేసును చెన్నైకోర్టుకు బదిలీచేసింది. ఈకేసు సైదాపేట సెషన్స్‌ కోర్టుకే రాబోతోంది. ఎటొచ్చి వాయిదా ఎపుడనేది కోర్టునుండి సమన్లు వస్తేగాని తెలీదు. త్యాగరాజన్‌కి గాని, తనకి గాని సమన్లు మధురై అడ్రసులకే వెళ్తాయని సహస్రకు తెలుసు. సమన్లు రాగానే మహదేవనాయకర్‌ ఫోన్‌చేసి చెప్పాడు.

అయితే యిది ప్రాథమిక స్టేట్‌మెంట్‌ రికార్డ్‌చేసుకునే ట్రయల్‌గాబట్టి సహస్రకోర్టుకు హాజరయినా త్యాగరాజన్‌ హాజరుగాకపోవచ్చు. కేసును తాత్సారంచేసే ఉద్దేశంతో తనకు చెన్నై అనుకూలం కాదు కాబట్టి మధురైకోర్టుకే హాజరవుతానంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుమతి పొందొచ్చు. అది మంజూరై మధురై కోర్టుకు హాజరుకమ్మని పర్మిషను వచ్చేలోపు సహస్రజాడ కనిపెట్టి అంతంచేయటానికి చాలా సమయం                      ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో...

ఒక రోజు సాయంకాలం...

సడెన్‌గా విరాట్‌కి ఫోన్‌ చేసాడు ధర్మ.

‘‘చెప్పు ధర్మా ఏంటి విశేషాలు?’’ కాజువల్‌గా అడిగాడు విరాట్‌.

‘‘విశేషాలు చాల వున్నాయి. ఓసారి నువ్వు బయటికి రాగలవా?’’

‘‘ఎలుకలున్న కలుగు జాడ తెలిసిపోయింది. నువ్వొస్తే బాగుంటుందనుకుంటున్నాను’’ చెప్పాడు ధర్మ.

‘‘వస్తాను అడ్రసు చెప్పు.’’

చెప్పాడు ధర్మ.

‘‘ఒకె అక్కడే ఉండు. వస్తున్నాను’’ అంటూ లైన్‌ కట్‌చేసాడు విరాట్‌.

సహస్ర తనూ వస్తానంటే వారించాడు.

చందూ ఆఫీస్‌నుంచి ఇంకా రాలేదు.

తన దుస్తుల ఫ్యాక్టరీకి వెళ్ళిన విశాలకూడ ఇంకా ఇంటికి రాలేదు. తను బైక్‌మీద వెళ్ళటం సేఫ్‌కాదు. ఇంటికి అవసరమైన సరుకులు తెచ్చే ప్‌ ది కాని అది ఓపెన్‌ జీప్‌ సహస్ర తనూ వస్తానంటే వారించి మునుసామికి ఫోన్‌చేసాడు. చేసిన అర్ధగంటలో తమ వేన్‌ తీసుకువచ్చేసాడు నుసామి. డ్రైవరుతోబాటు మునుసామి బండశివా కదిరేషన్‌కూడ వచ్చారు.అలా వేన్‌లో అంతా బయలుదేరి ధర్మ చెప్పిన అడ్రసుకు చేరుకునే రికి చీకటపడి వీధి దీపాలు వెలిగాయి. కీల్పాక్కంలోని మారుమూల వీధి కార్నర్‌లోని టీ బంక్‌ వద్ద ధర్మ విరాట్‌కోసం ఎదురుచూస్తున్నాడు. క్కన  మరో యిద్దరు ఫ్రెండ్స్‌ వున్నారు. వాళ్ళంతా కూడ వేన్‌లోకి వచ్చేసారు. వేన్‌ని స్లోగా పోనిమ్మని చెప్పాడు ధర్మ.  

విశాలమైన ఆ వీధిలో...

ఎడంపక్క ఇరవైఏడో నంబరు ఇంటిని పరిశీలించి గుర్తుపెట్టుకోమన్నాడు ధర్మా. స్లోగా వెళ్తూన్న వేన్‌లోంచి జాగ్రత్తగా ఆయింటి పరిసరాల్ని గమనించారంతా. రెండంతస్థుల పాత భవనం, పైన టెర్రస్‌మీద సగం భాగం మూడో అంతస్థుగా ప్లాట్‌ కట్టబడుంది. ఆవరణలో కొన్ని శాల్తీలు అటుయిటు తిరుగుతున్నాయి. వేన్‌ ఆ భవనం దాటి ఎగువకు కెళ్ళిమరో వీధిలోకి మలుపు తిరగ్గానే ఒక పార్కు పక్కన వేన్‌ ఆపించాడు ధర్మా.

‘‘వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారా?’’ అడిగాడు విరాట్‌.

అవునన్నట్లు తలూపాడు ధర్మా.

‘‘కీల్పాక్కాంలో మారుమూల ప్రాంతం యిది. మూడు రోజుల క్రితం కాశిశెట్టి స్ట్రీట్‌లో ఏవోకొంటున్న ఎట్టయప్ప మనిషి ఒకడ్ని గుర్తించి జాగ్రత్తగా వాడ్ని ఫాలోఅయి ఈ ఇంటిని గుర్తించగలిగారు మనవాళ్ళు. అప్పటినుంచి పగలు రాత్రి వంతులవారీగా ఈ ప్రాంతంలో తిరుగుతూ గమనించటంతో చాలా విషయాలు బయటపడ్డాయి.’’ అన్నాడు ధర్మ.

‘‘ఏంటా విషయాలు?’’ వెంటనే అడిగాడు విరాట్‌.

‘‘ప్రస్తుతం త్యాగరాజన్‌ అడ్డా ఆ ఇరవై ఏడో నంబరు యిల్లే. పైనున్న ప్లాట్‌లో త్యాగరాజన్‌ ఉంటాడు. దిగువ రెండంతస్తులూ వాడి మనుషులు మకాం ఉంటున్నారు. ఎట్టయప్పవెంట నలుగురు రాగా తర్వాత మధురై నుంచి మరోపదిమంది వచ్చిజాయినయ్యారు. వీళ్ళుగాక లోకల్‌ గుండాలు ఇరవైమందిని తీసుకున్నారు. అంతా ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు.

త్యాగరాజన్‌ పగలు ఎక్కడికీ వెళ్ళటం లేదు. సాయంకాలం వెళ్ళి రాత్రి ఏదో టైంకి తిరిగి ఇక్కడికే వచ్చేస్తున్నాడు.  తన ఇంటికెళ్ళినా అక్కడ ఎక్కువ సేపు ఉండటం లేదు.

అయితే ముఖ్యమైన విషయం ఉత్తరాది నుంచి బహుశ హర్యానా లేదా బీహార్‌ ప్రాంతం నుంచి కావచ్చు. ఆరుగురు ఘూటర్స్‌ని పలిపించి రిజర్వ్‌లో ఉంచాడు. వాళ్ళు కూడా ఆ యింట్లోనే ఉంటున్నారు.

ఎట్టయప్ప కొందరు మనుషుల్ని తీసుకొని వేన్‌లో ఉదయం వెళ్తే తిరిగి రాత్రికే కేంప్‌లోకి వస్తున్నాడు. అంటే సహస్ర జాడకోసం వాళ్ళంతా ముమ్మరంగా సిటీలో గాలిస్తున్నారని వేరే చెప్పక్కర్లేదు.’’ అంటూ ధర్మ తను తెలసుకున్న విషయాల్ని వివరిస్తుంటే ఆసక్తిగా విన్నారంతా.

‘‘అయితే ఇప్పుడేం చేద్దాం? వాళ్ళకన్నా ముందే మనం దాడిచేద్దామా? మధురైనుంచి పారిపోయి వచ్చినట్టుగా ఆ త్యాగరాజన్‌ చెన్నై కూడా వదిలి పారిపోవాలి. మన దెబ్బ ఎలా ఉంటుందో చూపిద్దాం. ఈ రాత్రికే  దాడి చేద్దాం’’ అన్నాడు ఆవేశంగా మునుసామి. కాని విరాట్‌ ఆవేశపడలేదు.

‘‘‘వద్దు మనం తొందర పడ్డం మంచిది కాదు. వాళ్ళ మకాం మనకు తెలిసిపోయింది. గాబట్టి ఎప్పుడన్నా ఆటాక్‌ చేయొచ్చు. ముందే మనం తొందర పడితే తప్పుమనదవుతుంది. ప్రస్తుతానికి వెళ్ళిపోదాం పదండి’’ అన్నాడు.

ధర్మ కూడా అదే సలహా యివ్వడంతో...

అంతా తిరుగు ప్రయానమయ్యారు.

రెండోసారికూడా ఇరవై ఏడోనెంబరు ఇంటి ముందు నుంచి వేన్‌ని పోనిస్తూ ఆ పరిసరాల్ని జాగ్రత్తగా గమనించారు. పూర్తిగా చీకట్లు ముసురుకునే సమయానికి వారు ప్రయాణిస్తున్న వేన్‌ ముంబళందిశగా పరుగు తీసింది.

***************************************


ఆ రోజు శిఖామణితో గొడవ జరిగిన రాత్రి గాయపడిన తర్వాత సహస్ర విరాట్‌లు సుమారు నెలరోజులు ఓల్డ్‌ మాంబళం ముదలియార్‌ స్ట్రీట్‌లోని విశాల యింట్లోనే రహస్యంగా ఉన్నారు.

కాని ఎక్కువ రోజులు అక్కడుంటం సేఫ్‌ కాదని ఇద్దరికీ తెలసు. ముఖ్యంగా తామిక్కడున్నంత కాలం కాంచనమాల విశాల ఈ తల్లీ కూతుళ్ళిద్దరికీ ప్రమాదం పొంచి ఉన్నట్టే. తామిక్కడున్నట్టు తెలిసిన మరు క్షణం వీళ్ళని కిడ్నాప్‌ చేసి సహస్రని బ్లాక్‌ మెయిల్‌ చేయాలని చూస్తారు. కాబట్టి వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలంటే తామిద్దరూ ఎంత తొందరగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. ఆరోగ్యం చక్కబడిరది గాబట్టి వెళ్ళి పోవటం మంచిది.

విరాట్‌ సహస్రలు చర్చించుకొని గోస్వామి కాలనీకి వెళ్ళి పోవాలని నిశ్చయించుకున్నారు. కాని విశాల అంగీకరించలేదు. ఏమైనా సరే ఇక్కడే డాలంటూ పట్టుబట్టింది. కాంచనమాల కూడా ఉండిపొమ్మనే చెప్పింది. వాళ్ళకి నచ్చజెప్పడానికి చాలా శ్రమపడాల్సివచ్చింది. మునిసామి చందూ, దీక్షలతో సహా అంతా పరిస్థితి వివరించాక గాని ఇద్దరూ ఒప్పుకోలేదు. ఆ రాత్రి ఎనిమిదిగంటలకి విశాల స్వయంగా తనకార్లో తీసుకెళ్ళి దించి వెళ్ళింది. విరాట్‌ చందూలు మొదట వీధిలోని తమ యింటి కొచ్చేసారు. సహస్ర దీక్షలు మూడో వీధి చివర తమ ఇంటికి చేరుకున్నారు.

ఆరోజునుంచి కదిరేశన్‌ మనుషులు మునుసామి మనుషులు సహస్ర వుంటున్న దీక్ష ఇంటికి వేయికళ్ళతో కాపలా ఉంటున్నారు. కాలనీకి వచ్చే కొత్త వాళ్ళని ఓ కంట గమనించసాగారు. ఈ లోపల సైదాపేట కోర్టుకి హాజరుకావలసిందిగా సమన్లు జారీ అయ్యాయి. ఇరవై రోజుల గడువుందింకా.  

**********************************


త్యాగరాజన్‌ చాలా సీరియస్‌గా వున్నాడు. ఎందుకంటే మధురై వదిలి వచ్చి నెలరోజులు కావస్తోంది. తన మనుషులు వీధికుక్కల్లా సిటీలో గాలిస్తున్నారు. అయినా సహస్ర జాడ తెలీలేదు. తన మనుషుల చేతకాని తనం మీద కోపం. ఆరోజు సాయంకాలం తన ముందుకొచ్చిన ఎట్టయప్ప బృందాన్ని కోపంగా చూసాడు. ‘‘ఏమైంది? మనం వుంటున్నది మధురైలో కాదు. చెన్నైలో. ఆ పిల్ల సహస్రజాడ యిక్కడే ఉంది. అయినా మీ చేత కాలేదా? ఇన్నిరోజులయినా జాడ తెలీనేలేదా? ఏం చేస్తున్నార్రా మీరంతా? ఇంకా ఎన్నిరోజుల్రా? మన కొంప మునిగే వరకూ తెలుసుకోలేరా?’’ అంటూ సీరియస్‌గా అడిగాడు.

‘‘ఆ పనిమీదే వున్నాంసార్‌. ఆచూకీ తెలిసింది’’అన్నాడు ఎట్టయ్యప్ప.

‘‘తెలిసిందా? ఇంకా తెలుసుకోవాలా?’’ సందేహంగా ప్రశ్నించాడు జగన్మోహన్‌.

‘‘తెలిసింది సార్‌’’

‘‘అయితే చెప్పరా ఎక్కడ వుంది? అడ్రసేమిటి?’’ ఉత్సాహంగా అడిగాడు.

‘‘మీనబాక్కం ఏర్‌పోర్ట్‌ దగ్గర్లో గోస్వామి కాలనీ అని మూడు వీధులతో కూడిన కాలనీ వుంది. మూడో వీధిలో చిట్టచివర యింట్లో దీక్ష అనే అమ్మాయితో కలిసి ఉంటోంది.’’

‘‘ఇది తెలుసుకోడానికి ఇన్నిరోజులు పట్టిందా?’’

‘‘సార్‌ ఒకవిషయం మీరు మర్చిపోతున్నారు. నెల్లాళ్ళ కిందట శిఖామణితో జరిగిన గొడవ మీకు తెలుసు. ఆ సందర్భంగా పోలీసుల రాకతో సహస్ర ఆమె ప్రియుడు విరాట్‌లు పారిపోతుండగా మన ధనగిరి బేచ్‌ ఎదురు పడ్డం కాల్పులు, మనవాళ్ళు కొందరు చనిపోవటం మీకు తెలుసు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరికీ బలమైన గాయాలే తగిలాయి. దాంతో వాళ్ళు గోస్వామి కాలనీకి రాకుండా ఆజ్ఞాతంలో ఎక్కడో వుండి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఇప్పుడే మూడు రోజుల క్రితం తిరిగి యిళ్ళకు చేరుకున్నారు’’.

ఆ మాటలు వింటూ విసుగ్గా నుదురు రుద్దుకున్నాడు త్యాగరాజన్‌ ‘‘ఎవడ్రా... ఎవడ్రా విరాట్‌. అగ్గికి ఆజ్యంతోడైనట్టు ఆ పిల్లదాంతో చేయికలిపాడు. వాడి వివరాలేమైనా తెలిసాయా?’’ అనడిగాడు.

‘‘లేదు సార్‌. ఆ కుర్రాడి వివరాలేమీ ఇంకా తెలీలేదు’’ చెప్పాడు ఎట్టయ్యప్ప.

‘‘సరి ఇప్పుడేం చేద్దాం? వాళ్ళు కాలనీకి తిరిగొచ్చేసారుగా వెళ్ళండి. రేపు ఉదయమే వెళ్ళి ఆజర్నలిస్టులేడీని ఇంటిదగ్గరే షూట్‌ చేసి చంపి పారేయండి. ఈ హర్యానా షూటర్స్‌ని పందుల్లా మేపుతున్నాం. వచ్చిన పని పూర్తయితే వాళ్ళని పంపించేయొచ్చు.’’

‘‘అదంత సులువు కాదు సార్‌. కాలనీ కెళ్ళి కామ్‌గా పని ముగించుకు రావటం సాధ్యం కానిపని’’

‘‘ఎందుకురా? అక్కడ బలమైన కాపలా ఏమన్నా వుందా?’’

‘‘ఉందిసార్‌. కాపలా పటిష్టంగా వుంది. మధురైనుంచి సహస్ర తండ్రి మహాదేవనాయికర్‌ పంపించిన పదిహేనుమంది మెరికల్లాంటి ఫైటర్స్‌ కదిరేశననే వాడి నాయకత్వంలో ఆ యింటిని చుట్టి రేయింబవళ్ళు కాపలాకాస్తున్నారు. మరో పక్క ఆ విరాట్‌కి గురువట. పేరు మునుసామి. కత్తిసాము కర్రసాములో మాష్టర్‌. అతడి మనుషులు పదిమంది పైగా వుంటారు. వాళ్ళంతా నిరంతరం కాలనీలోకి వచ్చే పోయే మనుషుల్ని వెహికిల్స్‌ని ఓ కంట కనిపెట్టిచూస్తున్నారు. అనుమానం వస్తే ఆపేస్తున్నారు. వీళ్ళుగాక మరో పాతికమంది కుర్రాళ్ళున్నారు. వాళ్ళలో చాలామందిని మధురైలో చూసిన గుర్తు. ఆ సహస్రకు ఇంతమంది రక్షణగా వున్నారు. వీళ్ళందర్ని తప్పించుకొని వెళ్ళి పని ముగించటం అసాధ్యం. సహస్రను అంతం చేసేలోపు వాళ్ళు మమ్మల్ని ఫినిష్‌ చేసేస్తారు. కాబట్టి తొందరపడితే పనులు కావు. కాస్త ఆలోచించి అడుగు ముందుకేయాలి’’ అంటూ తనకు తెలిసిన సమాచారమంతా   వివరించాడు ఎట్టయ్యప్ప.

ఆ మాటలు శ్రద్ధగా వింటూ...

కాస్సేపు అటుయిటు పచార్లు చేసాడు త్యాగరాజన్‌.

ఉన్నట్టుండి ఆగి...

ఎట్టయ్యప్ప వంక చూసాడు.

‘‘మనం శత్రువుని చేరటం సాధ్యంగానప్పుడు...  శతృవునే బయటికి రప్పించటం తెలివైన పని. అవునా?’’ అనడిడగాడు.

‘‘కాని ఎలా సార్‌?’’

‘‘ఎలాగో చెప్తాను. కాలనీ దాటి సహస్ర బయటికి రాకపోవచ్చు. ఇంటికే పరిమితం కావచ్చు. కాని సహస్ర ఫ్రెండు... ఏం పేరన్నావ్‌? దీక్ష యస్‌. క్షనే అమ్మాయి బయటకు రాకుంటా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఏదో టైంలో వస్తుంది కదూ?’’

అవునన్నట్టు తలూపాడు ఎట్టయప్ప.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika