Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> సద్వినియోగం

sadviniyogam

సరస్వతి , జగదంబ చిన్ననాటి  సహాధ్యాయులు .  పెళ్ళయ్యాక  కూడా  వాళ్ళ అత్తవారిళ్ళు... ఒకరికొకరు బంధువుల కావటం  వల్ల  వాళ్ళ 'స్నేహం'  సాగుతూనే  ఉంది . 

పక్కఊరిలో  పెళ్ళికి  వచ్చారు  సరస్వతి  కుటుంబం !  అందర్నీ పంపేసి  తను మాత్రం  జగదంబ  దగ్గర  నాలుగు  రోజులు గడుపుదామని ఆగింది  సరస్వతి .  అదే పెళ్ళికి  జగదంబ , భర్త వెళ్ళటం - సరస్వతిని  తనతో  వచ్చి,  ఉండమని  బతిమాలటం కుడా కొంతకారణం!

" నువ్వు ఆ  పెళ్ళికి  రాకపోయినా  నేనొచ్చి  నీ దగ్గర  నాలుగు రోజులుండి  వెళ్ళేదాన్నే! మొదటినించీ నేననుకుంటున్నదేనే  ఈ  పెళ్ళికి  వెళ్ళటం   జరిగితే  నీతో  గడిపి వెళ్లాలని ! "  నవ్వుతూ  అంది సరస్వతి . 

అలా -అలా మాట్లాడుకుంటూ 'పూజ గది' లోకి  వెళ్ళారిద్దరూ!  జగదంబ మనుమడు  ఐదేళ్ళ వాడు  బామ్మతో కలిసి  పూజ  చెయ్యాలని కాచుక్కూచున్నాడు . వాడి శ్రద్ధ  చూసి , చాలా ముచ్చట  పడింది సరస్వతి .

" ఇంకా  ముద్దమాటలు  తగ్గలేదని  ఊరుకున్నాను గాని...లేకపోతె   ఈపాటికి  అంగపూజా - అష్టోత్తరం నేర్పెద్దును .. " అంది  మనుమడి తలనిమురుతూ  జగదంబ . 

" అయ్యో నీ  అసాధ్యంకూలా...ఏమిటంత అర్జంటు?" ఆశ్చర్యంగా  అడిగింది సరస్వతి . 

"చిన్ననాటినించే  పిల్లలకన్నీ నేర్పాలి సరసూ! లేకపోతె  పెద్దైన తర్వాత  నలుగురిలో 'అభాసు' పాలౌతాం దీక్షితులుగారి  మనుమడిలా!" పాక పకా నవ్వుతూ  అంది  జగదంబ 

********         **********          **********        **********           **********

హడావిడి పనులు పూర్తయ్యాక  సావధానంగా  కూచున్నారిద్దరూను . 

" ఇప్పుడు చెప్పు  ఏదో చెప్తానన్నావుగదా ! దీక్షితులుగారి   మనుమడు... " అందించింది  సరస్వతి . 

" ఓహ్...అదా... ?" అంది  జగదంబ కిల కిల నవ్వుతూ. 

" అబ్బ... ఊరించి చంపకే.... చెప్పు... " అన్న  సరస్వతితో ---------------

" నాలుగిళ్ళ  అవతల  ఎవరో  కొత్త జంట   అద్దెకొచ్చారు ! చుట్టుపక్కల  మా నలుగుర్నీ  తాంబూలానికి పిలిస్తే వెళ్లాను. పూజకేమీ  సిద్ధం చేసుకోలేదు  వాళ్ళు ! వెళ్ళిన నలుగురం  అన్నీ అమర్చసాగాం... హరివాణం, ఉద్దరిణి ఉన్నాయి...కాని-పంచపాత్ర లేదు....  అనగానే దీక్షితులుగారి   భార్య  - తెమ్మని  వారి మనుమణ్ణి   పంపింది . ఆ కుఱ్ఱ్రాడు  తెచ్చినవి   చూశాక - అక్కడ  చాలామందికి  వవ్వాగలేదు ! "

 పది లీటర్లు ...పట్టే  ఒక పెద్ద  ష్టీలుగిన్నె , అరచేతి వెడల్పున్న 'జరీ  అంచు  పంచ'  తెచ్చాడు . నవ్వుతున్నవాళ్ళను   చూస్తూ  తనేదో  'తప్పు' చేసినట్లు  ఫీలయ్యాడాకుఱ్ఱాడు - " ఓహో...పంచ -అంటే ఐదు కదా? ఔనౌను ... ఇంకా  నాలుగు  పాత్రలు   తేవాలన్నమాట... సోరీ... తెచ్చేస్తానుండండి" అంటూ  మళ్లీ  పరుగెత్తబోయాడు . 

" వాళ్ళెక్కడో  'ఢిల్లీ ' లో  ఉంటారు . వాళ్లకి  'పూజా - పునస్కారాలు' తక్కువ . నేనెళ్ళి  తెస్తానుండండి !" అంటూ దీక్షితులు  గారిభార్యే  బయలుదేరి   వెళ్ళింది . "యజ్ఞాలూ -యాగాలూ చేయించే  ' ఆహితాగ్ని' దీక్షితులు గారి  మనుమడికి 'పంచపాత్ర'అంటే... తెలియదా???     "అక్కడందరూ అదే  మాట..." ఏం చేస్తాం- చెప్పండి  ఇప్పటి    సంసారాల్లో  ఎవరిష్టం వారిది  కదా? పెద్దవారే అనుసరిచకపొతే... ఇంక పిల్లలకెలా  తెలుస్తాయ్?" నవ్వుతూనే  అన్నా - దీక్షితులుగారి  భార్యకిది కొంచెం  అవమానంగానే  అనిపించి ఉంటుంది  పాపం ! ఎందుకంటే  అస్తమానం  అందర్నీ 'తప్పు'పడుతూనే  ఉంటుందావిడ"

" నువ్వు చెప్పింది  నిజమే  జగదంబా! చిన్ననాటి నుంచీ  మన  సంప్రదాయాలు పిల్లలికి నేర్పించాలి. మంచి - చెడు  వివరించి  చెప్పాలి . సాధ్యమైనంతవరకూ   వాళ్ళని  'సుపధం' వైపు  మళ్ళించాలి! చక్కని వ్యక్తిత్వంతోబాటు  మన వేదధర్మాలను, మన సంస్కృతినీ  కూడా  అర్ధమయ్యేలా  బోధించాలి! " మనస్ఫూర్తిగా అంది  సరస్వతి . 

 "ఇంకో  వింత  చెప్పమన్నావా  సరసూ...!  నేనిందాకా  చెప్పిన  కుఱ్ఱాడే  'డిగ్రీ'  పూర్తయాక  తాతగారి దగ్గరకి వచ్చేశాడు .  వేదాలూ -శాస్త్రాలు , ఉపనిషత్తులూ- పురాణాలూ ,మీమాంసలూ... ఒకటేమిటి  అన్నీ పుక్కిట  పట్టేశాడు! పండితుడైపోయాడు... పామరజన్నాన్ని చేర్చి   విద్యావంతుల్ని  చేస్తున్నాడు .  అన్ని విధాలా  'ఉద్దండుడు' అనిపించుకున్నాడు  తెలుసా ? ఒక్కోసారి    ఆనాటి  'పంచపాత్ర' సంగతి చెప్పి... 'నిజంగా ఆనాడు 

ఆ సంఘటన  జరగకపోయి   ఉంటే - దాన్ని నేను   సీరియస్ గా   తీసుకోకపోయి  ఉంటే , ఈ 'సంపన్నిధి' ని నేను తెలియకుండానే - కోల్పోయి ఉండేవాణ్ణి!"  అని   ఉదహరిస్తూ...  విద్యార్ధులను ప్రోత్సహిస్తుంటాడు .

 " నీ  దగ్గిరకి  వచ్చినందుకు  ఒక  చక్కని  విషయం  గ్రహించాను  జగదంబా! నేనుకూడా  మా మనుమరాలికి స్తోత్రాలూ - స్తవాలూ నేర్పటం  మొదలెడతాను" అంది  సరస్వతి! 

 " వాళ్ళు చదువుతుంటే   నేర్పిన  మనకెంత  తృప్తిగా ఉంటుందో  గమనించు" మెరుస్తున్న కళ్ళతో అంది జగదంబ .  స్తోత్రాలు  నేర్చుకునే  పిల్లలు  గుంపుగా రావటంతో  లేచి వెళ్ళింది   జగదంబ . 

 " తను కూడా 'ఇలా' కాలాన్ని సద్వినియోగం  చేసుకోవచ్చు" అనే నిర్ణయానికి వచ్చింది   సరస్వతి .

మరిన్ని కథలు
‘laikeeyam