Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: రెండవ రోజు ఆడిషన్స్ అయిపోయి వెళ్తుండగా చంద్రకళతో " నీ అంత వయసున్నప్పుడు నృత్యం పట్ల నేనూ  క్రమశిక్షణతో, ఆసక్తితో ఉండేదాన్నని. విష్ యు గుడ్ లక్ అని చెప్తుంది తేజస్విని మేడం. ఆడిషన్స్ జరిగిన రెండు రోజులు చంద్రకళ వాళ్ళతో పాటు జగదీష్  వెంటవుండడంతో చంద్రకళ ఆనందానికి అవధుల్లేవు.ఆ తరువాత...   

 

గజేబో నుండి దూరంగా వచ్చాక,  పక్కకి వేసున్న గార్డెన్ చైర్ లో కుచోమన్నారు.  మరో చైర్ లాక్కొని, నా ఎదురుగా కూచున్నారాయన.

“కళా, మొన్న మీరు మా యింటికి వచ్చినప్పుడు,  జగదీష్, రాణి ఏమన్నా గొడవ పడ్డారా?  రాణి అప్ సెట్ అయిందా? చెప్పు,” అడిగారు.

కాస్త ఆశ్చర్య పోయాను. వెంటనే తేరుకుని ఆనాటి విషయాలు చెప్పాను.

అంతా విన్నాక,  “కరక్టే, పెద్ద గొడవేమీ లేదుగా!” క్షణమాగారు..

“మన రాణి ఆ రోజు జగదీష్ తో మాట్లాడుతూ అప్ సెట్ అయిందని, మీరు వెళ్ళి పోయాక, ఒక్కత్తే తన కార్ లో కూచుని కాసేపు మ్యూజిక్ విన్నదని,  కోపంగా ఉండడం వల్లనేమో,  కార్ డోర్ గట్టిగా బాది, తన చేతిని తానే గాయపరుచుకుందేమో! అని, అక్కడే ఉన్న వాచ్ మెన్ గోవిందన్ నాతో అంటున్నాడు,”  నా వంక సూటిగా చూసారు అంకుల్.

“చూడు కళా, మన రాణిని చిన్నప్పటి నుండి చూస్తున్నాడు, గోవిందన్.  దాన్ని షికార్లు తిప్పి ఆడించేవాడు . రాణి కోపం, నడవడి వాడికి బాగా తెలుసు. అందుకే బాధ పడుతూనే, నాతో అలా వివరించాడు.నువ్వు మాత్రం ఈ సంగతి ఎవరితోనూ అనకు,”  కుర్చీ నుండి లేచారు..

“సరే,  పద వెళదాము,”  అన్న అంకుల్ వెనుకే నడిచాను.   మధ్యలో ఆగి,  అకాడెమీ కమిటీ మెంబర్ సరస్వతమ్మకి నన్ను పరిచయం చేసారు....

మరికాసేపుండి,   పార్టీ నుండి అర్ధరాత్రయ్యాక ఇల్లు చేరాము....

**

జగదీష్ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాక,  అతన్ని చాలా మిస్ అవుతున్నాము.  అన్నిటికి హడావిడి చేసేవాడు....  నత్తిగా మాట్లాడే మీనాక్షితో కూడా కబుర్లు చెప్పేవాడు.  మూలన పడున్న రాయిని కూడా మాట్లాడించగలడు జగదీష్’  అనిపిస్తుంది...

“తుఫాను వచ్చి వెలిసినట్టుంది,”  అని అమ్మ అతని గురించి అన్న మాటలు నిజం..

క్రిస్టమస్ హాలిడేస్ సరదాగా సందడిగా గడిచాయి.

నాన్నకి,  టెలి-ఫిలిం ఆడిషన్స్ బాగా జరిగాయని చెప్పాను. 

మార్చ్ బదులు, ఫిబ్రవరీ లోనే, తను తిరిగి చెన్నై వచ్చే అవకాశం ఉందంటున్నారు నాన్న.

అందరం రోజులు లెక్కపెడుతున్నాము...

స్కూల్స్ రి-వోపెన్ అయ్యాక, హోం వర్క్,  ప్రాజెక్ట్స్ వర్క్ బాగా ఎక్కువగానే ఉంది.. 

ఎంత బిజీగా ఉన్నా,  పార్టీ ముందురోజు సంఘటన గుర్తొస్తూనే ఉంటుంది.  కావాలని,  రాణి తన చేతిని, గాయపరుచుకుందేమో అన్న విషయం గుర్తొచ్చినప్పుడల్లా మనసు తొలిచేస్తుంది.   ఉండబట్టలేక,  అమ్మకా విషయం చెప్పినప్పుడు, కాసేపు ఆలోచించింది అమ్మ.  రాణి విషయాలు ఎప్పటికప్పుడు మరిచిపొమ్మని గట్టిగా చెప్పింది..

**
‘రేపే,  నాన్న భూటాన్ నుండి వచ్చే రోజు. ఫిబ్రవరి14.  లంచ్ టైంకంతా,  నాన్న ఇంట్లో ఉంటారు.   లక్కీగా శనివారం. స్కూల్ కి వెళ్ళే పనిలేదు’ అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాము నేను, వినోద్....

బ్యాక్-ప్యాక్ అందుకుని, స్కూలుకి బయలుదేరబోతుంటే, అంకుల్ ఫోన్చేసారు. .టెలి-ఫిలింప్రాజెక్ట్ కి,  నేను,  సెలెక్ట్ అయ్యానని చెప్పారు. పట్టలేని ఉత్సాహంగా అనిపించింది.

“వెంటనే నాన్నకి చెప్పమ్మా,”  అన్నాను...

“రేపటి వరకు ఆగితే ఏం పోయింది?”  అడిగింది...

క్షణం ఆలోచించాను.

నాన్న ఇంటికి వచ్చాకే,  టెలిఫిలిం సంగతి చెప్పి సర్ప్రైజ్ చేద్దామని నిర్ణయించుకున్నాము...

సంతోషంగా,  మేఘాల మీద నడుస్తున్నట్టుగా స్కూలుకి వెళ్ళిపోయాను...

**

రీసెస్ టైంలో,  కెమిస్ట్రీ  లాబ్ వైపు నడుస్తున్న నన్ను,  ఎవరో,  భుజంమీద  చేయి వేసి ఆపారు.  పక్కకి చూస్తే, లీనా జోసఫ్.  న్యూ-జెన్ మాగజీన్ లో నా ఫోటోస్, ఇంటర్వ్యూ చూసిందట. అభినందించింది.

నాతో పాటే నడుస్తూ కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది.

“ఔనూ,   రేపు ఫిబ్రవరీ 14  వేలెంటైన్స్ డే.  అదే, ప్రేమికులరోజున ఏం చేస్తున్నావు?” అడిగింది నన్ను..

“హాపి యెస్ట్ డే ఫర్ మి. ఆరునెల్ల తరువాత, మా నాన్న భూటాన్ నుండి ఇంటికి వచ్చేస్తున్నారు,” అన్నాను.

“ఓహో“ అలాగా! నైస్,” అనేసి, కొద్దిక్షణాలు మౌనంగా ఉంది...

“నీకు తెలుసా?  వేలెంటైన్స్ డే గిఫ్టుగా, జగదీష్ బాబుకి లేటెస్ట్ మాడల్ లెనోవా లాప్ టాప్ పంపిందట, రాణి.  అతను ఇవాళ ఫోన్ చేసి, అంతఖరీదైన గిఫ్ట్ పంపినందుకు గొడవ చేసినా,  తరువాత నచ్చిందని చెప్పాడంట ... రాణి ఇజ్ సో హాపీ.  సెలెబ్రేషన్స్ కి తన ఫ్రెండ్స్ ని ఐస్ క్రీం పార్లర్ కి తీసుకువెళుతుంది. మా అక్క కూడా వెళుతుంది.  ఇదంతా తనే చెప్పింది నాకు,”  గబ గబా విషయం చెప్పింది లీనా.క్లాస్ రూమ్ వరకు వచ్చేసాము.  మా వెనుకే టీచర్ కూడా లోనికి వచ్చారు..

“ఇదంతా ఎంత ఎగ్జైటింగ్ కదా!” , “మళ్ళీ మాట్లాడుతాను,”  అంటూ తన సీటులోకి వెళ్ళిపోయింది లీనా.

‘చాలా అనీజీగా అనిపించింది...  లీనా చెప్పిందంతా నిజమేనా?  రాణికి మరొకరు దొరకనట్టు జగదీష్ తోనే ఫ్రెండ్షిప్ చేయడం, విలువైన వేలెంటైన్స్ గిఫ్టులివ్వడం నాకస్సలు నచ్చడం లేదు..   అమ్మకి చెబితే ఏమంటుంది?’ అనుకున్నాను.

**

ఇంటికెళ్ళాక,  డాన్స్ క్లాసుకి తయారయి వెళ్లి డైనింగ్ దగ్గర కూర్చున్నాను.

అమ్మ నాకు హార్లిక్స్ కలిపిచ్చింది.  స్కూల్లో, లీనాజో సెఫ్ నుండి విన్న విషయం అమ్మకి చెబుదామని తలెత్తాను. 

“నీకోసం ఇదేదో ప్యాకేజీ కొరియర్లో వచ్చింది,” అంటూ షెల్ఫ్ మీదున్న ఓ పార్సెల్ వంక చూపించింది అమ్మ.  

నాకు ఎప్పుడూ కొరియర్ రాదే! .....

“ఏంటమ్మా అది?  అదేమిటో నువ్వే తీసి చూడు?” అన్నాను.

అమ్మ ప్యాకెట్ వోపెన్ చేసింది.  

అందులో రెండు సెల్ ఫోన్లు.  ఒకటి రెడ్ కలర్.  ఒకటి బ్లాక్.

ఆశ్చర్యపోయాను.  నాకు ఫోన్లు పంపేదెవరు?

అమ్మ కవర్నుండి లెటర్ తీసి,  నాకు వినపడేలా చదివింది...

డియర్ చంద్రా,

మై సప్రైజ్ టు యు బోత్.... (నీకు, వినోద్ కి).

మీకు నా వేలంటైన్స్ డే గిఫ్ట్స్ గా–సెల్ ఫోన్స్ పంపుతున్నాను

... నాకు మంచి డీల్ వచ్చింది. 

నీకు రెడ్ ఫోన్, వినోద్ కి బ్లాక్.

అత్తయ్యకి చెప్పు,  ఏమీ స్పెండ్ చేసే అవసరం లేదు.   ఆ ఫోన్స్ కి ఇన్ – కమింగ్ కాల్స్ ఫ్రీ.  చార్జ్ చేసుకుంటే చాలు.  ఫోన్స్ విల్వర్క్. నేనే మీకు ఫోన్ చేస్తాను ఎప్పుడన్నా.

హోప్ యు లైక్ ద గిఫ్ట్స్.

టేక్ కేర్,

జగదీష్ బాబు.....

అరె, ఏంటిది? నమ్మలేకపోతున్నాను..  రియల్ సప్రైజ్....అప్పుడే మీనాక్షితో పార్క్ నుంచి వచ్చిన వినోద్ తనకి ఫోన్ గిఫ్ట్ వచ్చిందని ఎగిరిగంతేశాడు..

అమ్మ కూడా సప్రైజ్ అయింది.   ప్యాకేజి వోపెన్ చేయకుండా నా కోసం వెయిట్ చేసిందట.

‘థాంక్స్ చెప్పాలి జగదీష్ కి.  నాకు,  వినోద్ కి కూడా చాలా నచ్చాయి ఫోన్స్’   అనుకుంటూ క్లాసుకి వెళ్ళిపోయాను.

“ఫోన్లు రెండు నేను చార్జ్ పెడతానులే, ” వెనుక నుంచి అమ్మ అనడం వినబడింది.

**

పొద్దున్నే లేచి నాన్న రాక కోసం నిముషాలు లెక్కపెడుతూ,  మరోసారి ఇల్లంతా సర్దేసాము. 

పదయ్యాక ఎయిర్పోర్ట్ కి కన్నన్ జీపు తీసుకెళ్ళాడు.

నాన్న కిష్టమైన కిచిడి చేసి,  వెజిటబిల్ ఆమ్లెట్ కి తయారు చేసింది అమ్మ.

నేను, వినోద్ బాల్కనీ లోనే వెయిటింగ్.....

**

సరీగ్గా ట్వెల్వ్ కి నాన్న వచ్చారు.   వస్తూనే నన్ను, వినోద్ ని దగ్గరికి తీసుకున్నారు. 

మాతో కబుర్లయ్యాక, స్నానం -పూజకానిచ్చి లంచ్ కి వచ్చారు.

ఆనందంగా ఉంది. కానీ,  నాన్న సన్నగా అయ్యారు.  జ్వరం వచ్చినట్టుగా వీక్ గా కనిపిస్తున్నారు.. 

నాన్నని చూస్తూ టిఫిన్ తింటున్న నాకు ఆపుకోలేని ఏడుపొచ్చేసింది.   అమ్మకి కూడా. 

“ఆరునెలలు కూడా అవ్వలేదు.  ఎందుకలా చిక్కిపోయారు.  మాకు అన్ని జాగ్రత్తలు చెప్పే మీరు ఇలాగైతే ఎలా?”  అంది.

“ఏముంది శారదా?    అక్కడ రెస్ట్ లేదు కదా! ఇక్కడ రొటీన్ డ్యూటీ లోపడి, నీ చేతివంట తింటే బాగయి పోతా.   ఏరా వినోద్ బాబు, ఔనా కాదా? నువ్వు చెప్పు,” వినోద్ తో అంటూ,  అమ్మని ఇంకొంచెం కిచిడి వడ్డించమన్నారు,  నాన్న.

ఫోన్ రింగయితే, వెళ్ళితీసాను.  భూషణ్ అంకుల్.  “కళా, నాన్నవచ్చారు కదా! హ్యాపీనా?” అడిగారు.  “నేను ఒకఫైల్ పంపుతానమ్మా.  నాన్నకివ్వు.   రేపు మేమే వచ్చి కలుస్తామని డాడీకి చెప్పు,” అన్నారాయన.

“అవును,  ఇవాళ పూర్తి రెస్ట్ నాకు. ఏ పనులైనా రేపటి నుంచే,”  విషయం విన్న నాన్న....

భూటాన్ నుండి మాకు తెచ్చిన వస్తువులు తీసిచ్చి, అక్కడి విశేషాలు, అక్కడి వారి తిండి  – దుస్తులు- ఆచారాల గురించి,   రాత్రి వరకు కబుర్లు చెప్పారు.....

నాన్న అలిసిపోయి నిద్రపోయాక గాని మేము ఆయన వద్ద నుండి కదలలేదు.

**   

పొద్దున్నే,  బ్రేక్ ఫాస్ట్ అయ్యాక, అంకుల్ పంపిన ‘రాగం- తానం- పల్లవి’  టెలిఫిలిం ఫైల్ రీవ్యూ చేస్తూ, అమ్మతో డిస్కస్ చేస్తున్నారు నాన్న.  నేనూ వెళ్ళికూర్చున్నాను.

“ఏమ్మా,  తేజశ్విని గారి ప్రొఫైల్ చూడు.  అమెరికా, మలేషియా, జొహానెస్బర్గ్, సింగపూర్ లో–స్వచ్చందంగా- ఆలయాలకి,  నేత్రదాన శిబిరాలకి,  బీదవిద్యార్ధుల స్కాలర్ షిప్ప్పులకి మరెన్నో సాంఘిక కార్యక్రమాలకి.. తన నృత్యకళ ద్వారా నిధులు సేకరించారట.  ఎంత అదృష్టం, ఎంతటి మానవీయత?

స్పెక్టాకులర్ కెరియర్ ఆమెది.   ఈ‘రాగం- తానం- పల్లవి’ ప్రాజెక్ట్ తన తల్లీతండ్రులకి అంకితం చేస్తారట ఆమె.

నా వంకచూస్తూ, “అర్ధమయ్యిందా? చిట్టితల్లీ,” అన్నారు నాన్న.

అయిందన్నట్టు తలాడించాను. 

“నేను కూడా తేజశ్విని అంతటి దాన్నవ్వాలని- మనకి, మాస్టారు గారికి,  ఇంకా జగదీష్ బావకి కూడా అనిపిస్తుంది,”  అన్నాను నవ్వుతూ.నన్ను దగ్గరికి తీసుకొని, తలమీద ముద్దుపెట్టుకున్నారు నాన్న.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery