Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 జరిగిన కథ: నాయకర్ దంపతులిద్దరు సహస్రను,  విరాట్ ను జాగ్రత్తగా వుండమని హెచ్చరిస్తారు. ఎప్పుడూ ఒంటరితనంతో ఉండేయిల్లు ఒక్కసారిగా బంధువులరాకతో సందడిగా మారిపోతుంది.ఆ సాయంత్రం గోస్వామి కాలనీకి వచ్చేసి విరాట్‌ ఇంట్లో సిటింగ్‌ వేస్తారు వెంకటరత్నంనాయుడు, మహాదేవనాయకర్‌, మునుసామి. ఆ తరువాత... 

 

త్యాగరాజన్‌ ప్లానేమిటో కొద్ది కొద్దిగా బోధపడసాగింది. అప్పటికప్పుడు ఒక దారుణమైన పథకాన్ని రూపొందించాడు త్యాగరాజన్‌్‌. దీక్ష కాలనీలోంచి బయటకురాగానే కిడ్నాప్‌ చేసి, ఆమెను అడ్డం పెట్టుకొని సహస్రను బయటకు రప్పించి, షూట్‌చేసి చంపటం ఆపథకంలోభాగం. అవసరమైతే రెండు మూడు రోజులు ఆలస్యమైనా ఫరవాలేదు. దీక్ష బయటకురాగానే కిడ్నాప్‌ చేయాలని నిర్ణయం జరిగిపోయింది.

ఒక తప్పటడుకు పది తప్పటడుగులకు కారణమవుతుంది. ఒక తప్పు పది తప్పులు చేయిస్తుంది. ఒక పొరపాటు పది పొరబాట్లకు మూలమవుతుంది. ఇక్కడ త్యాగరాజన్‌్‌ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిస్తుందా లేక బెడిసికొట్టి, నేలక్కొట్టిన బంతిలా ఎగిరి తన ముఖాన్నే తాకుతుందా తెలీదు.ఎట్టయప్ప మాత్రం ఆ పథకాన్ని అమలు చేయటానికి ఆనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తూ తన మనుషులతో అప్పటికప్పుడు బయలుదేరి పోయాడు.

I     I     I

విరాట్‌ సహస్రలు కాలనీకి వచ్చేసి వారం రోజులు గడిచాయి. ఇంత వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సహస్ర రక్షణ కోసం మూడు బేచ్‌లు పనిచేస్తున్నాయి. వాళ్ళంతా సుమారు ఏభైమంది వుంటారు. అందరికీ వంటా వార్పు ఇంట్లో సాధ్యం గాదు గాబట్టి వాళ్ళంతా హోటళ్ళలో భోంచేయటమో లేదా హోటల్‌ నుండి కేరేజీలు తెచ్చుకోడమో జరుగుతోంది.

విరాట్‌ ఇంట్లో చందూ విరాట్‌ మునుసామి బండశివా ఈ నలుగురూ ఇంట్లోనే వంట చేసుకుంటున్నారు. అలాగే దీక్ష ఇంట్లో సహస్ర దీక్షలు తమవరకు వండుకుంటున్నారు.

ఇలా ఉండగా...

ఎనిమిదో రోజు ఉదయం...

ఉన్నట్టుండి మార్కెట్‌కి బయలుదేరింది దీక్ష.

‘‘వద్దు నువ్వెళ్ళకు. కదిరేశన్‌తో చెప్పి ఎవరో ఒకర్ని పంపిద్దాం’’ అంది సహస్ర.

‘‘ఎవర్ని పంపించినా ఈ మగళ్ళంతా యింతే. ఏదీ సరిగా చూసి కొనరు. నాలుగు రోజులక్రితం అలాగే చేసాంగా ఏమైంది? ముదిరిపోయిన బెండకాయలు, పుచ్చిన వంకాయలు సగానికి సగం పనికిరాకుండా పోయాయి. ఏం ఫరవాలేదు. నే వెళ్ళి తెస్తాను’’ అంది దీక్ష.‘‘దీక్షా, నామాట వినవే. ఇప్పుడున్న పరిస్థితిలో మనం బయటకెళ్ళటం క్షేమంకాదు’’ నచ్చ జెప్పాలని చూసింది సహస్ర. ఆమె మాటల్ని కొట్టిపారేసింది దీక్ష.

‘‘ఏయ్‌. సమస్య నీగ్గాని నాక్కాదుగదా? నా జోలికెవడొస్తాడు? మొన్న షాపింగ్‌కెళ్ళొచ్చాను ఏమైంది? ఏం కాలేదుగదా. ఇప్పుడూ అంతే. నువ్వేం టెన్షన్‌ పడకు. అర్థగంటలో వచ్చేస్తాను’’ అంటూ స్కూటీ మీద వెళ్ళిపోయింది దీక్ష.

సహస్ర మనసెందుకో అనీజీగా ఫీలయింది. కీడును శంకించనారాంభించింది. ఎంత చెప్పినా వినకుండా బయటకెళ్ళిన దీక్షమీద కోపం ముంచుకొస్తోంది. చందూకి ఫోన్‌ చేసి చెప్పాలనుకొంది. తను ఆఫీస్‌కెళ్ళిపోయుంటాడు. టైం పది కావస్తోంది. విరాట్‌ ఇంట్లోనే ఉంటాడు. ఫోన్‌ చేసి చెప్పాలనుకుంది. కాని ముందే రచ్చ చేసావంటూ అదో గొడవ దీక్షతో. అది తిరిగి వచ్చేవరకు తనకీ టెన్షన్‌ తప్పదు.ఎలాగో అయిదు నిముషాలు ఓపిక పట్టింది. ఇక తన వల్లకాలేదు. వెంటనే కదిరేశన్‌ని పిలిచి దీక్షకి తోడుగా ఎవరినన్నా మార్కెట్‌ వరకూ పంపించమంది. సహస్ర సలహా మేరకు కదిరేశన్‌ తన మనుషుల్లో ఒకడ్ని  మార్కెట్‌కి పంపించాడు.

అలా దీక్ష కోసం వెళ్ళిన వాడు వెళ్ళినట్టే పావుగంటలో వెనక్కి వచ్చేసాడు. వాడు ఉత్తినేరాలేదు. దీక్ష స్కూటీని తీసుకుని మరీ వచ్చాడు. వస్తూనే... ‘‘కదిరేశనన్నా... ఘోరం జరిగిపోయింది’’ అంటూ అరిచాడు.వాడి అరుపులు వినగానే...

సహస్ర గుండె జారినంత పనైంది.

వేగంగా డోర్‌లోకి పరుగెత్తుకొచ్చింది.

ఈలోపల కదిరేశన్‌ అడుగుతున్నాడు వాడ్ని ‘‘ఏమిట్రా స్కూటీ తీసుకొచ్చావ్‌ దీక్ష మేడం ఎక్కడ? ఏం జరిగింది? చెప్పరా.’’ అంటూ గర్జించాడు.‘‘నే వెళ్ళేసరికే స్కూటీ పాలడిపోదగ్గర్లో రోడ్‌మీద పడుందన్నా. దీక్షమ్మగారు అక్కడ లేరు. వాకబు చేస్తే చెప్పారు. ఉదయంనుంచి ఒకవేన్‌ ఆ సమీపంలోనే ఆగుందట. దీక్షమ్మ స్కూటీమీద వస్తుంటే ఆపేసారట. కత్తులు చూపి బెదిరించి వేన్‌లో తీసుకుపోయారట’’ అంటూ వాడు గాభరాతో జరిగింది చెప్తుంటే ముఖముఖాలు చూసుకున్నారంతా.ఆ మాటలు వినగానే...హతాశురాలయింది సహస్ర.ఆఖరికి అనుకున్నంతా అయింది.ఎంత చెప్పినా వినకుండా వెళ్ళి తను ప్రమాదంలో చిక్కుకుంది. తమ పీకలమీదికి తెచ్చింది. సందేహం లేదు. ఎట్టయప్ప మనుషులు దారికాచి దీక్షని కిడ్నాప్‌ చేసేసారు. ఇప్పుడేం చేయాలి?క్షణం కూడా ఆలస్యం చేయకుండా...వెంటనే విరాట్‌కి ఫోన్‌ చేసింది సహస్ర.విషయం తెలిసిన మూడోనిముషంలోనే విరాట్‌తో బాటు మునుసామి కూడా సహస్ర వద్దకొచ్చేసారు.‘‘నీకు బుద్దుందా? బయటికెళ్ళొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వినక్కర్లేదా? దీక్షని ఎందుకెళ్ళనిచ్చావ్‌?’’ వస్తూనే సహస్ర మీద మండిపడ్డాడు విరాట్‌.‘‘ఎంత చెప్పినా వినకుండా వెళ్ళింది. ఏంచేయమంటావ్‌? వాళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళారో ఏం చేస్తారోనని భయంగా వుంది విరాట్‌. ఏదో ఒకటి చేయాలి’’ అంది గాభరాను గొంతులోనే అణచుకుంటూ సహస్ర.

‘‘కంగారు పడకండి’’ అన్నాడు మునుసామి.

‘‘కొంచెం స్థిమితంగా ఆలోచిద్దాం. భయపడాల్సిందేమీ లేదు. వాళ్ళక్కావలసింది సహస్ర. దీక్షకాదు. కాలనీలోకి రావటానికి ధైర్యంచాలక సహస్రను బయటికి రప్పించడానికి వేసిన మాష్టర్‌ ప్లానది. నా అంచనా కరక్టయితే కాస్పేపట్లో వాళ్ళు సహస్రకు ఫోన్‌ చేస్తారు. వెయిట్‌ చేద్దాం’’ అన్నాడు.‘‘వెయిట్‌ చేయటం అనవసరం గురువుగారూ. వాళ్ళు ఖచ్చితంగా దీక్షను కీల్పాక్కం ఇరవైఏడోనెంబరు యింటికే తీసుకెళ్ళుంటారు. మనం వెంటనే వెళ్ళి దాడిచేద్దాం’’ అన్నాడు ఆవేశంతో విరాట్‌.‘‘చినబాబు ఆవేశపడకు. ఆవేశపడితే పనులు కావు. అనర్థాలు జరుగుతాయి. ఇంతతెలిసీ ఆవేశంలో నువ్వు కూడా పొరబాటు పడుతున్నావు. చూసావా? వాళ్ళు తెలివితక్కువ వాళ్ళా దీక్షను తమ మకాంలోకి తీసుకెళ్ళటానికి? దీక్షకోసం సహస్రరాగానే చంపాలని వాళ్ళప్లాన్‌. చేతిలో హర్యానా షూటర్స్‌ వున్నారు. పకడ్బందీగా స్కెచ్‌ వేసారు. బయట ఎక్కడో స్పాట్‌ ఎంచుకున్నారు. వాళ్ళఫోన్‌ వస్తేగాని మనం ఓ నిర్ణయానికి రాలేం.  ధర్మకి ఫోన్‌కొట్టి మనవాళ్ళందర్ని యిక్కడికొచ్చేయమని చెప్పు’’ అన్నాడు.

వెంటనే ధర్మాకి ఫోన్‌ చేసాడు విరాట్‌.‘‘ఒరే కదిరేశా ఓసారిలారారా’’ అంటూ కదిరేశన్‌ని దగ్గరకు పిలిచాడు మునుసామి.‘‘మన కాలనీ గేటు నుండి మార్కెట్‌ వరకు రెండునుంచి మూడు ఫర్లాంగుల దూరం వుంటుంది. ఇది మామూలుగా జరిగిన కిడ్నాప్‌కాదు. ఎట్టయప్ప మనుషుల్లో ఎవడో ఒకడు ఇక్కడే రోడ్‌లో తిష్టవేసి మన మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు ఉప్పందిస్తున్నాడు. ఇప్పుడుకూడా వాడు ఇక్కడే ఉండుంటాడు. దీక్షను తీసుకెళ్ళాక మన కదలికల్ని ఓకంట కనిపెడుతుంటాడు. పంపించు. ఇద్దరు లేదా ముగ్గురుగా రెండు జట్లుగా పంపించు. పాలడిపో దరిదాపుల్లో అనుమానించతగ్గ ఎవడు కన్పించినా లాక్కురమ్మను. త్వరగా పంపించు’’ అంటూ సలహా యిచ్చాడు.దిరేశన్‌ తక్షణమే తన కుర్రాళ్ళని అటు పంపించాడు.‘‘గురువుగారూ ఇంకావాళ్ళీ పరిసరాల్లో ఉంటారంటే అనుమానమే. వీళ్లని పంపించటం అనవసరం’’ అన్నాడు విరాట్‌.‘‘అవసరమే చినబాబు. ఇలాంటి వ్యవహారాల్లో కాస్త అనుభవం కూడా ఉండాలి. ఉంటే నా మాటలు మీకు అర్థమవుతాయి. వాళ్ళు సహస్రకు ఫోన్‌ చేస్తారు. దీక్ష ప్రాణాలతో ఉండాలంటే తాము చెప్పే అడ్రసుకి ఒంటరిగా రమ్మంటారు. వెంట ఎవరు వచ్చినా దీక్ష ప్రాణాలతో దక్కదంటారు. కాబట్టి దీక్షకోసం సహస్ర ఒంటరిగా బయలుదేరాలి. ఆమెను ఆనుసరించి కాస్త వెనగ్గా మనమూ బయలు దేరాలి. సహస్రకి తోడుగా కాలనీ నుంచి ఎవరన్నా వస్తున్నారో లేదో ముందుగానే తెలుసుకోడానికి వాళ్ళు ఖచ్చితంగా ఓ మనిషినిక్కడ             ఉంచి వెళ్ళుంటారు’’ అంటూ తన అభిప్రాయం వివరించాడు మునుసామి. ఎందుకో అతని మాటలు వాస్తవం కావచ్చనిపించింది అందరికీ.

సరిగ్గా ఇరవై నిముషాల తర్వాత...

ఓ యువకుడ్ని జబర్దస్త్‌గా లాక్కొచ్చి...

అందరి ముందు పడేసారు కదిరేశన్‌ మనుషులు.

దారిలోనే వాడ్ని బలంగా కొట్టినట్టున్నారు.గజగజ వణికిపోతున్నాడు.‘‘మన కాలనీ ఎంట్రన్స్‌ గేటు సమీపంలోనే అటూ యిటూ తిరుగుతూ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నాడన్నా. మమ్మల్ని చూడగానే సెల్‌ ఆఫ్‌చేసి పారిపోబోయాడు. ఎంత కొట్టినా నోరు విప్పటంలేదు’’ అంటూ రిపోర్ట్‌ చేసారు. వాడి దగ్గరనుంచి లాక్కున్న సెల్‌ఫోన్ని విరాట్‌కి అందించారు. ఫోన్‌లో పేర్లు చూడగానే అర్థమైపోయింది. వాడు శతృ మనిషని.‘‘వీడ్ని ఏంచేద్దాం గురువుగారు. మీరు చెప్పిందే నిజమైంది’’ అంటూ మునుసామిని అడిగాడు విరాట్‌.

‘ఏం చేయక్కర్లేదు. నోటికి టేప్‌ అంటించి కాళ్ళు చేతులు కట్టిలోన మూల గదిలో పడేసి తాళం పెట్టండి. తర్వాత చూద్దాం. అంటూ సలహా యిచ్చాడు మునుసామి. ఆ కుర్రాడ్ని అవతలికి లాక్కుపోయారు కదిరేశన్‌ మనుషులు.ఇంతలో సహస్ర సెల్‌ఫోన్‌ మోగింది.దీక్ష సెల్‌ నంబర్‌ అది. కాని ఖచ్చితంగా లైన్లో వుంది దీక్ష కాదని తెలుసు, దీక్ష సెల్‌ నుంచి ఫోన్‌తనకి చేస్తూన్నారు.

నిశ్శబ్ధంగా ఉండమని చెప్పి...

స్పీకర్‌  ఫోన్‌ ఆన్‌చేసి...

సహస్రను మాటాడమన్నాడు విరాట్‌.‘‘ఏయ్‌ దీక్ష ఇంటికి రాకుండా ఏంచేస్తున్నావే? ఎక్కడున్నావ్‌?’’ఏమీ తెలీనట్టే అడిగింది సహస్ర.అటునుంచి వెకిలినవ్వు విన్పించింది.అది మగ గొంతు.‘‘హలో జర్నలిస్ట్‌ లహరిమేడం. ఎంతయినా జర్నలిస్టువి గదా! బాగానే నటిస్తున్నావ్‌. నీ ఫ్రండు దీక్ష కిడ్నాప్‌ చేయబడిరది. ఆ విషయం నీకు తెలుసనినాకు తెలుసు. ఫోన్‌ నీ ఫ్రండుదయినా మాటాడుతుంది నేను’’ అంటూ మరో సారి వెకిలిగా నవ్వాడు అవతలివ్యక్తి.‘‘నేనంటే? ఎవడ్రా నువ్వు?.. మా దీక్ష ఎక్కడ?’’ కటువుగా ప్రశ్నించింది.‘‘బలి పశువుగదా ప్రస్తుతానికి దీక్ష మా దగ్గరే క్షేమంగా వుంది. తన ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో వున్నాయి. ప్రాణస్నేహితురాలు గదా. రా. వచ్చి నేను చెప్పే అడ్రస్‌నుంచి దీక్షను కాపాడుకో. ఒంటరిగా రా. ఒక్కదానివేరా. వెంట ఒక్కమనిషి వచ్చినా దీక్షను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం. గుర్తుంచుకో. నిర్ణయంనీది. నీకు ఒక గంట టైమిస్తున్నాను. టైంలోపల రావాలి....’’

‘‘ఒకే. వస్తున్నాను. ఒంటరిగానే వస్తున్నాను. చెప్పరా. అడ్రస్‌ చెప్పు’’

అవతలి వ్యక్తి చెప్పాడు.

పెన్నుతో చిన్న పేపర్‌ మీదరాసుకుంది సహస్ర. ఆ స్లిప్‌ను తీసుకొని చూసాడు విరాట్‌. మీనంబాక్కం ఏర్‌పోర్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ రన్‌వేని చుట్టి దక్షిణంగా ఎగువున కాలనీకి పోయే రోడ్‌లో వుండే ఒక పాడుపడ్డ కట్టడం అడ్రస్‌ అది.

‘‘అరే ఎట్టయప్పా!’’ ఫోన్‌లో పిలిచింది సహస్ర.

‘‘వాడెవడు? నాకు తెలీదు’’ అన్నాడు అవతలివ్యక్తి.

‘‘మరి నువ్వెవరు? త్యాగరాజన్‌కి మరో చెంచావా?’’ దబాయించింది.‘‘త్యాగరాజనెవరో నాకు తెలీదు. అయినా నాపేరుతో నీకు పనేంటి? చేతనైతే వచ్చి దీక్షను విడిపించుకెళ్ళు’’ కరుగ్గా చెప్పాడు వాడు.‘‘దీక్ష మీ దగ్గరుందని నాకు నమ్మకమేంటి? ఫోన్‌ దీక్షకివ్వు మాట్లాడాలి’’‘‘ఒకే. మాటాడు’’పది సెకన్ల తర్వాత విన్పించింది ఓ గొంతు.ఏడ్చేస్తోంది.‘‘సారీ సహస్ర నన్ను క్షమించవే’’ అంది ఏడుస్తూనే.‘‘దీక్ష కంట్రోల్‌ యువర్‌ సెల్ఫ్‌. భయంలేదు. చెప్పేది విను’’ ధైర్యం చెప్పాలని చూసింది సహస్ర.‘‘నీ మాట వినకుండా బయటకొచ్చి పెద్ద తప్పుచేసాను. బుద్ధొచ్చింది. నా ప్రాణం పోయినా ఫరవాలేదు. చందూని క్షమించమని చెప్పు. నేనేమైనా ఫరవాలేదు. నువ్వు రావద్దు. నిన్ను వీళ్ళు చంపేస్తారు. నీతో మాట్లాడిరది ఎట్టయప్ప...’’అంతవరకే విన్పించింది.చెంపమీద కొట్టి ఫోన్‌ లాక్కునుండాలి ఎట్టయప్ప.

దీక్ష గొంతు కెవ్వుమంటూ ఫోన్‌లో విన్పించింది.‘‘రేయ్‌ ఎట్టయప్పా...’’ అంటూ కోపంతో రంకెవేసింది సహస్ర.‘‘అరవకు... అర్థమైందిగా. నేను ఎట్టయప్పనే. రా... వచ్చి దీన్ని విడిపించితీసుకెళ్ళు’’ అన్నాడు ఎట్టయప్ప.‘‘రేయ్‌... నువ్వు మగాడివైతే దమ్ముంటే నేరుగా నా ముందుకొచ్చి మాటాడాలి. ఆడపిల్లని అడ్డంపెట్టుకుని నన్ను సాధించాలని చూడ్డం కాదురా. నువ్వు పిరికి పందవుగాబట్టే ఎట్టయప్పను కాదంటూ బొంకావ్‌. వస్తున్నారా. దీక్షను కొట్టిన నీ చేతుల్ని విరిచేయకపోతే నా పేరు సహస్రకాదు. దానికి ఏమన్నా జరిగితే ఒక్కడు... మీలో ఒక్కడూ ప్రాణాలతో మిగలడు జాగ్రత్త’’ అంటూ హెచ్చరించి లైన్‌ కట్‌ చేసింది.‘‘ఈ అడ్రసు నీకు తెలుసా?’’ స్లిప్‌ మీది అడ్రస్‌ను సహస్రకు చూపించి అడిగాడు విరాట్‌.‘‘తెలుసు. డకోటా విమానాలతో ట్రైనింగ్‌ యిచ్చే సెంటర్‌ పక్కగా వెళ్ళే ఈ వీధి ఎగువన ఒక కాలనీకి పోతుంది. మధ్యలో చాలాదూరం ఇళ్ళుండవు. అటుయిటు తోటలు గుబురు పొదలతో అడవిలా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి’’ అంది లేచి లోనకెళ్తు సహస్ర.‘‘యు ఆర్‌ కరెక్ట్‌.

ఇప్పుడేం చేద్దాం. నువ్వు బల్దేరుతున్నావా?’’ అడిగాడు విరాట్‌.‘‘అవును అట్టే టైం లేదు. ఇప్పుడేవస్తాను’’ అంటూ తనగదిలోకి వెళ్ళింది సహస్ర.విరాట్‌ మునుసామి వంక చూసాడు.ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.‘‘చెప్పండి గురువుగారు. సహస్ర బయలుదేరుతోంది. మనం ఏం చేద్దాం? ఈ ప్రమాదం నుండి దీక్షను సహస్రను కూడా మనం కాపాడుకోవాలి. సహస్ర కన్నాముందే మనం అక్కడికి చేరుకోవటం మంచిదా లేక సహస్రను పంపించి వెనకే వెళ్ళటం మంచిదా?’’ అంటూ సలహా అడిగాడు విరాట్‌.‘‘ఖచ్చితంగా మనం కాస్త వెనగ్గా వెళ్ళటం మంచిది’’ అంటూ వెంటనే బదులిచ్చాడు మునుసామి.‘‘చినబాబు. ఇది హేండ్‌ టు హేండ్‌ పైట్‌ కాదు. వాళ్ళ లక్ష్యం సహస్ర ప్రాణాలు తీయటం. ఇక్కడ ప్రధాన సమస్య నీకు తెలీంది కాదు. వాళ్ళ దగ్గర ఆరుగురు షూటర్స్‌ ఉన్నారు. సహస్ర దీక్ష కోసం రాగానే కాల్చిచంపటం వాళ్ళ ఉద్దేశం. అంతే గాని ఫైటింగ్‌ వాళ్ళ ఉద్దేశం కాదు. సహస్రను ఒంటిగా బయటికి రప్పించటం కోసమే ఈ కిడ్నాప్‌ చేసారు. కాబట్టి దీక్ష కోసం సహస్ర చాలా సాహసం చేయాలి.

వాళ్ళంతా అక్కడ పొంచి ఉంటారు. రోడ్డు మీద ఓ కన్నేసి ఉంచుతారు. సమస్ర వెంట గాని వెనగ్గాగాని మనం ఎవరం వెళ్ళినా దీక్ష ప్రాణాలకు గ్యారంటీలేదు. కాబట్టి సహస్రను ముందు పంపించి పదినిముషాలు వెనగ్గా మనం బయలుదేరటం మంచిది. అక్కడికెళ్ళిన సహస్రకూడా మొండిగా వాళ్ళముందుకు పోవటం క్షేమం కాదు. వెళ్ళినట్టే వెళ్ళి వెనక నుంచి దెబ్బకొట్టి, ముందు దీక్షను అక్కడ్నుంచి బయటికి పంపించేయాలి. సహస్రకి వివరంగా చెప్పి పంపించు’’ అంటూ సూచించాడు మునుసామి.మునుసామి మాటల్లోనే ధర్మమిత్రబృందం బస్సు రివ్వున వచ్చింది. ధర్మతో సహా అంతా బస్‌దిగి లోనకొచ్చేసారు. బస్సువీధి చివర రివర్స్‌ తీసుకుని వచ్చి కదిరేశన్‌ వేన్‌ వెనక ఆగింది.ధర్మతో సహా మితృలంతా బిలబిలలోనకొచ్చేసారు. జరిగిందివిని ఒక్కసారిగా హతాశులయ్యారు. ధర్మ ఎట్టయప్పమీద కోపంతో మండిపడ్డాడు. అంతా చర్చించుకొని ఒక నిర్ణయానకొచ్చేలోన సహస్రరెడీ అయి బయటికొచ్చింది.సింపుల్‌గా వైట్‌ అండ్‌ వైట్‌ పంజాబీ డ్రస్‌ ధరించింది. గ్రీన్‌ కలర్‌ చున్నీ మెడలో వేసుకుంది. చూడ్డానికి డ్రస్సు పంజాబి డ్రస్‌లాగే ఉంటుంది. కాని మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైట్‌కి అనుగుణంగా డిజైన్‌ చేయబడి జేబులు కలిగి ఉంటుంది. జేబుల్లో ప్రత్యర్థుల మీద ప్రయోగించటానికి చిన్న చిన్న ఆయుధాలుంటాయి. వాటితో అవసరమైతే ప్రత్యర్థుల ప్రాణం తీయొచ్చు. లేదా గాయాలు కల్పించి నరకం చూపించవచ్చు.

‘‘నేను బయలుదేరుతున్నాను’’ అంది వస్తూనే.విరాట్‌ లేచి దగ్గరకొచ్చాడు.‘‘సహస్రా ఇది లైప్‌ అండ్‌ డెత్‌ గేమ్‌. బి కేర్‌ఫుల్‌. సరిగ్గా పదినిముషాలు ఆగి నీవెనకే బయలుదేరుతున్నాం. ఈలోపు నువ్వు మేనేజ్‌ చేయాలి. డైరక్ట్‌ అటాక్‌ వద్దు. వాళ్ళను ఏమార్చి దీక్షను ముందు అక్కడ్నుంచి బయటికి పంపించెయ్‌. ఇంతలో మేం వచ్చేస్తాం’’ అంటూ హెచ్చరించాడు.‘‘ఒకె. బై’ అందరికీ చెప్పి బయటికొచ్చింది సహస్ర. వెంట విరాట్‌ కూడా వచ్చాడు.స్కూటీ తీసుకొని స్టార్ట్‌ చేసింది సహస్ర.ఆమె చేతిమీద చేయి వేసి ప్రేమగా నిమిరాడు విరాట్‌.‘‘జరిగిందాని గురించి బాధపడకు. దీక్షను సేఫ్‌గా బయటకు తేవటం మనలక్ష్యం. బి కేర్‌ఫుల్‌’ అంటూ హెచ్చరించాడు.‘‘ఒకే. నువ్వుకూడా జాగ్రత్త’’‘‘ఒకే డియర్‌. టేక్కేర్‌’’

‘‘ఒకే బై’’ఎప్పటిలాగే చున్నీతో ముఖం కవర్‌ చేసుకుంది.ఒంటరిగానే బయలుదేరి వెళ్ళిపోయింది సహస్ర. ఆమెను సాగనంపి విరాట్‌ లోనకొచ్చాడు. ఎలా చూసినా తామంతా సుమారు ఏభైమందిపైగా వున్నారు. వెళ్ళి జగన్మోహన్‌ మనుషుల్ని చుట్టుముట్టడం పెద్దసమస్యకాదు. కాని అలా చేస్తే దీక్షప్రాణాలకు గ్యారంటీ లేదు. ఈ విషయం ఇంకా చందూకి తెలీదు. తను ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్ళి పోయాడు.సహస్ర వెళ్ళిన సరిగ్గా పదకొండో నిముషంలో విరాట్‌ వర్గం బయలుదేరింది. ముందుగా విరాట్‌ తన బైక్‌మీద కదిలాడు. ఆ వెనకే మునుసామి తన వాళ్ళతో వేన్‌లో కదిలాడు. ఆ వేన్‌ని అనుసరించి కదిరేశన్‌ వేన్‌ బయలుదేరింది. చివరిగా ధర్మతన బృందంతో మినీబస్‌లో అనుసరించాడు. దీక్ష ఇంటికి తాళంపెట్టి ఒకడ్ని మాత్రం అక్కడ కాపలా ఉంచాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్