Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 4th september to 10th september

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - రవీంద్ర

 

ప్రేమకు స్నేహానికి మధ్య...!!

ప్రేమకు స్నేహానికి మధ్య యువతలో అనేక సందేహాలు. ఏది ప్రేమ. ఏది స్నేహం. స్నేహానికి ప్రేమకు మధ్య ఉన్న తేడా ఏంటి.. ఒక రిలేషన్ ను ప్రేమా లేక స్నహమా అని ఎలా అర్థం చేసుకోవాలి. పొరపాటు పడకుండా, స్నేహాన్ని స్నేహంగానే ఎలా స్వీకరించాలి. ప్రేమను ఎలా గుర్తించాలి. స్నేహం ప్రేమగా మారుతుందా.. మరేలా ఏలా చేసుకోవాలి. అసలు ప్రమేకు, స్నేహానికి మధ్య అడ్డు పొర ఉందా... ఉంటే దాన్ని ఎలా గుర్తించాలి. ఇష్టమైన స్నేహాన్ని ప్రేమగా మలచుకోవడం ఎలా.. ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు యూత్ ను ఎప్పటికప్పుడు వేదిస్తూనే ఉంటాయి. నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తుంటాయి. మంచి స్నేహాన్ని వదులుకునేలా చేస్తాయి. ఒక్కోసారి ప్రేమను కూడా స్నేహంగా భావించి, ఆప్తులను మిస్ అయ్యేలా చేస్తాయి. అందుకే స్నేహానికి, ప్రేమకు మధ్య ఉన్న ఆంతర్యంపై ఇప్పటికీ, ఎప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది.

పరిచయం స్నేహాంగా...

స్నేహానికి ప్రేమకు మధ్య చర్చ కేవలం యువతీ యువకుల మధ్యే వస్తుంది. అంటెే జెండర్ ప్రధాన కారణం అన్నమాట. కాలేజ్ లలో, ఉద్యోగాలు చేసే చోట, ఇంటి పరిసర ప్రాంతాలలో సహజంగా యువతీ యువకుల మధ్య సంబంధాలు ఏర్పడుతుంటాయి. అవసరాలు, ఇష్టాలు వంటి అనక కారణాల వల్ల పరిచయాలు ఏర్పడతాయి. చాలా సార్లు ఈ ఏర్పడిన పరిచయం తెగిపోదు, కొనసాగుతుంది. పరిచయంలో ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటారు. ఒకరి మనస్తత్వం మరొకరికి అర్థం అవుతుంది. ఇష్టాయిష్టాలు కలిసిపోతాయి. ఒక్కోసారి పరిస్థితులే స్నేహాన్ని ఎక్కువకాలం కొనసాగేలా చేస్తాయి. దాంతో . స్నేహాలు బలపడతాయి. 

క్రాంతి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. తన గ్రూపులో రమ్య, మేఘనతో పాటు వినోద్,. వినయ్ కూడా ఉంటారు. అందరూ కలిసి ప్రాజెక్టు వర్కు చేయాలి. దీంతో క్రాంతికి వినోద్ తో మంచి స్నేహం ఏర్పడింది. అలానే కృష్ణ తన ఆఫీసులో ఉంటే మనోజ్ఞతో కలిసి పర్క్ చేయాలి. ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఆ వర్క్ వల్లే ఏర్పడింది. వేద ఇంటి పక్కన ఉండే సురేష్ పై ఇష్టంతో  పరిచయం పెంచుకుంది. స్నేహం చేస్తుంది. ఇలా ఏర్పడిన పరిచయాలే స్నేహాలుగా మారతాయి.    

మితి మీరని స్నేహాలు

పరిచయం స్నేహంగా మారే క్రమంలో ఇద్దరి మధ్య ఉండే హద్దులు చెరిగిపోతుంటాయి. కాలేజ్ లో శ్రీనుకు పరిచయం అయిన వినోదిని మొదట సార్ అని పిలిచేది. తర్వాత పేరు పెట్టి పిలవడం అలవాటయ్యింది. వారి మధ్య స్నేహం ఎక్కువకాలం కొనసాగాక పెట్ నేమ్ తో మ్యాన్లీ అని పిలుస్తుంది. శ్రీను కూడా వినోదినిని డింపుల్ అని పిలుస్తున్నాడు. స్నేహంలో లంచ్ బాక్సులు షేర్ చేసుకోవడం, గ్రూప్స్ తో కలిసి సినిమాలకు వెళ్లడం, అవసరానికి సహాయం చేయడం, అప్పుడప్పుడు ఫోనుల్లో మంచిమంచి కొటేషన్స్ మెసేజెస్ పాస్ చేసుకోవడం లాంటివి సర్వసాధారణం. స్నేహంలో కొన్ని హద్దులు ఉంటాయి. అవి మానసికమైనవి, శారీరకమైనవి కూడా. మితిమీరిన అభిమానాన్ని ఒక్కరిపైనే చూపరు.

స్నేహం ప్రేమగా మారే క్రమం

స్నేహాలు అన్నీ ప్రేమగా మారతాయని చెప్పలేం. కానీ కొన్ని స్నేహాలు కొంతకాలం కొనసాగాక ప్రేమగా మారతాయి. అభిరుచులతో పాటు, వీళ్లతో లైఫ్ షేర్ చేసుకుంటే బావుంటుుంది అన్న అభిప్రాయానికి ఎదుటి వాళ్లు వస్తారు. దీంతో ఇద్దరిలో ఒకరు వారి ఉద్దేశ్యాన్ని మాటలకంటే ముందు చేతల్లో బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. ఒకే గ్రూపులో ఉన్నా రవికాంత్  మాత్రం శిరీషను ప్రత్యేకంగా చూస్తాడు. ఏది షేర్ చేయాలన్నా ముందు శిరీషకే చెప్తాడు. తన పర్సనల్స్ కూడా శిరీషకే తెలియజేస్తాడు. ఒక్కోసారి పక్కకు పిలిచి ఒంటరిగా మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు. వెంకట్ ను ఇష్టపడే దేవి మాటల మధ్యలో తెలికుండానే తాకుతూ, సరదాగా కొడుతుంది. ఒంటరిగా అతనితో సినిమాలకు వెళ్లాలని ప్రపోజ్ చేస్తుంది. షాపింగ్ లకు, ఫికారుకు అతని బైక్ మీద వెళ్లాలని ఆశపడుతుంది. మిగిలిన వారితోకంటే వెంకట్ తోనే టైమ్ స్పెండ్ చేయడానికి ఇంపార్టెంటెన్స్ ఇస్తుంది. మిగిలిన స్నేహితులు తను ఇష్టపడే అబ్బాయిని కానీ, అమ్మాయిని కానీ కామెంట్ చేసినా, తిట్టినా అలాంటి వాళ్లు భరించలేరు. వారు నిజంగా తప్పు చేసినా సమర్థిస్తారు. వెనకేసుకొస్తారు. ఎప్పుడూ సెల్ లో మెసేజ్ లు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ లే కాదు, ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలియజేస్తారు. తిన్న టిఫిన్ నుంచి వేసుకున్న డ్రెస్ వరకు... ఇంట్లో, బయట తనకు తెలిసిన ప్రతిదాన్ని వెంటనే షేర్ చేసుకుంటారు. రాత్రులు, పగలు అనే తేడా కూడా మర్చిపోతారు. నవ్వుతూ, తుళ్లుతూ ఆనందం మొత్తాన్ని గుమ్మరిచ్చేస్తారు.

స్నేహమా... ప్రేమా...     

కొంత మంది మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమా అనేది చూసే వాళ్లకు అర్థం కాదు. ఇంకొంతమంది యూత్ కు వారి మధ్య ఉన్న రిలేషన్ ప్రేమా లేక స్నేహమా అనేది వాళ్లకే తెలీదు. పక్కవాళ్లు అపార్థాలు చేసుకున్నా పట్టించుకోరు. అసలు ముందు అమ్మాయి అబ్బాయి మధ్య క్లారిటీ ఉండాలి. ఇద్దరూ కలిసి తిరుగుతుంటే స్నేహం చేస్తున్నామా... లేక ప్రేమకు పునాది నిర్మిస్తున్నామా... అనేది తెలుసుకోవాలి. స్నేహం హద్దులు దాటుతుంటే... ఇష్టం లేకపోతే ముందు ఎదుటి వాళ్లకు క్లారిటీ ఇవ్వాలి. అలానే స్నేహాన్ని వదులుకోకుండా నిలుపుకోవాలి. ఒక్కోసారి ఇద్దరిలో ఒకరు కావాలని స్నేహాన్ని ప్రేమగా కోరుకోవచ్చు. కానీ ఇద్దరికీ తర్వాతైనా క్లారిటీ అవసరం. స్నేహానికి కొన్ని హద్దులు ఉంటాయి. మరి నిజమైన స్నేహితులుగా ఉండాలి అనుకున్నప్పుడు వాటిని అతిక్రమించకూడదు. రమేష్, మౌనిక కలిసి మెలిసి తిరుగుతుంటారు. చిన్నచిన్న హద్దులు కూడా దాటేశారు. తీరా రమేష్ ఐలవ్ యు అని చెప్పినప్పుడు మౌనిక నిన్ను నేను ఆదృష్టితో చూడలేదు అని చెప్పింది. దాంతో రమేష్ మానసికంగా బాధపడ్డాడు. కోలుకోడానికి ఆరునెళ్లు పట్టింది. కొంతమంది కలిసితిరిగినతం కాలం తిరిగి చివరకు ప్రేమిస్తున్నట్లు ప్రవర్తించి, మనిద్దరి మధ్య ఉన్నది స్నేహమే అని తప్పుకుంటుంటారు. స్నేహమా, ప్రేమా అన్నది గిరిగీసి చెప్పడానికి వీలుకానిది. కానీ ఒక సన్నని పొర మాత్రం ఉంటుంది. అదే కోరిక. జీవితాంతం ఎదుటి వారితోనే కలిసి ఉండాలనే బలమైన కోరిక. అది శరీరక సంబంధంతో కూడుకున్నదై ఉంటుంది. మానసిక సంబంధం మాత్రమే అయితే స్నేహంగానే నిలిచిపోతుంది.

మనసే గీటురాయి        

స్నేహం ఏర్పడకుండా నేరుగా ప్రేమ పుట్టొచ్చు. ఒక రిలేషన్ ప్రేమగానే ప్రారంభం కావచ్చు. వీటివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేరుగా ఎదుటివాళ్లు ఇష్టమనో, కాదనో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. కానీ ప్రేమించాలంటే.. మొదట స్నేహం చేసి, తర్వాత ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయాలి అనుకుంటేనే ఈ తిప్పలన్నీ... కానీ స్నేహం పునాదిగా ఏర్పడిన ప్రేమలు చాలా కాలం నిలుస్తాయన్నది వ్యక్తిత్వం వికాస నిపుణుల అభిప్రాయం కూడా. అసలు స్నేహమనే వాకిట్లో నిలబడితే ప్రేమలోకం కనిపిస్తుంది అంటారు. అయితే ఏ సంబంధమైన యువతీ యువకుల మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. అన్నీ వ్యాపారమైన నేటి సమాజంలో స్నేహం, ప్రేమలు కూడా వ్యాపార ధోరణిలోకి మారాయన్నది విమర్శకుల భావన. స్వచ్ఛమైన ప్రేమలు, స్నేహాలు కనపడడం లేదు. డబ్బు, హోదా, స్టేటస్ ను బట్టే స్నేహాలు, ప్రేమలు పుడుతున్నాయన్న వాదనలోనూ నిజం లేకపోలేదు. ఆస్తి తక్కువని వదిలేసిన ప్రేమికురాళ్లు, తక్కువ కులం అని తెలిసి అమ్మాయిని ప్రేమించి వదిలేసిన యువకులు ఉన్నారు. ఉదాత్తమైన స్నేహాలు, ప్రేమలు మనసుకు మాత్రమే విలువ ఇస్తాయి.

మరిన్ని శీర్షికలు
sahiteevanam