Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

ఫ్లాప‌యిన సినిమాల్నీ చాలా ప్రేమించా  - నాని

యువ క‌థానాయ‌కుల్లో నానిది ఓ సెప‌రేట్ బాణీ. అంద‌రిలా మాస్ పాత్ర‌ల కోసం తాప‌త్రయ‌ప‌డ‌లేదు. త‌న‌కు ఏ పాత్ర‌లు సూట‌వుతాయో అవే చేశాడు. రొటీన్ సినిమాల వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. ఉన్నంత‌లో కొత్త క‌థ‌లు ఎంచుకొన్నాడు. ప్ర‌యోగాల పేరుతో నేల విడ‌చి సాము చేయ‌లేదు. కంటెంట్‌, క‌మ‌ర్షియ‌ల్ రెండూ క‌లిపి కొట్టాడు.అందుకే వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్నాడు. మెల్లిమెల్లిగా మినిమ‌మ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు. నాని న‌టించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఈ శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా నానితో..జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* హాయ్ నాని..
- హాయండీ..

* భ‌లే భ‌లే మ‌గాడివోయ్ - టైటిల్‌తో వ‌స్తున్నారు. ఈ టైటిల్ వెనుక ఉన్న విష‌య‌మేంటి?
- టైటిల్‌లోనే కాదు.. సినిమాలోనూ చాలా విష‌యం ఉంది. మ‌రో చ‌రిత్ర‌లోని ఈ పాటంటే నాకు భ‌లే ఇష్టం. ఈ పాట‌తో సినిమా అంటే చాలా ఎగ్జైట్ అయ్యా. ఏదో పాత పాట వాడుకోవాల‌నే ఉద్దేశంతో ఈ టైటిల్ ఎంచుకోలేదు. ఈ సినిమాలో నా పాత్రనీ, ప‌డే పాట్ల‌ని చూసిన ప్ర‌తిసారీ `వీడు భ‌లే మ‌గాడే..` అనిపిస్తాడు. అందుకే ఆ టైటిల్ పెట్టాం.

* మ‌తిమ‌రుపు హీరో అంటే.. గ‌జినిలాంటి కొన్ని సినిమాలు గుర్తొస్తాయి..
- కావ‌చ్చు. కానీ గ‌జిని లో హీరోకి షార్ట్ టైమ్ మెమొరీలాస్‌. అదో జ‌బ్బు. కానీ ఇక్క‌డ అలాంటిదేం లేదు. వాడికి అన్నీ గుర్తుంటాయ్‌. కానీ.. ఒక ప‌ని చేస్తున్న‌ప్పుడు రెండో ఆలోచ‌న వ‌స్తే మొద‌టిది మ‌ర్చిపోతాడు. ఉదాహ‌ర‌ణ‌కు హీరో బామ్మ చ‌చ్చిపోయింది. ఆ బాధ‌లో ఉండి.. ఆసుప‌త్రికి బ‌య‌ల్దేర‌తాడు. మ‌ధ్య‌లో ఏదో పాట వినిపిస్తుంది. స‌డ‌న్‌గా మ‌నిషి ఆ పాట కోసం ఆలోచించ‌డం మొద‌లెడ‌తాడు. బామ్మ చ‌నిపోయింద‌న్న విష‌యం  ఆ క్ష‌ణం మ‌ర్చిపోతాడు. మ‌ళ్లీ బామ్మ ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తే త‌ప్ప‌.. ఆ సంగ‌తి గుర్తుకు రాదు. అలా ల‌క్కీ అనే ఓ ల‌క్కరాజు ప‌డిన పాట్లేమిటో సినిమా చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. 

* ఈ సినిమా చేసి తీరాల్సిందే.. అని డిసైడ‌యిపోయిన‌ట్టు చేసిన పాయింట్స్ ఏంటి?
- క‌థ‌లోని పాయింట్ నాకు బాగా న‌చ్చిందండీ. దాన్ని చెప్పే విధానం ఇంకా బాగా న‌చ్చింది. మారుతిలో సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఎక్కువ‌. ప్ర‌తీ సీన్‌నీ న‌వ్వుల మ‌యం చేశారు.

* అయితే మారుతిపై ఇది వ‌ర‌కు వేరే ఇమేజ్ ఉంది... అదేం మీకు ఇబ్బంది క‌లిగించ‌లేదా?
- ఈరోజుల్లో సినిమాని ఆయ‌న త‌న‌ని తాను నిరూపించుకొనేందుకు తీశారు. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో ఓ సినిమా తీసి, ఇండ్ర‌స్ట్రీ మొత్తాన్ని ఆయ‌న వైపుకు తిప్పుకొనేలా చేయడం మామూలు విష‌యం కాదండీ. ఆ స‌మ‌యంలో ప్ర‌యోగాలెవ్వ‌రూ చేయ‌లేరు. ప‌క్కాగా డ‌బ్బులు మిగిలే సినిమాలే తీయాలి. అదే చేశారు. కానీ..  ఆయ‌న‌లో ఉన్న యాంగిల్ వేరు. అస‌లు మారుతి అది కాదు. అదేంటో.. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

* మీరు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు క‌దా... ఆ అనుభ‌వంతో సెట్లో ద‌ర్శ‌కుడికి స‌ల‌హాలేమైనా ఇస్తుంటరా?
- నేను ద‌ర్శ‌కుడిగా సినిమా చేస్తే నాకు నా హీరో ఎలా కోప‌రేట్ చేయాల‌ని అనుకొన్నానో.. అలాంటి స‌హ‌కార‌మైతే ద‌ర్శ‌కుడికి త‌ప్ప‌కుండా ఇస్తా. ఓ స‌న్నివేశాన్ని నాలుగైదు ర‌కాలుగా తీసే స్కోప్ ఉంటుంది. నేనూ నా వైపు నుంచి రెండు మూడు ఆప్ష‌న్స్ ఇస్తా. అందులో ఏది తీసుకోవాలి, ఆ స‌న్నివేశాన్ని ఎలా న‌డిపించాల‌న్న‌ది ద‌ర్శ‌కుడి ఇష్టం.

* డీ ఫ‌ర్ దోపిడీతో నిర్మాత‌గా మారారు.. ఆ అనుభ‌వం ఏం నేర్పింది?
- నిజానికి ఆ సినిమాకి నేనేం డ‌బ్బులు పెట్ట‌లేదు. రాజ్ డికె నాకు మంచి స్నేహితులు. ఆ సినిమా బిజినెస్ చేయాలంటే ఏదో ఓ తెలిసిన పేరు ఉంటే బాగుంటుంద‌ని న‌న్ను సంప్ర‌దించారు. నేను ఓకే చేశా. స‌హాయ ద‌ర్శ‌కుడిగా ఉన్న‌ప్పుడు ఓ సినిమా కొబ్బరికాయ్ కొట్ట‌డం నుంచి.. తొలి కాపీ వ‌చ్చే వ‌ర‌కూ ఎన్ని విభాగాలుంటాయో, ఏమేం ప‌నులు చేయాలో అవ‌న్నీ నాకు తెలుసు. రిలీజ్ ప్రోసెస్ ఎలా ఉంటుందో మాత్రం నాకు తెలీదు. ఆ అనుభ‌వం డీ ఫ‌ర్ దోపిడీ తో క‌లిగింది. 

* పైసా, జెండాపైక‌పిరాజు సినిమాల ఫ‌లితాలేం నేర్పాయి?
- ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చు. కానీ ఆ టైమ్ లో ఇష్ట‌ప‌డే చేశా. ఇప్ప‌టికీ చెబుతున్నా. ఫ్లాప‌యినా స‌రే.. నా ప్ర‌తీ సినిమానీ ప్రేమించా. ఇప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉన్నా.

* ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మ‌ళ్లీ కాస్త రిలీఫ్ ల‌భించిన‌ట్టుంది..
- ఆ సినిమా మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్‌ని టార్గెట్ చేసి తీసింది. ఆ వ‌ర్గం ప్రేక్ష‌కులు చూస్తే స‌రిపోతుంద‌నుకొన్నాం. ఆ టార్గెట్‌ని మించి రీచ్ అయ్యిందా సినిమా. న‌టుడిగా నాకు చాలా చాలా సంతృప్తినిచ్చింది. ఇప్ప‌టికీ ఈసినిమాకి సంబంధించి అభిమానుల నుంచి మెయిల్స్ వ‌స్తుంటాయి. ఒక్కొక్క మెయిల్‌ నాలుగైదు పేజీలుంటుంది. న‌టుడిగా నా గౌర‌వాన్ని పెంచిందా సినిమా. బ‌హుశా ఆ సినిమా మిస్స‌య్యితే.. ఇప్పుడు చాలా గిల్టీగా ఫీల‌య్యేవాడ్ని.

* అయితే ఓ ద‌శ‌లో వ‌రుస‌గా ఫెయిల్యూర్స్ వ‌చ్చాయి... అప్ప‌ట్లో మీ ఆలోచ‌న‌లు ఎలా ఉండేవి?
- ఏ క‌థానాయ‌కుడి కెరీర్ గ్రాఫ్ అయినా తీసుకోండి. నాలుగు సినిమాల‌కు ఓ సినిమా హిట్ట‌వుతుంది. నేనిప్ప‌టి వ‌రకూ 12 సినిమాలు చేస్తే అందులో 8 సినిమాలు మంచి సినిమాలున్నాయి. హిట్లున్నాయి, సూప‌ర్ హిట్లున్నాయి. పైసా, జెండాపైక‌పిరాజు సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డం, 2013లో ఒక్క సినిమా కూడా రాక‌పోవ‌డంతో నాకేదో పెద్ద గ్యాప్ వ‌చ్చిన‌ట్టు అనిపించింది. ఆ రెండు సినిమాలూ 20 ఫ్లాపుల‌కు స‌రిప‌డా ప్ర‌భావం చూపించాయంతే.

* ఇక గ్యాప్స్ లేకుండా చూసుకొంటారా?
- ష్యూర్‌గా. ఇది వ‌ర‌కు నేను సినిమా త‌ర‌వాత సినిమా చేయాలనే ధోర‌ణిలో ఉండేవాడ్ని. రెండు సినిమాల మ‌ధ్య క‌నీసం రెండు నెల‌ల పాటు గ్యాప్ తీసుకొనేవాడ్ని. అదెంత త‌ప్పొ ఇప్పుడు తెలిసొచ్చింది. గ్యాప్ మ‌నం తీసుకోకూడ‌దు... ఇండ్ర‌స్ట్రీనే ఇస్తుంటుంది.. అప్పుడెలాగూ గ్యాప్ లు వ‌స్తుంటాయ్ అని అర్థ‌మైంది. 

* ఈమ‌ధ్య క‌థానాయ‌కులు పారితోషికాలు తీసుకోకుండా.. సినిమా నిర్మాణంలో వాటా అడుగుతున్నారు. ఈ ప‌ద్ధ‌తిపై మీ కామెంట్‌..
- పెద్ద పెద్ద హీరోలే ఇలా చేస్తున్నారు.నేనెందుకు చేయ‌ను. డెఫ్‌నెట్‌గా ఇలా చేస్తే బాగుంటుంది.. నేనూ సిద్ధంగానే ఉన్నా.

* హిందీలో అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్టు అప్ప‌ట్లో చెప్పారు..
- ఆహా క‌ల్యాణం టైమ్‌లో హిందీ సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చిన మాట నిజ‌మే. అయితే ఆ త‌ర‌వాత దాన్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు. త‌మిళంలో మాత్రం వ‌స్తున్నాయి. కానీ నేనే ప‌క్క‌న పెడుతున్నా. ఎందుకంటే తెలిసిన భాష‌లో న‌టించ‌డంలో ఉన్న సౌల‌భ్యం వేరు. తెలుగులో ఓ డైలాగ్ చెబుతుంటే నా వైపు నుంచి బెట‌ర్ మెంట్స్ చేసే అవ‌కాశం ఉంటుంది. నాదంటూ ఓ యాస‌లో చెప్పొచ్చు. టైమింగ్ చూపించొచ్చు. త‌మిళంలో అయితే బ‌ట్టీప‌ట్టి చెప్పాలి. ఆ మాజా రాదు. 

 * త‌దుప‌రి సినిమాలేంటి?
- ప్ర‌స్తుతం 14 రీల్స్ సినిమాలో న‌టిస్తున్నా. ఇందులో బాల‌య్య అభిమానిగా క‌నిపిస్తా. అక్టోబ‌రులో మ‌రో సినిమా మొద‌ల‌వుతుంది. నాలుగైదు క‌థ‌లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌

మరిన్ని సినిమా కబుర్లు
movie review