Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగిన కథ: విరాట్‌ సహస్రలు కాలనీకి వచ్చేసి వారం రోజులు గడుస్తాయి. సహస్ర రక్షణ కోసం మూడు బేచ్‌లు పనిచేస్తుంటాయి.  త్యాగరాజన్‌. ,సహస్రను బయటకు ఎలాగైనా రప్పించాలని, మార్కెట్ కు వెళ్ళిన దీక్షను కిడ్నాప్ చేస్తాడు.ఆ తరువాత..

 

 

సహస్ర దీక్షను బంధించిన చోటుకు చేరుకున్న పదోనిముషంలోనే వీళ్ళంతా అక్కడుండాలి. కాని ఏర్‌పోర్ట్‌ రోడ్‌లో రెండు సిగ్నల్స్‌ని దాటడంలో ఏర్పడ్డ ఆలస్యంతో ఆ సమయం మరో పదినిముషాలు పెరిగింది. అంటే విరాట్‌ బృందం సహస్రను పంపించిన పదోనిముషంలో బయలుదేరినా మరో పది నిముషాలు కలిపి ఇరవై నిముషాలు ఆలస్యంగా అడ్రసులోని రోడ్‌ని చేరుకున్నారు.

ఆరోడ్‌కి చేరి మలుపు తిరగ్గానే ఎదురుగా నిర్మానుష్యంగా వున్న రోడ్‌లో రొప్పుతూ రోజుతూ ఒంటరిగా పరుగెత్తుకొస్తున్న దీక్ష కన్పించింది. ఆమెను చూడగానే ఒక్కసారిగి టెన్షన్‌ చోటు చేసుకుంది. అందరిలో ముందుగా రివ్వున దూసుకొచ్చి దీక్ష పక్కన బైక్‌ ఆపాడు విరాట్‌. తమ వాళ్ళను చూడగానే ధైర్యం తెచ్చుకోడానికి బదులు బోరున ఏడ్చి నెత్తి కొట్టుకుంటూ ఉన్న చోటే రోడ్‌ మీద నిలబడి పోయింది దీక్ష. రివ్వు రివ్వున బ్రేక్‌లతో కీచ్‌ కీచ్‌మని చప్పుడు చేస్తూండగా రెండు వేన్‌లు మినీ బస్సు ఆగిపోయాయి.

అంతటి ధైర్యం గుండె దిటువు కలిగిన విరాట్‌ కూడ దీక్ష దుఖ్ఖం చూసి కాస్త చలించాడు. కళ్ళముందు సహస్ర మెదిలింది. ఏమైంది? సహస్ర క్షేమంగా వుందా?

‘‘నేను పాపిష్టి దాన్ని ఎంత చెప్పినా వినకుండా ఈ అనర్థానికి కారణమయ్యాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నాకు బతకాలని లేదు’’ అంటూ బోరున ఏడుస్తున్న దీక్షను పక్కన కూచొని భుజం తట్టి ఓదార్చాడు విరాట్‌.

‘‘దీక్ష ఆపెయ్‌ ముందా ఏడుపు ఆపెయ్‌’’ అన్నాడు.

‘‘అది కాదన్నయ్యా....’’ వెక్కి వెక్కి పడుతూ ఏదో చెప్పబోయింది.

‘‘ఇప్పుడు జరిగిందాని గురించి బాధపడిలాభంలేదు. అక్కడేం జరిగింది? సహస్ర ఎలా ఉంది?’’

‘‘నన్ను విడిపించి పంపించేసి వాళ్ళతో పోరాడుతోంది. పారిపోయి వస్తున్న నాకు రివాల్వర్‌ కాల్పులు విన్పించాయి. వాళ్ళు సహస్రను చంపాలని చూస్తున్నారు...’’

ఆమాటలు వినగానే కోపంతో వూగి పోయాడు మునుసామి. ‘‘పదండ్రా! అక్కడ పోరాడుతోంది సహస్ర. మనం వెళ్ళిపోయి ముందు అమ్మాయికి అండగా నిలవాలి. దీక్షకి ధైర్యం చెప్పి విరాట్‌ వెనకే తీసుకొస్తాడు. పందండి’’ అనరుస్తు దిగినట్టే దిగి తిరిగి వేన్‌ ఏక్కేసాడు.
ఈసారి మినీ బస్సు ముందుకు దూసుకుపోగా వెనకే వేన్లు రెండూ పరుగెత్తాయి. చివరిగా దీక్షను తీసుకుని తన బైక్‌ మీద బయలు దేరాడు విరాట్‌.

శిథిల భవనం వద్దకొచ్చేసరికి ఆప్రాంతమంతా నిశ్శబ్ధంగా వుంది. అటు యిటు ఎత్తయిన చెట్లు డొంకలు తీగలు పొదలు పిచ్చి మొక్కలతో కూడి చూడ్డానికి అదేదో అటవీ ప్రాంతాన్ని తపిస్తోంది. చాలా దూరం వరకు చూద్దామంటే ఒక్క యిల్లూ కనబడదు. ఆ ప్రాంతాన్ని ఏర్‌పోర్ట్‌ అథారిటీస్‌ విస్తరణకోసం స్వాధీనం చేసుకుంటుందనే పుకార్లు వున్నందున స్థలాల యజమానులెవరూ యిళ్ళు కట్టుకోడానికి సాహసించటం లేదు. ఉన్నదున్నట్టు వదిలేయటంతో అక్కడ ఎటుచూసినా ఎత్తయిన చెట్లు పొదలు డొంకలతో అటవీప్రాంతాన్ని తలపిస్తోంది. ఫోన్‌లో ఇచ్చిన అడ్రసుప్రకారం పాతకట్టడం కుడి పక్కగా రోడ్‌నానుకునే వుంది.

పురాతన కాలంనాటి హవేలీ వంటి భవనం అది. సువిశాలమైన కాంపౌండ్‌ గోడలు పూర్తిగా శిథిలమైపోగా ఎంట్రన్స్‌ కాంపౌండ్‌ గేట్‌ ఉండే చోట తలుపులూడిన పెద్దరాతి గుమ్మం ఆర్చిలా నిలబడుంది. దానికి దగ్గరలో బారుగా రాతిస్థంభాలతో కూడిన మండపంలాంటి కట్టడం వుంది. సీలింగ్‌ చాలవరకు జారిపోయి మొండిగోడలు కొన్ని చోట్ల కన్పిస్తున్నాయి. దానికి తలుపుల్లేని దర్వాజాలు అక్కడక్కడా వున్నాయి. దానికి మధ్యభాగంనుంచి లోనకు దారివుంది.

దానికి అవతల విశాలమైన ఆవరణ వుంది. ఆ ఆవరణ అవతల పెద్ద భవనం తాలూకు మొండి గోడలు కొన్ని చోట్ల సీలింగ్‌తో కూడి ఇంకా శిథిలంగాకుండా రెండో అంతస్థుకూడా కన్పిస్తున్నాయి. పూర్వం ఎప్పుడో మండువా లోగిలి పద్ధతిలో నాలుగు పక్కలా కలిపి లేపిన పెద్ద భవనం తాలూకు శిథిల ప్రాంతం అది. చూడ్డానికి దయ్యాల కొంపలా వుంది.

విరాట్‌ బైక్‌ దిగి దీక్షను తీసుకునిలోన కెళ్ళేసరికి అప్పటికే ఆయుధాలు ధరించి ఓ పక్క ధర్మ బృందం మరో ప్రక్క మునుసామి ఇంకో పక్క కదిరేశన్‌ బృందం అంతా సహస్ర కోసం ప్రత్యర్థులకోసం ప్రతి అంగుళం గాలిస్తున్నారు.

అంతటా నిశ్శబ్ధంగా వుంది.

ఆ ప్రాంతాల్లో ఎక్కడా ప్రత్యర్థులుగాని వారి వాహనాలుగాని లేవు. సహస్ర జాడలేదు. పెద్ద పోరాటమే జరిగిందనటానికి గుర్తుగా అక్కడడక్కడా నేలమీద నెత్తుటి మరకల జాడ తెలుస్తొంది. కాని ఒక్కరూ లేకుండా ఏమైపోయారంతా? సహస్ర ఏమైంది? అందరిలోనూ ఉత్కంఠత నెలకొనుంది. విరాట్‌ అయితే పిచ్చిపట్టినట్టు ‘‘సమస్రా.. ఏమైపోయావ్‌? ఎక్కడున్నావ్‌?’’ అంటూ ఆ ప్రాంతమంతా కలతిరుగుతూ అరుస్తుంటే అతడి అరుపులకి శిథిల భవనం పై అంతస్థుల్లోని గబ్బిలాయిలు బెదిరి ఒక్కసారిగి గాల్లోకి లేచాయి.

ఇక్కడ నుండి దీక్ష పరుగెత్తుకొంటూ తమకు ఎదురైనచోట మూడు ఫర్లాంగుల దూరం ఉండొచ్చు. దీక్ష పరుగెత్తుకు రావటానికి పావుగంట సమయం పట్టిందనుకొంటే తిరిగి అయిదు నిముషాల్లో తామంతా యిక్కడున్నారు. అయిదు నిముషాలు కాదు. రెండోనిముషంలోనే వచ్చేసారు. ఈ మధ్యపావుగంట సమయంలో ఇక్కడ ఏంజరిగింది? సహస్ర ఏమైంది? ప్రత్యర్థులేమయ్యారన్నది మిష్టరీగా వుంది.
ఒకవేళ వాళ్ళు సహస్రను చంపి వెళ్ళి పోయారనుకుంటే శవమన్నా అక్కడ పడుండాలి. లేదా దీక్షను తప్పించిన కొద్దిసేపటికే వీలుచూసుకుని సహస్రా పారిపోయి ఉండాలి. అలా జరిగుంటే ఈ పాటికి తను ఫోన్‌ చేయాలిగదా.

జరిగిన సంఘటనను ఎలా అర్థం చేసుకోవాలో తెలీక ఎక్కడి వాళ్ళక్కడ శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు.

ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

I     I     I

ఆ ప్రాంతాన్ని చేరుకోగానే...

ముఖానికి చుట్టుకున్న చున్నీ తీసేసింది సహస్ర.

మబ్బుల్లేని ఆకాశంలో సూర్యుడు తేజోమయంగా ప్రకాశిస్తున్నాడు. సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది.అక్కడ శిధిల భవనం వద్ద ఎట్టయప్ప బృందం కాపువేసి ఆమె రాకకోసం ఎదురుచూస్తోంది. తాము వేసింది మాష్టర్‌ ప్లాన్‌. ఈ సారయినా సహస్రను చంపలేకపోతే త్యాగరాజన్‌ ముందు తలెత్తుకోలేడు. అందుకే ఎట్టయప్ప చాలా పట్టుదలగా, పకడ్బందీగా ప్లాన్‌ వేసుకున్నాడు.మొండి గోడల వెంట చుట్టూ పొజిషన్స్‌ సెట్‌ చేసుకుని రెడీగా వున్నారంతా, హర్యానా షూటర్స్‌లో యిద్దరు రెండో అంతస్థులో వున్నారు. మిగిలిన నలుగురు షూటర్స్‌ దిగువున స్థంభాల వెనక సిద్ధంగా వున్నారు. మిగిలిన సుమారు పాతిక మంది ఎట్టయప్ప మనుషులు రకరకాల మారణాయుధాలు ధరించి తలో చోట పొజిషన్స్‌ తీసుకున్నారు.ఎదురుగా ఖాళీ స్థలంలో...

ఒకరాతి స్థంభానికి...చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడుంది దీక్ష. ఎట్టయప్ప కొట్టిన దెబ్బకి ఆమె చెంప ఎర్రగా కందిపోయింది. అరిచిగోల చేయకుండా ఆమె నోటికి టేప్‌ అంటించారు. చేతులారా తెచ్చుకున్న ఈ కష్టానికి ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.సహస్ర లోనకొస్తే ఎదురుగా దీక్ష తప్ప తామెవరూ కన్పించని విధంగా అంతా సెట్‌ చేసాడు ఎట్టయప్ప. లోనకు రాగానే దీక్షను చూసి సహస్ర పరుగున రావాలి. అలా వస్తుండగానే షూటర్స్‌ ఆరుగురూ ఆమెను నాలు పక్కలనుంచి పిట్టను కాల్చినట్టు కాల్చి చంపేయాలి. అదీ వాళ్ళప్లాన్‌. ఇందులో ఏమాత్రం అవకాశం ఇచ్చినా తిరగబడి ఆమె తామందర్నీ చంపేస్తుందని ఎట్టయప్ప భయం. కాబట్టి రాగానే స్పాట్‌లోనే సహస్రప్రాణం తీయాలని కాచుకునున్నారంతా.

సహస్ర రాకను గమనించేందుకు ఒకడ్ని రెండో అంతస్థు టెర్రస్‌ మీద కూచోబెట్డారు. వాడు అక్కడ్నుంచి రోడ్‌ని నిశితంగా గమనిస్తున్నాడు.క్షణాలు భారంగా దొర్లిపోతున్నాయి.అంతలో పైనున్నవాడు గొంతు చించుకొని అరిచాడు. ‘‘అన్నా వచ్చేస్తొంది ఆ పిల్ల స్కూటీమీద వచ్చేస్తొంది. గెట్‌రెడీ’’ అంటూ.‘‘ఒక్కత్తే వస్తోందా వెంట ఎవరన్నా వున్నారా?’’ దిగువనుంచి అరిచాడు ఎట్టయప్ప.‘‘ఎవరూ లేరన్నా. సింగిల్‌గావస్తోంది’’ వెంటనే బదులిచ్చాడు పైనున్నవాడు.ఆమాట వినగానే విజయగర్వంతో ఎట్టయప్ప ఛాతీ గుప్పెడు పెరిగింది. సంతోషంతో ఉబ్బిపోతూ మీసం తిప్పాడు. ఈ దెబ్బతో తన పరపతి త్యాగరాజన్‌ గారి ముందు పదిరెట్లు పెరిగిపోతుంది.‘‘వస్తుందిరా. రాక ఎక్కడికి పోతుంది. స్నేహంకోసం ప్రాణత్యాగం చేస్తున్న వీరనారీ. రానీ... అరు బుల్లెట్లతో ఒకేసారి వీడ్కోలు చెప్దాం’’ అంటూ దీక్షను చూసి వెకిలిగా నవ్వాడు. ఓ చేతిలో పొడవాటి బరిసె రెండో చేతిలో వేటకత్తితో పెద్ద పెద్ద అంగలు వేస్తూ పక్కన శిథిóలాల వెనక్కు పోయి నక్కాడు.మండుటెండలో...

స్థంభానికి చేతులు వెనక్కి విరిచి కట్టబడున్న దీక్ష కళ్ళనుండి జలపాతంలా వర్షిస్తోంది కన్నీరు. అరవటానిక్కూడా లేకుండా నోటికి టేప్‌ అంటించారు. సహస్రలోనకు రాకూడదని మనసులోనే వేయి దేవుళ్ళకు మొక్కుకుంటూ గింజుకుంటోంది.అయితే...పైనున్న వాడు అరిచి అయిదు నిముషాలు కావస్తున్నా ఎక్కడా స్కూటీ ఇంజను శబ్ధంగాని, సహస్ర రావటంగాని జరక్క పోవడంతో ఎట్టయప్పకి అనుమానం వచ్చింది. ఉన్నచోటునుంచి బయటికొచ్చి పైవాడ్ని చూస్తూ` ‘‘ఏమైంది... ఆ పిల్లేది యింకారాలేదు. దారిలో ఆగిందా?’’ అనరిచాడు.అప్పటికే వాడు కంగారుపడుతూ...

అవతల చెట్లవెనక రోడ్‌ని చూస్తున్నాడు.అటు చెట్ల గుబురు అడ్డురావటంతో వాడికేమీ కన్పించటంలేదు. అయినా ఏదో ఒకటి చెప్పకపోతే ఎట్టయప్ప అరుస్తాడని` ‘‘ఆగినట్టుందన్నా. చెట్ల వెనక ఏముందీ యిక్కడికి తెలీటంలేదు’’ అన్నాడు.ఆ మాటతో ఎట్టయప్పకు అనుమానం వచ్చేసింది. దగ్గరకొచ్చి రోడ్డు మీద ఎందుకు ఆగినట్టు? ఏదన్నాప్లాన్‌తో వచ్చిందా? ఏం జరిగిందో చూడాలనే ఉద్దేశంతో వడివడిగా రోడ్‌ మీదకు వచ్చాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండటం చూసి సాచి ముఖం మీద గుద్దినట్టు ఉలిక్కి పడ్డాడు.నిజంగా సహస్ర వచ్చిందా? లేక వచ్చినట్టు తమవాడు అబద్ధం చెప్పాడా! వస్తే ఇంతలో ఏమైంది? అయినా తనగురించి తెలీదా? తమ వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు? ఏంజరుగుతోంది? గిరుక్కున లోనకు పోడానికి వెనుతిరిగాడు.సరిగ్గా అప్పుడే రెండో అంతస్థు శిధిలాలపైనుంచి కెవ్వుమంటూ వినవచ్చిందో ఆర్తనాదం. అదిరిపడి లోనకు పరుగెత్తిన ఎట్టయప్పకి రెండో అంతస్థు శిథిలాలపైనుంచి జారిపడిపోతూ కన్పించాడు తమ మనిషి.వాడి మీద అటాక్‌ జరిగిందా...లేక కాలుజారి కిందపడ్డాడు అర్థంగాక...ఉన్నచోటే శిలా విగ్రహంలా నిలబడి పోయాడు ఎట్టయప్ప.

I                 I                   I

తను చేరాల్సిన ప్రాంతాన్ని సమీపించగానే సహస్ర ఎగువకు గమనిస్తూ స్కూటీ వేగాన్ని తగ్గించింది.దూరంలో ఉండగానే చెట్లవెనక రెండో అంతస్థుపైన మొండిగోడపైనుంచి ఒకడు రోడ్‌నే కనిపెట్టి చూడటం గమనించింది.నేరుగా లోనకెళ్ళటం ఎంత ప్రమాదమో ఆమెకు తెలుసు. ప్రత్యర్థులు ఎవరెక్కడ ఏఏ పొజిషన్స్‌లో     ఉన్నారో తెలీదు. దీక్షను ఎరగా వుంచి తనకు గాలం వేసి చంపాలని చూస్తున్నారు. తనకు అనుకూలంగా పరిస్థితిని మలుచుకోవాలంటే కొంచెం రిస్క్‌ చేయక తప్పదు. ఏమాత్రం తేడా వచ్చినా అటుదీక్ష ఇటు తను ఇద్దరిలో ఎవరో ఒకరి ప్రాణం పోవటం ఖాయం. అయినా సాహసం చేయాలి తప్పదు. ఎట్టయప్పకు వూహించని షాకివ్వాలి.ఆలోచిస్తూనే...రోడ్‌ పక్క ఎత్తయినా చెట్ల కిందకు రాగానే...ఉన్నట్టుండి స్కూటీని దారి మళ్ళించింది. రోడ్డు వదిలి వేగంగా కుడి పక్క చెట్ల మధ్యగా పొదల వెనక్కి పోనిచ్చింది. కొంచెం దూరం వెళ్ళగానే గుబురు పొదల వెనక ఇంజన్‌ ఆపి స్కూటీని స్టాండ్‌ వేసింది. చెట్టు పుట్టల్ని కవర్‌ చేసుకుంటూ శిథిóల భవనం వెనక తట్టువైపు పరుగు తీసింది.మూడే మూడు నిముషాల్లో సగం కూలిన కాంపౌండ్‌ గోడను చేరుకుంది. నిశ్శంబ్ధంగా ఉంది అంతటా. మెడలోని చున్నీని తీసి నడుంకి బిగించి కట్టుకట్టుకుంది. మూడు రాళ్ళను దాటి గోడను సమీపిస్తుండగా రాళ్ళమధ్యనుంచి కస్సుమని పడగవిప్పి చివ్వున లేచిందో నల్లత్రాచు. అంతకన్నా వేగంగా కదిలింది సహస్ర చేయి పాము పడగ కింద ఒడిసి పట్టుకుని లేపింది. మూడు మూరల పొడవు కోడె త్రాచు ‘సారీ డియర్‌. అనవసరంగా నాజోలికొచ్చావ్‌. ఇప్పుడు అవసరానికి నిన్ను వాడుకుంటున్నాను. సారీ’ అంటూ దాని తలమీద తట్టి రెచ్చగొడుతూ ముందుకు కదిలింది.

మొండి గోడను కవర్‌ చేసుకుంటూ ఆవరణవైపు చూసింది. ఎక్కడి కక్కడ శిథిలావస్థలో వున్న ఆ పురాతన భవంతి వెనక తట్టు ఎవరూ కాపలా వున్న జాడలేదు. ఎవరూ తనను గమనించక ముందే మెరుపు వేగంతో పరుగెత్తి కూలిన రాళ్ళపైనుంచి గెంతుతూ పదిక్షణాల్లో మొదటి అంతస్థు బాల్కానీలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో అటు పక్క ఆవరణలోంచి ఎట్లయప్ప పైన కాపలా వున్న వాడ్ని ఇంకా రాలేదని అడగటం వాడు స్కూటీ రోడ్‌ మీద ఆగినట్టుందని బదులివ్వటం ఆ అరుపులు ఆమెకి విన్పించాయి.క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోనకు పరుగెత్తి కూలిన టెర్రస్‌ శిథిలాల మీదుగా రెండో అంతస్థు బాల్కానీకి చేరుకొని పైకి చూసింది. పైన మొండిగోడమీద వున్న కాపలా వాడు తనకోసం రోడ్‌ వంక చూస్తూ ఆ ధ్యాసలో వున్నాడు. దిగువన ఆవరణ స్పష్టంగా కన్పిస్తోంది. మధ్యలోని స్తంభానికి కట్టబడి మండుటెండలో నిలబడుంది దీక్ష. నోటికి టేప్‌ అంటించ బడి గింజుకుంటోంది. ఎట్టయప్ప ఏంజరిగిందో చూడ్డానికి పెద్ద పెద్ద అంగలతో రోడ్‌ మీదికి పోతున్నాడు. ఓ చేతిలో బరిసె ఓ చేతిలో వేట కత్తి పట్టుకునున్నాడు వాడు.దీక్ష ఉన్న పరిస్థితి చూడగానే... కోపంతో భగ్గుమంది సహస్ర.

ఇక వెనక ముందు చూడలేదు.

బుసలు కొడుతూ చేతిలో మెలికలు తిరుగుతున్న నల్లత్రాచును తోక పట్టి గిరగిర తిప్పి విసిరేసింది పైన కాపలా వున్నవాడి మీదకి అంతే...గింగిరాలు తిరుగుతూ వచ్చి మీద పడిన నల్లత్రాచు కసికొద్ది వాడ్ని ఇష్టానికి కాట్లు వేసింది. ఏంజరిగింతో అర్థంమయ్యేలోపే వాడు చావు కేకలు పెడుతూ గోడపైనుంచి కిందపడిపోయాడు. ఇక వాడి ప్రాణాలకు గ్యారంటీ లేదని సహస్రకు తెలుసు. శిథిలం గాకుండా వున్న గదుల్లోంచి దూరి ముందు భాగం వైపు పరుగెత్తింది. దట్టంగా సాలెగూళ్ళు, ధూళితో నిండి వున్న ఆ గదులు ప్రస్తుతం గబ్బిలాయిలకి ఆవాసంగా  ఉపయోగపడుతున్నాయి.ఉన్నట్టుండి సహస్ర అటుగా దూసుకురావటంతో వాటి ప్రశాంతతకి భంగం కలిగింది. బెదరీ రోదచేస్తూ ఒక్కసారిగా గోల చేసాయి. ఈలోపల`అక్కడ రెండో అంతస్థులో ముందు పక్కస్థంబాల వెనక సిద్ధంగా పొజిషన్స్‌లో వున్నారిద్దరు షూటర్స్‌. పైనున్నవాడు అరచి కింద పడ్డంతో షాక్‌తిని పొజిషన్స్‌ వదిలి వాడి వద్దకు పరుగెత్తారు. వాళ్ళలో ఒకడు పారిపోతున్న నల్ల తాచును గమనించి రివాల్వర్‌తో షూట్‌ చేసాడు. పాము తల బుల్లెట్స్‌తో ఛిద్రం కాగా ఎగిరి గోడవతలినుంచి కిందకు పడిపోయింది.

‘‘ఏంటి? ఏమైందిరా! ఎందుకురా కిందపడ్డాడు వాడు?’’దీక్షను కట్టి ఉంచిన చోటునుంచి ముందుకొస్తూ అరిచాడు ఎట్టయప్ప.‘‘పాము సార్‌.. పాము కాటేసింది. పాముని షూట్‌ చేసాం. వీడు బతకడనుకుంటా. నోటినుంచి నురగలు వస్తున్నాయి’’ అంటూ బదులిచ్చాడు ఒకడు.ఇదే సమయంలో...ఒక్కసారిగా రోదచేస్తూ గబ్బిలాయిలు లేచి బయటకు ఎగిరిపోతుండటం చూసి అదిరిపడి అటు చూసిన షూటర్స్‌ ఇద్దరికీ సుడిగాలిలా బయటకు దూసుకొస్తున్న సహస్ర కన్పించింది. కంగారుపడి వాళ్ళిద్దరూ రివాల్వర్లు గురిపెట్టేలోన పరుగునవస్తూనే వేగంగా తన చేతులకు పని చెప్పింది సహస్ర. అంగుళం పిడి రెండంగులాల బ్లేడ్‌తో సన్నగా ఉండే చురికలు రెండు గాలిని చీల్చుకుంటూ దూసుకొచ్చి ఒకడి కుడి భుజంలోన రెండోది రెండోవాడి గొంతు పక్కన దిగబడ్డాయి. అంతే...

దారుణంగా అరుస్తూ కూలబడి పోయారిద్దరూ. చేతుల్లోని రివాల్వర్లు ఎగిరి శిథిలాల మధ్యలో ఎటో పడిపోయాయి.సహస్ర ప్రయోగించిన చురికలు సాధారణ చురికలు కావు. వాటి చివర బాణం మొన షేప్‌లో కొక్కేల్లా వుంటాయి. అవిదిగటం వరకే, దిగాక బయటకి తీయాలంటే డాక్టర్‌ సాయంలేకుండా సాధ్యంకాదు. గాలం ముల్లులా కొక్కేలు కండను పట్టేసి నరకం చూపిస్తాయి.దిగువనున్న ఎట్టయప్ప రెండో అంతస్థులో ప్రత్యక్షమైన సహస్రను చూడగానే షాక్‌తో నిలబడి పోయాడు. వెంటనే కంగారుతో... ‘‘వచ్చేసిందిరా నాయనో ఆ డెవిల్‌ వచ్చేసింది పై అంతస్తులో ఉంది. పొండి.. కాల్చి చంపండి. షూట్‌ హర్‌’ అంటూ గొంతు చించుకొని అరిచాడు.అంతటితో అంతవరకు ఎట్టయప్ప బిగించిన ఉచ్చు సడలిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ పొజిషన్స్‌ వదిలి పై అంతస్థు వైపు పరుగులు తీసారు.షూటర్స్‌ ఇద్దర్ని నేలకూల్చటంతో అక్కడ ఆగలేదు సహస్ర. కిందవాళ్ళు పైకి వచ్చేలోన మెట్లదారి వైపు పోకుండా బొంగరంలా తిరిగి వచ్చిన దారినే లోనగదుల్లోకి పరుగులు తీసింది. వాళ్ళంతా పైకి వచ్చేసరికి తను వెనక పక్క కూలిన శిథిలాలమీదుగా దూకుతూ కిందకు వచ్చేసింది. ఈలోపల...ఆవరణలో వున్న ఎట్టయప్ప జరుగుతున్న పరిణామాల్ని చూసి కోపంతో వూగిపోయాడు. తను వేసింది తిరుగులేని ప్లాన్‌ అనుకున్నాడు.

సహస్రరాగానే పిట్టను కాల్చినట్టు కాల్చి చంపొచ్చనుకున్నాడు. కాని చేతికి దొరికినట్టే దొరికి చేజారనున్న విజయాన్ని తలచుకోగానే కోపంతో భగ్గుమన్నాడు. తను పన్నిన వ్యూహాన్ని ఛేదించి సహస్రలోనకొచ్చిందంటే ఆమెను ఆపటం కష్టమని తెలుసు. దాంతో విచక్షణా జ్ఞానాన్ని మర్చిపోయి వేగంగా దీక్షముందుకెళ్ళాడు. అంతా చూస్తూనే వుంది దీక్ష. సహస్ర రాకను గమనించగానే ఆమె గుండె వేగం మరింత హెచ్చింది. ఎట్టయప్ప వంక భయం భయంగా చూస్తొంది.‘‘ఏంటే అలా చూస్తావ్‌. నీ ఫ్రండు నిన్ను విడిపించి తీసుకెళ్తుందనీ ధైర్యమా? అది ఆడపిల్ల కాదు. ఆడపిశాచి, రాక్షసి. మా ప్లాన్‌కి కౌంటర్‌ ప్లాన్‌ వేసింది. నన్ను చావు దెబ్బకొట్టాలనుకుంటోంది. నిన్ను విడిపించుకెళ్ళాలని వచ్చింది. ఒంటరిగా రమ్మంటే వచ్చినట్టే వచ్చి దొంగ దెబ్బ కొడుతోంది. వదులుతానా? దాన్ని చంపి నిన్ను ప్రాణాలతో వదలాలనుకున్నా. ఇపుడు నిన్ను చంపి ఆపిశాచికి పెద్ద షాకిస్తా’ నీ తల నరికి దానికి పిచ్చిపట్టేలా చేస్తా’ అనరుస్తూ చివ్వున వేటకత్తిని పైకి లేపాడు. వాడి ఆవేశం చూసి గజగజా వణికింది దీక్ష. క్షణం ఆగితే`

దీక్ష తలతెగి నేలమీద దొర్లేదే!

భయంతో కళ్ళుగట్టిగా మూసుకుంది.కాని ఆఖరి క్షణంలో...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika