Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
చిరంజీవి కాదు.. బ్ర‌హ్మానందం మెగా స్టార్ అవ్వాలి - తేజ‌

సినిమా పిచ్చోళ్లంటారే.. తేజ అదే టైపు.  
సినిమాని పిచ్చిగా ప్రేమిస్తాడు. సినిమా త‌ప్ప‌... ఇంకో పిచ్చిలేదు.
జ‌యం లాంటి పిచ్చేక్కే క‌లెక్ష‌న్లు వ‌చ్చే సినిమా తీయ‌గ‌ల‌డు.
ధైర్యంలా జనానికి పిచ్చిప‌ట్టే సినిమాలూ తీయ‌గ‌ల‌డు. అయినా ఏమాట‌కామాట చెప్పుకోవాలి. కొత్త వాళ్ల‌తో సినిమాలు తీసి, క‌మ‌ర్షియ‌ల్ హిట్లు కొట్టే ధైర్యం ఇచ్చిన ద‌ర్శ‌కుడు తేజ‌నే. అందుకే తేజ నుంచి సినిమా వ‌స్తుందంటే... ట్రాక్ రికార్డులేం ప‌ట్టించుకోకుండా అటు వైపు చూస్తుంటారు సినీ జ‌నాలు. ఇప్పుడు తేజ నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది. అదే హోరా హోరీ. ఈ శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా తేజ‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* దేని కోసం ఈ హోరా హోరీ పోరు?
- ప్రేమ కోసం. ప్రేమ విఫ‌ల‌మైతే.. కొంత‌మందికి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నిపిస్తుంది. ఇంకొంత‌మందికి నాకు ద‌క్క‌నిది ఇంకొక‌రికి ద‌క్క‌కూడ‌ద‌న్న శాడిజం పుట్టుకొస్తుంది. ఈ రెండు ప‌రిస్థితుల మ‌ధ్య న‌లిగిన అమ్మాయి క‌థ‌.

* ఇలాంటి ప్రేమ క‌థ‌లు చాలా వ‌చ్చాయేమో..
- మ‌న‌కున్న క‌థ‌లు చాలా త‌క్కువ‌. వాట్నే తిప్పీ తిప్పీ తీయాలి. ప్ర‌జెంటేష‌న్‌లో మార్పు చూపించాలి. అయితే హోరా హోరీ మాత్రం ఓ కొత్త క‌థ‌. సెకండాఫ్‌లో ఊహించ‌ని ట్విస్టులంటాయి. అవ‌న్నీ థ్రిల్ క‌లిగిస్తాయ‌ని నా న‌మ్మ‌కం

* ఈ క‌థ‌ని వ‌ర్షం నేప‌థ్యంలోనే తీయాల‌ని ఎందుకు అనిపించింది?
- వ‌ర్షం అన్న‌ది ఓ రొమాంటిక్ ఫీలింగ్‌.  మ‌న క‌వుల ర‌చ‌న‌లు చూడండి. వ‌ర్షాన్ని ఎంత అద్భుతం వర్ణించారో తెలుస్తుంది. వాన ప‌డుతుంటే.. ఆడియ‌న్స్ సినిమాల‌కు రారు.. వ‌ర్షాన్ని చూస్తూ కూర్చుంటారు.. వాన అంత గొప్ప‌ది. 

* మీరు లొకేష‌న్లో హీరో హీరోయిన్ల‌మీద చేయి చేసుకొంటారు అని చెప్తుంటారు. సెట్లో అంత హింస అవ‌స‌ర‌మా?
- నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా త‌ప్ప‌.. నాకు ఇంకేం తెలీదు. సినిమా బాగా రావాలి.. దాని కోసం ఏమైనా చేస్తా. మిమ్మ‌ల్ని పొడిస్తే నా సినిమా బాగొస్తుందంటే.. పొడిచేస్తా.. (న‌వ్వుతూ).  అలాగ‌ని నేనేదో పుడింగిన‌ని, మాయాబ‌జార్‌లాంటి సినిమాలు తీస్తాన‌ని చెప్ప‌డం లేదు. కానీ మంచి సినిమాలు తీయ‌డానికి మాత్రం నా వంతు ప్ర‌య‌త్నం చేస్తా. ప‌రిశ్ర‌మ శాశ్వితం.. ఇక్క‌డున్న‌వాళ్ల‌మంతా తాత్కాలికం. సినిమా అనేది శాశ్వ‌తం.. తీసినోళ్లు తాత్కాలికం. మాయాజ‌జార్ గురించి ఇప్ప‌టికీ గొప్ప‌గా చెప్పుకొంటున్నాం. కానీ ఆ సినిమా తీసినోళ్ల‌లో ఒక్కరూ మ‌న మ‌ధ్య లేరు. మ‌న సినిమా గురించి కూడా జ‌నం అలా గొప్ప‌గా చెప్పుకోవాలి.

* సంగీత ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కోడూరిని బాగా ఇబ్బంది ప‌డ్డార‌ట‌..
- నావ‌ల్ల త‌ను ఇబ్బందిప‌డ్డాడేమో. కానీ త‌న వ‌ల్ల నేనేం ఇబ్బంది ప‌డ‌లేదు. త‌నది చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం. అలుగుతాడు, గొడ‌వ ప‌డ‌తాడు.  నేనో టైపు. సినిమా చేస్తున్నంత సేపూ అంద‌రూ నాతోనే ఉండాలి.. అనుకొంటా. త‌నకో ఇండివిడ్యువాలిటీ ఉంటుంది క‌దా. నేను రోడ్ల‌పై ప‌డుకొన్న‌వాడ్ని. మ‌ళ్లీ నా స్థాయి అక్క‌డికి దిగ‌జారిపోతుందేమో... అన్న‌భ‌యం నాది. పొద్దున లేచిన‌ప్పుడు పాండీబ‌జార్‌లో మెట్ల‌మీద ప‌డుకొన్న రోజుల్ని గుర్తు చేసుకొంటుంటా. మ‌ళ్లీ ఆ రోజుల్లోకి వెళ్ల‌కుండా ఉండాలంటే క‌ష్ట‌ప‌డాలి. అందుకే ప‌నిచేస్తూనే ఉంటా.

* సినిమా ప‌రిశ్ర‌మ గురించి ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సంబంధాలు దెబ్బ‌తింటాయ‌న్న భ‌యం ఉండ‌దా?
- నాకెవ‌రితో ఉన్నాయిప్పుడు మంచి సంబంధాలూ. (న‌వ్వుతూ). నేనేం అలాంటివి ప‌ట్టించుకోను. నాకు సినిమా ముఖ్యం. ఈ ప‌రిశ్ర‌మ నాకు అన్నం పెట్టింది. సినిమా పాడైపోతుంటే.. చూడ‌లేను. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌.. ఇలా పెద్ద పెద్ద‌వాళ్ల‌తో క‌ల‌సి ప‌నిచేసిన‌వాడ్ని. ఎంజీఆర్ త‌ప్ప మేటి న‌టుల సినిమాల‌కు వ‌ర్క్ చేశా. అప్పుడు సినిమా ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది?  ఆ బాధ‌లో ఏదో మాట్లాడేస్తుంటా. కొంత‌మంది ఫ‌స్ట్రేష‌న్ అనుకొంటారు. ఇంకొంత‌మంది వీడికి చేత‌కాక అంటున్నాడు అనుకొంటారు. ఎవ‌రేం అనుకొన్నా.. నాది సినిమాల‌పై ప్రేమ‌.

* కోపం త‌గ్గించుకోవ‌చ్చుగా..
- ఇదే మాట నాతో చాలామంది చెప్పారు. కానీ నా గుణాల్ని క‌ప్పేసుకొని పైకి న‌టించ‌లేను. చిన్న‌ప్పుడే కొన్ని ల‌క్ష‌ణాలు ప్యాకేజీ రూపంలో వ‌చ్చేశాయి. ఇది వ‌ద్దు.. ఇది మాత్ర‌మే కావాలి అనుకొంటే కుద‌ర‌దు. ఓ బ్ర‌డ్ ప్యాకెట్ కొన్నామంటే అందులో పాడైపోయిన ముక్క‌లు కూడా రావొచ్చు. ఎంచుకొనే సౌక‌ర్యం అక్క‌డ ఎలా ఉండ‌దో, జీవితంలోనూ అలానే కొన్ని ల‌క్ష‌ణాల్ని ఎంచుకోలేం. జీవితాంతం క్యారీ చేయాల్సిందే.

* ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని న‌మ్ముకొన్న రోజులివి. మీరేమో మీధోర‌ణిలోనే సినిమా తీస్తానంటే ఎలా?
- కామెడీ కోసమే జ‌నాలుథియేట‌ర్ల‌కు వ‌స్తార‌నుకొంటే... చిరంజీవి కాదు, బ్ర‌హ్మానందం మెగా స్టార్ అవ్వాలి. జ‌బ‌ర్‌ద‌స్త్ లో న‌టిస్తున్న‌వాళ్లంతా సూప‌ర్ స్టార్లూ, ప‌వ‌ర్ స్టార్లూ అయిపోవాలి. ఎంట‌ర్‌టైన్ మెంట్ అంటే వినోదం మాత్ర‌మే అనుకొంటున్నాం. కానీ వినోదం ఓ భాగం మాత్రమే. కామెడీ, యాక్ష‌న్‌, సెంటిమెంట్ ఇవ‌న్నీ క‌ల‌గ‌లిసి ఉంటేనే ఓ సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉన్న‌ట్టు. నా జ‌యంలో ఇవ‌న్నీ ఉన్నాయి. కాబ‌ట్టి అప్ప‌ట్లో ఈ సినిమాని 5 కోట్ల‌మంది చూశారు. ఇప్పుడు కామెడీ సినిమాల్ని 80 ల‌క్ష‌లమంది కూడా చూడడం లేదు. అన్ని ర‌కాల ఎమోషన్లు ఉన్న సినిమాలు తీస్తే.. జ‌నం ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు వ‌స్తారు.

* పెరిగిపోతున్న బ‌డ్జెట్ల‌పై మీ అభిప్రాయం ఏమిటి?
- రూపాయిలో ఓ సినిమా తీయాలంటే.. 70 పైస‌లు పారితోషికాల‌కే అయిపోతున్నాయి. మ‌నం 30 పైస‌ల‌తోనే సినిమాలు తీస్తున్నాం. 70 పైస‌ల‌తో సినిమా తీసి, 30 పైసలు పారితోషికం ఇచ్చిన రోజున ఖ‌చ్చితంగా మ‌నం మంచి సినిమాలు తీయ‌గ‌లం.

* మ‌రి మీ హోరా హోరీ విష‌యంలో ఏం జ‌రిగింది?
- 90 పైస‌ల‌తో సినిమా తీశాం. ప‌ది పైస‌లు మాత్ర‌మే పారితోషికాల పేరుతో ఇచ్చాం.

* చివ‌రిగా ప్రేక్ష‌కుల‌కు ఏం చెబుతారు?
- టాక్ క‌నుక్కోండి. అంద‌రూ బాగుందంటే.. సినిమా చూడండి. లేదంపై పైర‌సీలో చూసేయండి.. ఏం ఫ‌ర్వాలేదు. (న‌వ్వుతూ) మీడియాకీ ఇదే చెబుతున్నా. సినిమా న‌చ్చితే జ‌నం మ‌ద్య‌కు తీసుకెళ్లండి. ఓ మంచి సినిమాని గొప్ప సినిమా చేసే శ‌క్తి మీడియాకే ఉంది. న‌చ్చ‌క‌పోతే ఏకి పారేయండి.. నో ప్రాబ్లం. (న‌వ్వుతూ)

- కాత్యాయని 
మరిన్ని సినిమా కబుర్లు
movie review