Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక



జరిగినకథ: తన కోసం కలలు కనే  అమ్మానాన్న  ఉండడం ఎంతో  అదృష్టమని చంద్రకళ ఆనందపడుతుంది. “దేశదేశాల్లో ఉన్న సాంస్కృతిక  సభలు తన నృత్యానికి  ‘వేదిక’లవ్వాలి, తనలోని కళకి కళాభిమానుల హృదయాలు ఉప్పొంగిపోవాలని  చంద్రకళతో అంటారు వాళ్ళ నాన్నగారుఆ తరువాత.  
 

నాన్న ఆర్మీ హాస్పిటల్ లోఎడ్మిటయ్యి వారమయింది.  చాలా మెడికల్ టెస్ట్స్ చేసారట కాని, ఇప్పటి వరకు నాన్న హెల్త్ స్టాటస్ మాత్రం క్లియర్ చేయ లేదట.  మరి కొన్ని రోజులు ఉండాలన్నారట. పగలంతా నాన్న దగ్గరే ఉండి, సాయంత్రానికి ఇంటికి వస్తుంది, అమ్మ.

         

ఆదివారం నాన్నని చూడ్డానికి నేను, వినోద్ వెళ్ళినప్పుడే, భూషణ్ అంకుల్, నీరూ ఆంటీ వచ్చారు.


“ఏమిటోయ్ మేజర్, వారం నుంచి ఇక్కడే ఉన్నావు?  ఏమిటి కంప్లైన్ట్?” అన్నారు అంకుల్ నాన్నకి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ..


“నిజమే,  నా హాస్పిటల్ స్టే, ఇన్నిరోజులు పడుతుందని అనుకోలేదు.

మొదటి సారి ‘డయాబెటిస్’ డిటెక్ట్ అవడమే కాక, బాగా హెచ్చుగా ఉందని రిపోర్ట్స్.   ఇన్సులిన్ హైడోసెస్ మీద ఉన్నాను.  బాగా ఫిజికల్ వీక్ నెస్ ఫీల్ అవుతున్నాను.  అది గాక, రైఫల్ ట్రైనింగప్పుడు ఇంజ్యూరి అవడంతో కుడి కన్ను ఇబ్బంది పెడుతుంది. అన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేస్తున్నారు,” క్షణమాగారు నాన్న...

“ఇప్పటి నా హెల్త్ కండీషన్ లో, మళ్ళీ వెంటనే అసైన్ మెంట్ తీసుకుని, అస్సాంకి వెళ్ళే పరిస్థితి ఉండక పోవచ్చని అంటున్నారు డాక్టర్లు,” అన్నారు.


“డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది లెండి, సత్య గారు.  మెడికల్ లీవ్ మీద ఇంటి పట్టునే ఉంటే హెల్త్ కుదుట పడుతుంది,” అంది ఆంటీ.


“మీరంతా వర్రీ అవకండమ్మా..  బాగానే ఉన్నాను, ఇక్కడ బోలెడంత రెస్ట్.  రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తాను,” జవాబుగా నాన్న.


నాన్న, అస్సాంకి వెళ్ళక పోవచ్చని మాత్రం అర్ధమయింది నాకు.  అందరం హ్యాపీ. ఇంకా కొద్ది రోజులు లీవ్ మీద ఉండి రెస్ట్ తీసుకుంటే నాన్న బాగయి పోతారు.

**

మళ్ళీ ఆదివారం నాడు పొద్దుటే, ఊరి నుండి కోటమ్మత్త వచ్చింది..  మమ్మ్మల్నిఆప్యాయంగా దగ్గరికి తీసుకొంది.... వినోద్ ని చూసి, అచ్చంగా నాన్న చిన్నప్పుటిలా ఉన్నాడంది.  చిన్నప్పటి నాన్న లాగా డాన్సులు, డ్రామాలు,  చేస్తున్నానంటూ, నన్ను ముద్దు పెటుకుంది.


ఫ్రెష్ అయ్యి, కబుర్లు చెబుతూ, కాఫీ టిఫిన్ కానిచ్చింది.

నేను డాన్స్ క్లాస్ కి వెళుతుంటే, నాతో పాటే బయలు దేరింది కోటమ్మత్త.

**

రెండు గంటల సేపు జరిగిన మా ప్రాక్టీసులు చూసి, ఇంటికొచ్చాక నన్ను చాలా మెచ్చుకుంది.

నాకన్నా పెద్ద వాళ్ళతో, సినిమా యాక్టర్లతో కలిసి నాట్యం చేస్తున్నానంటూ ఆశ్చర్య పోయింది కోటమ్మత్త...


కబుర్లు చెబుతూ భోంచేసి, ఆమె సర్దుకునే లోగా, నాన్న హాస్పిటల్ నుండి డిస్చార్జయ్యి, ఇంటికి వచ్చేసారు.  తన తమ్ముణ్ణి చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నాన్నకి ఇష్టమైనవి తానే వండి పెట్టి, నాన్నన్ని మళ్ళీ ఆరోగ్యం గా బొద్దుగా చేస్తానని నవ్వేసింది కూడా.

**

మెడికల్ లీవ్ మీద ఇంట్లోనే ఉన్న నాన్న, మరిన్ని టెస్ట్స్ చేయించుకోడానికి హాస్పిటల్కి వెళ్లి వస్తున్నారు.   ఆయన హెల్త్ గురించి అమ్మ దిగులుగా ఉంటుంది.

ఆర్మీ నుండి బయట పడి, సివిల్ జాబ్ చేయమని, ఉండుండి, నాన్నతో గొడవ పడతుంది కూడా.


ఓ మారు భోజనం వడ్డిస్తూ కూడా అదే విషయం మాట్లాడుతున్న అమ్మని వారించారు నాన్న.

“చూడు శారదా,  ఇక్కడ ప్రస్తుతం, మనముంటున్న ఫ్లాట్, బాబు ఎడ్యుకేషన్ ఆర్మీ వాళ్ళే ఇస్తున్నారు.  అస్సాం వెళ్ళడం లేదు కదా! నా మెడికల్ లీవ్ మరో మూడు నెలల వరకు పొడిగించ వచ్చు. ఈలోగా, ఆర్మీ నుండి తప్పు కోవడం గురించి అలోచించి, నిర్ణయం తీసుకుంటాను.  కాస్త ఓపిక పట్టు,” అమ్మకి నచ్చ జెప్పారు నాన్న....

అది విన్న తరువాత, అమ్మ ముఖం కాస్త ప్రశాంతంగా మారింది...


చిరునవ్వుతో, నాన్నకి కొసరి కొసరి వడ్డించ సాగింది...

“అసలు నువ్వు మర్చి పోతున్న ముఖ్యమైన విషయం ఒకటుంది, శారదా..- నాట్య రంగంలో మన చంద్రకళ వృద్ధిలోకి రావాలంటే, చెన్నైలోఉండడమే కరెక్ట్.  ఔనా?”  అమ్మ వంక చూస్తూ అడిగారు...

”అంతే కాదు,  ఇన్నాళ్ళగా నీ మ్యూజిక్ క్లాసుల విషయంగా కూడా స్థిర పడ్డావిక్కడ. కాబట్టి, అన్నీ అలోచించి నిర్ణయాలు తీసుకుందాము.. నాకు తెలుసు కదా!  కాబట్టి, నువ్వు బాధ పడుతూ నన్ను విసిగించకు,”... అంటూ భోజనం ముగించారు నాన్న.......

**

ఆ సంభాషణ జరిగిన వారానికి, తేజశ్విని గారి డాన్స్ బ్రోష్యూర్స్ కలెక్ట్ చేసి, నన్ను వెంట బెట్టుకొని, మాస్టారు గారిని కలిసింది అమ్మ.  తేజశ్విని గారి అనుమతితో ఆవిడ కూర్చిన ‘దేవి స్తోత్ర మాలిక’, ‘సంభవామి యుగే యుగే’, ’గురువే నమః’, ‘కన్య’, ‘మానస పుత్రి’  లాగా ఓ కథా వస్తువు ఉన్న నృత్యాంశాల్లో నాకు శిక్షణ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది.  సంగీతం, పాటల విషయంలో తాను కూడా వీలైన సహకారాన్ని అందిస్తానని చెప్పిందాయనికి.

మాస్టారు గారు అంతా విని, ‘తప్పకుండా ఆలోచిద్దాము శారద గారు,” అన్నారు.


ఇలా ప్రోగ్రాములు తగ్గించి నృత్య శిక్షణ పైన దృష్టి పెట్టడమే సరయిందన్నారు నాన్న, జగదీష్ కూడా....

**

తలకి నూనె రాసి, కోటమ్మత్త లాగా మర్దనా చేయడం, మరెవ్వరికీ సాధ్యం కాదంటారు నాన్న.

అది గుర్తొచ్చి, శనివారం లంచ్ అయ్యాక, నూనె సీసా తీసుకుని వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాను.

“మీ అమ్మ లాగా మంచి సిరి గల జుట్టు, చంద్రకళా నీది,” అంది కోటమ్మత్త జుట్టు చిక్కు తీస్తూ.

“మీ నాన్న కూడా చిన్నప్పుడు, ఇలాగే తలకి తైలం పట్టించి మర్దనా చేయమనే వాడని చెప్పానా?” నవ్వుతూ కోటమ్మత్త......

“నాన్న సంగతులు ఇంకా చెప్పత్తా,” అడిగాను.


“నువ్వు సరిగ్గా కూర్చో...నూనె పెడుతూ చెబుతా మీ నాన్న అల్లరి గురించి,” అంది ఆత్త.


ఆమె చెప్పిన దాన్ని బట్టి- ముగ్గురాడపిల్లల తరువాత, వాళ్ళమ్మ సత్యనారాయణ స్వామికి మొక్కుకుంటే పుట్టిన వారసుడట-నాన్న. అతి గారాబంగా పెరిగాడట. ఐదేళ్ల వరకు వాళ్ళమ్మ దగ్గరే పాలు తాగేవాడట. చిన్నప్పుడు, స్కూలుకి వెళ్ళకుండా, నిక్కర్ మాత్రమే వేసుకొని, ఊరంతా గోలీలాడుతూ తిరిగేవాడట. స్నేహితుల్ని వెంటేసుకొని, బావుల్లో, చెరువుల్లో ఈత కొట్టేవాడట.

ఓ రోజు, కత్తేరి కాయలు కోసం, చెట్టుని రాళ్ళతో కొడుతుంటే, ‘బుస్సుమంటూ ’ఓ పదహారు పడగల పాము, నాన్న మీదకి పడగ విప్పిందట.  దాంతో దడుసుకొని జ్వరమొచ్చి, నాలుగు రోజులు పడకేసాడట, పాపం, నాన్న.  అప్పుడు నాన్న వయస్సు తొమ్మిదేళ్ళట. ...


అట్లా జబ్బు పడి లేచాక మాత్రం స్కూలుకి వెళ్లడం మొదలు పెట్టాడట.

బడికి వెళ్ళినా, అక్కడ కూడా అల్లరేనట.


“చదువులో ఫస్ట్ ఉండేవాడు మీ నాన్న.  డ్రామాలు, పాటలంటే ఇష్టంతో అదే పని మీద ఉండే వాడు.  కృష్ణుడు వేషం వేయిస్తే, సత్య భామ వేసే అమ్మాయి అందంగా లేదని గొడవ చేసి ఆడపిల్లలకి పేర్లు పెట్టేవాడు.

ఏమైనా, చాలా తెలివి గలవాడవడంతో,  డబుల్ ప్రమోషన్స్ వచ్చి చదువులో దూసుకు పోయాడనుకో.  మీ నాన్నలాంటి వాళ్ళు చాలా అరుదేనమ్మా, చంద్రకళా,” అని జడ వేయడం ముగించింది, కోటమ్మత్త.


నాన్న గురించి వింటుంటే, నాకు ఏడు పొచ్చేసింది. నేను కళ్ళు తుడుచుకోడం చూసి, అత్తా, అమ్మా కూడా కాస్త గాభరా పడ్డారు.


నాన్న చిన్నతనం గురించి విన్నాక, నాన్న మీద నాకు ప్రేమ మరింత ఎక్కువైంది.

చిన్నప్పుడు అల్లరి వాడైనా, పాపం! నాన్న అమాయకుడు....

ఎంతో కష్టపడి పైకొచ్చానని చెబుతూనే ఉంటారు’ అనుకున్నాను.

‘నాన్నని సంతోష పెట్టాలి.  ‘ఐవిల్ మేక్ హిమ్ ప్రౌడ్ ఆఫ్ మి’ అని మనస్సులో గట్టిగా అనుకున్నాను..

**

ఆదివారం డాన్స్ క్లాసుకి వెళ్ళేప్పటికి,  కాంపౌండులో గవర్నమెంట్ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి.  ‘ఎవరై ఉండవచ్చో’ అనుకంటూ,  అప్పుడే వచ్చిన కాంచన, మంజరి వాళ్ళతో పాటు క్లాసు లోపలికెళ్ళాను.

అక్కడ, మా గురువు గారితో మాట్లాడుతూ, చాలా మందే ఉన్నారు.  ఆయన పక్కన బల్ల మీద పూల హారాలు, బొకేలు ఉన్నాయి.


మమ్మల్ని,  పక్కనే ఉన్న శేషు మాస్టారి క్లాస్ రూములో వెయిట్ చేయమన్నారాయన.

**

మరో అర గంటకి, చేతిలో కవర్లతో,  ఆయనే మా వద్దకు వచ్చారు. కల్చరల్ కమిటీ మెంబర్స్ తో, రాబోయే టూర్ గురించి సంప్రదింపులు జరుపుతున్నానని చెబుతూ, చేతిలోని కవర్లు మాకందించారు. వాటిల్లో ‘నృత్యహేళి’  కార్యక్రమాల వివరాలున్నాయన్నారు.

ఉన్నట్టుండి ఏర్పాటయిన సమావేశమవడంతో, క్లాస్ కాన్సెల్ చేసే వ్యవధి కూడా లేక పోయిందని చెప్పి, మమ్మల్ని బ్రేక్ తీసుకోమని కోరారు.

**

‘నృత్యహేళి’ కవర్ తీసుకొని, గబగబా ఇంటికొచ్చేప్పటికి, ఇంటి ముందు తలుపులు తీసే ఉన్నాయి.  వరండాలో ఎవరివో షూజ్, సాండల్స్ ఉన్నాయి.

హాల్లోకి వస్తుంటే, అమ్మ వాళ్ళ గది నుండి అమ్మ గొంతు వినబడింది.  ఎందుకో అప్ సెట్ అయినట్టుగా ఉంది. ఇంచు మించు ఏడ్చేస్తుంది. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasinipattiuste koti