Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఫెయిల్యూర్ క్లబ్

failure club

‘‘ఫెయిల్యూర్ క్లబ్’’

ఆ పేరు   కొత్తగా, చిత్రంగా అనిపించింది.

రోడ్డు మీద నడుస్తున్న వాడినల్లా

ఆ బ్యానర్ చూసి ఠక్కున ఆగిపోయాను.

సాధారణంగా గెలుపు గురించి అందరూ మాట్లాడుకుంటారు.

గెలుపు ... సంపద,కీర్తి ప్రతిష్ఠలు, ఆత్మసంతృప్తి  వంటి వాటిని  తన వెంట తెస్తుంది.

గెలిచిన వాడి చుట్టూ జనం మూగుతారు. నిత్యం పొగడ్తలతో ముంచెత్తుతారు.

గెలిచిన వ్యక్తి ముఖంలో విజయగర్వం, తేజస్సు కనిపిస్తాయి.

మరి ఓటమి...

ఓటమి అవమానభారాన్ని పెంచుతుంది. ఆత్మన్యూనత, ఆందోళన, భయం, నైరాశ్యం వంటి వాటిని తోడుగా   తెస్తుంది. 

 ఓడిన వ్యక్తి గుంపుగా దూరంగా పారిపోతాడు. తననెవరూ గుర్తించకుండా ఉండే బావుంటుందనుకుంటాడు.

ఓడిన వ్యక్తి ముఖంలో నిరాశానిస్పృహలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.

గెలుపుకి  అందరూ బంధువులయితే.. పాపం ఓటమి మాత్రం అనాథ.

‘‘ మరిక్కడేం జరుగుతోంది?’’ ఆలోచించుకుంటూ లోపలకి అడుగుపెట్టాను.

నిజానికి అక్కడ కార్యాలయం లాంటిదేమీ లేదు.

ఓ ఆలయ ప్రాంగణంలో ... ఖాళీగా ఉన్న చిన్న గది ముందు బ్యానర్ కట్టారు. లోపల వలయాకారంలో కుర్చీలు వేశారు. బహుశా ఒకరి తర్వాత మరొకరు మాట్లాడేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారేమో తెలీదు.

దాదాపు పది మంది వరకూ అక్కడక్కడ గుంపులుగా  చేరి మాట్లాడుకుంటున్నారు.

సమావేశం ప్రారంభం కావటానికి మరికొంచెం సమయం పట్టేట్టుంది.

రెండడుగులు బయటకు వేసి సిగరెట్ ముట్టించాను.

ఇంతలో... మొబైల్లో మెసేజ్ వచ్చినట్టుగా రింగ్ టోన్ మోగింది. తీసి చూశాను.అది ప్రణవి నుంచి.

అప్పటికే ఐదారు మెసేజులున్నాయి. అన్నీ ఆమె నుంచే.

‘‘ బయలుదేరావా? సమయం గుర్తుందిగా... రాత్రి 10.20...’’

 కాళ్లలో వణుకు మొదలయ్యింది.

నిన్న రాత్రి మా ఇద్దరిమధ్యా నడిచిన సంభాషణ కళ్ల ముందు మెదిలింది.

‘‘ ఈ సమస్యలు ఒక కొలిక్కి వచ్చేలా లేవు. మనిద్దరం కలిసి జీవించటం కష్టం అనిపిస్తోంది. కనీసం కలిసి చనిపోదాం. అప్పుడయినా మనకి తృప్తి’’...ప్రణవి చెబుతోంది.

 శీతాకాలం సాయంత్రం. ఆ  వంతెనపైన రద్దీ తక్కువగా ఉంది.  దిగువ నుంచి రైలు వెళుతోంది. ఆ హోరులో ఆమె చెప్పిన మాటలు కొన్నే నా చెవిన పడ్డాయి.

నుదుటి మీదకు జారుతున్న ముంగురులను ఎడం చేత్తో పైకి తోసుకుంటూ మళ్లీ ఆమాటలు చెప్పింది. ఉలిక్కి పడ్డానునేను. జీవితం పట్ల  స్పష్టత, లోతయిన అవగహన ఉన్న అమ్మాయి నుంచా నేను ఈ మాటలు వింటున్నది... ఆశ్చర్యం కలిగింది నాకు.

ఎనిమిది నెలల క్రితం ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సారి ఆమెను చూశాను.

టీవీ రిపోర్టుగా ఓ యూత్ ప్రోగ్రాం నిమిత్తం అక్కడి కెళ్లాను. చాలా చురుకయిన పిల్ల. మనసులోని భావాలను దాచుకోవటం తెలీదు అని మొదటి పరిచయంలోనే గ్రహించాను.

‘‘ మీ కార్యక్రమం ఇప్పటి జనరేషన్ కి తగినట్టుగాలేదు. వరకట్న సమస్యలు, మీరెలాంటి వ్యక్తిని పెళ్లాడాలనుకుంటున్నారు? భవిష్యత్తులో మీరేం కావాలనుకుంటున్నారు? ఇవన్నీ అవుట్ డేటెడ్ సజ్జక్టులు. ఇందులో చూసి నేర్చుకోటానికి ఏముంది? కాలక్షేపం తప్ప’’ అంటూ మొహం మీదే కడిగిపారేసింది.

నేను ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు గానీ.. నా పక్కనున్న కెమెరామెన్ మాత్రం..

‘‘ మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకండి. అంతేగానీ మా ప్రోగ్రామ్ ని తీసిపారేయకండి. ఛానల్  రేటింగ్ లో మా ప్రోగ్రాం మేం నెంబర్ ఒన్ తెలుసా?’’ అన్నాడు సమర్థించుకుంటూ.

ఆమె ఆ మాటల్ని తీసిపారేసింది.

‘‘ మా కాలేజీకి వచ్చారు కాబట్టి... నా అభిప్రాయం చెప్పాను. మీకు ఉపయోగపడుతుందనుకుంటే మార్పులు చేసుకోండి అంతే తప్ప నన్ను విసుక్కుంటే ఎలా?’’. అంది నిర్మొహమాటంగా. 

ఆ కాలేజీలో ఉన్న ఏడెనిమిది మంది ఇతర అమ్మాయిలతో పాటు ఆమె అభిప్రాయం కూడా తీసుకుని  తిరిగొచ్చేశాం. కార్యక్రమం ప్రసారమయ్యే రోజున అలవాటుగా అందరికీ ఫోన్లో విషయం చెప్పాను. అది చూసి వాళ్ల అభిప్రాయాలు చెప్పమని కోరాను.

మిగతా వాళ్లు ఏం చెప్పారో నాకు గుర్తులేదు.

‘‘మీరు మా అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టులేరు. అమ్మాయిల అందచందాలను   మాటిమాటికీ చూపించటం తప్ప..’’ అంది ప్రణవి.

‘‘ మీ అభిప్రాయం సరైనదే. మాట్లాడిన వాళ్లంతా టీవీలో కనిపించాలన్న ఆరాటంతో ఉన్నారు గానీ.. వ్యక్తీకరణ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపలేదు’’ అన్నాను  తను మాటలతో ఏకీభవిస్తూ.   

తనెలా స్పందించిందో తెలియదు గానీ.. ఇది జరిగిన కొన్నాళ్లకి తనే నాకు స్వయంగా ఫోన్ చేసింది.

‘‘ నా ఫ్రెండ్ ఒకమ్మాయి  టీవీ  ఛానల్ చూద్దామని గొడవ చేస్తుంటే  మీరు గుర్తొచ్చారు. ఈ ఆదివారం వద్దామనుకుంటున్నాం. వీలుకుదురుతుందా?’’ అనడిగింది. 

ఆమె అభ్యర్థనను కాదనటానికి నాకు ఎలాంటి కారణం కనిపించలేదు.

సాధారణంగా ఆదివారం ఉదయం అంత పని ఒత్తిడి ఉండదు. మా ఇన్ ఛార్జితో ముందుగా మాట్లాడి  తగిన ఏర్పాట్లు చేశాను. ప్రత్యేక శ్రద్ధతో అన్ని విభాగాలు చూపించాను.

నలుగురమ్మాయిలు వచ్చారు. మా క్రియేటివ్ హెడ్  వాళ్లని దగ్గర కూర్చోబెట్టుకుని  ఛానల్లో వస్తున్న అన్ని కార్యక్రమాల గురించి ఫీడ్ బ్యాక్ అడిగి తీసుకుంది.  అందులో ఒకమ్మాయి ముఖకవళికలు, మాటతీరు తనని బాగా ఆకట్టుకోవటంతో    యాంకర్ గా అవకాశం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది.   ఇదంతా   నా పరిచయం వల్లనేనని  ఆమె  స్నేహితులంతా ప్రణవిని  మెచ్చుకున్నారు.

ఆమెకు కూడా నాపైన అభిమానం కలిగింది.

తనే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేది.

చాలా సందర్భాల్లో నేను శ్రోతగా మిగిలేవాడిని.  కొద్ది రోజుల్లోనే మా పరిచయం గాఢంగా మారింది. తరచూ  ఇద్దరికీ అనుకూలమైన ప్రాంతం వంతెన పైన  కలసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. మొదట్లో పావుగంట, అరగంట మాట్లాడుకునేది తర్వాత గంటలు, గంటల సమయం దొర్లిపోయేది.

ఓ నెల్రోజుల క్రితం ...

‘‘ఒకరి అభిప్రాయలను మరొకరు గౌరవించుకునే జంట మంచి భార్యాభర్తలవుతారట.  మనం పెళ్లి చేసుకుంటే బావుంటుందేమో?’’ అంది తనే.

‘‘అంత కంటే అదృష్టం మరొకటి ఉంటుందా?’’ అనిపించిందినాకు.

అప్పట్నుంచి మరింత ఉత్సాహంగా ఉండేవాళ్లం.

ఇంతలోనే ప్రణవి నుంచి ఈ మాటలు.. 

‘‘ ఏమిటి .. నువ్వంటున్నది?’’ సీరియస్ గా అడిగాను.

‘‘నువ్వు విన్నది నిజమే. మా డాడీ  మన పెళ్లికి ఒప్పుకోవటం అసంభవం’’ అంది కుండబద్దలు కొట్టినట్టుగా...

 ఈ రోజు ఉదయం ఈ విషయాన్ని తేల్చి చెప్పేశారు డాడీ. అంతేకాదు. రేపు రాత్రికి చికాగోకి పంపుతారట. అక్కా, బావతో నువ్వూ వెళ్లాలి. కాస్త గట్టిగానే చెప్పారు.’’

‘‘దేనికి?’’ ఆసక్తిగా అడిగాను.

‘‘మా బావ తమ్ముడిని నేను తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలట. నాన్నగారు ఇన్ కం టాక్స్ సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు వియ్యంకుడిగా అక్కయ్య మామగారు ఆదుకున్నారట. ఆ సమయంలో  తన రెండో కూతురిని కూడా కోడలుగా పంపాలని కోరితే ... అప్పుడున్న పరిస్థితుల్లో కాదనలేకపోయారట...’’

‘‘ ఇప్పుడు నేను కాదంటే... నాన్నగారి మాట పోతుంది. అంతకు మించి అక్కయ్య కాపురం పైనా ప్రభావం చూపుతుంది’’ క్లుప్తంగా పరిస్థితిని వివరించింది ప్రణవి.

ఇంతకు మించి గత్యంతరం లేదు అన్న భావన ఆమె మాటల్లో కనపడింది. ఆ తర్వాత కొద్దిగా ఊపిరిపీల్చుకుని మళ్లీ తనే అంది.

‘‘ అంతకు ముందు అవసరం రాలేదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు తప్పదుగా.. నీ గురించి  మొదటిసారి అమ్మకు చెప్పేశా...

 ఉద్యోగం సద్యోగం లేని వాడిని చేసుకుని నువ్వేం సుఖ పడతావే... ’’ అంది.

నిన్ను కాళ్లు కింద పెట్టకుండా పెంచాం. చూస్తూ చూస్తూ ఓ బికారి గాడికిచ్చి ఎలా చేయం అంటూ పెద్ద గోలే చేసింది. ఈ పరిస్థితుల్లో..’’ అర్థోక్తితో ఆగిపోయింది ప్రణవి.

చర్నాకోలతో ఒంటిమీద చెళ్లున చరిచినట్టయింది నాకు.  అపరాధభావనతో కుంగిపోతున్నాను. ఆ నిముషంలో ఆమెకు ధైర్యం చెప్పే సాహసం చేయలేకపోయాను. 

ఓ జాతీయ ఛానల్ వాళ్లు మా ఛానల్ ని టేకోవర్ చేయటంతో ఇక్కడున్న స్టాఫ్ లో చాలా మందిని బయటకు పంపారు. ముఖ్యంగా అప్పటి సీఈఓకి సన్నిహితంగా ఉన్న ఐదారుగురిని తప్పనిసరిగా వైదొలగవలసిందిగా హెచ్చరికలు చేశారు. అందులో నేనొకడిని.

సాధారణ ఉద్యోగిగా టీవీ ఛానల్లోకి ప్రవేశించిన నేను అనతికాలంలోనే  పై కెదిగాను. నాలుగయిదు ఛానళ్లు వరుసగా మారుతూ వేతన పరంగా ఎక్కువ సంపాదించే స్థాయికి చేరాను. దాదాపు అన్ని ఛానళ్లలోనూ నాకు పరిచయం ఉన్నట్టే.. నేను తమకు పోటీగా భావించి నా రాకను   అడ్డుకునేవాళ్లూ చాలా మంది ఉన్నారు.

‘ వద్దు సార్... వాడికి తలబిరుసు..

అన్నీ తనకే తెలుసనుకుంటాడు.. గ్రూపుతో కలసి సరిగా పనిచేయలేడు.

అందరూ తను చెప్పిందే వినాలన్న మొండి పట్టుదల ఎక్కువ.

ఎవరినీ లెక్క చేయడు. తను నచ్చిన ప్రోగ్రామ్ చేస్తాడు.. ఏం చేయాలనుకున్నాడో ముందు చెప్పడు. అనుమతి తీసుకోడు...

ఇలా నా గురించి చెడ్డగా ప్రచారం చేశారు. ఒకప్పుడు పేరుప్రతిష్ఠలు తెచ్చిన    నా సామర్థ్యాన్ని, వ్యక్తిత్వాన్ని బలహీనత,లోపాలుగా చెప్పుకొచ్చారు.

అందుకే నాకు వెంటనే అవకాశాలు రాలేదు.

‘‘ ఏదో ఒక ఛానల్లో చేరటం దేనికి? నీ ప్రతిభకు, అనుభవానికి తగిన దానిలో అవకాశం వచ్చేదాకా వేచి చూడు’’ ...ప్రణవి సలహా క్రమంగా రోజులు నెలలయ్యాయి.  అదృష్టం మాత్రం నా తలుపు తట్టలేదు.

నిరుద్యోగిగా ఒంటరి పోరాటం చేస్తున్న నాకు, ప్రణవిభారం కూడా మోయగలనన్న నమ్మకం కలగటంలేదు. ఆమెను ఇంట్లో నుంచి లేపుకుపోయి పెళ్లి చేసుకోలేను.

అలాగని మౌనంగా ఊరుకుంటే రేపు రాత్రికి ఆమె ఈ దేశం నుంచి ఎగిరిపోతుంది... తిరిగి నాకు దక్కుతుందన్న భరోసా లేదు.

మరెలా .. ఈ సమస్యను అధిగమించటం..  ’’ ఆలోచనలో పడ్డాను.

ప్రణవి సూటిగా అడిగింది.

‘‘బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా.. నీకు చావంటే భయమా?’’

‘‘ లేదు’’ అంటూ తల అడ్డంగా ఊపాను.

‘‘ అయితే నేను చెప్పేది విను.

రాత్రి 10.20 ప్రాంతంలో  ఎక్స్ ప్రెస్ ఈ దారిన వెళుతుంది. మనం వంతెన మీద నుంచి చూస్తే రైలు రాక కనపడుతుంది. సరిగ్గా వంతెన కిందకు రైలు వచ్చే సమయానికి పైనుంచి దూకేద్దాం. శరీరం ఆనవాళ్లు లేకుండా ఛిద్రమవుతుంది. అలాగే మన సమస్య కూడా... ’’ స్థిరనిశ్చయానికి వచ్చిన దానిలా చెప్పేసింది.

నాకు కూడా అభ్యంతరం చెప్పాలనిపించలేదు.

సమయం దగ్గర పడుతున్న కొద్దీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

‘‘ హలో... హలో.. ’’

మైక్ లో ఎవరో మాట్లాడుతున్నారు. సమావేశం ప్రారంభమైనట్టుంది. 

‘‘ ప్రణవిని కలవటానికి ఇంకా సమయం ఉంది. ఈ లోగా కాసేపు ఇక్కడే  గడిపితే మనసు కాస్త కుదుటపడుతుందేమో ’’ మరో  ఆలోచన చేయకుండా  లోపలకి నడిచాను.

----------------------------------------------------------

‘ ప్రకృతి  మనకెన్నో పాఠాలు చెబుతుంది. వాటిని గ్రహించే ఓపిక, తీరిక మనకి ఉండటంలేదు.’’  అతను మాట్లాడటం ప్రారంభించాడు.

రాలే ఆకు, వికసించే పువ్వు, గర్జించే మేఘం, మెరిసే మెరుపు , కరుగుతున్న కొవ్వొత్తి... ఇలా దేనితీసుకున్నా అది మనకు బోలెడు జీవితపాఠాలు చెబుతుంది.’’

‘‘ ఆయన రామస్వామి... ఈ క్లబ్ వ్యవస్థాపక ఛైర్మన్’’ పక్కనున్న వాళ్లెవరో చెప్పారు. 

ఈ వాతావరణం నాకు కూడా కొత్తగా  అనిపించింది. ప్రసంగాన్ని ఆసక్తిగా వినటం ప్రారంభించాను. 

‘‘ ఈ జీవితం శాశ్వతం కాదని... రాలే ఆకు ద్వారా తెలుసుకోవచ్చు.

జీవించేది ఒక్క రోజయినా .. గౌరవంగా జీవించమని వికసించే పువ్వు చెబుతుంది.

వర్షించే మేఘం... చేదును గ్రహించి మంచిని పంచమని చెబితే.. మెరిసే మెరుపు.. ఉండేది ఒక్క క్షణమయినా ఉజ్వలంగా ఉండమన్న
దేశాన్నిస్తుంది. 
ఇక కరిగే కొవ్వొత్తి అయితే... చివరి క్షణం వరకూ పరులకు సాయపడమని సూచన ఇస్తుంది. మనం ఈ నీతిని హిస్తున్నామా? జీవితం విలువను గ్రహిస్తున్నామా?’’

రామస్వామి గొంతు ఆ గదిలో  ఖంగుమంటోంది. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. ‘‘సృష్టిని నిద్రలేపటంలో కోడి.. పరుగులో గుర్రం... వినటంలో పిల్లి.. విశ్వాసంలో కుక్క.. సేవలో ఎద్దు.. నిరంతర శ్రమలో చీమ... నిశిత దృష్టిలో గద్ద... గానంలో కోకిల.. నాట్యంలో నెమలి.. పౌరుషంలో పొట్టేలు..సాహసంలో పులి... పరాక్రమంలో సింహం... ఆదర్శంగా నిలుస్తాయి.

వీటిని ఆలోచించే శక్తిలేకపోయినా తనదైన ప్రత్యేకతతో జీవిస్తాయి.

ఆలోచనాశక్తి ఉన్న మనిషి మాత్రం చిన్న ఓటమికి తల్లడిల్లుతున్నాడు. భావోద్వేగాలతో కుంగి పోతున్నాడు. ’’

పక్కనున్న గ్లాసందుకుని కొంచెం నీళ్లుతాగి మళ్లీ చెప్పాడు.

 ‘‘ నిజమే.

ఓటమి అవమానభారాన్ని పెంచుతుంది.

ఆత్మన్యూనత, ఆందోళన, భయం, దుఖం, నైరాశ్యం లాంటి  వాటికి కారణమవుతుంది. 

బతుకుపైన తీపిని చంపుతుంది.  కొన్నిసార్లు ఆత్మహత్యకు పురిగొల్పుతుంది కూడా. ’’

ఓ సారి చుట్టూతా పరికించి చూసి  మళ్లీ చెప్పటం కొనసాగించాడు రామస్వామి.

‘‘ప్రేమ వైఫల్యం,  కుటుంబ కలహాలు,  ఆర్థిక సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి, సమీప బంధువుల మరణం... ఇలా ఏదో ఒక అంశంలో జీవితం విసిరే సవాళ్లు  తట్టుకోలేని వేదనను మిగులుస్తున్నాయి.

మనం తప్ప ప్రపంచమంతా సుఖసంతోషాలతో మునిగి తేలుతుందనుకుంటాం. నిర్బంధ మరణాన్ని స్వాగతిస్తున్నాం. ’’ ఉలిక్కిపడ్డాను నేను.‘‘ ఇతను చెబుతున్నది నా గురించేనా?’’ అనుమానపడ్డాను.

‘‘పుట్టిన ప్రతి మనిషి చనిపోవలసిందే. కానీ మనకి మనమే మరణశాసనం లిఖించుకోవటం మాత్రం అవివేకం. సమస్య ఎంత తీవ్రమయినదయినా అది మనం ప్రాణం తీసుకునేటంత పెద్దది కాదు...  అది గ్రహించలేకపోతున్నాం.

కాయకష్టం చేసుకునే పేదవాళ్లే నయం. వాళ్లు అంత తేలిగ్గా ఆత్మహత్య చేసుకోరు.  చదువుకున్న వాళ్లలోనే ఇదంతా. ఆయనను చూడండి. తన ఆఫీసులో పనిచేసే కొలీగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను ఉద్యోగం కోసం  అమెరికా పంపాడు. కొన్నాళ్లకి ఆమె అతనితో సంబంధాలు తెంచుకుంది.  అక్కడ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అంతే.. ఊహించని ఈ పరిణామంతో అతను కంగుతిన్నాడు. ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఈ క్లబ్ చొరవ తీసుకోకపోయి ఉంటే మన  మధ్య అతన్ని చూడలేకపోయేవాళ్లం.

ఆయనే కాదు..

సినిమాలు, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయినవాళ్లు.. ఐదు పదులు దాటిన వయసులో హఠాత్తుగా ఉద్యోగం ఊడి కుటుంబం రోడ్డున పడటంతో భరించలేని వాళ్లు... చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభించక వేసారి పోయిన వాళ్లు... ఇలా ఈ గదిలో నాతో సహా  ఉన్న ప్రతి ఒక్కరూ... ఏదో ఒక సమస్య బారిన పడ్డవారే. ప్రాణాలు తీసుకోవాలనుకున్నవారే.  ఏదో అదృశ్య శక్తి చివర్లో మనల్ని కాపాడింది. అందుకే ఈ క్లబ్ ని ఏర్పాటు చేశాం. జీవితంలో ఓడిపోయిన వాళ్లమందరూ ఒక చోట అనుభవాలను కలబోసుకుంటున్నాం.

ఓటమి బాట నుంచి గెలుపు దారిలోకి జీవితాన్ని ఎలా మళ్లించుకున్నామో వివరంగా చెబుతున్నాం.  ఇంకెవరూ ప్రాణం తీసుకోకుండా చూస్తున్నాం...’’

ఫెయిల్యూర్ క్లబ్ అంటే ఏమిటో ఆ నిముషంలో నాకు అర్ధమయింది. రామస్వామి మాట్లాడుతుంటే ఆత్మీయమైన వ్యక్తి  కళ్లముందున్న కదులుతున్న అనుభూతి కలిగింది. ‘ పక్కవాడి జీవితంలోకి తొంగిచూస్తేగానీ... మనం ఎదుర్కొంటున్న సమస్య అంత తీవ్రమైనది కాదన్న విషయం అర్ధం కాదు.  ఇంకా వివరంగా చెప్పాలంటే..

చెప్పులు లేవే అని మనం బాధ పడుతున్నప్పుడు...అసలు కాళ్లే లేని వ్యక్తి కంటపడితే గానీ మనం ఎంత అదృష్టవంతులమో అర్ధం కాదు. ’’ చెప్పుకుపోతున్నాడు ఆయన. 

‘‘జీవితంలో సానుకూల దృక్పథం అవసరం. అది ఉన్నప్పుడు ఎంతటి క్లిష్టమైన సమస్య ఎదురయినా సులువుగా బయటపడగలుగుతాం. ఓటమి భయం దరిచేరదు. ఆత్మవిశ్వాసంతో సవాళ్లను అధిగమించగలుగుతాం.   గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర మత గ్రంధాలను తీసుకోండి. వాటిల్లో జీవిత సమస్యలకు పరిష్కార మార్గాలెన్నో కనిపిస్తాయి. డేల్ కార్నెగీ, విన్సెంట్ పీలే, వ్యాన్ డయ్యర్, ఆంథోని రాబిన్స్, స్టీఫెన్ కొవే, రాబిన్ శర్మ, జాక్ ఫీల్డ్, రాబర్ట్ ష్కుల్లర్, బాబ్ ప్రోక్టర్, జిగ్ జిగ్లర్ లాంటి విదేశీ రచయితలెందరో విజయసాధనకు, సంతృప్తికర జీవనానికి అవసరమైన దారులు చూపారు.  తెలుగులోనూ నిపుణులయిన రచయితలెందరో పుస్తకాలు అందించారు. అంతెందుకు.  తర్జాలంలో  వందలాది పేజీల సాహిత్యం అందుబాటులో ఉంది. ఇవన్నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోటానికి మనకు కొంతయినా సాయపడతాయి. ఆత్మహత్యకు కొద్దినిముషాలు వాయిదా వేసుకుంటే చాలు.. క్రమంగా ఆ భావననుంచి తేలిగ్గా బయటపడగలుతారు ఎవరయినా ’’ ప్రవాహంలా సాగుతోంది రామస్వామి ప్రసంగం. అది ఎప్పటికి ముగుస్తుందో తెలీదు.

నా మెదడులో  కదలిక... ఆలోచనలు కొత్త చివుళ్లు తొడుక్కుంటున్నాయి. ‘‘నేనూ, ప్రణవీ తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నామా?’’ నాలో ఏదో తెలియని సంఘర్షణ...ఇక అక్కడ ఉండాలనిపించింది.

 గబగబా బయటకొచ్చేశాను. 

------------------------------------------------------------

‘‘ రాత్రి ఏమై పోయావ్... మొబైల్ తీయలేదు. ఇక్కడికి రాలేదు’’  బుంగమూతి పెట్టి ప్రేమ, కోపం మిళితమైన స్వరంతో  అడిగింది ప్రణవి. ‘ ఈ వంతెన మీదే అర్ధరాత్రి వరకూ ఎదురుచూసి ఆటోలో ఇంటికెళ్లిపోయాను. నువ్వు నన్ను మోసం చేశావని రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయాను తెలుసా? ’’

అదేం పట్టించుకోనట్టుగా... ‘‘ మనం పెళ్లెప్పుడు చేసుకుందాం’’ అన్నాను ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ.

ఊహించని  నా  ప్రతిస్పందనకు ఆమె  ఆశ్చర్యపోయింది.

 ‘‘ ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావ్’’... అంది.

 నా మెహంలో ప్రసన్నత  ఆమెకు మింగుడుపడటంలేదనుకుంటా. 

‘‘ యాదగిరి గుట్ట వెళదామా? ’’ అన్నాను మళ్లీ. 

‘‘ దేనికి? ఇప్పుడా?’’ ..ప్రణవి అడిగింది.

‘‘ చెప్పాగా... పెళ్లి చేసుకుందాం’’ అన్నాను ఆమెను దగ్గరకు తీసుకుంటూ.

 తను ఇంకా ఏదో మాట్లాడబోతుంటే.. మధ్యలోనే అడ్డుకున్నాను.

నిన్నటి విషాదం గురించి నాకు తలుచుకోవాలనిపించలేదు. అందమైన భవిష్యత్తును కలలుగంటున్నాను.

మామూలుగా బతకటం కాదు..

అర్ధవంతంగా జీవించటం గురించి ఆలోచిస్తున్నాను. 

అందుకు మానసికంగా సిద్ధమయ్యాను కూడా.  ఆ విషయం ముందే ప్రణవికి చెప్పాలనిపించలేదు.గెలుపు ... తన చుట్టూ పొగిడే గుంపును  సృ ష్టించుకుంటే..

ఓటమి... తనను తాను తెలుసుకునేలా చేస్తుంది. ప్రయత్నిస్తే కొత్త జీవితానికి బాటలు పరుస్తుంది. ఫెయిల్యూర్ క్లబ్ లోకి అడుగుపెట్టి  నేను తెలుసుకున్న  జీవిత సత్యం ఇదే.. మనసులోనే  క్లబ్బుకు జోహార్లు అర్పించాను.  ఆ తర్వాత ...

అదే వంతెనపైన ఎన్నో అందమైన సాయంత్రాలు

మా మధ్య ఆహ్లాదంగా గడిచాయి. ఉద్యోగం, పెళ్లి, ఇద్దరు పిల్లలతో మా జీవితం  ఓ మంచి కథలా సాగిపోయింది.  

మరిన్ని కథలు
o pili manastapam