Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review
చిత్రం: కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ 
తారాగణం: నితిన్‌, యామీ గౌతమ్‌, అశుతోష్‌ రాణా, నాజర్‌, రవిప్రకాష్‌, హర్షవర్ధన్‌, సప్తగిరి, సురేఖా వాణి, వాసు ఇంటూరి తదితరులు. 
ఛాయాగ్రహణం: సత్య పోన్‌ మార్‌ 
సంగీతం: కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌, సందీప్‌ చౌతా (నేపథ్య సంగీతం) 
దర్శకత్వం: ప్రేమ్‌ సాయి 
నిర్మాణం: గురు ఫిలింస్‌, మల్టీ డైమన్షన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
సమర్పణ: గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ 
నిర్మాతలు: వెంకట్‌ సోమ సుందరం, రేష్మ ఘటాల, సునీత తాటి, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ 
విడుదల తేదీ: 17 సెప్టెంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
డిగ్రీ డిస్‌ కంటిన్యూ చేసిన కళ్యాణ్‌ (నితిన్‌) ఉద్యోగం వేటలో బిజీగా వుంటాడు. తన స్నేహితుడు రాజేష్‌కి బదులుగా ఓ సారి కొరియర్‌ కవర్‌ని డెలివరీ చేయడానికి వెళ్తాడు. అక్కడ పనిచేసే కావ్య (యామీ గౌతమ్‌)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు కళ్యాణ్‌. ఆమె కోసం కొరియర్‌ బాయ్‌గా కళ్యాణ్‌ అవతారమెత్తుతాడు. ఇదిలా ఉండగా ఓ సైంటిస్ట్‌, గర్బం దాల్చిన మహిళలకు అబార్షన్‌ అయ్యేలా చేసి, స్టెమ్‌సెల్‌ని సేకరించి, డబ్బున్న ధనికులకు ఇస్తుంటాడు. ఇదో పెద్ద మెడికల్‌ స్కామ్‌. ఇందులో చాలామంది డాక్టర్లను ఇన్వాల్వ్‌ చేస్తాడు ఆ సైంటిస్ట్‌. ఇది వార్డ్‌ బోయ్‌ మాణిక్యం (ఇంటూరి)కి తెలుస్తుంది. సంఘ సంస్కర్త అయిన సత్యమూర్తి (నాజర్‌)కి ఆసుపత్రుల్లో జరుగుతున్న మెడికల్‌ స్కామ్‌ గురించి వివరిస్తూ లెటర్‌నీ, అబార్షన్‌ కోసం వాడే టాబ్లెట్లనీ సాక్ష్యం కోసం కొరియర్‌లో పంపిస్తాడు. ఈలోగా విషయం తెలుసుకున్న స్కామ్‌ ముఠా మాణిక్యంను చంపేస్తుంది. ఇప్పుడా కొరియర్‌ని డెలివరీ కాకుండా చెయ్యడానికి మెడికల్‌ స్కామ్‌ ముఠా విశ్వ ప్రయత్నాలూ చేస్తుంది. ఆ కొరియర్‌ బాధ్యత తీసుకున్న కళ్యాణ్‌కి విషయం తెలిసిందా.? ఈ క్రమంలో కళ్యాణ్‌ ఎదుర్కొనే ఇబ్బందులేమిటి? మెడికల్‌ స్కామ్‌ని కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ ఎలా తుదముట్టించాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
సినిమా సినిమాకీ నటనలో ఈజ్‌ని మరింత పెంచుకుంటున్నాడు నితిన్‌. కంప్లీట్‌ మెచ్యూర్డ్‌ పెర్ఫామెన్స్‌ ఈ సినిమాలో నితిన్‌ ఇచ్చాడు. హీరోయిన్‌తో జోవియల్‌గా కన్పిస్తూ, సీరియస్‌ మూమెంట్స్‌లో ఎగ్రెసివ్‌గా కనిపిస్తూ హండ్రెడ్‌ పర్సెంట్‌ సూపర్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చిన నితిన్‌, నటుడిగా ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. ఫైట్లు, డాన్సుల్లో నితిన్‌ సూపర్బ్‌ అనిపించాడు. యామీ గౌతమ్‌ బాగానే చేసినా, ఆమెకు పెద్దగా ప్రాధాన్యత లేని సాదా సీదా పాత్ర దక్కింది. గ్లామర్‌ పరంగా, నటన పరంగా ఓకే అనిపించింది. సత్యం రాజేష్‌, హర్షవర్ధన్‌ కామెడీ పరంగా ఓకే అనిపిస్తారు. అశుతోష్‌ రాణా విలన్‌గా ఆకట్టుకున్నాడు. నాజర్‌ ఓకే. కథలో కీలకమైన వార్డ్‌ బాయ్‌ పాత్రలో వాసు ఇంటూరి బాగా చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. 

కొత్తదనం కోసం హీరో చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. పాయింట్‌ కొత్తదనంతో కూడుకున్నదే అయినా, దాన్ని ప్రెజెంట్‌ చేసే విధానంలో దర్శకుడు పూర్తిగా వర్క్‌ చేయలేదనిపిస్తుంది. సినిమా అసలు ప్లాట్‌ సెకెండాఫ్‌లోనే వేగం పుంజుకుంటుంది. తద్వారా ఫస్టాఫ్‌ పాసివ్‌గా మారిందనిపిస్తుంది. కథ, కథనం విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. పాటలు ఓకే, మాటలూ బాగానే వున్నాయి. ఎడిటింగ్‌ ఇంకా బాగా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైన మేర ఉపయోగపడ్డాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. 

ఫస్టాఫ్‌లో లవ్‌, కామెడీతో సోసోగా నడిచిపోతుంది. అక్కడక్కడా ఆకట్టుకున్నా, అసలు కథ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది ఆడియన్స్‌కి. సెకెండాఫ్‌లో సినిమా మంచి మూడ్‌లోకి వెళుతుంది. అక్కడ కూడా కొన్ని అనవసరమైన సన్నివేవాలు సినిమాని ఇబ్బంది పెడతాయి. సెకెండాఫ్‌ వేగం పెరిగినా, అప్పటికే క్రియేట్‌ అయిన డల్‌ మూడ్‌ సినిమాలో ఏదో వెలితి వుందన్న విషయాన్ని ప్రేక్షకుడికి గుర్తు చేస్తుంది. లవ్‌ స్టోరీ ఇంకాస్త ఆకట్టుకునేలా ఉండి ఉంటే ఖచ్చితంగా సినిమాకి కలిసొచ్చేది. చెప్పాలనుకున్న పాయింట్‌ బాగానే ఉన్నా, దాని చుట్టూ అనుకున్న కథ, సీన్స్‌ విషయంలో సగటు ప్రేక్షకుడిని దర్శకుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది. సినిమా విడుదల పలుమార్లు ఆలస్యం కావడంతో, సినిమాపై అప్పటికే క్రియేట్‌ అయిన హైప్‌ తగ్గడం కూడా మైనస్‌ పాయింట్‌. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
కొరియర్‌ బాయ్‌ లేట్‌ మాత్రమే కాదు డల్‌ కూడా 

అంకెల్లో చెప్పాలంటే 
2.75/5
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka