Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగిన కథ: సహస్ర నిర్ధాక్షిణ్యంగా ఎట్టయప్ప రెండు చేతుల్ని మణికట్టు వద్దకి నరికేస్తుంది. ఎట్టయప్ప వేసిన భయంకరమైన గావు కేకతో ఆ ప్రాంతం మారు మోగుతుంది. ఆ సంఘటన చూసి గొల్లున అరుస్తారు ఎట్టయప్ప మనుషులు.చేతులు నరికిన మరు క్షణమే గిరుక్కున తిరిగి దీక్ష నోటికి అంటించిన టేప్‌ని లాగేస్తుంది సహస్ర.  ఆ తరువాత...  

     

‘‘ఎంత?’’

‘‘మాకేం పెద్ద ఆశ లేదులే. నా ప్రియురాల్ని పట్టిస్తే కోటి అని ప్రకటనిచ్చావ్‌గా.... అదప్పటి నీ మాట. మూడు కోట్లిచ్చి ప్రియురాల్ని విడిపించుకెళ్ళు. ఇదిప్పటి మా మాట. రాత్రికి ఫోన్‌ చేస్తాను. సహస్రతో మాటాడి నమ్మకం కుదిరాకే నువ్వు డబ్బు రెడీ చెయ్యి. ఎక్స్ చేంజి ఎప్పుడు ఎక్కడ ఎలాగో రేపు చెప్తాను’’ అంటూ మరో మాటకి అవకాశం యివ్వకుండా లైన్‌ కట్‌ చేయటమే కాదు. స్విచ్ఛాప్‌ చేసేసాడు అవతల.

విరాట్‌ అయోమయంగా చూసాడు అందరి వంక.

‘‘ఏమైందిరా కిడ్నాపేంటి? ఎవరు వాళ్ళు?’’ అనడిగాడు పక్కనే వున్న ధర్మ.

‘‘అదే అర్థమై చావట్లేదురా. అంతా గందరగోళంగా వుంది’’ అంటూ అవతలి వాడేం చెప్పిందీ వివరించాడు విరాట్‌.

అంతా విని మునుసామి దీర్ఘంగా ఆలోచిస్తూ ‘‘ఫోన్‌లో ఆటో శబ్దం వినన్పించిందన్నావ్‌ కదూ?’’ అనడిగాడు.

‘‘అవును వాళ్ళింకా సహస్రతో ఆటోలో ప్రయాణిస్తున్నారు. నాకెందుకో ఇది మరో నాటకం అన్పిస్తుంది’’ అన్నాడు విరాట్‌.

‘‘లేదు. దీనికీ త్యాగరాజన్‌ మనుషులకీ సంబంధం లేదు.’’ అన్నాడు స్ధిరంగా మునుసామి.

‘‘ఎలా? మనకెలా తెలుస్తుంది. సంబంధం లేదని?’’ అనడిగాడు కదిరేషన్‌.

‘‘కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండ్రా. వాళ్ళు సహస్రని ఆటోలో కిడ్నాప్‌ చేస్తున్నారు. జగన్మోహన్‌ మనుషులకి వాహనాలున్నాయి. ఆటోల్లో తిరగరు. రెండోది మాట్లాడిన వాడి గొంతును బట్టి ఇరవైకి కాస్త అటు యిటు వయసుంటుందని విరాట్‌ చెప్తున్నాడు. అంత చిన్న కుర్ర వెధవలెవరూ ఎట్టయప్ప వద్ద లేరు. కాబట్టి అమ్మాయి గురించి మనం భయపడాల్సింది లేదు. కిడ్నాప్‌ జరిగింది నిజం.’’

‘‘వీళ్ళు మాత్రం సహస్రని ఆటోలో ఎలా తీసుకెళ్తారు....? దారిలో ఎవరన్నా సహస్రను గుర్తు పడితే తాట తీస్తారని భయముండదా?’’ అనడిగాడు మరొకడు.

‘‘ఏ దుప్పటో ముసుగేసి పేషంట్‌ లా తీసుకెళ్తే ఎవడు గుర్తు పట్టేది. వాళ్ళేమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు.’’ చెప్పాడు మునుసామి.

ఇంతలో... వెళ్ళిన నలుగురూ దీక్ష స్కూటీని చెట్ల వెనక వెదికి పట్టుకొని అక్కడికి తీసుకొచ్చారు.

అప్పటికి మధ్యాహ్నం...

ఒంటి గంట కావస్తోంది సమయం...

కాని వారికీ ఆకలి దప్పులు లేవు.

తీవ్రంగా ఆలోచిస్తూ మౌనంగా వున్నాడు విరాట్‌. ఎవరికి వాళ్ళు కాస్సేపు నిశ్శబ్ధంగా ఉండిపోయారు. దీక్ష మాత్రం మోకాళ్ళ మధ్య ముఖం దాచుకొని ఏడుస్తూనే ఉంది. ఉన్నట్టుండి లేచి దీక్ష పక్కకెళ్ళి కూచున్నాడు విరాట్‌.

‘‘దీక్షా! నువ్విలా ఏడ్చినందువల్ల లాభం ఏమన్నా వుందా? అయిందేదో అయింది. సహస్ర క్షేమంగా ఉంది. కాదంటే కిడ్నాపర్స్‌ చేతిలో వుంది. అడిగిన డబ్బిచ్చి తీసుకొచ్చేద్దాం. ఏడవకు’’ అన్నాడు.

‘‘సారీ అన్నయ్యా ఇదంతా నావల్లే. సహస్ర ఎంత చెప్పినా వినకుండా వచ్చి మీ కష్టాలకి కారణమయ్యాను.’’ ఆమెకు అనేక విధాల నచ్చచెప్పి ఓదార్చాడు విరాట్‌.

‘‘ఇప్పుడేం చేద్దాం చిన బాబు వెనక్కి వెళ్ళిపోదామా?’’ అడిగాడు మునుసామి.

‘‘ముందు దీక్షను సేఫ్‌ గా ఇంటికి పంపించేయాలి’’ అన్నాడు విరాట్‌.

‘‘ఏం తల్లీ నీ స్కూటీలో ఇంటికెళ్ళిపోగలవా?’’ అనడిగాడు మునుసామి.

‘‘నా వల్ల కాదు. స్కూటీ నడప లేను. సమయానికి సహస్ర అడ్డు పడకుంటే ఎట్టయ్యప్ప చేతిలో అప్పుడే నా తల తెగి పడుండేది. ఇప్పటికీ నాకు గుండె దడ కాళ్ళు వణుకు తగ్గ లేదు.’’ అంటూ సహస్ర వచ్చినప్పట్నుంచి తను రోడ్‌ వెంట పరుగెత్తే వరకు, తను చూసిన సంఘటనలు సహస్ర పోరాటం గురించి దీక్ష వివరిస్తుంటే అంతా విభ్రాంతి చెందారు. ముఖ్యంగా సహస్ర ఎట్టయ్యప్ప చేతుల్ని మణికట్టు వద్దకి నరికేసిందని తెలిసి అచ్చెరువొందారు.

అప్పటికప్పుడు కదిరేషన్‌ మనుషుల్లో ఒకడ్ని స్కూటీ నడపమని చెప్పి దీక్షను వెనక కూచోమని ఇంటికి పంపించేసారు. పంపించే ముందు ఈ విషయాన్ని చందూకి ఫోన్‌ చేసి ఇప్పుడే చెప్పక ఆఫీసు నుంచి వచ్చే లోపలే మేం కాలనీకి వచ్చేస్తాం అలాగే విశాలకీ ఏమీ చెప్పకు తెలిసిందంటే పనులన్నీ మానుకొని వచ్చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. సహస్ర క్షేమంగా వస్తుంది. అంటూ హెచ్చరించాడు విరాట్‌. అలాగే కదిరేషన్‌ మనిషితో నువ్వు దీక్ష ఇంటి దగ్గరే మీ వాడితో ఉండిపో. మన లోన గదిలో బంధించిన కుర్రాడితో ఇక పని లేదు. వాడ్ని వదిలేయండి’’ అన్నాడు.

స్కూటీ వెళ్లిపోగానే..

మునుసామి వంక చూసాడు విరాట్‌.

‘‘ఈ అనర్ధం మొత్తానికి కారణం ఎవరు గురువు గారూ?’’ అనడిగాడు.

‘‘ఇంకెవరు చినబాబు. దీక్షేగా....... ఆ పిల్ల బయటకు రాకుండా ఇంట్లో ఉంటే ఇదంతా జరిగేది కాదుగా’’ చెప్పాడు మునుసామి.

కాదన్నట్టు తల అడ్డంగా వూపాడు విరాట్‌.

‘‘మీరు కూడ పారబాటు పడుతున్నారు చూసారా? అసలు ఆ త్యాగరాజన్‌ సహస్రను చంపించటం కోసం ఇలాంటి నీచమైన స్కెచ్‌ వేసి మనుషుల్ని పంపించక పోతే సమస్యలు వచ్చేవి కాదు గదా. మధ్యలో వచ్చి ఎవరో సహస్రను కిడ్నాప్‌ చేయరు గదా.’’

‘‘ఆ మాట నిజమే అనుకో కాని పందిని బురదలో దొర్లాకుండా ఆపగలమా? త్యాగరాజన్‌ వెధవని మనకు తెలుసు. అవునా?

‘‘అందుకే... జరిగిందానికి వాడేం సమాధానం చెప్తాడో తెలుసుకోవాలనుంది.’’

‘‘అంటే నీ ఉద్దేశం? వెళ్ళి ఇరవై ఏడో నెంబర్‌  ఇంటి మీద పడదామా?’’

ఇప్పుడు ధర్మ కల్పించుకుంటూ పడ్డం కాదు అంకుల్‌ విరాట్‌ ఉద్దేశం. ఓసారి మన సత్తా ఏమిటో రుచి చూపిస్తే గాని వాడి తిక్క తీరదు. లేక పోతే మళ్ళి మళ్ళీ వెధవ ప్లాన్లు వేసి సహస్ర ప్రాణం తీయాలని చూస్తాడు’’ అంటూ వివరించాడు.

‘‘మనం తొందర పడుతున్నామేమో....పట్ట పగలు దాడి చేస్తే తర్వాత పోలీస్‌ కేసులు గొడవలు...’’ గుర్తు చేసాడు కదిరేషన్‌.

‘‘ఆ భయమక్కర్లేదు. పోలీస్‌ కేసు పెడితే ఉచ్చు తనకే బిగుస్తుందని వాడికి తెలుసు. ఇపుడు సహస్రను చంపాలని చేసిన కుట్ర మొత్తం బయట పడుతుంది. గాబట్టి అలాంటి పిచ్చి పని చేయడు’’ అన్నాడు విరాట్‌.

‘‘అయితే ఆలస్యమెందుకు? బయల్దేరండి’’ అంటూ లేచాడు మునుసామి. అంతే...

మరో మూడు నిముషాల్లో బయలుదేరిన విరాట్‌ బృందం వాహనాలు కీల్పాకం వైపు శర వేగంతో పరుగు  ఆరంభించాయి.

ఈ                   ఈ              ఈ


కీల్పాక్కం...

ఇరవై ఏడో నంబరు యిల్లు...

ప్రస్తుతం ఆ భవంతిలో చాల మంది గుండాలున్నారు. అయినా అది చాలా నిశ్శబ్దంగా గంభీరంగా కన్పిస్తోంది. ఉదయం నుంచీ త్యాగరాజన్‌ ఎక్కడికీ వెళ్ళ లేదు. దీక్షను బంధించిన విషయం తెలీగానే సహస్ర చావు కబురు కోసం ఎదురు చూస్తూ మేడ మీద తన ప్లాట్‌ లోనే వున్నాడు.

ఎట్టయప్ప వెంట పాండ్యన్‌ తో బాటు ఆరుగురు హర్యానా షూటర్లు, పాతిక మంది తమ మనుషులు వున్నారు. తన స్కెచ్‌ కి డోకా లేదు. సహస్ర అంతమైన శుభవార్త తెలుస్తోందని కొండంత ఆశగా ఎదురు చూస్తుండగా సహస్ర తప్పించుకున్న వార్త పిడుగు పాటులా తెలిసింది.

దీక్షను క్షేమంగా విడిపించుకుంది. ఎట్టయప్ప చేతులు నరికేసింది. పాము విసిరి ఒకడ్ని చంపింది. షూటర్స్‌ లో ఇద్దరితో సహా పన్నెండు మంది దారుణమైన గాయాల పాలయ్యారు. ఇంతా చేసి సహస్ర నిక్షేపంగా పారిపోయింది. వాళ్ళందర్ని ఆస్పత్రిలో చేర్పించి రాబోతున్నాడు పాండ్యన్‌. వాళ్ళింకా రాలేదు.

తన పథకం మట్టి కొట్టుకు పోయి ఈసారి కూడ ఓడి పోడంతో కోపం, అశాంతి, అసహనంతో మగ్గి పోతూ ప్లాట్‌ లో మందు కొడుతూ కూచున్నాడు. కింది అంతస్థులో లోకల్‌గా రిక్రూట్‌ చేసిన గుండాలు నలభై మంది వరకు వున్నారు. వాళ్ళలో ఎవడికీ త్యాగరాజన్ని సమీపించటానికి ధైర్యం చాలటం లేదు.

ఇక్కడ త్యాగరాజన్‌ కి తెలీని విషయం తను కీల్పాక్కంలో వున్న సంగతి ఎవరికీ తెలీదనుకొంటున్నాడు. విరాట్‌ వర్గానికి ఈ అడ్రసు తెలుసన్నసంగతి తెలిస్తే బహుశ అంత తీరిగ్గా అక్కడ ఉండేవాడు కాదేమో.

సరిగ్గా ఒంటి గంటా నలభై నిముషాలు అవుతుండగా విరాట్‌ బృందం దాడి ఆరంభమైంది.

రెండు వేన్‌లు మినీ బస్సు రివ్వున దూసుకొచ్చి దుమ్ము తెరలు రేపుతూ గేటు బయట ఆగాయి. అవి ఆగీ ఆగక ముందే బయటకు దూకేసారంతా.

లోపలి వాళ్ళు ఎవరూ వూహించని సంఘనట ఇది. పైగా వచ్చినది తమ వాహనాలనుకొని వాళ్ళెవరూ అలర్ట్‌గా లేరు. ఒక్క సారిగా లోనకు దూసుకొస్తున్న గుంపును చూసి కంగారు పడి ఆయుధాలు అందుకునే లోపలే విరాట్‌ వర్గం సునామిలా విరుచుకు పడ్డారు వాళ్ల మీద. దొరికిన వాడ్ని దొరికినట్టు విరగ దీయ నారంభించారు. అసలేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడ వదల్లేదు. ఈ లోపల విరాట్‌ మెట్ల దారి వెంట వేగంగా పైకి పరుగెత్తాడు.

తన ప్లాట్‌లో వున్న త్యాగరాజన్‌...

దిగువ నుంచి అరుపులు కేకలు విన్పించటంతో ఒక్క సారిగా అదిరి పడ్డాడు. ఎవరైనా గాని తన అడ్డా మీద దాడి చేసిన వాళ్ళని ప్రాణాలతో వదల కూడదని రివాల్వర్‌ అందుకొని వేగంగా కిందకు పరుగెత్తుకొచ్చాడు. దాంతో మొదట అంతస్థు దాటకుండానే విరాట్‌ త్యాగరాజన్‌ మెట్ల పైన ఒకరి కొకరు ఎదురు పడి పోయారు. అటు త్యాగరాజన్‌ ఇటు విరాట్‌ కూడ ఒకేసారి ఒకరి కొకరు రివాల్వర్లు గురి చేసుకున్నారు. నిజానికి విరాట్‌కి రివాల్వర్‌ లేదు. ఆ రోజు ధనగిరి మనిషి నుంచి వశ పర్చుకున్న రివాల్వర్‌ని జాగ్రత్త చేసాడు. దీక్ష కిడ్నాపయిన విషయం తెలీగానే ఎందుకైనా మంచిదని దాన్ని లోడ్‌ చేసి వెంట తెచ్చాడు. అది ఇక్కడ ఉపయోగ పడింది.

విరాట్‌ కి మూడు మెట్ల పైన త్యాగరాజన్‌ వున్నాడు.

ఇద్దరిలో ఒక్కరూ రివాల్వర్‌ దించ లేదు.

దిగువున హాల్లోను, బయట కూడ హోరా హోరీగా సాగుతున్న పోరాటం చూస్తుంటే త్యాగ రాజన్‌కి మతిలేదు. వచ్చిన వాళ్ళు తన మనుషుల్ని చితగొట్టేస్తున్నారు. తరిమి తరిమి కొడుతున్నారు. తన స్థావరం వీళ్ళకెలా తెలిసిందో బుర్ర చించుకొన్నా అర్ధం గావటం లేదు.

‘‘ఏమిటాలోచిస్తావ్‌ కాలుస్తావా? కాల్చు..... రివాల్వర్‌ మీద నీ వేలు కదిలిందంటే నాకన్నాముందు నువ్వు ఛస్తావ్‌ చావుకు సిద్ధమేనా?’’ అరిచాడు విరాట్‌.

‘‘ఎవరూ ఎవర్ని చంపక్కర్లేదు పో.............. నీ మనుషుల్ని తీసుకొని వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపో. లేదంటే కాల్చేస్తాను’’ హెచ్చరించాడు త్యాగరాజన్‌.

‘‘ఎలా వెళ్తాను?......... మర్యాదగా సహస్రను అప్పగించు’’ వెళ్ళిపోతాను.

‘‘యుమీన్‌............. జర్నలిస్ట్‌ లహరి?’’

‘‘అవును’’

‘‘నాకేం తెలుసు? ఎక్కడికొచ్చి ఏమడుగుతున్నావో అర్ధమవుతోందా?’’ అరిచాడు త్యాగరాజన్‌.

విరాట్‌ కోపం హద్దులు దాటి పోయింది.

‘‘ఎవరితో మాటాడుతున్నావో తెలిసే మాటాడుతున్నావా? నీకేం తెలీదా? ఎట్టయప్ప ఎవడి మనిషిరా’’ అంటూ మెట్లపై నుంచే ఎగిరి పైన నిలబడున్న త్యాగరాజన్‌ కాళ్ళ మీద తన్నాడు. వూహించని విరాట్‌ అటాక్‌తో బాలన్స్‌ తప్పి కెవ్వున అరుస్తూ వెనక్కి విరుచుకు పడి పోయాడు త్యాగరాజన్‌. చేతిలో రివాల్వర్‌ ఎగిరి అవతల పడింది. గాభరాతో రివాల్వర్‌ ని చేజిక్కించుకోవాలని అటు దొర్లాడు. కాని అంతకు ముందే  గెంతుతూ మెట్ల పైకి వచ్చేసిన విరాట్‌ ఆ రివాల్వర్‌ని కూడ స్వాధీనం చేసుకున్నాడు.

‘‘లేరా.......... పైకి లే’’ కరుగ్గా హెచ్చరించాడు.

‘‘లేవక పోతే ఏం చేస్తావ్‌? ఎవడ్రా నువ్వు? చంపేస్తావా? నన్ను చంపేస్తావా? మా తాత మాజీ సియం. మాది బలమైన ప్రతిపక్ష పార్టీ. మా డాడీ సెంట్రల్‌ మినిస్టర్‌. నా వెనక పార్టీ కేడర్‌ వుంది.’’

త్యాగ రాజన్‌ మాటలు పూర్తి కాక ముందే...

విరాట్‌ చేతిలోని రివాల్వర్లు రెండూ ధన్‌ ధన్‌ మంటూ ఘర్జించాయి. అదిరి పడి కాళ్ళు వెనక్కి తీసుకొని లేచి నిలబడ్డాడు త్యాగరాజన్‌.

‘‘పద.......... మనం సెటిల్‌ చేసుకోవాల్సిన విషయాలు చాల వున్నాయి. ఇప్పుడు నిన్ను చంపటానికి ఒక్క బుల్లెట్‌ చాలు. నువ్వు ఛస్తుంటే నీ మాజీ సియం తాత గాని, ఢల్లీి లోని కేంద్ర మంత్రి నీ బాబు గాని, మీ పార్టీ కేడర్‌ గాని, నువ్వు కూడబెట్టిన ఆ పార ధన వాశి గాని ఏదీ నిన్ను కాపాడలేదు. ప్రాణాలు దక్కాలంటే చెప్పినట్టు విను పద’’ అంటూ హెచ్చరించాడు విరాట్‌.

ఇద్దరూ మేడ పైకి వచ్చారు.

ఓపెన్‌ టెర్రస్‌లో తను సోఫా మీద కూచొని ఎదురుగా త్యాగ రాజన్‌ ని కూచోమన్నాడు విరాట్‌.

‘‘చెప్పు నా సహస్ర ఎక్కడ? ఏం చేసావ్‌?’’ అడిగాడు.

‘‘మా దగ్గర లేదు’’ అన్నాడు ఆశ్చర్య పోతూ త్యాగ రాజన్‌.

‘‘వేరెక్కడుంది?’’

‘‘మా దగ్గర లేదంటున్నాగా. ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది. మా వాళ్ళ రిపోర్ట్‌  ప్రకారం తప్పించుకు పారి పోయింది. అంతే.’’

‘‘అంతే అంటే? పారి పోతే నా వద్దకి రావాలిగా. ఇంత వరకు రాలేదు. ఖచ్చితంగా మీ వాళ్ళే ఏదో చేసుండాలి.’’

‘‘చేయడానికి ఏముందిక్కడ? ఒకడి మీద పామును విసిరి చంపింది. ఇద్దరు షూటర్స్‌ భుజాలు చేతులు చచ్చు బడిపోయాయి. ఎట్టయప్పని చేతులు నరికేసింది. పది మందిని దారుణంగా గాయ పరిచి తప్పించుకు పోయింది. ఎట్టయప్పనే కాల్చేసాక నీ సహస్రని ఎవరేం చేయగలరు? ఆ పిల్ల సాధారణ యువతి కాదు. రణ చండి. పాతిక మంది కొమ్ములు తిరిగిన మగాళ్ళనే చావు దెబ్బ కొట్టి తన స్నేహితురాల్ని విడిపించుకు పోయింది. మెచ్చుకోవాలి. అలాంటి అమ్మాయిని మెచ్చుకోవాల్సిందే. కాని తను నా శతృవు. మెచ్చుకోలేను. ఆ పిల్ల మా దగ్గర లేదని మాత్రమే చెప్ప గలను. వాళ్ళందర్ని ఆస్పత్రిలో చేర్చి పాండ్యన్‌ మిగిలిన వాళ్ళు కాస్సేట్లో ఇక్కడికి వస్తారు. కావాలంటే వాళ్ళని అడుగు’’ జరిగింది చెప్తారు.

‘‘సో......... తను పారి పోయింది నిజమంటావ్‌’’

‘‘అదేగా చెప్తున్నాను’’

‘‘సో......... వాట్‌ నెక్ట్స్‌?’’

‘‘అంటే......... ఇంకా ఏం చెప్పాలి?’’

‘‘రెండు సార్లు తనను చంపాలని ప్లాన్‌ వేసి ఫెయిలయ్యావ్‌ గదా. ఈ సారి ఏం చేయాలనుకుంటున్నావ్‌?  ఇంకో ఇరవై రోజులే వుంది. సైదా పేట కోర్టు కి తనూ వెళ్ళాలి, నువ్వూ వెళ్ళాలి. ఈ లోపలే సహస్రను చంపటం నీ లక్ష్యం...... మూడో ప్రయత్నం ఏమిటి? ఎలా చంపిస్తావ్‌?’’

ఒకింత ఆలోచించాడు త్యాగరాజన్‌.

‘‘ప్రస్తుతానికి నాదగ్గర ఎలాంటి ప్లాను లేదు. ఆ అమ్మాయిని చంపాలని కూడ అనుకోడం లేదు. కండ బలంకన్నా బుద్ది గొప్పది కదా. ఆ బలాన్ని జయించలేనప్పుడు ఓటమి భరించి మిన్నకుండటం మంచిది. కాబట్టి ఇంకోసారి ప్రయత్నించాలనుకోడం లేదు. కాని....... చెప్పలేను. నా బుద్దిబలం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఇవాళకి ఆలోచనలు లేవు, ఉండక పోవచ్చు. బుద్ది, కర్మానుసారిణి అన్నారిందుకే. కాబట్టి నీ సహస్ర మా చేతిలో చావకుండా మీ జాగ్రత్తలో మీరుండటం మంచిది’’ అన్నాడు.

‘‘ఒకె....... చివరిగా ఓప్రశ్న అడుగుతున్నాను చెప్పు. ఇది టివి ఇంటర్వూ కాదు. ప్రజల్ని ఏమార్చినట్టు నన్ను నమ్మించలేవు’’ అన్నాడు విరాట్‌.

‘‘జనం? ....’’ అంటూ ఫక్కున నవ్వాడు త్యాగరాజన్‌.

‘‘జనం గురించి వదిలేయ్‌. గొర్రెల మంద’’ అన్నాడు నవ్వుకుంటూ.

‘‘తప్పు.  ప్రజల్ని తేలిగ్గా తీసేయకు. జనాన్ని మీరు గొర్రెల మంద అనుకొంటే ఆ మందను కాచే ఏసు క్రీస్తు దేవుడయ్యాడు. గొర్రెల మంద లాంటి జనాన్ని పరిపాలిస్తున్న మీ నాయకులెందుకు దేవుళ్ళు కాలేక పోతున్నారు?’’

‘‘మాటలతో మెలిక పెట్టాలని చూడకు మిస్టర్‌ విరాట్‌. ఉపమానాలు నాకు వచ్చు. గోవుల్ని కాచి గోపాలుడు దేవుడయ్యాడు. గొర్రెల్నికాచి క్రీస్తు దేవుడయ్యాడు. రాక్షసుల్ని చంపిన రాముడూ దేవుడయ్యాడు. నరాధముల్ని వధించి పరశు రాముడూ దేవుడయ్యాడు. అయితే ఏమిటి? మానవుడు ఆశా జీవి. ఆశకు అంతు లేదు. అదృష్టం కలిసొచ్చి అవకాశాలు వచ్చినప్పుడే అందినంతా దోచుకోవాలి. నేను చేస్తోంది అదే. ఇప్పుడు గొప్పగా నీతులు చెప్పే బుద్ధిమంతుడు కూడ తన వంతు వస్తే నా లాగే చేస్తాడు.’’

‘‘ఒకె నిన్ను చూస్తుంటే ఇప్పటికిప్పుడే చితగొట్టి చంపేయాలనిపిస్తోంది. కాని వయసులో పెద్ద వాడివని ఆ పని చేయలేక వెళ్ళి పోతున్నా. కాని సహస్ర తిరిగి రాలేదంటే మాత్రం మళ్ళీ వచ్చి నిన్ను చంపేస్తాను. గుర్తుంచుకో’’ అంటూ చర చరా మెట్ల దారి వైపు కదిలాడు. కిందకు పో బోతూ ఆగి తిరిగి చూసాడు.

‘‘పిచ్చి ముదిరితే ప్రమాదమన్న సంగతి నీకు తెలీంది కాదు. లోకంలో ఏ పిచ్చికైనా మందుంది గాని నీలాంటి డబ్బు పిచ్చికి మందు లేదు. భూ కుంభకోణాలతో పుచ్చి పోయావ్‌. నీకు మరుజన్మంటూ వుంటే ఖచ్ఛితంగా ఆ భూమి పైనే కుమ్మరి పురుగై పుట్టి మట్టి తిని బతుకుతావ్‌’’ అని చెప్పి చర చరా కిందికొచ్చేసాడు.

అప్పటికింకా దిగువన...

ఇరు వర్గాల మధ్యన హోరా హోరీగా కొసాగుతూనే వుంది పోరు. కాని విరాట్‌ వర్గానికే పై చేయిగా వుంది. అక్కడున్న గుండాలకు సరైన నాయకుడంటూ లేక పోడంతో వాళ్ళంతా ఆత్మ రక్షణలో పడి పోయారు. దిగువన హాలు బయట ఎటు చూసినా అరుపులు కేకలతో దొమ్మి కొనసాగుతూనే వుంది.

ఒక పక్క కర్రను విష్ణు చక్రంలా తిప్పుతూ మునుసామి వీర విహారం చేస్తున్నాడు. మరో పక్క క్రికెట్‌ బేట్‌తో విజృంబించి ఫైట్‌ చేస్తున్నాడు కదిరేషన్‌. ఇక ధర్మ అయితే దృఢమైన రెండు కర్ర ముక్కల్ని పుచ్చుకొని చెలరేగి పోతున్నాడు. చేతిలో ఇనప రాడ్‌ తో దొరికిన వాడి తాట తీస్తున్నాడు బండ శివ.

ధర్మతో బాటు మిత్ర బృందం సామాన్యమైందేమీ కాదు. వాళ్ళంతా విరాట్‌ తో బాటు ఒకే స్కూల్లో మార్షల్‌  విద్యలు అభ్యసించిన వాళ్ళు. వాళ్ళని ఆప గల సత్తా దమ్మూ గల మొనగాడెవడూ ఆ లోకల్‌ గుండాల్లో లేరు. దాంతో అంతా కలిసి వాళ్ళని దుమ్ము దులిపేస్తున్నారు. ఈ లోపల ఆస్పత్రి నుంచి తమ వేన్‌ లలో తిరిగి వచ్చిన పాండ్యన్‌ బృందం అడ్డాలో పరిస్థితి గమనించి ఆగకుండా అటు నుంచి అటే అక్కడికి దూరంగా వెళ్ళిపోయారు.

విరాట్‌ కిందికొచ్చే సరికి అప్పటికే చావు దెబ్బలు తిని ఒక్కొక్కడు పోరాటం నుంచి తప్పుకొని పారి పోవటం మొదలైంది. పట్ట పగలు వీధిలో జనం ఎక్కడి వాళ్ళక్కడ నిలబడి పోయి భయ బ్రాంతులతో చూస్తున్నారు. అసలా యిల్లు ఎవరిదో అంతమంది గుండాలు అక్కడ ఎందుకున్నారో, దాడి చేస్తున్న మనుషులెవరో ఏదీ జనాలకు తెలీదు.

విరాట్‌ కిందికొచ్చిన అయిదు నిముషాల్లోనే ఆ పోరాటం ముగిసింది. ఇంచు మించు అంతా పారిపోగా ఆర్త నాదాలు చేస్తున్నారు. వాళ్ళని అంతటితో విడిచి పెట్టి వెను తిరిగారంతా. ఎంత వేగంతో వచ్చాయో, అంతకు మించిన వేగంతో విరాట్‌ వర్గాన్ని తీసుకొని ఆ ప్రాంతం వదలి వెళ్ళి పోయాయి వారి వాహనాలు. వాటి వెనకే విరాట్‌ తన బైక్‌ మీద అనుసరించి వెళ్ళిపోయాడు.

విరాట్‌ వర్గం వెళ్ళి పోయిన పది నిముషాల తర్వాత పాండ్యన్‌ తిరిగి అక్కడికొచ్చాడు అప్పటికే త్యాగరాజన్‌ అడ్డా వదలి వెళ్ళి పోడానికి కిందికొచ్చేసాడు. ఎవరి మీదా కోప్పడ లేదు. పాండ్యన్‌ రిపోర్ట్‌ నీ వినలేదు. సింపుల్‌గా నేను వెళ్తున్నాను. రాత్రికి ఈ చోటు కాళీ చేసి అంతా మన వేలచ్చేరి లోని ఇంటికొచ్చేయండి. ఎవరన్నా అడిగితే నేనిక్కడ లేనని చెప్పండి అని చెప్పి కార్లో వెళ్ళి పోయాడు.

అంతే...

ఆ రోజు రాత్రికి రాత్రే...

త్యాగరాజన్‌ అడ్డా కీల్పాక్క నుంచి వేలచ్చేరి లోని ఇంటికి మార్చి వేయ బడింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika