Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ



జరిగిన కథ: సిద్ధార్ద , తేజాలు కలిసి సినిమాకెళ్దామని ప్లాన్ చేస్తారు.. వాళ్ళిద్దరితోపాటు ప్రతిమకు కూడా ఒక టికెట్ తీసుకోమంటాడు సిద్ధార్ధ. ఆ తరువాత.. 


ప్రోగ్రామ్‌కి అతడిని ఆహ్వానిస్తూనే` ‘‘మీ ఫ్రెండ్‌ చానెల్‌ రిపోర్టర్‌ ని ఈ ప్రోగ్రామ్‌ కి రమ్మనండి’’ రిక్వెస్ట్‌ చేసింది.

‘‘ప్రోగ్రామ్‌ కవర్‌ చేయాలంటే...మీరు పిలిస్తేనే బాగుంటుంది’’ చెప్పాడు సిద్దార్ధ తేజ సెల్‌ నంబరిస్తూ.

‘‘అంటే...ఆ రోజు నేను స్వయంగా పిలవ లేదనే మీ ఫ్రెండ్‌ సినిమాకి రాలేదన్న మాట’’ అడిగింది ప్రతిమ.

‘‘ఆ రోజు కథ మీకూ తెలుసుగా. ఈ మీడియా వాళ్లంతే...ఇంట్లో ఇంపార్టెంట్‌ ప్రోగ్రామ్స్‌ ని కూడా మిస్‌ చేసుకుంటారు. అదేమంటే...ప్రొఫెషన్‌ అంటారు’’చిరాకు నటించాడు సిద్దార్థ.

‘‘మరో విషయం. మా వాడు క్రయిం రిపోర్టర్‌. సినిమా కవరేజ్‌ ల కు మరొకరుంటారు. అందుకనీ..వస్తాడో రాడో తెలీదు’’

‘‘ఆ సంగతి నాకూ తెలుసు. రిపోర్టర్‌ గా కాకున్నా ఫ్రెండ్‌ గా నైనా రావొచ్చు’’

‘‘అదే...ఆ స్పష్టత తోనే మీరు పిలవండి’’ అన్నాడు సిద్దార్థ.

ఈ కాన్వర్వేషన్‌ జరిగిన సరిగ్గా పది నిముషాల తర్వాత తేజా నుంచి సిద్దార్థకి ఫోన్‌ వచ్చింది.

‘‘నాకివాళెంతో సంతోషంగా ఉంది. అందని ఆ ఆకాశాన్ని అర చేత్తో అందుకున్నట్లనిపిస్తోంది’’

‘‘ఏమైందీ? మీలో కోటీశ్వరుడెవ్వరు నాగార్జున నుంచి ఫోన్‌ వచ్చిందా?’’ ఏం తెలీనట్లు అడిగాడు సిద్దార్థ.

‘‘ప్రతిమ దగ్గర్నుంచి ఫోన్‌ వచ్చింది. సినిమా సక్సెస్‌ మీట్‌ కి రమ్మని ఆహ్వానించింది’’

‘‘సక్సెస్‌ మీటే కదా...ప్రోగ్రాం కవర్‌ చేయమని పిలిచుంటుంది’’అన్నాడు తేలిగ్గా తీసుకుంటూ.

‘‘సినిమాకి ఎందుకు రాలేదని అడిగింది. కనీసం ఈ ప్రోగ్రామ్‌ కైనా కచ్చితంగా రమ్మంటోంది. అన్నట్లు నువ్వూ వస్తున్నావు కదా!’’

‘‘వస్తున్నాను...’’ చెప్పాడు సిద్దార్థ. తర్వాత నెమ్మదిగా అన్నాడు సిద్దార్థ` ‘‘మనకి ప్రతిమ జస్ట్‌ ఫ్రెండ్‌. అంతే! అంతకు మించి మనసు కెక్కించుకుంటే మనకే ఇబ్బంది’’

‘‘నువ్వేం చెప్తున్నావ్‌?’’

‘‘నిజమే చెప్తున్నాను. ఓ కేసు విషయంలో ప్రతిమ ప్రొఫెషనల్‌ గా మనల్ని కలిసిందంతే. ఆ స్పృహ ఉండాలంటున్నా’’

సిద్దార్థ చెప్తుంటే...తేజాకి విసుగ్గా ఉంది. ఎప్పుడూ హ్యాపీ మూడ్‌ ని పాడు చేస్తుంటాడు. అంత ఆత్మీయంగా ఉంటున్నా అను క్షణం ఆమెని అనుమానిస్తుంటాడు.

‘‘ఆకాశంలో ఇంద్ర ధనుసు అందంగానే ఉంటుంది. కనిపిస్తే ఆనందించాలి. కానీ...ప్రతి సారీ కనిపించాలని కోరుకో కూడదు. కారణం...ఎండా వానా ఎప్పుడు కలిసొస్తాయో ఊహించడం కష్టం’’

‘‘నువ్వు చెప్తున్నది అర్ధం కావడం లేదు’’

‘‘అర్ధం చేసుకుంటే అర్ధమవుతుంది. ఇదేం భగవద్గీత కాదు...అర్ధం కాదనడానికి. మనకీమధ్యే పరిచయమైన ఆమెకంటూ ఓ ప్రత్యేక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో ఒక్కరికే చోటుంది. ఆ అదృష్టం నీదీ నాదీ కాదు’’ అన్నాడు.

‘‘ప్రతిమ విషయంలో నీకా ఊహ ఉందో లేదో తెలీదు కానీ...ఆమెపై ఆశలు పెంచుకోవద్దని ఓ ఫ్రెండ్‌గా నీకు సలహా ఇస్తున్నా’’చెప్పాడు సిద్దార్థ. చెప్తున్నపుడు సిద్దార్థ కళ్ల ముందు ఆ పదంకెల సెల్‌ఫోన్‌ నంబరే కదలాడుతోంది. ఆ నంబర్‌ నుంచే ప్రతి పది నిముషాలకు ప్రతిమకు కాల్‌ వస్తోంది. ఆ ఇద్దరి మధ్య అంత ఫ్రీక్వెంట్‌గా ఏం మాటలుంటాయి?

‘‘బహుశా..స్వీట్‌ నథింగ్సే’’అనుకున్నాడతడు.

‘ఇప్పుడు కాస్త తీరిక దొరికింది కాబట్టి ఆ నంబర్‌ గురించి ఆరా తీయాల్సిందే’ అతడిలో పట్టుదల హెచ్చింది.

ఓ కేసు పరిష్కరిస్తూనే...ప్రతిమ వ్యక్తి గత జీవితంలోకి తను తొంగి చూస్తున్నాడా?

అసలా నంబర్‌ వెనుక రహస్యం గురించి తానెందుకు తెలుసు కోవాలి?

ఆ ఉత్సుకత తనకెందుకు కలుగుతోంది?

పైకి, తేజాని హెచ్చరిస్తున్నతనే ప్రతిమ ఆకర్షణలో పడిపోయాడా?  

ఆ ఆలోచన రాగానే ఒక్క సారి ఉలిక్కి పడ్డాడు సిద్దార్థ.


గోల్కొండ హోటల్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో  ‘ప్రియతమా...’ సినిమా పోస్టర్లు ఆహూతులకు ‘హలో..’ చెప్తున్నాయి. మూవీ సక్సెస్‌ మీట్‌  కి ఇండస్ట్రీ పెద్దలతో పాటు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.

‘‘నువ్వూ వచ్చావా?’’ అక్కడ కనిపించిన యాంకర్‌ వరలక్ష్మిని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు తేజ.

‘‘ఔను..ఈ ప్రోగ్రామ్‌ కి వ్యాఖ్యాతని నేనే’’

‘‘క్రయిం బులెటెన్‌ కాదిది. అందర్నీహడల గొట్టేయడానికి’’ అన్నాడు తేజ...సిద్దార్ధ కోసం హాలంతా కలయ చూస్తూ. అర గంట క్రితమే అయిదు నిముషాల్లో అక్కడుంటానని చెప్పిన వ్యక్తి ఇంకా రానే లేదు.

‘‘క్రయిం బులెటెన్‌ సక్సెస్‌ లో కూడా నా రోల్‌ ఉంది. అందుకే, ఈ సక్సెస్‌ మీట్‌ కి నన్ను ప్రత్యేకించి పిలిచారు’’ అంది వరలక్ష్మి.

‘‘ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. నీ యాంకరింగ్‌ బాగుంటుంది’’ మెచ్చుకున్నాడు తేజ.

‘‘సారీ...ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ థాంక్స్‌ కూడా’’

‘‘ఆ రెండూ ఎందుకు?’’

‘‘ఆ రోజు మీరు అండగా ఉన్నందుకు’’ ఆ రోజు తర్వాత వరలక్ష్మిని మళ్లీ ఈ రోజే కలవడం. మనసు బావో లేదంటూ లీవ్‌ పెట్టింది. ఔను...ఎంతగానో ప్రేమించిన వ్యక్తి సర్వస్వం దోచుకుని దగా చేసి తన నుంచి దూరంగా పారిపోతే...తట్టుకోవడం నిజంగా కష్టమే. మళ్లీ కోలుకుని జన జీవన స్రవంతిలో కలిసి పోవాలంటే ఒంటరిగా ఓ గదిలో కూచుని కన్నీళ్లింకి పోయే దాకా కసి తీరా ఏడ్వాలి. బహుశా, వరలక్ష్మి కూడా అదే పని చేసుంటుంది. ఆఫీసుకి రాని ఈ నాలుగు రోజులూ కళ్లు వాచేలా వెక్కి వెక్కి ఏడ్చి ఉండాలి. వాడుకుని వాడు వదిలేసి వెళ్లి పోయాడంటే...ఇన్నాళ్లూ కలిసి కాపురం చేసిన ఇల్లే కాదు...గుండె ఖాళీ అయిపోయినట్లే. ఆ శూన్యాన్ని భరించాలంటే ముందు వాస్తవాన్ని జీర్ణించుకోవాలి. ఆలోచిస్తూ వరలక్ష్మి కళ్ల వైపు పరిశీలనగా చూసాడు తేజ. గోరింట పెట్టినట్లు ఆమె కళ్లు ఎర్రగానే ఉన్నాయి. కన్రెప్పలు కూడా వాచి ఉన్నట్లనిపించింది.

‘‘మళ్లీ ఈ లోకంలో పడ్డట్లేనా?’’ అడిగాడు తేజ.

‘‘ఇంత దారుణంగా మోసపోతాననుకోలేదు’’ అంది వరలక్ష్మి.

‘‘మోసపోతానని ముందే అనుకోవాలి’’ ఆశ్చర్యంగా చూసిందతడి వైపు.

‘‘ౖఔను! నువ్వు ఎంచుకున్న మార్గం భిన్నమైంది. ఆ దారి పొడవునా గులాబీ రేకులే పరచి ఉంటాయని నువ్వెలా నమ్మావు. ఈ మగాళ్లు ఒట్టి మాయగాళ్లని ఆడపిల్లగా ముందే నీకు తెలిసుండాలి. మనసిచ్చి పుచ్చుకునే ప్రేమ వేరు. నువ్వు మరో అడుగు ముందుకేసావు. పెళ్లి ప్రమేయం లేకుండా నమ్మ కూడని మగాడిని నమ్మి లివిన్‌ రిలేషన్‌ షిప్‌ లో పడి పోయావు. తీరం చేర్చాల్సిన ఆ షిప్‌ సముద్రం మధ్యలోనే సుడి గుండంలో ముంచేసింది. తప్పుగా అనుకోకుంటే తనని నమ్మడం తప్పే కదా!’’

‘‘అతడిపై ఉన్న ప్రేమ, ఆకర్షణ నమ్మేలా చేసింది’’

‘‘ఆ నమ్మకమే వమ్మయింది. పెళ్లి చేసుకుంటానంటూ కన్వీనియంట్‌గా నీతో గడిపేసాడు. కట్నం సొమ్ము కోసం మరో ఆడ పిల్ల గొంతు కోసేందుకు సిద్ద పడ్డాడు. ఇంతకీ ఆ పెళ్లి చెడ గొట్టి నువ్వు సాధించినదేంటీ?’’

‘‘ఆ పిల్లను రక్షించాను...’’

‘‘ఔనా! అందువల్ల నీకొచ్చిన ప్రయోజనం. అంతా అనుకున్నారు...వాడినే నువ్వు పెళ్లి చేసుకుంటావని. అలా ఎందుకు చేయలేదు’’

‘‘నన్ను కాదనుకుని వెళ్లి పోయిన వాడితో బలవంతంగా కాపురం చేయలేననిపించింది. అందుకే, నేనూ కాదనుకున్నాను’’

‘‘ప్రేమలు, పెళ్లిళ్లే క్రైసెస్‌ లో పడి పోతున్నాయి. ఇక, ఏ మాత్రం భరోసా లేని ఇలాంటి రిలేషన్‌ షిప్‌ లు పాతాళంలో పడి పోవడం ఆశ్చర్యం కాదు.  లివిన్‌ రిలేషన్‌ షిప్‌ లో పడే ముందే ఈ ప్రమాదాన్ని ఊహించి ఉండాల్సింది. సహ జీవనం విషయంలో చట్టాలిప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నా... ఆ బంధాన్ని సమాజం హర్షించే స్థితిలో లేదు’’ అన్నాడు తేజ.

‘‘అయినా, నువ్వనుకున్న దారిలో నువ్వు నడిచావు. కొత్త పేర్లతో పుట్టుకొస్తున్న ఇలాంటి రహస్య బంధాలు విజయ వంతం కావాలంటే ఇద్దరి మధ్య ప్రగాఢమైన నమ్మకం కావాలి. ఆ నమ్మకం వమ్మయినప్పుడు ఇదిగో...ఇలా నీలా వీధిలో నిలబడాల్సి వస్తుంది’’ చెప్పాడు తేజ. ఆ తర్వాత నవ్వుతూ...‘‘సిన్మా ప్రోగ్రాం కొచ్చి ఇంత బరువైన మాటలా? అబ్బో! నాకే ఆశ్చర్యం వేస్తోంది...’’అంటూ ‘రేపు ఆఫీసుకి వస్తున్నావా?’’ అడిగాడు.

‘‘వస్తున్నాను. అయినా, మీరు చెప్పిన మాటల్లో తప్పేం లేదు. ఒకే కప్పు కింద సహజీవనం చేస్తూ ఒకర్నొకరు అర్ధం చేసుకో వచ్చనుకున్నాం. లివిన్‌ రిలేషన్‌ లో థ్రిల్‌ తో పాటు.. ఆ తర్వాత మ్యారేజ్‌ చేసుకుంటామనుకున్నాను. కానీ, ఆ త్రాష్టుడు నన్ను భార్యలా ఊహించ లేదని...మరోలా చూస్తూ దగ్గరయ్యాడన్నభావనే నిప్పులా నన్ను కాల్చేస్తోంది. ఏది జరిగినా..మంచిదే. వాడిని బలవంతంగా పెళ్లాడాలనుకో లేదు. బుద్ది చెప్పాలనుకున్నాను. చెప్పాను’’ అంది వరలక్ష్మి కసిగా.

‘‘ఆఫీసులో రోజూ కలుస్తూనే ఉంటారు కదా! మీ ఇద్దరి మధ్య ఇంకేం మాటలుంటాయి’’ ఆసక్తిగా అడుగుతూ వారిద్దరి మధ్యకి వచ్చింది ప్రతిమ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్