Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
shasti

ఈ సంచికలో >> కథలు >> ఒక్క ఐడియా...

okka idea

 రామం, విశ్వం, సూర్యం ముగ్గురు ఒకే కంపెనీలో పనిచేస్తారు. మంచి మిత్రులు. ఒకరి ఇంటికి ఒకరు తరుచూ వెళ్తూ వుండడం వల్ల ఒకరి బంధువులు ఇంకొకరికి తెలుసు. వాళ్ళ పిల్లలు ఆరుగురూ కూడా మంచి స్నేహితులు. మూడు కుటుంబాలు కలిసి సినిమాలకు వెళ్ళడం, కార్తీకమాసం పిక్నిక్ లకు , యాత్రలకు వెళ్ళడం వంటివి కూడా చేస్తూ వుంటారు.

వాళ్ళ ఆఫీస్ దగ్గర్లో ఎప్పటి నుండో ఖాళీగా వున్న ఒక స్థలాన్ని చదును చెయ్యడం, ఎవరో ఒక వ్యక్తి రోజూ కార్లో వస్తూ వుండడం చూసిన రామానికి ఆ స్థలం డెవలప్ మెంట్ట్ కి ఇచ్చారేమో అనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం అంతా రామానికి అక్కడ ఫ్లాట్స్ వస్తే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందులో ప్లాట్ బుక్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. సాయంత్రం ఆఫీసు నుండి బయటకు వస్తూ రామం మిత్రులిద్దరికీ తన ఐడియా గురించి చెప్పాడు. విశ్వం , సూర్యం కూడా ఐడియా బాగుందిరా, ఆఫీస్ కీ దగ్గర అన్నారు.

పక్కరోజు రామం కాపలా కాసి ఆ కార్లో వచ్చిన ఆయనను పట్టుకున్నాడు. అతని ఊహే నిజమయ్యింది. ఆ స్థలం లో అపార్ట్ మెంట్ రాబోతోంది. ఆనందంతో 'యాహూ' అని అరవాలనిపించింది రామానికి. ఆ ఆదివారం గెట్ టు గెదర్ పెట్టుకుని మూడు కుటుంబాలు కలిసాయి. ప్లాట్ బుక్ చెయ్యడం గురించి చర్చించారు. ఆడవాళ్ళు , మగవాళ్ళు , పిల్లలు మూడు బ్యాచ్ లుగా విడిపోయారు. ఎవరి స్థాయిలో వారు ఊహల్లో ఎక్కడికో వెళ్ళిపోయారు.

ఎంచక్కా పొద్దున్నే ముగ్గురు కలిసి వాకింగ్ కి వెళ్ళొచ్చు. పిల్లలని ట్యూషన్ కి తీసుకెళ్ళి, తీసుకురావడం ఒకళ్ళు, కూరలు , పళ్ళు తేవడం ఒకళ్ళు, బిల్లులు కట్టడం , సరుకులు తేవడం ఒకళ్ళు, ఇలా పనులు పంచుకుంటే టైం చాలా ఆదా అవుతుంది. హాయిగా వుండొచ్చు అనుకున్నారు మగవాళ్ళు. గుడికి వెళ్ళాలన్నా, షాపింగ్ కి వెళ్ళాలన్నా కలిసి వెళ్ళొచ్చు. ఎప్పుడన్నా ఏ ఫక్షన్కో ఆడవాళ్ళు ఒక్కరే ఊరు వెళ్తే ఎవరో ఒకళ్ళు ఆ ఫ్యామిలీకి భోజన ఏర్పాట్లు చూడొచ్చు. అసలు ఇబ్బంది వుండదు అని సంతోషపడిపోయారు ఆడవాళ్ళు. స్కూల్ కి ఒకే ఆటోలో వెళ్ళొచ్చు, సాయంత్రం మేడ మీద కలిసి ఆడుకోవచ్చు అని ఎగిరి గెంతులేసారు పిల్లలు.

ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్కరోజే బిల్డర్ ని అడిగి ప్లాన్ తీసుకున్నాడు రామం. ఆఫీస్ బ్రేక్ టైం లో కూడా ప్లాట్ గురించే  చర్చ. లక్కీగా ఫ్లోర్ కి మూడే ప్లాట్లవడం తో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక ప్లోర్ మొత్తం  మనమే వుంటాము అనుకుని ఆ వారమే ముగ్గురికీ కలిపి ఒక ఫ్లోర్ బుక్ చేశారు.   ఆ నెలలోనే శంకుస్థాపన జరిగింది. ఫ్రెండ్స్ ముగ్గురూ హాజరయ్యారు. అపార్ట్ మెంట్ పని చకచకా జరుగుతోంది. స్లాబ్లు, గోడలు , ఇంటీరియర్ ఇలా మూడేళ్ళలో అపార్ట్ మెంట్  నిర్మాణం పూర్తి అయ్యింది. ఎవరి పేరు బలాన్ని బట్టి వాళ్ళ ముగ్గురూ మాఘమాసం లో గృహప్రవేశం అయ్యారు. ఎలా అయితేనేం ముగ్గురూ సామాన్లు అన్నీ చేరేసుకుని ఇల్లు సర్దేసుకునేసరికి పిల్లల పరీక్షలు రానే  వచ్చాయి. పిల్లలు, పెద్దలు చదివి పరీక్షలు పూర్తిచేసారు. మూడు బ్యాచ్ లు , ఆడవాళ్ళు , పిల్లలు , మగవాళ్ళు ఎవరు ఊహించుకున్నట్లు వాళ్ళు జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంతలో సునామి ఏ రూపం లో వచ్చిందటే సూర్యం వాళ్ళ మామగారికి హార్ట్ ఎటాక్ అని ఫోన్ వచ్చింది. సూర్యం భార్య పద్మిని ఒక్కతే కూతురు కావడం వల్ల తను గోలగా వుంటుందని పిల్లల్ని ఇక్కడే వుంచెయ్యమని , తను చూసుకుంటానంది రామం భార్య జానకి. సూర్యం, పిల్లలు ఒక వారంపాటు రామం వాళ్ళింట్లోనే టిఫిన్, బోజనం. ఒకసారి చేసింది, మరొకసారి చెయ్యకుండా రోజుకో రకం చేస్తోంది జానకి. ఇడ్లీలు, గారెలు గట్టిగాను, ఉప్మా జావ గాను , చట్నీలో ఉప్పుంటే పులుపుండదు, లేదంటే విపరీతమైన   కారం, కళ్ళమ్మట నీళ్ళు తిరిగేవి. అసలే పద్మిని వంట చాలా బాగా చేస్తుంది. ఆ రుచులు అలవాటై పిల్లల్ని నైమంత్, టెంత్ హాస్టల్ లో పెడదామన్నా వాళ్ళు ససేమిరా వెళ్ళం అని మొండికేశారు. టిఫిన్లే ఇలా వుంటే బోజనం గురించి ఏం చెప్పాలి. అన్నం ఒక రోజు బిరుసుగా వుంటే ,ఒకరోజు తోపల వుంటుంది. దానిలో ఊరగాయ పచ్చడి వేసుకున్నా రుచి తెలియదు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో సూర్యానికి, పిల్లలకి అర్ధంకాలేదు. పోనీ విశ్వం వాళ్ళింటికి వెళ్దామంటే విశ్వం భార్య లక్ష్మి చాలా నిదానం గా పని చేస్తుంది. వాళ్ళింటి వరకు వాళ్ళ పనిచేసుకోవడమే గగనం. ఇంక అదనం గా ఏం చెయ్యగలదు?

మధ్యలో రెండు రోజులు సూర్యం బయట ఏదో పని వుందనో , ఊరి నుండి వచ్చారు, వాళ్ళని ఎంగేజ్ చెయ్యాలి అని మేనేజ్ చేసాడు కానీ ఎన్ని రోజులు చెయ్యగలడు? ఒక పక్క జానకి నా వంటకి భయపడి మీరు ఇంటికి రావడం మానేస్తున్నట్లున్నారు అన్నయ్యా అంటుంది. భోజనానికి కూర్చుటే ఒక పక్క ముద్ద దిగదు, ఇంకో పక్క ఇంకొంచెం వేసుకోండి అన్నయ్యా అని జానకి ఎక్కువెక్కువ వడ్డించేస్తుంది. దీనితో కక్కలేక , మింగలేక అన్నట్లు సూర్యం పడే బాధ వర్ణనాతీతం. ఎప్పుడెప్పుడు పద్మిని వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సూర్యం, పిల్లలు.  ఈ లోపు లక్ష్మి తమ్ముడి పెళ్ళి కుదిరింది. పది రోజుల్లోనే పెళ్ళి , తరువాత ముహూర్తాలు లేవు అని కబురు వచ్చింది. లక్ష్మి పిల్లల్ని తీసుకుని బయల్దేరింది. లక్ష్మి వాళ్ళ ఊరు పద్మిని వాళ్ళ ఉరు దగ్గరే. లక్ష్మి వాళ్ళమ్మగారు పద్మినిని , టైం ఎంతో లేదమ్మా, మీ నాన్నగారికి తగ్గింది, పిల్లలకి  సెలవేగా , నువ్వు ఈ పది రోజులు ఇక్కడే వుంటే మాకూ సాయం గా వుంటుందని ఒప్పించారు.

ఈ వార్త విన్న సూర్యానికి తలమీద పిడుగు పడ్డట్లయింది. బాధితుల జాబితాలో కొత్తగా విశ్వం చేరాడు. విశ్వం స్వతహాగా భోజన ప్రియుడు. ఎప్పుడూ లక్ష్మిని బెండకాయ కొబ్బరివేసి వండు. వంకాయ మెంతికూర చెయ్యి, గుమ్మడికాయ పులుసుపెట్టు అని బజార్లో కనబడ్డ కూరలన్నీ తెచ్చి , ఏ కూర ప్రత్యేకం గా ఎలా వండాలో చెబుతాడు. అలాంటి విశ్వం జానకి వంటకి బలైపోయాడు. అన్నయ్యా మీకు వంకాయ కూర ఇష్టం అంట గదా, లక్ష్మి చెప్పింది అని జానకి వంకాయ వారోత్సవం మొదలుపెట్టింది. వంకాయ బగారా పుస్తకం చూసి చేశాను, గుత్తి వంకాయ కూర టీవీ లో చూసి చేశాను అని ఇలా వారం రోజులు ఏదో రకం వంకాయ వండి పెట్టింది జానకి.

కాశీ వెళ్ళిన వాళ్ళు ఇష్టమైనది ఏదో ఒకటి వదిలేస్తారంట, కాశీ వెళ్ళకుండానే ఇక్కడే వంకాయ వదిలేసేటట్లుందిరా నా పరిస్థితి. చిత్రహింస , గృహ హింస ఇలా ఎన్నో రకాల హింసలు విన్నాను, కానీ ఈ పాకహింస ఏంటిరా బాబూ అని విశ్వం , సూర్యం దగ్గర వాపోయాడు. ఇన్నాళ్ళూ చెప్పుకునే నాధుడు లేడని బాధపడుతున్న సూర్యం ఒక్కసారే బావురుమన్నాడు. ఇన్నేళ్ళు రామం ఎలా భరిస్తున్నాడు, ఈ వంటని అనుకున్నారు ఇద్దరూ. ఒకే దగ్గర ప్లాట్స్ తీసుకుందామన్న ఐడియా రామానికి ఏల రావలె మనమేల అంగీకరించవలె అని తలబాదుకున్నారు ఇద్దరూ. 

బ్రతుకుజీవుడా అని బావమరిది పెళ్ళికి వెళ్ళి వస్తూ అందరినీ వెంటబెట్టుకు వచ్చాడు విశ్వం. ఎప్పుడూ లేనిది ఈ సారి ఇంట్లో ఘన స్వాగతం లభించింది పద్మినికి. పెద్దగా చుట్టాల్ని ఇష్టపడక ఏ పెళ్ళో, పేరంటమో వచ్చినా , పద్మినిని పంపేసే సూర్యం పద్మినీ ఇకనుండీ ఏదన్నా ఊరెళ్ళాలంటే నేను వెళ్ళొచ్చేస్తాను, మమ్మల్ని వదిలి వెళ్ళకు, జానకి వంట తినలేక చచ్చాం అన్నాడు. అమ్మా ఆంటీ వంట ఒక వారం తినగలిగితే ఏ హాస్టల్ లోనైనా వుండిపోవచ్చు, మేము ఈ సంవత్సరం  మీరు చెప్పినట్లే హాస్టల్ కి  వెళ్తాం అన్నారు నైంత్    కి రాబోయే కవలలిద్దరు. ముసి ముసి నవ్వులు నవ్వింది పద్మిని. 

ఎప్పుడూ ఆ వెరైటీ వండు, ఈ వెరైటీ వండు అని తినడం కోసమే బ్రతకడం లా వుండే విశ్వం బతకడం కోసమే తినడం లా అయిపోయాడు. ఏం వండినా మీరు మాట్లాడకుండా తినేస్తున్నాడు. ఒక్క ఐడియా .. జీవితాన్నే మార్చేస్తుంది అనే యాడ్ చూసి ఏదో అనుకున్నాం కానీ నిజం గా తమ ఐడియాకి ఇంత మార్పు వస్తుంది అని ఊహించలేదు ఆడవాళ్ళు ముగ్గురూ. పద్మిని నాన్నగారికి హార్ట్ ఎటాక్ రావడం వట్టిదే అని గానీ, కావాలని జానకి ఈ పదిహేను రోజులు అలా వండిందని గానీ ఆడవాళ్ళు ముగ్గురూ కలిసి రామం నోరు నొక్కేసారని గానీ విశ్వానికి, సూర్యానికి తెలియదు.     

మరిన్ని కథలు