Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cough Cures | దగ్గుకు పరిష్కారాలు | Ayurvedic Treatment | Dr. Murali Manohar Chirumamilla, M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆర్చెస్ నేషనల్ పార్కు - పి ఎస్ ఎం లక్ష్మి

ప్రకృతి చెక్కిన హరివిల్లులు ఆర్చెస్ నేషనల్ పార్కు

సౌందర్యలహరి, ప్రకృతి ప్రపంచం లో సృష్టించిన అనేక అద్భుతాల అందాలను చూడటానికి కన్నులు చాలవనిపిస్తుంది. విశేషమేమిటంటే ప్రకృతి విలయతాండవాలా తర్వాత భూమిపైన, లోపల జరిగిన అనేక మార్పుల వలన భూమిపైన ఆకర్ష్ణీయ ఆకృతులు ఏర్పడి వీక్షకులకు కనుల విందు చేయటమే గాక వేల సంవత్సరాల తరాలనాటి చారిత్రక విశేషాలను కూడా తెలియజేస్తున్నాయి. అలాంటి అద్భుత ప్రదేశాలలో కొన్నింటిని మేమీ మధ్య చూడటం జరిగింది. వాటిలో ఒకటి అర్బన్ నేషనల్ పార్కు.అమెరికాలోని యూటా రాష్ట్రం లో మోఏబ్ కు 5 మైళ్ళ దూరం లో వున్న ఈ పార్కులో ప్రకృతి వింతలు అనేకం. పేరుకి తగ్గట్లే ఈ పార్కులో ప్రకృతి సిద్ధం గా ఏర్పడ్డ ఆర్చీలు చాలా వున్నాయి. కొలరాడో నదిపైన వున్న ఈ ఆకృతులన్నీ ఎఋఋఅ ఇసుకరాయితో ఏర్పడ్డవి. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతమైన కళాక్రుతులను చూసి మైమరచిపోవాల్సిందే.

ర్ర  ఇసుకరాతితో ఏర్పడిన ఈ ఆకారాలన్నింటికీ కారణం మామూలు ఉప్పు అంటే ఆశ్చర్యం గా వుంటుందికదూ. భూగర్భ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం 300 మిలియన్ సంవత్సరాలా క్రితం యూటా, కొలరాడో రాష్ట్రాల మధ్య , కొండలు వున్న ప్రదేశం, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం వుండేది. ఆ ఖాళీ స్థలం లో జరగటం వలన భూమిపై కొన్ని వేల అంగుళాల మందం గా ఉప్పు పొరలు ఏర్పడ్డాయి. ఆ బేసేన్ ని పేరడాక్స్ బేసేన్ అనీ , ఉప్పు నిలవల్ని పేరడాక్స్ ఫార్మేషన్ అనీ అన్నారు. ఈ పేరడాక్స్ ఫార్మేషన్ మీద, తర్వాత వచ్చిన ప్రవాహాలతో కొట్టుకొచ్చిన ఇసుక, బండ రాళ్ళు పడ్డాయి. ఇవి కింద వున్న లవణ పొరలకన్నా బరువైనవి అవటంతో కింద వున్న ఉప్పు పొరలు కరిగి రాళ్ళ మధ్య నుంచి పైకెగెసి రాళ్ళ పైనం తా కప్పుగా ఏర్పడింది.  

తర్వాత ప్రకృతిలో , భూగర్భం లో వచ్చిన మార్పులవలన ఈ కప్పులు చాలామటుకు కూలి, రాళ్ళు పైకి చేరి, అద్భుతమైన ఆకారాలతో నిట్టనిలువు బండలుగా నిలిచాయి. వీటిని ఫిన్స్ అంటారు. ఈ రాళ్ళ మధ్యనున్న పొరల్లోనూ, పగుళ్ళలోను నీరు చేరి మంచుగా  మారేది. ఆ మంచు నీరుగా కరిగిపోవటం, మళ్ళీ నీరు పడటం, మంచుగా మారటం.. ఈ మార్పులతో ఆ మంచు చుట్టూ వున్న రాళ్ళు చిన్ని ముక్కలుగా అయి రాలిపోయేవి. దానితో రాళ్ళ మధ్య ఖాళీలు పెరిగేవి. ఖాళీ ప్రదేశం లో వీచే బలమైన గాలుల వలన మిగిలిన రాళ్ళల్లో గట్టిగా లేని భాగాలన్నీ పడిపోగా, గట్టిగా వుండి, బేలెన్స్ వున్న రాళ్ళు నిలబడ్డాయి. అవే ఆర్చీలుగా, ఇంకా అనేక ఆకారాలుగా మారాయి. అలాంటి ఆర్చీలు ఇక్కడ అనేకం. ఇవన్నీ జరగటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టాయి.

ఇక్కడ ఆర్చీకి కొలమానం రెండు ఆధారాల మధ్య ఖాళీ ప్రదేశం కనీసం మూడు అడుగులు వుండాలి. ఆ పాత కొలమానం ప్రకారం ఇక్కడ 2000 పైన ఆర్చీలు ఏర్పడుతుంటే పాతవి పడిపోతున్నాయనీ, కొత్త ఆర్చీలు ఏర్పడుతుంటే పాతవి పడిపోతున్నాయనీ అంటున్నారు.

మరి ఇక్కడ వున్న కొన్ని విశేషాలను చూద్దామా? 

ఇక్కడ వున్న కొన్ని ఆకారాలకి పేర్లు పెట్టారు. ఇంకా పేరులేని ఆకౄతులెన్నో వున్నాయి. వాటికి సరైన పేరు తట్టిన సందర్షకులు విజిటర్స్ సెంటర్ లో సమాచారం ఇవ్వచ్చు. పేరున్న వాటిలో ముఖ్యమైన కొన్నింటి గురించి చెబుతాను.

డెలికేట్ ఆర్చి

ఇది ఈ పార్కు లేండ్ పార్కు. ఎటువంటి ఆధారాలూ లేకుండా 65 అడుగుల ఎత్తున నిలబడ్డ ఈ ఆర్చి యూటా స్టేట్ లో రిజిస్టరు అయ్యే వాహనాల లైసెన్సు ప్లేట్ల మీద కనబడుతుంది. అంతేకాదు.. 1996 లో యూటా రాష్ట్రావతరణ జరిగి వంద సంవత్స్రాలయిన సందర్భం గా జరిగిన ఉత్స్వాల సమయం లో విడుదలైన పోస్టల్ స్టాంపు పైన కూడా స్థానం సంపాదించుకుంది. 

దీని దగ్గర దాకా వెళ్ళేందుకు 3 మైళ్ళ కాలి దోవ వుంది కానీ వర్షాకాలం లో ఆ దోవ బాగుండదు. దూరం నుంచి చూడటానికి వేరే దోవలో వెళ్ళాలి. రానూ పోనూ దాదాపు 3 మైళ్ళు నడవాలి. దోవంతా కొండలమయం. పర్వతాల అందాలు, ఎడారి మొక్కలు పూసిన వివిధ రంగుల , ఆకారాల పూలు , దూరాన కనిపిస్తున్న మైదానాలు, ఆ వెనుక కనిపించే పర్వతాలు, ఆకాశాన మబ్బులు , ఓహ్ ... కూసింత కళా పిపాస వుండాలేగానీ అద్భుతాలే. పైగా దోవ కూడా బాగుంటుంది.దోవలో వారెవరైనా మన చీరెని మెచ్చుకున్నా, ఇండియా గురించి అడిగినా ఇంక చెప్పాలా? మాకు దోవలో విలియంస్ దంపతులు కలిశారు. వాళ్ళు మమ్మల్ని పలకరించి వాళ్ళు బేలూరు రామకృష్ణ మఠం లో కొన్నాళ్ళు వున్నామని, అది గొప్ప ప్రదేశమనీ , చాలా ప్రశాంతం గా ధ్యానం వగైరా చేశామనీ, చాలామంది గొప్పవాళ్ళని కలుసుకున్నామనీ, ఆ ధ్యానం ఇక్కడకొచ్చాక కుదరటంలేదు, మళ్ళీ ఇండియా రావాలని వుందన్నారు. ఆగ్రా డిల్లీ చూశాము, ఇంకా ఏమి చూడాలి అని అడిగితే నా సంతోషం ఏం చెప్పమంటారు!!? ఇలాంటివి వింటుంటే నాకే కాదు, ఇండియా లో పుట్టినవారికెవరికైనా సంతోషమే కాదు, కొంచెం గర్వం కూడా కలుగుతుంది కదా!? 
డబుల్ ఆర్చి స్వాభావికం గా ఏర్పడిన రెండు ఆర్చీలకీ ఒక వైపు కొన కలిసి వుంటే రెండో వైపు విడివిడిగా వుంటాయి. అందుకే డబుల్ ఆర్చి అనే పేరు వచ్చింది. ఇందులో పెద్ద ఆర్చి 148 అడుగుల పొడవు ం 104 అడుగుల ఎత్తు వుంటుంది. 

దీనికి వెళ్ళటానికి కూడా రానూ పోనూ రెండు మైళ్ళు నడవాలి. ఈ రెండు ఆర్చీలకి మా అల్లుడు పవన్ ప్రోత్సాహం తోనే నడిచాను. అప్పటికే అలసిపోయిన నేను ఇంక నడవలేననుకున్నా. ఇంత దూరం వచ్చి ఇవి చూడకపోవటమా! మీరివి చూడాల్సిందే.. చూడక్పోతే అందరికీ ఎలా చెప్తారు.. రండి అని తీసుకెళ్ళారు. రెండు వైపులా కొండలు, మధ్యలో సన్నని తోవ .. సినిమా సెట్టింగులా.. ఇంక ప్రకృతి అందాలు సరేసరి. వెళ్ళక్పోతే ఎన్ని అందాలు చూడలేకపోయేదాన్నో!!

బేలెన్స్ డ్ రాక్

దీని మొత్తం ఎత్తు 128 అడుగులు , నేల పై నుంచి 55 అడుగుల ఎత్తున వున్న ఒక రాతి మీద వున్న ఇంకొక రాతి ఎత్తు 3 స్కూలు బస్సులంత వుంటుందింట. ఇది పార్కు మైన్ రోడ్డు మీద నుంచే కనిపిస్తుంది.

డెవిల్స్ గార్డెన్ 

ఇందులో అనేక ఆకారాలలో రాతి ఫిన్స్తో పాటు ఎక్కువ సంక్యలో ఆర్చీలను కూడా చూడవచ్చు.

ఇవి ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మాత్రమే. ఇంత విశాలమైనఈ పార్కులో ఎటుచూసినా ప్రకృతి నిలిపిన అద్భుత కళాఖండాలే. ఇవే కాకుండా, తెలిసినవారు ఇక్కడ 200 మిలియన్ సంవత్సరాలా క్రితం రాళ్ళను, 13 వైవిధ్యమాఇన పొరలలో చూడవచ్చు. 73, 234 ఎకరాల వైశాల్యం లో వున్న ఈ పార్కును చూడటానికి ఒక్కరోజు చాలు. అంటే అన్ని ఎకరాలలో వున్న ప్రదేశాలు పూర్తిగా అని కాదు. కొన్ని  ముఖ్యమైన దర్శనా స్థలాలను నిర్ణయించి, వాటిని కలుపుతూ 18 మైళ్ళ రోడ్డు వున్నది. ఆ రోడ్డు మీద కారులో వెళ్ళి ఆ ముఖ్య ప్రదేశాలన్నీ చూడవచ్చు. 

ఇదంతా ఎడారి ప్రదేశం అవటం వల్ల ఇక్కడ కొన్ని రకాల చెట్లు, పొదలు లాంటివి వుంటాయి. కుందేళ్ళు, లేళ్ళు, గ్రే ఫాక్స్ , కేటిల్ స్నేక్స్ వగైరా ఎడారి ప్రదేశాలలో వుండే చిన్న జంతువులు వుంటాయి.  ఇక్కడ వున్న ఇంకొక విశేషం.... ఈ రాతి ప్రదేశం లోనూ జీవం వున్నది. ఇక్కడి రాతి నేలమీద వున్న నల్లటి పై పొర అల్గే, లిచెన్స్, శ్యానో బేక్టీరియాలతో నిండి వుండి ఎడారి మొక్కలు పెరగటానికి ఆధారం గా నిలుస్తుంది. అలాంటి నేలమీద నడుస్తే అవ్వన్నీ నశిస్తాయని, వాటిలో జీవం వుంది, ఆ ప్రాంతం రక్షించటానికి అవి అవసరం కనుక తొక్కవద్దని, రోడ్డు మీదనే నడవమని , బోర్డులు కనబడుతాయి. అంతేకాదు.. అక్కడి వారు ఆ సూచనలను ఖచ్చితంగా పాటిస్తారు కూడా..

ఇక్కడ ట్రెక్కింగ్ , కేంపింగ్ , సైక్లింగ్,  గైడెడ్ టూర్స్ వంటి వాటికి సౌకర్యాలు వున్నాయి. వాటికి కూడా కొంత రుసుము చెల్లించాల్సి వుంటుంది. పార్కులోని విజిటర్స్ సెంటర్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ( ఒక్క క్రిస్ మస్ రోజు తప్ప) మిగతా అన్ని రోజులూ తెరచి వుంటుంది.

పార్కులో ప్రవేశానికి రుసుము వున్నది. నలుగురు దాకా వున్న కారుకి 10 డాలర్లు (7 రోజులకి) , 80 డాలర్లు ఒక సంవత్సరం మొత్తం ఈ పార్కే కాకుండా ఇంకా అమెరికాలో వున్న నేషనల్ పార్కులు ఎక్కడా టికెట్ తీసుకోనక్కరలేదు. టికెట్ తో బాటు పార్కులో వున్న విశేషాలు, వాటికి వెళ్ళవలిసిన దోవలు , సౌకర్యాలు, అవి వున్న ప్రదేశాలలో ఒక మేప్ ఇస్తారు.

మన దేశం లోనూ ప్రకృతి వింతలు , శిల్ప కళా నైపుణ్యాలు, ఇంజనీర్ల ప్రతిభలు, అలనాటి భవన నిర్మాణం లోని అద్భుతాలూ అనేకం వున్నాయి. అయితే ఇన్నివేల ఎకరాల స్థలం లో ఉలి పట్టని శిల్పకారిణి ప్రకృతిచే మలచబడ్డ ఇలాంటి అద్భుత శిలాతోరణాలను చూసినప్పుడు, అవి ఎక్కడ వున్నా, వాటిని సృష్టించిన ప్రకృతి మాతకు జోహార్లనక తప్పదు.     

మరిన్ని శీర్షికలు
navvunaluguyugalu