Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

గిరిజాత్మజ గణపతి - లక్ష్మి కర్నాగ

ganapati temple

కిందటి వారం మనం అష్ఠ గణపతులలొ ' మహా గణపతి ' , ' చింతామణి గణపతి ' ల గురించి తెలుసుకున్నాం . యివాళ మనం అష్ఠ గణపతులలొ ఆరవది అయిన గిరిజాత్మజ గణపతి గురించి తెలుసుకుందాం .

గిరిజాత్మజ గణపతి ని లైణ్యాద్రి గణపతి అనికూడా అంటారు . లేణి అంటే గుహ అనిఅర్ధం , అద్రి అంటే రాతి కొండ అని అర్ధం .లైణ్యాద్రి అంటే రాతి కొండ గుహ అని అర్ధం . యీ గుహలు వున్న పర్వత శ్రేణులని హటకేశ్వర పర్వత శ్రేణులు లేక సులేమాన్ పర్వత శ్రేణులు అని అంటారు . యీ ప్రాంతాన్ని ' కపిచిత్త  ' అనికుడా అంటారు . ఇక్కడకి దగ్గరగా వుండే జనావాసం ' జున్నారు ' అనే వూరు . యిది జిల్లా కేంద్రం కూడా . 

గిరిజాత్మజ గణపతి పూణే నగరానికి దగ్గర దగ్గర వంద కిలొమీటర్ల దూరం లో వుంది . పూణే , నాసిక్ హైవే మీద నారాయణ గావ్ దగ్గర స్టేట్ హైవే లోకి మళ్ళి జున్నారు చేరుకుంటాం . జున్నారు జిల్లాకేంద్రానికి ఆరు కిమీ దూరంలో వున్నాయి యీ గుహలు . నారయణ గావ్ నుంచి మన ప్రయాణం పంట పొలాలు , పండ్ల తోటల గుండా సాగుతుంది . ముఖ్యం గా జామ , దానిమ్మ , ద్రాక్ష తోటల పక్కగా మన ప్రయాణం సాగుతుంది . యీ గుహల దగ్గర చిన్న చిన్న దుకాణాలు తప్ప జనావాసాలు కనిపించవు . అల్లంత దూరం నుంచి సుమారు వంద అడుగుల యెత్తున అర్ధ వృత్తాకారం లో యీ గుహలు కనిపిస్తూ వుంటాయి . సుమారు 250 మెట్లు ఎక్కవలసి వుంటుంది . ఎక్క లేనివారి కోసం డోలీలు దొరుకుతాయి .

యీ గుహలు ఒకటవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దానికి చెందినవి . యీ గుహలు బౌద్ధ విహారాలు . యిక్కడ సుమారు పాతిక గుహల దాకా వున్నాయి . మొదటి ఎనిమిది గుహలు విరిగిపోయిన మెట్లతో కొంచం కష్టం గా వెళ్ల గలుగుతాము . మిగతా గుహలు ఉత్సాహవంతులైన యువత వెళ్ళగలిగి నట్లుగా వుంటాయి . విహారాలు కాబట్టి గుహలు గదులలాగా వుంటాయి . శిల్పాలు , చిత్రాలు వుండవు . కొన్ని గుహలకి వెళ్ళే మెట్లు విరిగి పోయి నడవడానికి వీలుగా వుండవు .

ఏడవ గుహలో గిరిజాత్మజ గణపతి లేక గిరిజా గణపతి  కొలువై వుంటాడు .

యినుము జాలీ తలుపులు కలిగిన గుహ . తలుపుల లోంచి లోనికి వెళితే చాలా విశాల సభా మంటపం , ఆరు స్తంభాలు , రెండు అర్ధ స్థంబాలు కలిగిన గుహలోకి అడుగు పెడతాం . యీ గుహ దక్షిణ ముఖంగా వుంటుంది . గిరిజా గణపతి తూర్పుముఖంగా ఉంటాడు ,యితని తొండం యెడమవైపుకి తిరిగి వుంటుంది . యిదికుడా మిగతా అష్ఠ గణపతులలాగే స్వయంభూ , కుడి వైపు చూస్తున్నట్టు గా  వుంటుంది కాబట్టి ఒకే కన్ను కనిపిస్తూ వుంటుంది . యీ వినాయకునికి ఎర్రటి సింధూరం పూసి వుంచుతారు . యీ స్తంభాలమీద ఏనుగులు , పులులు  , మొదలయిన శిల్పాలు చెక్కబడి వున్నాయి . గోడల పైన గణపతి కి సంబంధించి న వివిధ పురాణ గాధలు , సతీసహగమనం చేసిన  తొమ్మండుగురు సతులను గురించిన కధలు చిత్రీకరించేరు . కాని  యీ చిత్రాలు 17 లేక 18 వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించేరు . యీ గుహలు భారత ప్రభుత్వపు ఆర్కియాలొజీ వారి సంరక్షణ లో వున్నాయి .

గణపతి గుహనుంచి హటకేశ్వర్ పర్వత శ్రేణులను , కిందన ప్రవహిస్తున్న కుక్డీ నదిని , కనుచూపు  మేర పచ్చని ప్రకృతి మనసులని పులకింప చేస్తుంది . జునార్ గ్రామం లోని బ్రాహ్మణులు గిరిజా గణపతికి ఇత్తడి కవచం కానుకగా సర్పిం చేరు . యిక్కడ పూజలు నిర్వహించే పూజారులు యజుర్వేద బ్రాహ్మణులు  .

యిక్కడి స్థల పురాణం తెలుసుకుందాం .

గణేష పురాణం ప్రకారం త్రేతాయుగములో కుక్డీ నదీ తీరాన గల జుర్నాపురం ( కాల క్రమాన యిది జున్నార్ గా వ్యవహరించాసాగేరు )  దగ్గర ' సింధు ' రాక్షసుని సంహారణార్ధం పార్వతీ పరమేశ్వరులు విశ్వరక్షకుడైన గణేశుని కొరకై తపస్సు చేస్తారు ( గణపత్యం మతం ప్రకారం గణపతే సర్వ శక్తి సంపన్నుడు , సర్వ విశ్వ రక్షకుడు అని నమ్ముతారు ) . పార్వతీ దేవి మన్నుతో బొమ్మను చేసి పన్నెండేళ్ళు ఆ బొమ్మను పూజిస్తూ  వినాయకుని మూల మంత్రమైన ' గమ్ ' అనే మంత్రం జపిస్తూ  ఘోర తపస్సు చేస్తారు .   ఆరు చేతులు , తెల్లని రంగు , నెమలి వాహనుడు అయిన వినాయకుడు వారి తపస్సకి మెచ్చి పార్వతీ , పరమేశ్వరుల పుత్రునిగా అవతరించి " సింధు " ని సంహరిస్తాననే వరం ప్రసాదిస్తాడు . పార్వతీ దేవి తాను పూజించిన బొమ్మలోనే గణపతిని నివాసముండమని కోరుతుంది . భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడు పార్వతీ దేవి కోరికను మన్నించి పార్వతీ దేవి పుత్రునిగా జన్మించేడు . యీ ప్రదేశం లో పార్వతీ దేవికి మానస పుత్రునిగా జన్మించి గిరిజాత్మజ గణపతి అయ్యేడు .

శివపార్వతులు యితనికి గుణేశుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగేరు . గుణేశుడు ఆరవయేట ఘోర తపస్సు చేసి విస్వకర్మని ప్రసన్నం చేసుకొని పాశం . అంకుశం , పరశు , పద్మం లని పొందుతాడు . గుణేశుడు ఒకనాడు తోటి పిల్లలతో ఆటలాడుతూ మామిడి  చెట్టు పై నున్న అండాన్ని పగులకొడతాడు , అందులోంచి గణేశుని వాహనమైన మయూరం ప్రత్యక్ష మౌతుంది . మయురాన్ని వాహనం గా చేసుకొని గుణేశుడు మయురేశ్వరుడయేడు .

రాక్షసుడు " సింధు " , తనను సంహరించేందుకు  గణేశుడు , గుణేశుడు గా అవతరించెనని తెలుసుకొని బాలకుడైన గుణేశుని సంహరించేందుకు క్రూ రుడు , బాలాసురుడు ,వ్యోమాసురుడు , కుశాలుడు అనే రాక్షసులను పంపుతాడు . గుణేశుడు ఆ రాక్షసులను సంహరించి అనంతరం మొర్గావ్ ప్రాంతంలో " సింధు " ని సంహరిస్తాడు .

యిక్కడ ముఖ్యంగా వినాయక జయంతి మరియు వినాయక చవితి పండుగలు చాలా వైభవం గా జరుపుకుంటారు .

మరిన్ని శీర్షికలు
weekly horoscope 25th september to 1st december