Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 25th september to 1st december

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద  

గోదాదేవికి చెలికత్తెలు ఆమె పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుబెట్టారు. 

దివిజద్రుప్రసవంబుఁ గాంచిన సపత్నిం జూచి చూపోప కిం
తవుజిల్గుంబని యంత సేసి మది నీర్ష్యాక్రోధము ల్సందడిం
ప విరిం బోక ద్రుమంబుఁ గైకొనఁబతి న్మందన్న మ్రానెల్లఁ దే
నవధిం బెట్టిన సత్య వీ వహహ కావా భామినీ నావుడున్ 

దేవవృక్షపు పుష్పాన్ని, పారిజాత పుష్పాన్ని పొందిన సవతిని రుక్మిణిని జూసి, సహించలేక, చిన్న విషయాన్ని పెద్దలుగా జేసి, మనసులో ఈర్ష్య, క్రోధము చెలరేగి, పూవుతో పోనీయకుండా ఏకంగా చెట్టుకు చెట్టునే పొందిన దానివి, ఔషధం కోసము చెట్టుకు చెట్టునే తీసుకురావాల్సిన శ్రమను భర్త ఐన శ్రీకృష్ణ పరమాత్ముడికి కలిగించిన సత్యభామవు నీవే కదా, ఆహాహా! అని ఆశ్చర్యంగా అన్నట్లుగా,నవ్వుతూ అన్నట్లుగా అన్నారు చెలికత్తెలు.చీకటింట్లో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లోని వస్తువులు ఒక్కొక్కటే కనిపించినట్టు పూర్వజన్మ స్ఫురణతో పూర్వ జన్మలో పరమాత్మునితో పొందిన ఆనందం, ఆ అనుభవాలు అన్నీ గుర్తుకొచ్చాయి గోదాదేవికి.

వాలిక కన్నులం బొడము వారి సకజ్జల మాశ్రితశ్రవో
గోళక మై తదంతికపుఁ గుంతలవల్లికిఁ దల్లిఁదోడుగా 
మైలవలి న్నన ల్నిగుడు మైఁ బులకల్పొడమన్ శ్లథాంగియై 
సోలినఁ జూచి డెందములు సుర్రన హా యని బోటు లర్మిలిన్  

విశాలములైన సోగకన్నుల నుండి ఊరుతున్న నీరు కంటికాటుకతో కలిసి చెవులనే గోళములను  ఆశ్రయించాయి. ఆ చెవుల సమీపంలోనే ఉన్న తలవెంట్రుకలు అనే తల్లికి తోడుగా, ఆ తలవెంట్రుకలను తడిపేశాయి. ఆమె శరీరము అనే ఏలకి తీగకు పూచిన మొలకల్లాంటి మొగ్గలలాంటి పులకలు కలిగాయి. శరీరము క్రుశించినట్లు, నీరసించినట్లు మూర్ఛ పోయింది. అది చూసిన చెలికత్తెలకు బాధకలిగింది. ఆమె మీది ప్రేమతో యిలా బాధపడ్డారు. 

ఎంతకుఁ దెచ్చెనే సరసిజేక్షణచెయ్దము లందుమీద జ
న్మాంతరవర్తనంబు హృదయంబున కిత్తరి నెచ్చరించి గో
రంతలు కొండలంత లగునట్లుగఁ జేసితి మంచుఁ జేటికా 
వాంతసతాళవృంతమృదువాతహిమాంబుకనాళిఁ దేర్చినన్ 

ఈ పద్మాక్షి చేతలు ఎంతకు దెచ్చాయి! వాటిమీద ఆమె జన్మాంతర పోకడలను ఈ సమయంలో గుర్తుజేసి గోరంతలు కొండంతలుగా జేశామే! అని బాధపడుతూ చెలికత్తెలు విసనకర్రలతో చల్లని గాలిని వీచి, చల్లని నీటిని చిలుకరించి ఆమెను మూర్ఛనుండి తేల్చారు. మూర్ఛనుండి తేరుకున్న గోదాదేవి యిలా అన్నది.

తెలిసి కను దెఱచి వెండియు 
జలజేక్షణ తన్ముకుంద చరణ స్మృతిని 
శ్చలతఁ గను మొగిచి మరి య
శ్రులు రెప్పలఁ దోఁపఁ దెఱచి చూచి సఖులతోన్ 

తెలివి వచ్చి, కనులు తెరిచి మరలా ముకుందుని చరణములను గుర్తుచేసుకుని నిశ్చలంగా కనులు  మూసుకుని కొద్దిసేపు మౌనంగా ఉండి, రెప్పలమీద కన్నీరు కనిపిస్తుండగా కనులు తెరిచి చూస్తూ  చెలికత్తెలను ప్రశ్నించింది.

మీ రెవ్వ రనుటయును శృం
గారిణి మే మురగకన్యకల మింతకు ము
న్ధారుణి కేతెంచితి మన
నారామలఁ గౌగిలించి యార్తి న్బలికెన్

నేను పూర్వజన్మలో సత్యభామను, సరే, మీరెవ్వరు అని ప్రశ్నించగా, ఓ సుందరీ! మేము ఇంతకుముందు  నాగకన్యలము, భూలోకానికి యిలా వచ్చాము( మేము నాగకన్యకలము, నీకంటే ముందుగా భూలోకంలో జన్మించాము, నీ కోసం) అనగానే గోదాదేవి ఆర్తిగా వారిని కౌగిలించుకుని యిలా అన్నది.

(కొనసాగింపు వచ్చేవారం) 

వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని శీర్షికలు
Andhra Prawns Curry