Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: సిద్దార్థతో , తేజాను కూడా ప్రోగ్రాం కి రమ్మని చెప్పమంటుంది ప్రతిమ.  తననే స్వయంగా పిలవమంటాడు సిద్దార్థ..  ఆ తరువాత..

 

తేజాని విష్‌ చేస్తూ ప్రోగ్రామ్‌ ఎజెండా పేపర్‌ని వరలక్ష్మి చేతిలో పెట్టింది.

‘‘మీరొచ్చినందుకు సంతోషం...’’చెప్పింది తేజాకి.

‘‘నాకూ..మిమ్మల్ని మరోసారి కలిసినందుకు హ్యాపీ’’ అన్నాడు తేజా.

ఎర్ర చుడీదార్‌లో ముద్ద మందారంలా ముగ్ధ మోహనంగా ఉంది ప్రతిమ. ఆమెనలా చూస్తున్న కొద్దీ కళ్లార్పకుండా చూడాలనిపిస్తోంది. సభ్యత అడ్డొచ్చి చూపు మరల్చాడు. మరో అయిదు నిముషాలకు కార్యక్రమం ప్రారంభమైంది.
వరలక్ష్మివేదికమీదకుఒక్కొక్కర్నీపిలుస్తోంది.‘ఆకాశంలోనే కాదు...అవకాశాల్లోనూ సగమంటూ సమర్ధవంతంగా సృజనాత్మక పాత్రని పోషిస్తున్న వాగ్దేవి ప్రొడక్షన్‌ క్రియేటివ్‌ హెడ్‌ ప్రతిమకు స్వాగతం...’’ వరలక్ష్మి ప్రతిమను ఆహ్వానించింది. ఆ సమయంలో హాల్లో వినిపించిన చప్పట్ల ధ్వనిలో తేజా చేతులు చేసిన సందడే అధికం. వేదికపై ఆసీనురాలైన ప్రతిమను తదేకంగా, తన్మయంగా చూస్తున్న తేజా భుజంపై బలంగా ఓ చేయి పడడంతో ఉలిక్కి పడ్డాడు.

ఆ చేయి సిద్దార్ధది.

‘‘ఇంతాలస్యమైందేం?’’

‘‘ట్రాఫిక్‌ జాం...’’అనేసాడు సిద్దార్థ.

‘‘సిటీల్లోఅన్నిఆలస్యాలకు ఒకే ఒక కారణం...ట్రాఫిక్‌ జాం. అలాంటి ట్రాఫిక్‌ జాం ను కూడా రెండు గంటల పాటు ఆపి మానవత్వాన్ని చాటుకున్నారు చెన్నయ్‌ వాసులు’’ రాత్రి చానెల్‌లో టెలి కాస్టయిన ఓ ప్రోగ్రాం గుర్తొచ్చింది తేజాకి. గుండె జబ్బుతో బాధ పడుతున్న ఓ యువతిని బతికించడం కోసం ఆ మహా నగరంలో ట్రాఫిక్కే ఆగి పోయింది. ఆ ఇన్సిడెంట్‌ వివరాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే...’’ అన్నాడు తేజ. ‘‘చెప్పు..తెలుసుకుంటాను’’అన్నాడు సిద్దార్థ.

‘‘ఇదో చిన్న ఇన్సిడెంటే. అయితేనేం గొప్ప నీతి ఉందిందులో...’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు.

చెన్నయ్‌ అడయార్‌లోని ఫోర్టిన్‌ మలార్‌ ఆస్పత్రిలో గుండె మార్పిడి కోసం ముంబైకి చెందిన జోషి అనే 21 ఏళ్ల యువతి ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది. కాంచి పురం జిల్లా మధురాంతకం ప్రాంతానికి చెందిన లోక్‌ నాథన్‌ అనే ఓ ఇరవయ్యేడేళ్ల యువకుడు యాక్సిడెంట్‌కు గురై కోమాలోకి వెళ్లాడు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన తమ కుమారుడు బతకడని తెలుసుకున్న ఆ యువకుడి తల్లి ఆరోగ్యంగా ఉన్న అతడి గుండెను దానం చేసేందుకు ముందు కొచ్చింది. ఈ యువకుడు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాస్పత్రిలోఉంటే..ఆ యువతి అక్కడికి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫోర్టీన్‌ మలార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాధారణ సమయాల్లో ఈ రెండు ఆస్పత్రుల మధ్య ప్రయాణానికి 45 నిముషాలు పడుతుంది. అయితే, బాక్స్‌లో అమర్చిన ఆ యువకుడి గుండెను అంబులెన్స్‌లో ఫోర్టీన్‌ మలార్‌ ఆస్పత్రికి కేవలం 13 నిముషాల 22 సెకన్ల లోనే తీసుకొచ్చారు. ఆ రెండు ఆస్పత్రుల మధ్య 12 జంక్షన్లున్నాయి. గుండె మార్పిడి చికిత్సను విజయ వంతం చేసేందుకు వైద్యులు పోలీసుల సాయం తీసుకున్నారు. దాంతో... ఆ రెండు ఆస్పత్రుల మధ్య రెండు గంటల పాటు రెడ్‌ సిగ్నల్స్‌ పడకుండా, ట్రాఫిక్‌ జాం లేకుండా చర్యలు తీసుకున్నారు.

‘ఓ ప్రాణం రక్షించడం కోసం మానవత్వం పరిమళించడం అంటే...ఇదే!’ సిద్దార్థకు ఆ ఇన్సిడెంట్‌ చెప్తూ అన్నాడు తేజ.

‘‘హ్యాట్సాఫ్‌...’’అన్నాడు సిద్దార్థ.

‘ప్రియతమా’ సినిమా సక్సెస్‌ గురించి వక్తలు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు.

సినిమాలో విషయం ఉంది కనుకనే విజయవంతమైందని చెప్తున్నారు. ప్రత్యేకించి ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ రక్కసి పై కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని నొక్కి వక్కా ణించారు.

హీరో, హీరోయిన్‌ తమ ప్రసంగాల్లో ఈ సినిమాలో నటించే మంచి అవకాశం వచ్చినందుకు థాంక్స్‌ చెప్పారు. ఆ తర్వాత...ప్రతిమ మైకు అందుకుంది.

‘‘చాలా క్లిష్ట సమయంలో ఈ సినిమా రిలీజ్‌ చేసాం. ముందు గానే ఇంటర్నెట్‌ లో రిలీజై పోయిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్‌ ని సాధిస్తుందని మేం అనుకోలేదు. కానీ...మనసున్న ప్రేక్షకులు ఈ సినిమాని అక్కున చేర్చుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌ అయింది. మా సంస్థ గత చరిత్ర ఒక్కసారి పరిశీలిస్తే...వాగ్దేవి ప్రొడక్షన్స్‌ ఎప్పుడూ సక్సెస్‌ మీట్‌ లు పెట్టలేదు. అందుకు విరుద్ధంగా ఈ సారి ఈ ప్రోగ్రామ్‌ ఎరేంజ్‌ చేయడానికి ఇద్దరు కారణం...ఆ ఇద్దరూ ప్రసాద్‌, విజయ్‌...’’ అంటూ ఒక్క సారి తన స్పీచ్‌ ఆపి సభికుల వైపు చూసింది ప్రతిమ.

ఆ ఇద్దరూ ఎవరా? అనే సభికుల్లో కలిగింది. కొద్ది క్షణాల విరామం తర్వాత మళ్లీ ప్రతిమ చెప్తోంది` ‘‘ఈ ఇద్దరూ విశాఖకు చెందిన వాళ్లు. మా ప్రియతమా...సినిమా హిట్‌ కు పరోక్ష కారకులు. ఎందుకంటే...ఈ సినిమాని నెటిజన్లకు ఇంట్రడ్యూస్‌ చేసింది వీళ్లిద్దరే. విజయ్‌...ఇండస్ట్రీకి చెందిన ఎడిటింగ్‌ విభాగంలో పని చేస్తుంటాడు. ఇతడి ఫ్రెండ్‌ ప్రసాద్‌. వీళ్లిద్దరూ వాగ్దేవి ప్రొడక్షన్స్‌కి వీర ఫ్యాన్స్‌. ఈ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ సినిమాకి ఎడిట్‌ వర్క్‌ చేస్తున్న విజయ్‌...దొంగ చాటుగా ఈ సినిమాని పెన్‌ డ్రైవ్‌ లోకి ఎక్కించి...తనూరు వెళ్లినప్పుడు రిలీజ్‌కి ముందే సినిమా చూపిస్తానంటూ ప్రసాద్‌కి చూపించాడు. ఆ సినిమాని ఆ ఇద్దరే చూసినా బాగుండేది. కానీ...సినిమా బాగా నచ్చడంతో..ప్రసాద్‌ విజయ్‌కి తెలీకుండా ఇంటర్నెట్‌ లో అప్‌ లోడ్‌ చేసాడు. ఆ తర్వాత...ఈ సినిమాకి ఇంటర్నెట్‌ లో లభించిన ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. వందల షేర్లు, వేల లైక్‌ లతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. థియేటర్ లో రిలీజ్‌ కావాల్సిన సినిమా ఇంటర్నెట్‌ లో హల్‌ చల్‌ చేస్తుండడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టాం. ఇంటర్నెట్‌ లో ప్లే కాకుండా బ్లాక్‌ చేయడంతో ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ను అపాయింట్‌ చేసుకుని మరీ ఈ సైబర్‌ క్రయిం తీగ లాగాం. డొంక కదిల్చాం. ఆ ఇద్దరూ దొరికి పోయారు. ఇక్కడే ఎడిటింగ్‌ విభాగంలో పని చేస్తున్న విజయ్‌ ని, విశాఖ లో ఉంటున్న ప్రసాద్‌ ని విచారించాం. తెలీక తప్పు చేసామంటూ లబో దిబో మన్నారిద్దరూ. మాకూ జాలేసింది. రిలీజ్‌ కాని మా సినిమాని దొంగిలించడం వారు చేసిన తప్పే. అయితే, ఆ సినిమాని నడి బజార్లో పెట్టి అమ్ముకోవాలని చూడ లేదు. దొంగ వ్యాపారం చేయాలనుకో లేదు. అత్యుత్సాహం కొద్దీ ఇంటర్నెట్‌ లో పెట్టి అడ్డంగా బుక్కయ్యారు...’’ చెప్తోంది ప్రతిమ.

‘‘అయితే, ఆ ఇద్దరిపై మీరే చర్యలు తీసుకోవడం లేదా?’’ ఓ చానెల్‌ ప్రతినిధి ప్రశ్నించాడు.

‘‘ముందు చర్యలు తీసుకుందామనే అనుకున్నాం. పోలీస్‌ కంప్లయింటిచ్చి కట కటాల వెనక్కి తోయాలనుకున్నాం. కానీ, మా చైర్మన్‌ గారు ఒప్పుకోలేదు. కొత్త సినిమాల్ని కబళించేందుకు చుట్టూ ఉన్న పెద్ద తిమింగలాల్నివదిలేసి...దొరికి పోతామనే స్పృహ లేకుండా తప్పు చేసిన అమాయకుల్ని వదిలి పెట్టమన్నారు. అలాగని శిక్ష పడ లేదనుకో వద్దు. విజయ్‌ ఉద్యోగం పోయింది. అంటే...అతడి కథ మళ్లీ మొదటికొచ్చిందన్న మాటే కదా! ఉద్యోగం వెతుక్కోవాలి. ఎక్కడ వెతుక్కోవాలి? ఇంత కాలం ఏ రంగంలో పని చేసి, అనుభవం సంపాదించాడో అదే రంగంలో ఉపాధి వెతుక్కోవాలి. ఈ ఫ్లాష్‌ బ్యాక్‌ తెలిసిన తర్వాత అతడికెవరు ఉద్యోగం ఇస్తారు? అంటే...తెలీక చేసినా, తెలిసి చేసినా తప్పు నిప్పు లాంటిదే. కాల్చేస్తుంది’’ అంది ప్రతిమ కించిత్‌ ఆవేశంగా.

‘‘తను చేసిన పని వల్లే ఫ్రెండ్‌ ఉద్యోగం పోయిందనే అపరాధ భావంతో కుమిలి పోవడం కన్నా ప్రసాద్‌ కి పెద్ద శిక్షే ముంటుంది? సమాజంలో అందరికీ తెలిసేలా వాళ్లిద్దరూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కక పోవచ్చు. కోర్టు దాకా కేసు వెళ్లక పోవచ్చు. అంతకు మించిన శిక్షను జీవితంలో అనుభవిస్తున్నారు. గతాన్ని చెరిపేసే రబ్బర్నిఇంత వరకెవరూ కని పెట్ట లేదు. కాబట్టి...వాళ్లిద్దర్నీ ఈ మచ్చ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది’’

‘‘అయితే, ఈ సక్సెస్‌ మీట్‌ ఎందుకు పెట్టినట్లో?’’ ఇంకో రిపోర్టర్‌ అడిగాడా ప్రశ్నని.

‘‘సినిమా సక్సెస్‌ ని మీతో పంచుకోవాలని...’’ చెప్పింది ప్రతిమ.

‘‘దాంతో పాటు...పైరసీ అరి కట్టేందుకు నిర్మాణాత్మకమైన కొన్ని చర్యల్ని తీసుకో బోతున్నామని చెప్పేందుకే ఈ మీట్‌. ఇండస్ట్రీ ప్రముఖులు, మీడియా పర్సన్స్‌, సైబర్‌ క్రయిం పోలీస్‌ అఫిషీయల్స్‌, మేధావులతో ఓ వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. పైరసీకి సంబంధించిన ఫిర్యాదుల్ని ఆ వేదిక స్వీకరించి అనుమానితుల పై డేగ కళ్లతో నిఘా పెడ్తుంది. ఇటీవల మా సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందులు సాధ్యమైనంత వరకూ మరో సంస్థకు ఎదురు కాకుండా చూసేందుకు ఈ వేదిక పని చేస్తుంది. ఆ విషయం ప్రకటించేందుకే ఈ సక్సెస్‌ మీట్‌ ను వినియోగించుకుంటున్నాం. ఈ క్షణం నుంచి మేం ప్రకటించిన సరి కొత్త వేదిక నిర్మాణం గురించి కృషి జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్లు మమ్మల్ని సంప్రదించొచ్చు...’’ స్పీచ్‌ ముగించి మైకు యాంకర్‌ వరలక్ష్మి చేతి కందించింది ప్రతిమ. సభా వేదిక మీద ఉన్న పెద్దల్తో పాటు, సభికులు కరతాళ ధ్వనులతో ప్రతిమకు ప్రశంసలందించారు.

‘‘ఆతిధ్యం స్వీకరించకుండా ఎవరూ వెళ్లి పోవద్దు. భోజన ఏర్పాట్లున్నాయి’’వరలక్ష్మి ప్రకటిస్తోంది.

‘‘పరంధామ్‌ రాలేదేం?’’ అడిగాడు సిద్దార్ధ బఫే దగ్గర ప్రతిమ కలిసినప్పుడు.

‘‘అలిగినట్లున్నాడు...’’ ఆన్సరిచ్చింది ప్రతిమ.

‘‘ఏం...?’’

‘‘అతడ్నీ అనుమానించాం కదా...’’

‘‘ఓహో...అయితే, మీకూ నా మీద కోపం రావాలి’’

‘‘ఎందుకు?’’

‘‘సిన్సియర్‌ గా చెప్పనా?’’

‘‘మీ సిన్సీయార్టీ పై నాకు అనుమానం లేదు’’

‘‘మిమ్మల్నీ అనుమానించాను’’

‘‘ఔనా...’’ ఆశ్చర్య పోయింది ప్రతిమ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika