Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
deathmistery

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: చంద్రకళ నాన్నగారికి  ‘మయస్తీనగ్రావిస్’ అనే వ్యాధి రావడం తో చాలా అధైర్యపడుతుంటాడు. భూషణ్ అంకుల్ మాత్రం ధైర్యం చెప్తాడు.. కానీ చంద్రకళ నాన్నగారు మాత్రం తన కూతురిపై పెట్టుకున్న ఆశలు, తనని ఎంతో గొప్పకళాకారిణిగా  చూడాలని ఆశపడుతున్నానని భూషణ్ అంకుల్ తో తన మనసులోని ఆవేదనను వ్యక్తపరుస్తారు.. ఆ తరువాత.. 

రాత్రి భోజనానికి, నాన్నకిష్టమైన అరటి పువ్వు కర్రీ, ఉర్ల గడ్డ కారంతో పాటు, నాకిష్టమైన వంటకాలు చేసింది కోటమ్మత్త,
‘మేము ఊళ్ళో లేని ఈ వారం రోజుల్లో విశేషాలు ఏమిటి,”  అడిగింది అమ్మ నాన్న ప్లేటులో వడ్డిస్తూ.....
వినోద్ కల్పించుకున్నాడు...

“మీరు లేరుగా, నాన్న రోజూ నన్ను ఐస్ క్రీం తిననిచ్చారు.  మాతో పాటు గ్రౌండ్స్ లో క్రికెట్ కూడా ఆడారు,” సంతోషంగా వాడు.

“ఔనా? ఆటలు మంచిదే కాని, రోజూ ఐస్ క్రీం తినడం ఏమిటి?” నాన్న వంక చూస్తూ అమ్మ.

“అదేమీ లేదు. రెండు సార్లు వాడి ఫ్రెండ్స్ ని కూడా తీసుకుని పార్లర్ కి వెళ్లాను.  అంతే,...” నవ్వారు నాన్న.

“ఇక పోతే, ఆర్మీ డ్యూటి విషయంగా, మా సుపీరియర్స్ ని, లాయర్ని కూడా కలిసాను. క్లియర్ గా డిస్కస్ చేసాను.  రామ్ తో కూడా మాట్లాడాను. ఇంక రిటర్మెంట్ విషయంగా ముందడుగు వేయడమే. మీరు ఊరి నుండి వచ్చాక, భూషణ్ వాళ్ళకి కూడా చెబుదామని ఆగాను. వాళ్ళని, రేపు సాయంత్రం డిన్నర్ కి రమ్మందామా?” అడిగారు నాన్న.

భోజనమయ్యాక, భూషణ్ అంకుల్ కి ఫోన్ చేసి, వాళ్ళని మరు నాడు డిన్నర్ కి పిలిచారు.

**

నేను డాన్స్ క్లాస్ నుండి వచ్చేప్పటికే అంకుల్, ఆంటీ వచ్చున్నారు....

నాన్న వాళ్ళతో మాట్లాడుతుండగా, నన్ను, వినోద్ ని భోంచేసేయమంది అమ్మ.

ఆర్మీ నుండి ‘ప్రి-మెచ్యూర్ రిటైర్మెంట్‘ తీసుకోడానికి డిసైడ్ అయ్యానని, సమ్మర్ అయ్యాక అఫీషియల్ గా ఆర్మీ నుండి రిటైర్ అవుతానని, తన సివిల్ పోస్టింగ్ కూడా చెన్నైకి దగ్గరిగా వచ్చేలా ప్రయత్నాలు మొదలు పెడతానని, అంకుల్ కి వివరించారు నాన్న.

“మొత్తానికి ఇదో కొత్త చాప్టర్...నీలైఫ్ లో.....అంతా సవ్యంగా ఉంటుందిలే సత్యం.  ఇక పోతే, నీ సివిల్ పోస్టింగ్ కి- నెల్లూరు, తిరుపతి, మంచి సెంటర్స్ కదా!,” అన్నారు అంకుల్...

వాళ్ళ మాటలు వింటూ, మేము మా డిన్నర్ ముగించాము....

డైనింగ్ టేబిల్ మీద మళ్ళీ వంటకాలన్నీ సర్ది, అంకుల్ వాళ్ళని భోజనానికి పిలిచింది అమ్మ.

**

‘రాగం-తానం-పల్లవి’ టెలి-ఫిలిం షూటింగ్ మొదటి రోజు, భూషణ్ అంకుల్ వాళ్ళ స్టూడియోలోనే ప్రారంభ పూజ చేసారు.

రెండు రోజుల పాటు కోటమ్మత్త కూడా షూటింగ్ చూడ్డానికి, వచ్చింది.

“అమ్మో, ఎంత కళ ఉందమ్మా నీలో!  నీ వేషం కూడా చాలా నచ్చింది నాకు.  ఎంత ముద్దుగా ఉన్నావో,” , “పోనీలే,  ఆ దేవుడే మీకు మేలు చెయ్యాలి,”  అంటూ ఆశీర్వదించిందామె.

షూటింగ్, ఓ కొత్త అనుభవం.. ఉత్సాహంగా జరుగుతుంది..నాన్న అప్పుడప్పుడు వచ్చి కాసేపు ఉండి, మాతో లంచ్ చేసి వెళుతున్నారు.

**

తేజశ్విని గారి ఫామిలీని కలిశాము.  ఆమె కూతురు కవిత, హీరోయిన్ కళ్యాణి పాత్రలో నటిస్తుంది..నేను టీనేజర్ కళ్యాణి అయితే, ఆమె ఎదిగిన కళ్యాణి పాత్ర పోషిస్తుంది.

తేజశ్విని గారి కొడుకు విక్రమ్. జగదీష్ లాగానే ఉన్నాడు.  ఇంకాస్త పొడవుగా, సన్నగా ఉన్నాడు. మంచి మాటకారి...అక్కా తమ్ముళ్ళు ఇద్దరు, నాతో ఫ్రెండ్లీ గా ఉన్నారు.

షూటింగ్ కూడా, ఏ మాత్రం వొత్తిడి లేకుండా, పిక్నిక్ లా అనిపిస్తుంది.

**

రోజూ ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యేప్పటికి, నాన్న, కోటమ్మత్త షూటింగ్ కబుర్ల కోసం చుట్టూ చేరుతారు.  అదే టైం కి జగదీష్ కూడా ఫోన్ చేస్తాడు. ఫోన్ స్పీకర్ మీదుంచి, అందరికీ ఒకే సారి షూటింగ్ విశేషాలు చెప్పాకే భోంచేస్తాను.

రెండు రోజుల షూటింగ్ మిగిలుండగా, రోజూలా ఫోన్ చేసిన జగదీష్, “ఇవాళ ముందు నన్ను న్యూస్ చెప్పనివ్వు,” అన్నాడు.  రాణి సంగతులు చెప్పడం మొదలు పెట్టాడు.

“రేపు వాళ్ళ స్టుడియోలోనే ఏదో తమిళ్ మూవీ కి రాణి సాంగ్ రికార్డింగ్ చేస్తుందట.  మీ టెలి-ఫిలిం టెలి కాస్ట్ అయ్యే టైం కి ఆ తమిళ్ మూవీ రిలీజ్ అవుతుందట,” అన్నాడు...

నా ఆడిషన్స్ జరుగుతున్నప్పుడే, తను ఇలా మూవీ సాంగ్ రికార్డ్ చేయబోతానని చెప్పిందని గుర్తు చేసాను...

‘ఇక్కడ కబుర్లు కొన్ని నా కంటే ముందే రాణి నుండి తెలుసుకుంటాడు జగదీష్.  అదే నాకు నచ్చదు.  కానీ ఏమంటాను!. 

ఇదివరకంటే, నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు.  ఇప్పుడు అన్ని కబుర్లు చెబుతూనే ఉంటాను అతనికి. ‘అయినా, అసలు రాణితో పోటీ పడ్డం అయ్యే పని కాదు’ అని మనసులోనే అనుకున్నాను.

ఇక మళ్ళీ రేపే మాట్లాడుతానని, ‘బై’ చెప్పి ఫోన్ పెట్టేసాను....

**

టెలి-ఫిలిం షూటింగ్ ముగిసిన సంధర్భంగా భూషణ్ అంకుల్ వాళ్ళింటికి డిన్నర్ కి వెళ్ళాము.

వాళ్ళ గార్డెన్-హౌజ్ లో నే డిన్నర్ ఏర్పాటు చేసారు.. నాన్నా వాళ్ళతో, విక్రమ్, కవిత కబుర్లు మొదలు బెట్టారు. విక్రమ్ మాట్లాడే, వచ్చీ రాని తెలుగు బాగుందన్నారు నాన్న.  షూటింగ్ సందర్భంగా, గడిచిన నెల రోజుల్లో, విక్రమ్ కి బాగానే దగ్గరయ్యాడు వినోద్.  ఇద్దరూ కలిసి సెట్స్ మీద అల్లరి చేసేవారు.  

**

డిన్నర్ కి,  చైనీస్ ఫుడ్ సర్వ్ చేసారు.  కబుర్లు చెప్పుకుంటూ, డిన్నర్ ఎంజాయ్ చేసాము.  భోజనాలయ్యాక, అందరం తేజశ్విని మేడమ్ చుట్టూ చేరాము.

నాన్న వచ్చి నా వెనుకగా నిలబడ్డారు.

“మరైతే, తేజశ్విని గారు, మా అమ్మాయి మీ అడుగు జాడల్లో నడవాలనుకుంటుంది.  మీ గురువుగారితో సహా, అంతా కళ ని మీతోనే పోలుస్తున్నారు.  నాట్య రంగంలో ఎదగాలని, దేశ విదేశాలు పర్యటించి ప్రదర్శనలిచ్చి,  మీలాగా స్థిర పడి, మా చంద్రకళ కూడా ఈ విద్యని తన తరువాతి తరం వారికి నేర్పించాలని, నా కోరిక, మా ఆశయం. మీరేమంటారు?  మా బోటి వారికి అది సాధ్యమేనా?” అడిగారు నాన్న.
....”తేజశ్విని మేడమ్ ఏమంటుందో నేను చెప్పుతా,” అన్నాడు విక్రమ్ చేయి పైకెత్తి...

నేనూ కుతూహలంగా అతని వంక చూసాను.

నా గురించి వాళ్ళమ్మ గొప్పగా చెప్పిందని,  నన్ను మీట్ అయ్యాకే, అదంతా నిజమని తెలిసిందన్నాడు విక్రమ్. అక్కడితో ఆగకుండా, అతిశయం లేని నాలాంటి అమ్మాయిని తనెక్కడా చూడ లేదని, నేను తనకి చాలా నచ్చానంటూ, అందరికి వినబడేలా చెప్పాడు..
అతని మాటలు నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.

“ఆ క్రెడిట్ వాళ్ళ పేరెంట్స్ కి ఇద్దాము విక్రమ్,” అన్నారు భూషణ్ అంకుల్...

“మరైతే అందరూ నోరు తీపి చేసుకోండి,” అంటూ డెజర్ట్ సర్వ్ చేయించింది నీరూ ఆంటీ...

“మా చంద్ర కళ పై మంచి అభిప్రాయం ఉంచుకున్నందుకు థాంక్స్ తేజశ్విని గారు.  మీ సలహా కూడా మాకు కావాలి,” అన్నారు నాన్న ఫ్రూట్ తింటూ.

“ఇంత డెడికేషన్ ఉన్న అమ్మాయికి అసాధ్యమేముంది మేజర్ గారు?  ముందుగా అంతర్జాతీయంగా అవకాశం వచ్చి కొంత టూర్ చెయ్యాలి.  మన భూషణ్ ఉన్నారుగా ప్లాన్ చేస్తారు. తన చదువయ్యాకే, చంద్రకళ అమెరికాకి రావచ్చు.  మేము అక్కడ యోగ ఇన్స్టి  ట్యూట్ కూడా స్టార్ట్ చెయ్య బోతున్నాము.. ముందైతే, ఇటు డాన్స్, అటు యోగ కూడా సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయవచ్చు చంద్రకళ,” , “ఇక ఆ తరువాత, అక్కడే స్థిర పడాలంటే, నా ప్రోత్సాహం ఎలాగూ ఉంటుంది,”... అన్నారు తేజశ్విని మేడమ్ జవాబుగా, నాన్నతో...

**

అమెరికా లోని కళారంగం, కళాకారుల పరిస్థితి గురించి,  నాన్న అడుగుతున్న ప్రశ్నలకి తాపిగా జవాబులిస్తున్నారు తేజశ్విని గారు...నేను అమ్మా కూడా ఆసక్తిగా వింటున్నాము.

“హే, చంద్ర కళా, పూర్తిగా మర్చి పోయాను,”  అంది ఉన్నట్టుండి కవిత నాతో.......

సెట్స్ మీద తను తీసిన ఫోటోస్ ఇ-మెయిల్ చేస్తానంటూ, నా ఇ-మెయిల్ ఐ.డి అడిగింది.

నాకు స్కూల్ మ్యూజిక్ గ్రూప్, అకడెమిక్ రిసోర్స్ ఇ-మెయిల్ తప్ప, పర్సనల్ కంప్యూటర్ గాని, వేరే ఇ-మెయిల్ ఐ.డి గాని లేదని చెప్పాను. విక్రమ్, కవిత ఒక్క సారిగా ఆశ్చర్య పోయారు.

“దట్స్ నాట్ రైట్,” అన్నాడు విక్రమ్.

మా టెలి-ఫిలిం డాన్సులు, ఫోటోస్ కూడా, వాళ్ళ ఇన్స్టిట్యూట్ వెబ్-పేజ్ మీద,

యూ-ట్యూబ్ లోనూ పెడతారు కాబట్టి,  నాకు ల్యాప్ టాప్ చాలా అవసరమంది కవిత. త్వరగా ఒక ల్యాప్ టాప్ పర్ చేజ్ చేసి, తమతో చాట్ చెయ్యాలన్నాడు విక్రమ్.

ఇదంతా వింటున్న రాణి నవ్వింది.  “చంద్రకళ ఈ మధ్యనే సెల్ ఫోను వాడడం మొదలు పెట్టింది. కంప్యూటర్ అంటే, మళ్ళీ ఢిల్లీలో ఉన్న తన కజిన్ ల్యాప్ టాప్ కొని పెట్టి, నేర్పిస్తేనే ఏమన్నా,” అంది గొంతెత్తి అందరికీ విన బడేలా.

ఒక్క  నిముషం ఎవరు ఏమీ అన లేదు.

చాలా అవమానంగా అనిపించి, తల దించుకున్నాను.

“హే, యు రాణి.  లీవ్ హర్ ఎలోన్. అంత రూడ్ గా మాట్లాడుతావేంటి. ఆమె ఒక ఆర్టిస్ట్, ఆమెకి కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ లేదేమో,” అన్నాడు విక్రమ్, అంతే గట్టిగా.

“వాట్ ఆర్ వి? మేము కూడా ఆర్టిస్ట్ ల మే విక్రమ్,” అంటూ నవ్వేసింది రాణి.

“అందరి అమ్మాయిల్లా కాదు చంద్ర కళ, షి ఇజ్ డెడికేటెడ్ టు హర్ ఆర్ట్,” అన్నాడు విక్రమ్.

రాణి కాస్త షాకయినట్టుగా చూసి, మౌనంగా ఉండి పోయింది.

“మామ్, మనం వెళ్ళే లోగానే, మనస్టార్ కి ఓ ల్యాప్ టాప్, గిఫ్ట్ గా ఇవ్వాలి,” అన్నాడు విక్రమ్ వాళ్ళ మమ్మీతో.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasi pattiste koti