Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 జరిగిన కథ: దీక్ష బాగా  ఏడుస్తూనే వుంటుంది.   ఏడ్చినందువల్ల లాభం ఏమన్నా వుందా? అయిందేదో అయింది. సహస్ర క్షేమంగా ఉంది. కాదంటే కిడ్నాపర్స్‌ చేతిలో వుంది. అడిగిన డబ్బిచ్చి తీసుకొచ్చేద్దాం. ఏడవకు’’ అని దీక్షతో  అంటాడు విరాట్ .. ఆ తరువాత... 

సుమారు సాయంత్రం మూడు గంటలవుతుండగా దీక్ష ఇంటికి చేరుకున్నారంతా. అక్కడ దీక్షతో బాటు ఇద్దరు  కదిరేషన్‌ మనుషులు మాత్రమే వున్నారు. బంధించి వుంచిన ఎట్టయప్ప మనిషిని వదిలేసారు.

వచ్చినప్పట్నుంచి దీక్ష సహస్ర కోసం ఏడుస్తూనే వుంది. అంతా తిరిగి రాగానే ముందు దీక్షను ఓదార్చి ధైైర్యం చెప్పారు. అప్పటికింకా ఎవరూ భోంచేయలేదు. వంటలు చేసి సిద్దంగా ఉంచటానికి అక్కడ ఎవరన్నా ఉంటేగా.

అలాగని అప్పటికప్పుడు వండి వార్చాలన్నా సుమారు ఏభై మందికి పైగా వున్నారు. జరిగే పని కాదు. కాబట్టి వచ్చీ రాగానే అందరికీ భోజనాలు తెచ్చేందుకు నలుగుర్ని బస్‌ లో డబ్బిచ్చి తరిమాడు విరాట్‌.

నాలుగు గంటలవుతుండగా హోటల్‌ వాళ్ళే ముగ్గురు మనుషులొచ్చి అదే బస్‌లో భోజనం కూరలు అన్నీ పంపించారు. వాళ్ళే అందరికీ వడ్డించారు. భోంచేసి వాళ్ళని పంపించేసరికి నాలుగు నలభై నిముషాలయింది.

ఇందులో భోంచేయని వాడు మునుసామి ఒక్కడే. వయసవుతోంది గాబట్టి ఎటూ గాని టైంలో తింటే అరగదంటూ కాస్త మందు పుచ్చుకొని పక్కకు పోయి పడుకున్నాడు. చాలా మంది విశ్రాంతి తీసుకొని ఆరు గంటలకు లేచారు.

అక్కడ్నుంచి తిరిగి టెన్షన్‌ మొదలయింది.

ఇంత వరకు కిడ్నపర్ల నుంచి గాని, సహస్ర నుంచి గాని ఫోన్‌ రాకపోవటం కొంచెం కంగారు పుట్టిస్తోంది. ఈ లోపల ఆఫీసు నుంచి చందూ ఇంటికొచ్చాడు. అప్పటి వరకు చందూకి ఇక్కడ జరిగిన విషయాలేమీ తెలీదు. చందూను చూడగానే దుఖ్ఖం ఆపుకోలేక తిరిగి ఏడ్చేసింది దీక్ష. అంతలో విశాల రివ్వున దూసుకొచ్చి గేటు బయట ఆగింది.

రోజూ ఉదయం సాయంత్రం సహస్రకు ఫోన్‌ చేసి మాట్లాడటం విశాల అలవాటు. ముఖ్యంగా విశాల ఇంటి నుంచి అంతా వచ్చేసాక తనిక్కడికి రాకూడదు గాబట్టి ఫోన్‌ చేస్తుంటుంది. ఇవాళ అయిదు గంటల తర్వాత నుంచి ఎన్ని సార్లు ఫోన్‌  చేసినా సహస్ర ఫోన్‌ స్విచ్చాఫ్‌ లో ఉండటంతో అనుమానం వచ్చి ఏమైనా అయిందని సరాసరి వచ్చేసింది. దాంతో విశాలకీ కిడ్నాప్‌ సంగతి తెలిసి పోయింది. ఏం చేయాలో తెలీక దీక్ష పక్కన కూచుని ఓదారుస్తూ ఉండిపోయింది.

క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి.

వీధి దీపాలు వెలిగాయి.

రాత్రి ఏడు గంటలు కావస్తోంది.

ఇటు నుంచి చేస్తే స్విచ్చాఫ్‌ వస్తోంది.

క్షణాలు గడిచే కొద్ది టెన్షన్‌ పెరిగి పోతోంది. విశాల ఇంటికి తిరిగి వెళ్ళలేదు. దీక్షకు తోడుగా అక్కడే ఉండిపోయింది. ఇంట్లోను బయటా పట్ట పగల్లా లైట్లు వెలుగుతున్నాయి. ఇంటి నిండా జనం. సాయంత్రం హాల్లో సోఫాలో కూచున్న విరాట్‌ ఇంత వరకు లేవ లేదు. ఫోన్‌ కోసం ఎదురు తెన్నులు చూస్తున్నాడు. అందరి పరిస్థితీ ఇంచు మించుగా అదే.

‘‘ఎందుకు మీరంతా అనవసరంగా టెన్షన్‌ పడతారు? సహస్ర కిడ్నాపర్ల వద్దనే సేఫ్‌గా ఉంది. అది నిజం. ఏదో టైంలో ఎలాగూ వాళ్ళు ఫోన్‌ చేయకుండా ఉండరు. ఓపిగ్గా వెయిట్‌ చేద్దాం. కంగారు పడితే పనులవుతాయా?’’ అంటూ విరాట్‌తో సహా అందరికీ హితబోధ చేసాడు మునుసామి.

‘‘కంగారు పడకుండా ఎలా ఉండగలను గురువు గారూ? మధ్యాహ్నం ఎప్పుడో ఒంటి గంట ప్రాంతంలో కిడ్నాప్‌ జరిగింది. ఎంత మత్తు మందు ప్రభావమైనా ఇంతవరకు స్పృహ రాకుండా ఉంటుందా? ఏం జరుగుతోందక్కడ అని ఆందోళనగా ఉంది’’ ఉన్నాడు విరాట్‌.

‘‘ఎందుకు ఆందోళన చిన బాబు. కొమ్ములు తిరిగిన మగవాళ్ళనే కాల్చేసిన సహస్రకి ఆకతాయి కుర్రాళ్ళు ఓ లెక్క. ఏదో మాజిక్‌ చేసి వాళ్ళని విరగ దీసి ఇప్పుడో కాస్సేపటికో తప్పించుకు వచ్చినా వచ్చేస్తుంది. ఇంకా స్పృహలోకి వచ్చుండక పోవచ్చు. ఇందులో మనం భయ పడాల్సిన సమస్య ఏమీ లేదు. అంతగా అవసరమైతే వాళ్ళడిగిన డబ్బు ఇచ్చి ఎలాగో విడిపించడానికి సిద్దంగా వున్నాం. భయమెందుకు వెయిట్‌ అండ్‌సీ’’ అన్నాడు మునుసామి. ఆయన మాటల్ని ధర్మ కదిరేషన్‌లు కూడ సమర్దించటంతో అంతటితో మౌనంగా ఉండి పోయాడు విరాట్‌. ఇలా టెన్షన్‌ టెన్షన్‌గా సమయం కదిలి పోతూనే ఉంది.

రాత్రి పది దాటింది.

పదకొండు దాటింది.

ఆ పూటకు టిఫిన్లతో సరి పెట్టుకున్నారంతా.

పదకొండున్నరవుతున్నా ఫోన్‌ రాకపోవడంతో ఇక ఈ రాత్రికి ఫోన్‌ చేయక పోవచ్చని మునుసామితో బాటు అంతా నిర్ణయానికొచ్చేసారు. ఇక నిద్ర పోవటం మంచిదని ఎక్కడివాళ్ళక్కడ సర్దుకొంటూండగా సడెన్‌గా విరాట్‌ సెల్‌ మోగింది.

ఒక్క దూకులో ఫోన్‌ అందుకొని చూసాడు విరాట్‌. అది సహస్ర సెల్‌ నుంచే వచ్చిన ఫోన్‌. కిడ్నాపర్లే లైన్‌లో ఉన్నారనుకొంటూ స్పీకర్‌ ఫోన్‌ ఆన్‌చేసి హలో అన్నాడు విరాట్‌.

అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ...

అటు నుంచి స్వయంగా సహస్ర గొంతు విన్పించింది.

‘‘హలో బావా ఎలా ఉన్నావ్‌? అంతా ఎలావున్నారు?’’ అంటూ...

ఆ గొంతులో ఎక్కడా టెన్షన్‌ గాని కంగారు కాని ఏమీ లేదు. చాలా ఉత్సాహంగా మాట్లాడుతోంది. దాంతో విరాట్‌కి సర్రున కోపం ముంచుకొచ్చింది.‘‘బుద్ధుందా? అసులు నీకు బుద్దుందా? ఇక్కడ మేమంతా నీకోసం టెన్షన్‌తో ఛస్తుంటే మమ్మల్నే ఎలా ఉన్నారంటూ పరామర్శిస్తున్నావా? ఆ కిడ్నాపర్లు ఎక్కడ?’’ అనరిచాడు.

‘‘ఎందుకు బావా అంత కోపం? చెప్పిన టైంకి మీరు వచ్చుంటే కిడ్నాపర్లతో నాకీ తిప్పలుండేది కాదు గదా.’’ అంది సహస్ర.

‘‘అంటే తప్పు నాదంటావా?’’

‘‘లేకపోతే నాదా?’’

‘‘సరి సరి తప్పోప్పులు తర్వాత మాటాడుకోవచ్చు. ముందు నిన్నా కిడ్నాపర్లు ఎక్కడుంచారో చెప్తే వచ్చి విడిపిస్తాం గదా.’’

‘‘వద్దులే నీకంత విసుగైతే ఎందుకు చెప్పాలి. చెప్పనంతే’’ అంటూ అవతల లైన్‌ కట్‌ చేసింది సహస్ర.

తల పట్టుకున్నాడు విరాట్‌.

‘‘ఓర్నాయనో ఈ తిక్కదాంతో ఏం మట్లాడినా తంటాగానే ఉంది. ఏం చేయాలి’’ అన్నాడు.

స్పీకర్‌ ఫోన్‌ లోంచి ఇద్దరి సంభాషణ...

అంతా వింటూనే వున్నారు.

‘‘ఫోన్‌ చేసి నాకివ్వు బావా. అక్కతో నేను మాట్లాడతాను’’ అంది విశాల.

‘‘విశాల కాదు, నేను మాట్లాడతాను చిన్న బాబు ఫోనిలా యివ్వు’’ అన్నాడు వెంటనే మునుసామి.

‘‘అవును బావా, అక్క చిన మావయ్య మాట వింటుంది యివ్వు’’ అంది విశాల.

విరాట్‌ ఫోన్‌ చేసి సెల్‌ మునుసామికిచ్చాడు.

అవతల రింగవుతున్న శబ్ధం అందరికీ విన్పిస్తుంది.

పది సెకన్ల తర్వాత ఫోన్‌ లిఫ్ట్‌ చేయబడింది.

‘‘అమ్మా సహస్ర’’ అంటూ పిలిచాడు మునుసామి.

ఈ సారి సహస్రకు బదులుగా.కిడ్నాపర్‌ గొంతు విన్పించింది.విలన్‌ లెవల్లో పెద్దగా నవ్వుతున్నాడు ఎవడో...‘‘రేయ్‌ కుర్ర సన్నాసి నీ నోట్లో కిరసనాయిలు పొయ్య. నీ నవ్వు కంపు కొడుతుందిరా వెధవ. మర్యాదగా ఫోన్‌ సహస్ర కివ్వు’’ అన్నాడు మునుసామి.‘‘యిస్తా గాని. మూడు కోట్లు రెడీ చేస్తున్నారా లేదా చెప్పు’’ అటు నుంచి అడిగాడు.‘‘కోట్లు కాదురా నీ తోలు ఒలిచి కోటు కుట్టించుకుంటా. నా సంగతి నీకు తెలీదు. మర్యాదగా ఫోన్‌ సహస్ర కివ్వు.’’మునుసామి మాటలకి వాడు భయ పడ్డాడో, బెదిరి పోయడో తీలీదుగాని వెంటనే ‘‘అక్కో ఈ పెద్దాయనెవరో నన్ను భయ పెట్టేస్తున్నాడు. తిడుతున్నాడు. నువ్వే మాటాడు’’ అంటూ వాడు సహస్రని పిలవటం విన్పించటంతో ఉలికి పడ్డారంతా.ఇదేం కొత్త మలుపో అర్ధం గాక మతి పోయినట్టుగా ముఖ ముఖాలు చూసుకున్నారంతా. డబ్బు కోసం కిడ్నాప్‌ చేసారనుకుందాం. ఒకె. కాని సహస్రని వాడు అక్కాని పిలవటం ఏంటి? విరాట్‌ కూడ అర్ధం చేసు కోలేక చిత్త భ్రమ ఏర్పడినట్టుగా అలా చూస్తుండి పోయాడు.వారి ఆలోచనలు ఓ కొలిక్కి రాక ముందే అటు నుంచి తిరిగి సహస్ర గొంతు విన్పించింది. ‘‘హలో.... ఎవరూ?’’ అంటూ.‘‘నేను మును సామిని మాటాడుతున్నా గాని ఏందమ్మా ఇదంతా? మాకేమీ అర్ధం కావటం లేదు’’ అన్నాడు.‘‘అర్ధమయ్యేలా చెప్పే దాకా విరాట్‌ ఆగితే గదా. విసుగుతో కోప్పడుతున్నాడు. అందుకే లైన్‌ కట్‌ చేసాను’’ అంది సహస్ర.‘‘కట్‌ చేసి కూచుంటే ఎలా తల్లీ. ఇక్కడ సమస్య చిన్నది కాదు గదా. పది నిముషాల్లో నీ వెనకే ఆ శిథిల భవనం వద్దకి వచ్చేస్తామని నీతో చెప్పిన మాట నిజమే. కాని ఏర్‌ పోర్ట్‌ దగ్గర రెండు సిగ్నల్స్‌ దాటి రావాలి. దాంతో లేటయింది. ఇందులో మా తప్పు గాని విరాట్‌ తప్పు గాని లేదు గదా...’’

‘‘అది కాదు చిన మావయ్యా’’ ‘‘నన్ను చెప్పనీ సహస్ర. మేం వస్తుంటే దారిలో దీక్ష ఎదురైంది. తనను తీసుకొని మేమంతా వచ్చే సరికి అక్కడ ఎవరూ లేరు. నీ జాడ లేదు. నీ సెల్‌కి ఫోన్‌ చేస్తే వాడెవడో నిన్ను కిడ్నాప్‌ చేస్తున్నామన్నాడు. ఆ కోపం ఈ కోపం కలిసి మేమంతా త్యాగ రాజన్‌ అడ్డా మీద పడి దాడి చేసాం. దొరికిన వాడ్ని దొరికినట్టు చితగొట్టి, మూడు గంటల కొచ్చి నీ ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు పారి పోయావంటాడు త్యాగరాజన్‌. కిడ్నాప్‌ చేసామంటాడు కిడ్నాపరు. ఏది నమ్మాలి.నీ ఫోన్‌ స్విచ్చాఫ్‌ లో ఉండటంతో ఆరు గంటల కొచ్చిన విశాల ఇక్కడే ఉండి పోయింది. ఆఫీసు నుంచి వచ్చిన చందూ జరిగింది విని కంగారు పడుతున్నాడు. ఇప్పుడు అర్ధరాత్రి కావస్తోంది. ఆ కిడ్నాపరు వెధవ నిన్ను అక్కా అని పిలవటం ఫోన్‌లో విన్పిస్తుంది. చెప్పమ్మా ఇన్ని టెన్షన్‌ల మధ్య మేమంతా నిద్రలు మాని నీ కోసం కంగారు పడుతుంటే ఇలా విరాట్‌తో పంతాలకు పోయి నువ్వు మౌనంగా ఉండటం మంచిదా చెప్పు. కాస్త ప్రశాంతంగా నిద్రపోతాం’’ అంటూ నచ్చ చెప్పాడు మును సామి. ‘‘సారీ చిన మావయ్యా జరిగింది చెప్తా గాని, ఫోన్‌ విరాట్‌ కివ్వండి’’ అంది సహస్ర.విరాట్‌ ఫోన్‌ తీసుకొని ‘‘హలో’’ అనగానే ‘‘సారీ విరాట్‌ అయాం సారీ’’ అంది.‘‘ఇట్సాల్‌ రైట్‌ చెప్పు ఏం జరిగింది?’’ అడిగాడు విరాట్‌.సహస్ర చెప్పటం ఆరంభించింది.అంతా ఆసక్తిగా వినసాగారు.

********************************

సహస్రకు స్పృహ తెలిసే సరికి...రాత్రి సుమారు పది గంటలు కావస్తోంది.తలంతా దిమ్ములా వుండి కొద్ది క్షణాలు ఏం జరిగింది తను ఎక్కడ వుంది ఏదీ గుర్తు లేకుండా పోయింది. కళ్ళు మూసుకొని కాస్సేపు అలాగే ఉండి పోయింది.క్రమంగా ఒక్కటొక్కటిగా...జరిగిన సంఘటనలన్నీ గుర్తు రాసాగాయి.అవును ఆ శిథిల భవనం మండపంలో చావుకి తెగించి శతృవుల కోసం పొంచి కూచుంది. ఆ టైంలో తన వెనకే పిల్లిలా వచ్చి ఎవరో ముఖం మీద ఏదో స్ప్రే చేసారు. అంతే తర్వాత ఏం జరిగిందీ తనకు తెలీదు. కళ్ళు తెరిస్తే ఇక్కడుంది.తనను చెక్క కుర్చీలో చేతులు వెనక్కి విరిచి కట్టేసారు. కాళ్ళు కూడ బంధించారు దిగువనెక్కడో మాటలు విన్పించడాన్ని బట్టి ఖచ్చితంగా ఇది డాబా మీది పోర్షను కావచ్చు. గోడలు రంగు మాసి వున్నాయి. అది చిన్న హాలు. దాని చివరి  బెడ్‌ రూం కన్పిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ తను తప్ప ఎవరూ లేరు. పైన సీలింగ్‌ ఫ్యాన్‌ తిరుగుతోంది.ఎవరు వీళ్ళు?అంత రిస్కు తీసుకొని ఎందుకు తనను తీసుకొచ్చారు? ఖచ్చితంగా వీళ్ళెవరో గాని త్యాగ రాజన్‌ మనుషులు మాత్రం కాదు. అక్కడ తను కనబడకపోడంతో విరాట్‌ తో బాటు అంతా ఏం కంగారు పడుతున్నారో ఏమిటో......... ఓసారి విరాట్‌తో మాట్లాడితే బాగుండేది. తీవ్రంగా ఆలోచిస్తోంది సహస్ర.

అంతలో ఎవరో మేడ మీది కొస్తున్న అలికిడి విన్పించింది. ఎప్పటిలా ఇంకా తెలివి రానట్టు నటిస్తూ అలాగే ఉండి పోయి క్రీగంట గమనించ నారంభించింది.గదిలో ట్యూబ్‌ లైటు కాంతి దేదీప్య మానంగా ప్రకాశిస్తోంది. వచ్చింది ఒకడు కాదు ఇద్దరు కాదు పన్నెండు మంది. ఆశ్చర్య కరమైన విషయం ఏమంటే వాళ్ళలో ఒక్కడు మాత్రమే సుమారు ఇరవై రెండు, ఇరవై మూడు సంవత్సరాల వయసు వాడు. మిగిలిన వాళ్ళంతా పదహారు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయస్కులు. లోనకు రాగానే మెట్ల వైపు ఎంట్రన్సు డోర్‌ మూసేసారు. అంతా సహస్రను చూస్తున్నారు.‘‘ముత్తన్నా దీనికింకా స్పృహ వచ్చినట్టు లేదు ఏం జేద్దాం?’’ అనడిగాడొకడు.వాడా మాట అడిగిన మరు క్షణం.మురడన్‌ ముత్తు సాచి చెంప మీద కొట్టాడు వాడ్ని.‘‘కొట్టడం కాదు. చంపేస్తాను వెధవా. నీ వయసెంతరా పదహారు. మీరే కాదు నాకన్నా వయసులో పెద్దది అక్క లాంటిది. అ మర్యాదగా దీన్ని, అది యిది అంటూ మాట్లాడొచ్చా? తప్పుగదా?’’ అన్నాడు ముత్తూ.‘‘అవునన్నా తప్పే’’ అన్నాడు దెబ్బ తిన్నవాడు.‘‘మనలో ఎవరు అమర్యాదగా మాట్లాడినా వూరుకోను చెప్తున్నాను. మన ప్లాను సక్ససయి డబ్బు చేతి కొచ్చేవరకు అక్కను మనం పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. తనేమన్నా సాధారణ అమ్మాయా, ఏదో ఇన్ని రోజులు మనం పడ్డ శ్రమకు దేవుడు కరుణించి ఇలా అక్క మనకు దొరికింది. గాని లేకపోతే మనవల్ల అయ్యే పనేనా.’’

‘‘ఆ మాట నిజమన్నా. ఇంకెవరం కూడ పొరబాటు చేయం’’ అంటూ మాటిచ్చాడు మరొకడు.‘‘అంతే కాదు గొప్పింటమ్మాయి. ఇక్కడ మన దగ్గర వున్నంత వరకు తల తాకట్టు పెట్టయినా సరే ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అర్ధమైందా?’’‘‘అర్ధమైందన్నా. ఆ బెంగ అక్కర్లేదు. మన చేతిలో కత్తెరున్నంత వరకు డబ్బుకు లోటేముంది’’ అన్నాడు మరొకడు.‘‘సరి సరి. అక్కకింకా తెలివొచ్చినట్టులేదు. మనం పడుకుందాం. తెలివి రాగానే నేను మాటాడతాను’’ అన్నాడు ముత్తూ.సహస్ర చుట్టూ చాపలు పరిచి వాళ్ళంతా పక్కలు సిద్దం చేసుకో సాగారు. వాళ్ళ మాటలు వింటున్న సహస్రకు ముచ్చటేసింది. మౌనం వహించటం ఇష్టం లేక పొడిగా దగ్గి అటు యిటు కదిలి తలెత్తింది. ఎందుకంటే ఉదయం ఎప్పుడో తిన్న టిఫిను. గోడ గడియారం రాత్రి పది గంటలు సూచిస్తోంది. ఇంత వరకు ఏమీ తినక పోడంతో ఆకలి కరకర లాడుతోంది. ఆ పైన బాత్‌ రూం కెళ్ళి ఫ్రషప్‌ అవ్వాలి. అర్జంటు.ఆమె స్పృహలోకి వచ్చినట్లు తెలీగానే ముత్తు బృందం బిరబిరా లేచిపోయింది. ముత్తూ ఆమె ఎదుటి కొచ్చాడు.

నోటీకి టేప్‌ ఉండటంతో మాట్లాడ్డానికి వీలు గాక గింజు కొంటూ మూలుగుతోంది సహస్ర.‘‘అక్కా నీ బాధ అర్ధం చేసుకో గలను. అరిచి గోల చేయనని మాటిస్తే టేపు తీసేస్తాను. సరేనా?’’ బ్రతిమాలుకున్నట్టు అడిగాడు ముత్తూ.సరేనన్నట్టు తలూపింది సహస్ర.ముత్తూ ఆమె నోటికి అంటించిన టేప్‌ తీసేసాడు.‘‘కట్లు... కట్లు కూడ విప్పండిరా’’ అంది.‘‘వూహు.......కట్లు విప్పితే మమ్మల్ని చితగొట్టి పారిపోతావ్‌? విప్పను. సారీ అక్కా’’ అన్నాడు ముత్తూ‘‘ఆ భయం అక్కర్లేదు. ప్రామిస్‌గా మిమ్మల్నేమీ చేయను. పారిపోను. నన్ను అక్కా అన్నావ్‌గా. అక్క తమ్ముళ్ళ కిచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. త్వరగా విప్పరా బాత్‌ రూం కెళ్ళి ఫ్రెషప్‌ అవ్వాలి.’’సహస్ర మాటల మీద ముత్తూకు నమ్మకం ఏర్పడింది. ఏమైతే అయిందని సహస్ర కట్లు విప్పేసాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్