Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
virugudu

ఈ సంచికలో >> కథలు >> మాట తీరు

matateeru

సుజాత, సురేష్ లకు లేకలేక పుట్టినవాడు రామం. అందువల్ల అల్లారుముద్దుగా పెంచారు. రామం ఎనిమిదో తరగతి చదువుతున్నా పెద్దలని గౌరవించడం, మర్యాద చూపడం తెలుసుకోలేదు.  నోటికి వచ్చింది రామం మాట్లాడేవాడు. వాడిని సరియైన మార్గంలో పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు తల్లిదండ్రులు.

ఒకసారి రామం మేనమామ కుటుంబం  చుట్టరికానికి వచ్చి  వారం రోజులున్నారు.  ‘పోయిన సంవత్సరం మీ వూరు వచ్చి మీ  ఇంట్లో  మూడు రోజులే ఉన్నాము. మీరేంటి ఏకంగా వారం రోజులు తిష్ట వేసారు’ అని ముఖం మీదనే అడిగాడు రామం. రామం మాటలకు తెల్లబోయిన చుట్టాలు తెల్లారి బస్సుకే వెళ్ళిపోయారు.  వాడి అమ్మానాన్నలే రామం చేత అలా అనిపించారని అనుకున్నారు మనసులో.

ఒక ఆదివారం ఉదయం  అంగడిలో సరుకులు కొనడానికి తల్లికి  తోడుగా   వెళ్ళాడు రామం. అక్కడ సుజాత చిన్ననాటి  స్నేహితురాలు కనిపించి ఆప్యాయంగా మాట్లాడింది. దగ్గరలోని దుకాణంలో పండ్ల రసం త్రాగుదామని తీసుకెళ్ళింది. ముగ్గురూ పండ్లరసం త్రాగిన తరువాత  దుకాణం వాడికి డబ్బు చెల్లించబోయింది సుజాత. కానీ  స్నేహితురాలు వారించడమే కాకుండా డబ్బు చెల్లించబోయింది.

‘చాలా రోజుల తరువాత  కలిసాము. ఎవరు చెల్లించినా తప్పు లేదు” అంటూనే డబ్బు చెల్లించడానికి ముందుకు వెళ్ళింది సుజాత. ఆమె  స్నేహితురాలు కూడా పట్టు విడవకుండా  ‘మిమ్మల్ని పిలిచింది నేనే కాబట్టి డబ్బు చెల్లిస్తాను’ అంది.

స్నేహితురాలుతో తన తల్లి వాదించడం చూసాడు రామం. వాడికి కోపం వచ్చి “మీ స్నేహితురాలు డబ్బు చెల్లిస్తానని ముచ్చట పడుతుంటే ఆపుతావెందుకు? నువ్వు ఆగినప్పుడే కదా ఆవిడ నిజంగా ఇస్తుందో,  మాటవరుసకి అంటుందో తెలిసేది’ అన్నాడు.

ఆ మాటలు విన్న సుజాత  స్నేహితురాలు  ముఖం చిన్నబోయింది. తన పర్సులో నుండి డబ్బు తీసి దుకాణం వాడికి ఇచ్చి ‘మీ వాడికి మంచి బుద్ధులు నేర్పించు’ అని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది.  తల కొట్టేసినంత పనయింది సుజాతకు.

అది జరిగిన తరువాత ఆదివారం నాడు సురేష్ స్నేహితుడు పని ఉండడంతో వాళ్ళింటికి వచ్చాడు. ముఖ్యమైన పని కావడం వల్ల గంటన్నర  దాటినా కదలలేదు.  అప్పటికి భోజనాల వేళ అయింది. వంట గదిలో పనిలో ఉన్న సుజాత భోజనాలకు సిద్ధం చేస్తూ  ‘నాన్నని భోజనానికి పిలువు’ అని  రామంతో చెప్పింది. 

అప్పటికి రామం ఆదివారం అనుబంధంలో ఉన్న పిల్లల పేజీని చదువుతున్నాడు. తల్లి పని చెప్పేసరికి వాడికి చిరాకు పుట్టింది. వెంటనే  “ నాన్నగారి స్నేహితుడు అంత  తొందరగా వెళ్ళే రకంలా  లేడు. ఏకంగా భోంచేసి వెళతాడేమో! ఇద్దరికీ వడ్డించవలసి ఉంటుంది” అన్నాడు గట్టిగా రామం. ఆ మాటలు బయట ఉన్న స్నేహితుడుకి వినిపించాయి. దాంతో వారిద్దరి సంభాషణని  మధ్యలోనే ముగించి  వెళ్ళిపోయాడు.

సుజాత, సురేష్ లే రామం చేత అలా అనిపిస్తున్నారని అందరూ అనుకునే పరిస్థితి వచ్చింది. అలా అనకూడదని చెబుతున్నా వినిపించుకోడు  రామం.

నెల తరువాత రామం పుట్టిన రోజు వచ్చింది. రామంని తీసుకుని గుడికి వెళ్ళారు సుజాత, సురేష్. రామం చేత్తో  కొబ్బరికాయను  అర్చకుడికి అందించమని చెప్పింది సుజాత. సజ్జలోని కొబ్బరికాయను తీస్తుండగా రామం చేతి నుండి  జారి ముక్కలయింది.

‘అయ్యయ్యో ! దేవుడికి కొట్టాల్సిన కొబ్బరికాయ కింద పడేసాడు!’ అంది సుజాత బాధగా.

‘అలా చేసావేం రామం?’ అన్నాడు సురేష్ నొచ్చుకుంటూ.

“ఫరవాలేదు. మీ  రామం కొబ్బరికాయను అతికించేస్తాడు’  అన్నాడు అర్చకుడు.

“ కొబ్బరికాయను నేనెలా  అతికిస్తాను?” ఆశ్చర్యపోయి  అడిగాడు రామం.

“పోనీ కింద జారుతున్న నీటిని గిన్నెలో చేర్చగలవా?’ అని మరో మారు  అడిగాడు అర్చకుడు.

‘అలాంటివి చెయ్యడం కుదరదు’ చెప్పాడు రామం.

‘ఆతకించడం రానప్పుడు ముక్కలు చేసావెందుకు?” మళ్ళీ అడిగాడు అర్చకుడు.

“పొరపాటున చెయ్యి జారింది. ఇంకొక కొబ్బరికాయ తెమ్మంటారా?” చిరాగ్గా అన్నాడు రామం. సుజాత, సురేష్  మౌనంగా చూస్తున్నారు. ‘కొబ్బరికాయ కాబట్టి పగిలినా ఇంకోటి  కొనగలవు. మరి పగిలిన హృదయాలను ఎక్కడ నుండి కొంటావు? కొబ్బరికాయనే అతకడం చేతకాని వాడివి హృదయాలను అతకగలవా?” అని నవ్వుతూ అడిగాడు అర్చకుడు.

“మీరేం  మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు” నిజాయితీగా చెప్పాడు రామం.

“ఇంటికి వచ్చే  అతిథులతో , అమ్మానాన్నల స్నేహితులతో దురుసుగా మాట్లాడుతూ  వాళ్ళ హృదయాలను   గాయపరిచి ముక్కలు చేస్తున్నావు. వారి   హృదయాలకు తగిలిన గాయాలు కొబ్బరిచిప్పలా పైకి కనిపించవు. కానీ  స్నేహాలు, బంధుత్వాలు దూరమౌతాయి. అందుకే మనం సరి చేయలేని వాటిని పాడు చేయకూడదు. భగవంతుడు కూడా ఒక  ప్రాణం తీసుకుపోతే  మరొక రూపంలో ప్రాణం పోస్తున్నాడు. మామూలు మనుషులం మరెంత జాగ్రత్తగా మెలగాలి? బాగా ఆలోచించి  ఈ పుట్టిన రోజు నుండి నీ  మాట తీరు మార్చుకో!అమ్మానాన్నలకు చెడ్డపేరు తెచ్చే పని మానుకో” అన్నాడు అర్చకుడు.

తాను చేస్తున్న తప్పు చాలా స్పష్టంగా బోధపడింది రామానికి.  ‘ఇక ముందు బుద్ధిగా ప్రవర్తిస్తాను” అన్నాడు తలొంచుకుని.ఇంట్లోనే కొబ్బరికాయకు నూనె  పట్టించడం వల్ల చేతి నుండి  జారిందనీ, అర్చకుడు తన తండ్రి స్నేహితుడనీ, తమ మాటలని లక్ష్యపెట్టని రామంకి బుద్ధి వచ్చేలా అతడితో అమ్మానాన్నలే నాటకo ఆడించారని  రామంకి తెలీదు.

మరిన్ని కథలు