Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
శుక్ర‌వారం మారిపోయే స్థానాల‌కు విలువ ఇవ్వ‌ను  - రామ్‌

హుషారు అనే ప‌దానికి కేరాఫ్ అడ్ర‌స్ లా క‌నిపిస్తాడు రామ్‌! ఈ వ‌య‌సులో కుర్రాళ్ల ఆలోచ‌న‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌లా ద‌ర్శ‌న‌మిస్తాడు రామ్‌!  అత‌ని జోరు.. స్పీడు యువ‌త‌రానికి భ‌లే న‌చ్చేసింది. అందుకే... యూత్ ఐకాన్‌లా స్థిర‌ప‌డిపోయాడు... రామ్‌! రామ్ సినిమా అంటే - అల్ల‌రి, ఆక‌తాయిత‌నం, ఆనందం, ఆట విడుపు - ఇలాంటి కొల‌త‌ల‌తోనే మ‌రో సినిమా సిద్ధ‌మైంది. అదే.. శివ‌మ్. ఈ శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా రామ్‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది. 

* హాయ్ రామ్..
- హాయండీ..

* శివ‌మ్ ఎలా ఉండ‌బోతోంది?
- కంప్లీట్ ప్యాకేజీలా ఉంటుంది శివ‌మ్‌. యాక్ష‌న్‌, వినోదం, మంచి పాట‌లూ... సాంకేతిక విలువ‌లూ ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపిన సినిమా శివ‌మ్‌. ఈసినిమా చూశా. ఓ ఆడియ‌న్‌గా నేను హ్యాపీ.

* మీ సినిమా అంటే యాక్ష‌న్‌, వినోదం, ప్రేమ ఎప్పుడూ ఇవేనా?
- నేను వీటితో పాటు ప్ర‌యెగాలు చేశాను క‌దా.??  జ‌గ‌డం ఓ కొత్త క‌థ‌. ఎందుకంటే ప్రేమంట కూడా విభిన్న‌మైన ఆలోచ‌న‌తో తీసిన సినిమానే. ఆ సినిమాలు ఆడ‌లేదు కాబ‌ట్టి.. గుర్తు లేదంతే.

* శివ‌మ్ టైటిల్‌కి జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
- ఇందులో నా పేరు శివ‌. ఏది అనుకొంటే అది చేసేస్తా. నా దూకుడు వినోదాన్ని పండిస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఇబ్బందీ ఎదుర‌వుతుంద‌నుకోండి. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

* రాశీఖ‌న్నాతో కెమిస్ట్రీ కుదిరిన‌ట్టేనా?
- ప్ర‌చార చిత్రాల్లో మీరు చూస్తూనే ఉన్నారుగా. నిజానికి.. రాశీఖ‌న్నా అన‌గానే నేను కొంచెం భ‌య‌ప‌డ్డా. త‌ను నాకంటే పెద్ద‌గా క‌నిపిస్తుందేమో అన్న అనుమానం ఉండేది. కానీ కొన్నిషాట్స్ తీసి స్ర్కీన్ పైచూసుకొంటే.. అలా ఏం అనిపించ‌లేదు. పైగా ఈసినిమా కోసం నేను కొంచెం బ‌రువు పెరిగా. అలా లెవెల్ అయిపోయింది.

* డీఎస్‌పీ మ్యూజిక్‌తో మీరు సంతృప్తిగానే ఉన్నారా?
- నూటికి నూరుశాతం. రెడీ త‌ర‌వాత డీఎస్‌పీ తో క‌ల‌సి ప‌నిచేయ‌లేదు. మ‌ధ్య‌లో కొన్నిసార్లు అనుకొన్నాంగానీ, కుర‌ద్లేదు. ఈసారి మాత్రం పట్టుబ‌ట్టి మ‌రీ ఈ సినిమా కోసం తీసుకొచ్చాం. సూప‌ర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు.

* పండ‌గ చేస్కో లాంటి హిట్ త‌ర‌వాత ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేశారు.. పెద్ద ద‌ర్శ‌కుడితో ప్రాజెక్ట్ ఓకే అయితే బాగుండేది అనిపించ‌లేదా?
- కొత్త ద‌ర్శ‌కుల‌తో ఎప్పుడు ప‌ని చేసినా.. మంచి ఫ‌లితాలొచ్చాయి. క‌రుణాక‌ర‌న్‌, సుకుమార్‌, భాస్క‌ర్‌లతో నేను చేసిన సినిమాలు స‌రిగా ఆడ‌లేదు క‌దా..!  ద‌ర్శ‌కుల కంటే వాళ్లు తెచ్చిన క‌థ‌లు, వినిపించే స్ర్కిప్టులే కీల‌కం.

* ఎలాంటి కథ‌ల్లో మిమ్మ‌ల్ని మీరు చూసుకోవాల‌ని భావిస్తుంటారు?
- ఏ ద‌ర్శ‌కుడైనా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి `ఎలాంటి సినిమా చేద్దాం` అని న‌న్ను అడిగితే నేను స‌మాధానం చెప్ప‌లేను. న‌న్ను వాళ్లు ఎలా చూపించాల‌నుకొంటున్నారన్న‌దే నాకు ముఖ్యం. ఒకొక్క ద‌ర్శ‌కుడి ఆలోచ‌న ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ల ఆలోచ‌న‌ల్ని బ‌ట్టి నేను క‌నిపిస్తుంటా.

* ఫ‌లానా త‌ర‌హా కాన్సెప్ట్‌తో సినిమా చేయాల‌ని ఎప్పుడైనా అనిపించిందా?
- అలా ఎప్పుడూ ఆలోచించ‌లేదు. కాన్సెప్ట్‌లూ, క‌థ‌లూ నాకే త‌డితే... నేనే ద‌ర్శ‌కుడ్ని అయిపోతానేమో.

*మీ కెరీర్‌లో బాగా డిజ‌ప్పాయింట్ చేసిన సినిమా ఏది?
- జ‌గ‌డం. ఆ సినిమాని చాలా ఇష్ట‌ప‌డ్డా. కానీ.. ప‌లితం ద‌క్క‌లేదు. ఇప్ప‌టికీ చాలామంది ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ప్రేమంట కూడా అంతే. టీవీలో చూశామండీ చాలా బాగుంది ఆ సినిమా అంటే.. నాకు కోపం వ‌చ్చేస్తుంటుంది.

* మోస్ట్  హ్యాపియెస్ట్   మూమెంట్ ఏది?
- నా తొలి సినిమా దేవ‌దాస్ విజ‌య‌వంత‌మ‌వ్వ‌డం. ఆ త‌ర‌వాత ప్ర‌తీ హిట్ సినిమానీ నేను ఆస్వాదిస్తూనే ఉన్నా. 

* ఫ్లాపుల్ని చూసి కంగారు ప‌డిన సంద‌ర్భాలున్నాయా?
- జ‌గ‌డం ఒక్క‌టే నాకు పెద్ద షాక్‌. ఆ త‌ర‌వాత ఫ్లాప్‌లొచ్చినా అంత‌గా ఇబ్బంది ప‌డ‌లేదు. కాక‌పోతే రెండు మూడు రోజుల పాటు ఓ గిల్టీ ఫిలింగ్ మాత్రం ఉంటుంది. 

* మ‌సాలా సినిమా స‌రిగా ఆడ‌లేదు. అయినా ఇక‌ముందూ మ‌ల్టీస్టార‌ర్‌లు చేస్తారా?
- త‌ప్ప‌కుండా. కాక‌పోతే ఇద్ద‌రు క‌థానాయ‌కుల‌కు స‌రిప‌డా క‌థ దొరకాలి.

* చేతిలో స్ర‌వంతి మూవీస్ లాంటి సంస్థ ఉండ‌డం ఎంత వ‌ర‌కూ క‌లిసొచ్చింది?
- పెద‌నాన్న‌గారి అనుభ‌వం నాకెంతో ఉప‌యోగ‌ప‌డింది. ఏ ద‌శ‌లో ఎలాంటి సినిమాలు చేయాలో ఆయ‌న న‌న్ను గైడ్ చేసేవారు. ఆల్రెడీ ఎత్తు ప‌ల్లాలు చూసొచ్చిన మ‌నిషి క‌దా.. ఎక్క‌డ త‌ప్పులు చేస్తామో ఆయ‌న‌కు బాగా తెలుసు. కాబ‌ట్టి.. నా విష‌యంలో అవి పున‌రావృతం కాలేదు.

* ప‌రిశ్ర‌మ‌లో మీ స్థానం, మీ రేంజ్ ఇంకా పెరిగితే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా?
- నేనెప్పుడూ అలాంటి విష‌యాల గురించి ఆలోచించ‌నండీ. రాత్రికి రాత్రే జాత‌కాలు మారిపోతాయి. ప్ర‌తీ శుక్ర‌వారం స్థానాలు తారుమారు అవుతాయి. అలాంటి వాటిపై ఆలోచించి బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకోవ‌డంలో ఎలాంటి ఉప‌యోగం ఉండ‌దు. అదేదో... క‌థ‌ల గురించి ఆలోచిస్తే... మంచి సినిమాలు తీయొచ్చు.

* పెళ్లి క‌బురు ఎప్పుడు చెబుతారు?
- ఇంట్లోవాళ్లు తొంద‌ర పెడుతున్నారు.. కానీ చూద్దాం.. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రం చెప్ప‌లేం క‌దా.

* ప‌రిశ్ర‌మ‌లో స్నేహితులున్నారా?
- అంద‌రితోనూ క్లోజ్‌గానే ఉంటా. కానీ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం ఎవ్వ‌రూ లేరు. పార్టీల్లోనూ నేను క‌నిపించ‌ను.

* హ‌రి క‌థ ఎలా ఉండ‌బోతోంది?
- ఓ కొత్త జోన‌ర్‌లో సాగే సినిమా అది. డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

* ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ.

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka